"నేనూ ఆ షారుఖ్.....ప్రేమించుకుంటున్న విషయం నీకు తెల్సు గదా....."
"అవును....అలాంటి ముక్కూ ముఖం కన్పించిన వాళ్ళని ప్రేమించొద్దని నీకు చెప్పాను కదా....ఆ విషయం నీకు చెప్పాను కదా.....ఆ విషయం నీకు తెల్సొచ్చిందా?" ఒక చిన్న రాయిని తీసుకుని వెనక్కి విసిరింది సంధ్య. ఆమెకు ఎలాంటి రాయినైనా వెనక్కి విసరడం అలవాటు.....చిన్నపుడు, వాళ్ళ మేనత్త బియ్యంలో రాళ్ళని ఎరుతూ వెనక్కి విసిరేది.....మేనత్త తన అలవాటే, మేనకోడలికి వచ్చిందని పొంగిపోతుంది.
"కాదే బాబూ.... అతని ముక్కూ ముఖం విషయంలో నేను షారుఖ్ కి వార్నింగిచ్చాను.....జుత్తు కత్తిరించుకుంటానని ప్రామిస్ చేశాడు.....ప్రస్తుతం జుత్తు కాదు డేంజర్, షారుఖ్, నేను ప్రేమించుకుంటున్నామని తెల్సి, షారుఖ్ నాన్న, జాబాలి నాయుడు మా ఇద్దర్నీ విడదీయడానికి ఏవో కుట్రలు చేస్తున్నాట్ట....."
"చూడు జానూ.....హ్యూమర్ సినిమాల్లోలా తలాతోకా లేకుండా చెప్పావంటే.....మర్డర్ చేసేస్తాను__స్టోరీ నా కర్దమయ్యేట్టు చెప్పు....." ఇంకో గులక రాయిని తీసి వెనక్కి విసురుతూ అంది సంధ్య.
"కొన్నాళ్ళు నేనూ షారుఖ్ ప్రేమించుకున్నాం గదా.....ఎన్నాళ్ళలా ప్రేమించుకుంటాం చెప్పు..... వాళ్ళ నాన్నని వప్పించి, సంప్రదాయపు పద్దతిలో బాపూ సినిమాలోనా పెళ్ళిచూపులు పెట్టుకొని తర్వాత పెళ్ళి చేసుకుందామనుకున్నానే....కానీ...కరుణామయుడైన నాక్కాబోయే మావే, అమ్రేష్ పురీలా తయారయ్యాడే" బాధగా అంది జానకి కాసేపయ్యాక బాధను దిగమింగుకుని-
"ఈ ఆపద నుంచి నువ్వే రక్షించాలే సంధ్యా....." అంది జానకి.
"ఎలా?"
"నా బదులు పెళ్ళికూతురిగా నువ్వుండాలే.....నీ కలవాటేగా పెళ్ళిళ్ళు చెడగొట్టడం.....నీ ఫీజు మాత్రం నీకిచ్చేస్తాలే...." హేండ్ బ్యాగ్ లోంచి కొన్ని నోట్లను బయటకు తీస్తూ అంది జానకి.
"నేను పెళ్ళికూతురిగా ఎలా యాక్ట్ చెయ్యగలను.....చెప్పు.....షారుఖ్ గుడ్డాడు కాదుగా...." ప్రశ్నించింది సంధ్య.
"అదేకదా నీ డౌటు నేను క్లారిపై చేస్తాను మా మావ అమ్రెష్ పూరీ అని చెప్పానే....అతగాడు చేస్తున్న కుట్ర ఏమిటో తెల్సా.....పెళ్ళిచూపులకి తన కొడుకును రాకుండాచేసి, ఇంకో వెధవని అతగాడికి బదులుగా నా దగ్గరకు పంపుతాట్ట. వాడు నన్నుచూసి, నాకీ పిల్లా అక్కర్లేదు.....పెళ్ళీ అక్కర్లేదని తెగేసి చెప్పేస్తాట్ట. ఈ విషయం అతి కష్టమ్మీద నాకు తెల్సిందిలే....ఆ విషయం తర్వాత చెపుతాను.
సదరు డమ్మీ పెళ్ళికొడుకు వచ్చే ప్లేసులో మా అక్క, బావ మొదలయిన బంధువులందర్నీ డమ్మీలుగా పెట్టాను. ఆ డమ్మీ కేండిడేట్ అక్కడకొచ్చి, నిన్ను చూసి ఛఛ....ఈ పిల్ల నాకు నచ్చలేదు.....ఇలా అలా వాగుతాడు. అదే సమయంలో తండ్రి చెరనుంచి మా షారుఖ్ తప్పించుకొని వచ్చి నిజమైన బంధువుల మధ్య నన్ను పెళ్ళి చూపులు చూసేస్తాడు. అది ఇంకొక చోటన్నమాట. ఎలా ఉంది ప్లాన్" హుషారుగా చెప్పింది జానకి.
సంధ్య ఇంకో గులకరాయిని తీసుకుని ఆలోచనలో పడింది.
"సంధ్యా.....నువ్వు సీరియస్ గా ఆలోచించకే. డేంజర్ లో పడిపోతాం.....మామూలుగా ఆలోచించు చాలు. ఇదిగో వెయ్యిరూపాయలు పార్ట్ టైమ్ జాబ్ చేసి కష్టపడిన డబ్బే ఇది....."
