Previous Page Next Page 
పాదాభివందనం పేజి 7

"నాన్నా! మరో అయిదు నిమిషాల్లో ట్రయిన్ వస్తుంది." అంటూ వచ్చాడు ఈశ్వర్.

"నేను సిద్దంగా వున్నాను" రాఘవ నవ్వుతు అన్నాడు.

శారదా కొడుకు కేసి సూటిగా చూసింది. "పూరేమ్మని రెండుగా చీల్చి పూజంటని విడదిస్తూన్నార్రా" అన్నట్టు చూసింది.

"శారదా!"

"నేనూ వచ్చేస్తానండి!" అంది ఆమె. ఇన్నేళ్ళుగా వున్న ఠీవి అంతా పారిపోయింది. ధైర్యం తగ్గిపోయింది. భయం పుట్టుకొస్తోంది. వంటరితనం రాహువులా తరుముకొస్తోంది.

"నువునా?"

ఆ  మాట ఆమెకి మరణ శిక్ష విధించినట్లుగా వినిపించింది. రాగ ప్రస్తారంలో తీగ తెగినట్టు ఆలాపన వేళలో కంఠనాళం చిట్లినట్టు ఆమె నిశ్చేష్టతయై చూసింది.

మూడో బెల్ మ్రోగింది.

ఇద్దరిమధ్యా నిశ్శబ్దం. రెండు శరీరాల్ని కాక రెండు జీవితాల్ని విడదీసే శాసనంలా వచ్చేసింది రైలు. శారద అక్కడ నుంచోలేకపోయింది. ఎదురుగా వచ్చేకొడుక్కి ఎదురుగా వెళ్ళింది.


గుంతకల్లు జంక్షన్.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వచ్చే సూచనగా మూడో గంట మ్రోగింది. భుజాలు నిండుగా కప్పుకున్న శాలువాని సవరించుకుంటు "ఇక వెళ్ళండి" అంది రుక్మిణి.

పరమశివం కళ్ళద్దాలు సవరించుకున్నాడు. అతని ముఖంలో ఏ భావం లేదు. రుక్మిణి పుట్టింటివాళ్ళిచ్చిన నగలు, ఆస్థి అంతా అతనికి అప్పగించి కట్టుకున్న సాదా నేత చీరతో వెళుతోంది. ఒక మహారాణి వనవాసం వెళుతున్నట్టుగా వుంది.

"చూడు- నువిలా వెళ్ళిపోతే"-

"వెళితే-"

"లోకం ఏమనుకుంటుంది?"

"లోకానికి నా చరిత్రే ఇంకేంపనులు లేవా?"

"అబ్బయి"

"వాడికి పెళ్లయింది, ఉద్యోగం వుంది. తోడుగా భార్యాబిడ్డలున్నారు. ఏమి లేని ఏకాకిని నేను-"

"రుక్మిణి- నువు ఏకాకివా? నేనున్నాను, పిల్లలున్నారు. ప్రేమ, అల్లుడు మనవలు"

"ఎందరుంటేనేం? నా గుండె చప్పుడు నాది. నా ఎదలోని సోద ఎవరు విన్నారు- నా ఆర్తి ఎవరికి కావాలి? స్నేహాన్ని గుర్తించలేదు. ఆత్మీయతని గుర్తించలేకపోయారు. మనసు విప్పి మాట్లాడేందుకు భయం-- కాఫీ కలిపి యిచ్చేందుకు జంకు అన్నీ ఆంక్షలు- ఆజ్ఞలు- ఎప్పుడూ ఎవరో చూస్తారు- ఏదో అంటారు అనే అర్ధం లేని అనుమానాలు- మీరు మీ అబ్బాయి- మీ అమ్మాయి."

"వాళ్ళు నీ పిల్లలే."

"ఉహు ఉహూ " వారించిందామె. నేను జన్మనిచ్చిన తల్లిని- అంతే? అన్ని మీ మాటలే- మీ అజ్ఞలే. మీ పెంపకమే. గాంభీర్యం- గుంభన- ఒంటెత్తు తనం శాసించాలనే బుద్ది."

ట్రెయిన్ ప్లాట్ ఫాం మీదికి వచ్చింది.

