అందమయిన అమ్మయి మరింత అందంపులుముతోన్న కాటుక కళ్ళతో నవ్వాపుకోటానికి ప్రయత్నిస్తోంది.
"నమస్తే అంది" మళ్ళీ నవ్వు తెరల్లోకి జారిపోతూ.
"నమస్తే! మిమ్మల్నిక్కడో చూసినగుర్తు....."ఆలోచనల్తో జ్ఞాపకాల్ని డ్రిల్లింగ్ చేస్తూ అన్నాడు.
"నీకు తెలిసిన కేస్ కాదులే! మహేష్ భార్య."
సురేష్ గాబరాపడ్డాడు.
"అవును! మహేష్ భార్య ఇన్ కమ్ టాక్స్ కుర్రాడితోలేచిపోయిందని తను తులసి దగ్గర ప్రచారం చేసినమ్మాయ్."
వెంటనే కోలుకున్నాడు.
"అవునవును! మహేష్ రెండోభార్య..అయ్ మీన్ అఫీషియల్ వైఫ్" ఉమారాణి నవ్వాగిపోయింది.
మహేష్ పొట్ట చేత్తో పట్టుకుని నవ్వుతున్నాడు.
అఫ్ కోర్స్! మొదటామెలేచిపోవటమే మంచిదయింది లెండి! మీరు చాలా అందంగా వున్నారు.
ఆమె అనుమానంగా మహేష్ వైపు చూసింది.
"మహేష్ కి తెలిసిన తను ఆ హోటల్లో మేనేజర్...." తులసి అంది.
"ఓ! ఈ కుట్రవెనుక మహేష్ హస్తముందన్నమాట."
"జాగ్రత్తగా చేసుకుంటే జాబ్ మంచిదే చెప్పాడు మహేష్....."
"జస్ట్ సూపర్ వైజింగ్....."
డ్యూటీ అవర్స్ ఏమిటి?"
"ట్వల్వ్ అవర్స్" మాణింగ్ ఎయిట్ టు ఈవెనింగ్ ఎయిట్.
"ఓ! బాండెడ్ లేబర్ అని చెప్పకుండా 'జాబ్' అంటారేం?"
"ఊహు....రెండుచోట్ల బాండెడ్ లేబర్ గా వర్క్ చేయటం నా వల్ల కాదు."
"రెండు చోట్లేమిటి?" కుతూహలంగా అడిగింది తులసి.
"సంవత్సరంన్నరనుంచీ నన్ను బాండెడ్ లేబర్ గా ఉపయోగించుకుంటున్నావ్ కదా! ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రీ......పోనీఏమయినా వెరయిటీ ఉందా అంటే అదీలేదు. జీతం బత్తెం లేదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి కంప్లెయింట్ ఇస్తున్నానులే....ఇంకెంతకాలం ఈ సెక్స్ ప్లాయి టేషన్ జరుగుతుందో చూద్దాం."
ఉమారాణి ముఖం పక్కకి తిప్పుకుని తనివితీరా నవ్వుతోంది.
"పొయిట్రీ కంప్లీటయింది ఉత్సాహంగా అన్నాడు మహేష్."
తులసి కుర్చీ అతనికి సమీపంగా లాక్కుని కూర్చుంది.
"ఈ గీతం పేరు ప్రియతమ."
"కోరికలున్నవి కన్నులలో
గతస్మృతులున్నవి గుండెలలో
కోరికలే గుర్రాలయితే
గతస్మృతులే పగ్గాలయితే
మనసునరేగెను సంక్షోభం
గుండెనుకాల్చెను మమతలగీతం..."
తులసి చప్పట్లు కొట్టింది.
"రియల్లీ సూపర్ మహేష్! నువ్వు వీటిని పత్రికలకెందుకు పంపవు?"
"వాళ్ళు తిప్పి పంపుతారని భయం....."
