Previous Page Next Page 
మొగలిబాకు పేజి 8

   

    "ఒరే హనుమా.....ఇక్కడ మనల్నెవరూ పోల్చుకోరు గదా" నారాయణరావు మనసు కీడు శంకించింది.
   
    "ఆ జాలి నాయుడొచ్చినా ఇప్పుడు నిన్ను పోల్చుకోలేడు. కానీ బాసూ......మిస్ వీనియన్స్ ఎక్స్ పెండేచర్. ఆ నాయుడు ఇచ్చిందాని కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసావ్. ఆ నాయుడి దగ్గర్నించి వసూలు చేసుకోగలవా?"
   
    "చచ్చినట్టు......లేకపోతే ఇదంతా మీ అబ్బ ఆడించిన నాటకమని, ఆ నాయుడు కొడుకు పకీరుగాడికి చెప్పేస్తే ఆడు పొంగిపోయి మరో పదివేలిచ్చేస్తాడు" నవ్వుతూ అన్నాడు నారాయణరావు.
   
    "ఆడిపేరు పకీరు కాదు......షారుఖ్. అలాగే తమరు నవ్వుమార్చండి. ఇప్పుడు నీ పేరు షారుఖ్.....  గుర్తుంచుకో" జ్ఞాపకం చేసాడు హనుమాన్ లు.
   
    మరో అయిదునిమిషాల తర్వాత విశాలమైన పాతకాలపు బంగ్లా ముందు కారులు ఆగాయి. ముత్తయిషువులందరూ హారతి పళ్లేల్తో ఎదురొచ్చారు. వరసగా కొంతమంది మగవాళ్ళు కూడా ఎదురు రావడంతో అందులో పెళ్ళికూతురు తరుపు బావలాంటి వ్యక్తి ఎవరో అర్ధం గాక అందరికీ నమస్కారం చేసాడు నారాయణరావు.
   
    "మనం నాటకం వేషాలు వేస్తున్నాంగానీ పెళ్ళికుర్రాడు బాగానే ఉన్నాడు గదా" జానకి ఏర్పాటు చేసిన నకిలీ బావ, పక్కనున్న వ్యక్తితో అన్నాడు.
   
    "నువ్వు అసలు బావవికావు. ఆ విషయం గుర్తుంచుకో....అర్ధమైందా" పక్కనున్న కాండిడేట్ నెమ్మదిగా  కసురుకున్నాడు.
   
    షారుఖ్ వేషంలో ఉన్న నారాయణరావుని లోనికి తీసుకెళ్ళారు. ఓ పాతకాలపు కుర్చీలో కూర్చోబెట్టారు. వరసగా ఆడంగులు నవ్వులు, జోకులు, అక్కడి ఖరీదయిన వ్యవహారం చూసి-

    "బాగా డబున్నవాళ్ళే......నిజం చెప్పేస్తే గిట్టుబాటవుతుందేమో చూడు......." హనుమాన్ లు పరమ రహస్యాన్ని నారాయణరావు చెవిలో ఊదాడు.

    "ఒరేయ్.....వృత్తికి ద్రోహంచేస్తే పుట్టగతులుండవ్.....నువ్వీ లాంటి ఐడియాలు చెపితే, నీ పెళ్ళిని చెడగొట్టేస్తాను....జాగ్రత్త" హెచ్చరించాడు నారాయణరావు.
   
    పట్నంనుంచి స్పెషల్ గా తెప్పించిన స్వీట్లు, హాట్లు తినేసి, పెద్ద గ్లాసుతో గ్లాసుడు పాలు తాగేసాక-
   
    "మరెందుకాలస్యం......పిల్లను తెప్పించండి.....అదెంత అందంగా వుంటుందో చూస్తాను" అన్నాడు నారాయణరావు.
   
    "ఒరేయ్ గురూ.....నువ్విప్పుడు షారుఖ్ కేరక్టర్ లో వున్నావ్. అదెంత అందంగా వుంటుంది.....ఇదంత అందంగా వుంది. ఇలాంటి మాటలనకూడదు.....తెల్సిందా"

    "అప్పుడప్పుడు ఇలాంటివి జ్ఞాపకం చెయ్యడానికే నిన్ను తీసుకొచ్చింది.......గుర్తుంచుకో" చెవిలో చెప్తూ-
   
    ద్వారబంధంవేపు చూసాడు నారాయణరావు. ఎదురుగా ముత్తయిదువులమధ్య మొగలి పువ్వులా జానకి వేషంలో వున్న సంధ్య.
   
    సంధ్యను దూరంనుంచి చూడగానే కళ్ళప్పగించేసాడు నారాయణరావు.
   
    "ఈపిల్ల మనకు ఎక్కడో, ఎప్పుడో పరిచయం కదరా" గొణిగాడు నారాయణరావు అనుమానంగా ఆమెకేసే చూస్తూ.
   
    "నాకూ అలాగేవుంది____కాని కాదేమో.....ఈ పిల్ల కుంటిదిరా......చూడు....ఆ కాలు కుంటుతోంది" మెల్లగా అన్నాడు హనుమాన్లు.
   
    మెల్లకన్ను పెట్టి, తేరిపారచూస్తూ, కుంటుతూ వచ్చి ఒక చాప మీద కూర్చుంది జానకి ఉరఫ్ సంధ్య.
   
    సంధ్యకు కూడా, నారాయణరావుని ఎక్కడో చూసినట్లుగా వుంది. ఆ సూటూ, బూటూ, హెయిర్ స్టెయిలూ, కళ్ళద్దాలు.......వాటివెనక అసలు మనిషిని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తోందామె.
   