సంధ్య ఆ వెయ్యి రూపాయలవేపు చూసి-
"వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు పెద్దలు. కానీ మిగతా వాళ్ళ దగ్గర వెయ్యిరూపాయలు తీసుకుని పెళ్ళిళ్ళు చెడా, మడా చెడగొట్టే నేను నీ దగ్గర వెయ్యిరూపాయలు తీసుకాకుండానే ఆ పెళ్ళి చూపుల్ని చెడగొడతాను గదా? మనమధ్య డబ్బు, ఫీజు ప్రసక్తి తీసుకొచ్చి, నన్ను బాధపెట్టావ్ నువ్వు....." మరో గులకరాయి వెనక్కి విసురుతూ అంది సంధ్య.
"సారీ సంధ్యా.....నీ మనసు ఇంత గొప్పదని నేనూహించలేకపోయాను. ఫ్యూచర్లో నాకు జన్మించే కూతురికి నీ పేరే పెట్టుకుంటానే సంధ్యా....." చేతిలో చెయ్యేస్తూ అందామె.
"ప్రామిస్ చెయ్యడం సులభం. నిలబెట్టుకోవడం చాలా కష్టం" ఏదో సామెత గుర్తుకు రావడంతో అనేసి లేచి నిలబడింది సంధ్య మరొక గులకరాయిని వెనక్కి విసిరి.
ఇద్దరూ ఇసకలో నడుస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక గులకరాయొచ్చి స్నాధ్య భుజానికి తగిలింది. కళ్ళు తిప్పి అటువేపు చురుక్కున చూసింది సంధ్య.
ఆమె అంతకుపూర్వం కూర్చుని వెనక్కీ విరిసిన గులకరాళ్ళు పడిన ప్రదేశంలో ఎంత సేపట్నుంచి ఉన్నాడో తెలీదు ఒక అరవై ఏళ్ళ వృద్దుడు కూర్చుని అన్నాడు. అదేపనిగా ఒక అందమైన యువతి పదే పదే తనమీద గులకరాళ్ళను విసురుతుండగా పూర్వకాలపు జ్ఞాపకాలు వచ్చినవాడిలా అయిపోయిన ఆ వృద్దుడు చివరిగా తను కూడా తన మనసులోని భావాన్ని ఆ వెళ్ళిపోతున్న అమ్మాయికి తెలపదలచి గులకరాయి విసిరాడు.
సంధ్య గబగబా అతనిదగ్గరకెళ్ళి, అతని కళ్ళల్లోకి ఓరగా చూసి "వెనక నుంచి నేను విసిరిన గులకరాళ్ళు నీమీద పడ్డాయికదూ" అడిగిందామె.
"అవును"
"దాంతో నువ్వు డ్రీమ్స్ కనడం మొదలెట్టావు కదూ......"
"ఇంకా రూఢీ కాలేదుగా......'బోసినోటితో నవ్వుతూ అన్నాడు అతను.
"నేన్నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అలా సూటిగా తన కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తున్న ఆ అమ్మాయివేపు చూసి సిగ్గుపడ్డాడు ఆ వృద్దుడు.
"పెళ్ళి చేసుకుంటావా?" రెట్టించి మళ్ళీ అడిగింది సంధ్య.
"మా ఆవిడ కొంచెం గయ్యాళి టైపు. నేనేం చేసినా, ఆవిడ్ని అడిగే చేస్తాను" నెమ్మదిగా అన్నాడాయన.
సంధ్య నవ్వింది. నవ్వుతూ, నవ్వుతూ అక్కడనుంచి కదిలి జానకి దగ్గరికి వచ్చేసింది. పాపం నవ్వుతూ తనకు దూరమైపోతున్న సంధ్యను చూస్తూ భారమైన హృదయంతో లేచి నిలబడ్డాడు ఆ వృద్దుడు.
మరో పదినిమిషాల తర్వాత జానకి, సంధ్య ఇద్దరూ సిటీబస్సులో ఉన్నారు.
"రేపు ఉదయం పదకొండు గంటలకు పెళ్ళిచూపులు నువ్వీ రాత్రి బయలుదేరితే బావుంటుంది. ఇద్దరం కారులో వెళదాం. నిన్ను నీ ప్లేస్ లో దించి, నేను నా ప్లేస్ కి వెళ్ళిపోతాను. ఆ పెళ్ళిచూపుల తతంగం అయిపోయాక నిన్ను కలుస్తాను.....ఇద్దరం తిరిగి వచ్చేద్దాం......సరేనా?"
"సరే....." అంది సంధ్య.
ఆ రోజు రాత్రి పదిగంటలకు జానకి, సంధ్య కారులో విశాఖపట్నం నుంచి బయలుదేరారు.
* * * *
సబ్బవరం గ్రామంలోకి ప్రవేశించాయి పదికార్లు. ఆ కార్ల మధ్య లోని మారుతీకారులో ఉన్నాడు నారాయణరావు. సూటు, బూటు, రేబాన్ కళ్ళజోడు__ఎప్పుడూ అలవాటు లేకపోవడంవల్ల మెడకు కట్టుకున్న టైను అడపా దడపా లాక్కోవడంవల్ల అది బిగుసుకు పోతోంది.
ఆ విషయాన్ని పక్కనే పంచె, లాల్చీలో పెద్దమనిషిగా కూర్చున్న హనుమాన్ లు గమనిస్తున్నాడు.
"గురూ.....మనం పెళ్ళివారింటికి చేరేసరికి ఆ టై గొంతుకు ఉరిలా బిగుసుకుపోయి నువ్వు ఢామ్మనడం ఖాయం. ఈ పెళ్ళిచూపుల తంతు, చావు తంతులా అయిపోద్ది జాగ్రత్త" హెచ్చరించాడు.
హెచ్చరికల్ని ఎప్పుడూ నారాయణరావు పట్టించుకోడు. అలాగే ఈ హెచ్చరిక కూడా.