"నమస్తే!" రెండు చేతులు జోడించింది. "ఏది ఏమైనా నాకు మాంగల్యం ముడివేశారు. ఇన్నేళ్ళు భరించారు. విడిపోతున్నాం సెలవు."

"రుక్మిణి"

"వెళ్ళండి! అటూ ట్రెయిన్ వైపు కదిలింది. ఇన్ని సంవత్సరాలు కలిసి బ్రతికిన భర్తను విడిచిపోతున్నందుకు కానీ, కన్న కూతుర్ని అల్లుడ్ని కొడుకుని బిడ్డల్ని వడిలి పోతున్నందుకు కానీ ఆమెలో వీసమేత్తు దుఃఖం లేదు.

తన జన్మ జన్మం చెలికాడు-- తన నెచ్చలి- తన ప్రాణ మిత్రుడు- ఆత్మీయుడు- ప్రాణాధికుడు - ఆరాధకుడు అయిన రాఘవని కలుసుకోబోతున్నందుకు ఆమెలో రస సాగరం పరవళ్ళు తొక్కుతోంది.

"మినీ-" పరిగెత్తినట్టే నడిచింది. అది జంక్షన్ అని కానీ కొన్నివేల మంది ఉన్నారని కానీ, ఎందరో తనని గమనిస్తారని కానీ ఆమె మనస్సులో లేనేలేదు. కడలిని చేరే నదిలా కదిలింది.

అక్కడే నుంచున్న పరమశివం నిట్టూర్చాడు.

ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు! ఉద్వేగము లేని భావనలు గుండె నిండా వున్నాయి. కోరుకున్నది దక్కించుకున్న అనందం కళ్ళలో కన్పిస్తున్నది.

"మినీ" ఆమె వైపు ఆరాధనగా చూస్తూ "ఎన్నేళ్ళు పట్టింది నా తపస్సు ఫలించటానికి ఇప్పటికి నా అదృష్టం పై నమ్మకం లేదు.

"ఇంకాన?"

"అవును" చిరుగాలికే కంపించే పల్లవంలా కదుల్తున్న ఆమె పెదాలని చూస్తూ అన్నాడు.

"ఎందుకు?"

"చూడటం కూడదన్న వాళ్లు . మాట్లాడటం నిషేదించిన వాళ్ళు అర్ధోక్తిలో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టినవాళ్ళు?"

"ఊ- ఏం చేస్తారేం?"

"నిన్ను ఆపేస్తారనుకున్నాను."

ఆమె అతని చేతిని అందుకుంది. ఒక శీతలకిరణం మరో వెన్నెల కెరటాన్ని స్పృశించినట్టుగా వుంది. "రఘూ" నన్నాపలేరని తెలిదా! ఆపితే ప్రాణాలు వదిలేదాన్ని- ఇన్నాళ్లూ భరించాను నరకం. భాద్యతలు తీర్చి- డ్యూటీదిగినట్టు వచ్చేస్తున్నాను. "అంది .

"కానీ - వాళ్ళకి నీ అవసరం."

"నాకవసరం లేదు నా గమ్యం వేరు, నా ధ్యేయం వేరు కదా! పోయిన జీవితం పోయింది. మిగిలిన బ్రతుకునైనా పండించుకోవద్దా . కోరికలు లేవు, అవేశాలు లేవు. అనుమానపడేవారెవరు. స్నేహితుల్లా కలసి జీవించాలనే కోరిక ఇప్పటికయినా తిరోద్దా?"

అతనామేనే చూస్తున్నాడు వెన్నెల వీధుల్లో, వెన్నెల వీణ మీటులలో , వెన్నెల పూలు రవళిస్తో వెన్నెల గీతాలు పాడుతూ వెన్నెల నృత్యం చేసే వియర్చరలా వుంది.

"ఎంత అందం!" అనుకున్నాడు. ఇది దేవతలకే సాధ్యం. కోరిక రగల్చకుండా మనస్సుని శాంతపరిచే ఈ సౌందర్యోపాసన తనది. రసవల్లవం లాంటి జీవితం ప్రారంభమైంది!" అనుకున్నాడు.

 Previous Page Next Page