    "ఒరేయ్.......హనుమా! ఈ పిల్ల నా క్లాస్ మేట్......సంధ్యలా లేదూ......చూడు చూడరోయ్"
   
    హనుమాన్లు కళ్ళు రిక్కించి తేరిపారచూసి-
   
    "చూడు నాన్నా.....బాసూ....మనుషులు పోలిన మనుషులు ప్రపంచంలో పదో, పదకొండుమందో వుంటారట.....జానకి కూడా సంధ్యలాగే వుందేమో.....కంగారు పడకు.....కార్యం కానియ్" అన్నాడు హనుమాన్లు.
   
    "ఇది కార్యంకాదు. పెళ్ళిచూపులు" కసురుకొనబోగా పక్క నుంచి మాటలు విన్పించాయి.
   
    "బాబూ.... అమ్మాయినేవైనా, ప్రశ్నలడుగు......మొహమాట పడకు"
   
    "నాకెందుకండీ మొహమాటం......అడుగుతాను" అని జానకివేపు చూసి-
   
    "చూడు పిల్లా.....నేనడిగే ప్రశ్నలకు మూడే మూడు ముక్కల్లో జవాబు చెప్పాలి......ఒకటో ప్రశ్న విడాకులంటే ఏంటి?" ఆ ప్రశ్నకు అక్కడున్న జనమంతా విస్తుపోయారు.
   
    "బాసూ.....గృహము లార్పేస్తున్నావ్.....ఇది మన సంస్థ ఇంటర్వ్యూకాదు, పెళ్ళిచూపులు" హనుమాన్లు నారాయణరావు తొడమీద గట్టిగా గిల్లాడు. నారాయణరావుకి తీవ్రంగా కోపం వచ్చింది.
   
    "ఒరేయ్......నువ్వలా గిల్లావంటే......నీ డ్రెస్ రెంట్ నువ్వే కట్టుకోవాలి జాగ్రత్త" హెచ్చరించి నలుగురివేపు చూసి, విశాలదంతాలు కన్పించేట్టుగా నవ్వి__
   
    "సారీ.......అంతరాయానికి క్షమించాలి......చూడు పాపా! పెళ్ళంటే ఏవిటి?" సీరియస్ గా చూస్తూ అడిగాడు నారాయణరావు.
   
    "నూరేళ్ళపంట సార్" బొంగురుగొంతు విన్పించేసరికి ఖంగుతిన్నాడతను. ఇది సంధ్య గొంతుకాదు .....ఈ అమ్మాయి జానకే అయ్యుంటుంటుంది అనుకొన్నాడు.
   
    "గుడ్___నీకేమేం చెయ్యడంవచ్చు" గంభీరమైన ముఖంపెట్టి అడిగాడు నారాయణరావు.
   
    "పిడకలండీ"
   
    "అవును అల్లుడుగారూ! మా అమ్మాయి పిడకపెట్టిందంటే......." అమ్మాయి తరుపువ్యక్తి ఏదో చెప్పబోగా, ఇంకోవ్యక్తి ఆమె నోరు మూసేసి -
   
    "పిడకలు గురించి చెప్పకూడదమ్మా__పిండివంటల గురించే చెప్పాలి" ఆ క్యాండెట్ వేషం వేసిన క్యాండెట్ కాదు......పక్కింటి క్యాండెట్ అందుకే సిన్సియర్ గా సలహా ఇచ్చిందామె.
   
    "నీకు వీణ వాయించటం వచ్చా"
   
    "వాయించమంటారా?" గబుక్కున లేవబోతూ అడిగింది జానకి.
   
    "వద్దు.....ఇప్పుడు టైం వేస్టు.....ఇంకా మృదంగం వాయించడం వచ్చా" మరొకప్రశ్న వేశాడతను.
   
    "ఒరేయ్! ఆ అమ్మాయి హరికధల భాగవతారిణి అనుకున్నావేంట్రా.....వేగిరం ప్రశ్నలు తెగ్గొట్టేసి నీకు ఆమె నచ్చలేరని చెప్పేసేయ్ వెళ్ళిపోదాం" చెవిలో గొణిగాడు హనుమాన్లు.
   
    హనుమాన్లు వేపు సీరియస్ గ చూశాడు నారాయణరావు.
   
    "ఒరేయ్ హనుమాన్లూ....ఈ అమ్మాయి జానకి కాదని నా హృదయం ఘోషిస్తుందిరా__కనుక ఈ అమ్మాయి నాకు నచ్చలేదని నేను చెప్పలేనురా" హనుమాన్లకు మాత్రమే అర్ధమయ్యే రీతిలో భోరుమన్నాడు నారాయణరావు.
   
    "ఆఁ......" నిర్ఘాంతపోయాడు హనుమాన్లు.
   
    "నువ్వు సడన్ గా ట్రాక్ మార్చేస్తే ఎలారా......ఇప్పుడు నువ్వు, నువ్వు కాదురా......ఆ పోరంబోకు షారుఖ్ వి అందుచేత నీకాపిల్ల నచ్చదు గాక నచ్చదు అంతే."
   
    "ఏంటో పెళ్ళికొడుకుగారు, పక్కనున్నాయనతో గుసగుసలాడుతున్నారు. నేను నచ్చలేదని చెప్పడానికా" సూటిగా పెళ్ళికూతురు వేషంలో వున్న సంధ్య అలా అడిగేసరికి ఖంగుతిని-
   
    "లేదు......లేదు.....ఆ ఉద్దేశ్యం ఎప్పుడో మారిపోయింది__అందుకే" నారాయణరావు మాటకి టప్ మని హనుమాన్లు అతని తొడ    మీద కొట్టాడు.

 Previous Page Next Page