సురేష్ ఉమారాణి దగ్గరకు నడిచాడు. వట్టినే, 'ప్రియతమ' అని పేరు పెట్టాడుగానీ నిజానికి తులసిమీద రాశాడది. మీకు పొయిట్రీ ఇష్టంలేదన్నారుకదూ?
"అవును ఎలర్జీ నవ్వుతూ అంది ఉమారాణి."
"అయితే బయటికెళ్ళి కూర్చుందాం రండీ! మనిద్దరికీ ఎలర్జీ విషయంలో సౌమ్యం వుంది కాబట్టి మనం మంచి ఫ్రెండ్స్ అయే అవకాశముంది."
ఆమె కొద్దిక్షణాలు సంశయించి అతనితోపాటు బయటకు నడిచింది.
ఇద్దరూ మెట్లమీద కూర్చుంటూ చూశారు గంగాభవానిని.
నూతివెనుక బట్టలు ఆరేస్తుంది.
చప్పునపైకి దోపుకున్న చీరనుకిందకు వదిలేసిందామె.
"నాకు కొత్తేంకాదులెండి! మీరలా ఓవరాక్షన్ చేయనక్కరలేదు సీరియస్ గా చెప్పాడు. "ఆమె మొఖంలో సిగ్గూ, అవమానం ఎర్రబడ్డాయ్.
"ఈమె గంగాభవానిగారని నాకు, తులసికి ఇంటి ఓనరు. చాలా ఉదార స్వభావం!" "ఏదడిగినా కాదనలేదు...... ఒక్కటి తప్ప....." గంగాభవానిమండిపడుతూ ఏదో అనబోయిందిగానీ......ఉమమాట్లాడింది.
"నమస్తే..."
"నమస్తే.....మీరెక్కడయినా జాబ్ చేస్తున్నారా?"
"లేదండీ! మీరో?"
ఆమె జవాబిచ్చేలోగానే సురేష్ కల్పించుకున్నాడు.
"చేయకపోవడమేమిటి మునిసిపల్ కార్పోరేషన్లో చాలా ప్రాముఖ్యతగల పోస్ట్ లో ఉంది." "అది ఆమెకోసమే ప్రత్యేకంగా సృష్టించారు....."
గంగాభవానిభయంగా చూస్తోందతనివేపు.
"అంతా వట్టిదే.....అతనిమాటలు....."
"ఏమిటా పోస్ట్?"
"ఈ ఏరియా ఏజంట్?"
"అంటే ఏం చేయాలి?"
"డిమోలిషన్ ఆఫ్ టెంపరరీ ఎరక్షన్స్..."
గంగాభవానికి అర్ధం కాలేదు.
"ఓ! ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్స్?"
"ఎగ్జాక్ట్ లీ? ఈ సంవత్సరకాలంలో చాలా ఎరక్షన్స్ డిమోలిషన్స్ చేయగలిగింది" గంగాభవాని ఇంట్లోకివెళ్ళిపోయింది రుసరుసలాడుతూ.
ఉమారాణి అనుమానంగా చూసింది.
"మీరు చెప్పిందంతా అబద్దం కదూ?"
"ఆమె చేస్తున్న జాబ్ అదేగానీ జీతంఎవరూ ఇవ్వటంలేదు అది ఆమె హాబీ!" ఆమెకు అప్పుడర్ధమయింది.
కొద్దిక్షణాలపాటు తల భూమిలోకి దించేసుకుంది.
"మా వారిగురించి తులసి కెందుకలా అబద్దం చెప్పారు."
"ఏ అబద్దంగురించి మీరు మాట్లాడేది. నేను చాలా చెప్తూంటాను!"
"అదే నేను లేచిపోయానని....."
"మీరు కాదు. మహేష్ మొదటిభార్య సంగతది."
ఆమె నవ్వేసింది.
"నేనే మొదటి భార్యను."
"అయితే లేచిపోయి మళ్ళీవచ్చేశారన్నమాట మీరు!"