జీపులో కూర్చున్న తర్వాత బన్సీలాల్ చెప్పాడు..."పోలీస్ స్టేషన్ కి పోనియ్యి."
ఖాన్ వినయంగా తలూపాడు.
జీపు పోలీస్ స్టేషన్ వేపు పరుగుతీసింది.
7
పదినిముషాల తర్వాత.
వాదన ప్రతివాదన జరిగింతర్వాత ఇరువురు ఓ అవగాహన కి వచ్చారు.
"నాకంతా అయోమయంగా వుంది. బన్సీలాల్ తల పట్టుకుంటూ అన్నాడు.
"నాకూనూ" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"ఇదంతా ఎలా జరిగిందంటారు?" కొద్దిసేపు ఆగి బన్సీలాల్ అడిగాడు.
"విషయం చాలా క్లిష్టంగా వుంది....మనకి తెలియని మూడో మనిషి చాలా గట్టివాడు అయి వుంటాడు....ఆనందయ్య, రామ్ దేవ్ లు వాళ్ళబాకీ అదేమి నాకు తెలియదు. వాళ్ళబ్బాయిని మీరు కిడ్నాప్ చేసి__
"దయచేసి మీరంతమాట అనవద్దు" ఇన్ స్పెక్టర్ మాటలకి మధ్యలో అడ్డుతగిలి అన్నాడు బన్సీలాల్.
ఇన్స్ పెక్టర్ అప్పటికే బన్సీలాల్ ఉప్పూ కారం తెగ తిని పూర్తి ముఖమాటంలో వున్నాడు. అందుకే బన్సీలాల్ నొచ్చుకోని విధంగా "ఓకే ఓకే లాల్ జీ" అని అన్నాడు చిరునవ్వుతో.
బన్సీలాల్ మొఖం ప్రసన్నత జెందింది.
"వేడివేడిగా చాయ్ తాగుదామా!"
"ఓకె మీలాంటివార్కి ఈ అలగా జనంతో వంద వ్యవహారాలు వుంటాయి. అవసరానికి కాళ్ళుపట్టుకొని డబ్బు తీసుకొంటారు, ముం....కొడుకులు. తిరిగి యివ్వాలంటే చచ్చిపోతారు. ఇలాంటి విషయాలు నాకు తెలియందేమీ కాదు. ఈ కేసుల్లో మేము మధ్యలో దూరము....వాళ్ళని భయపెట్టడానికి మీరు తాత్కాలికంగా వాళ్ళబ్బాయిని దాచివుంటారు. అదితప్పని కూడా నేను అనను."
"కరెక్టుగా చెప్పారు. వాళ్ళని భయపెట్టడానికి దాచాను. గాడిద కొడుకులు వాళ్ళని భయపెట్టకపోతే లాభంలేదు. కాస్త లూజుగా వున్నామంటే అసలు మాట వినరు."
"జరిగింది అదేకదా! ఈ విషయం నాకు తెలియదు కదా? అలాంటప్పుడు రాత్రికి రాత్రి నేను ఎలా కబురు చేస్తాను చెప్పండి. ఫోన్ చేసి విషయం చెబుతాను గాని ఎప్పుడయినా రహస్య సమాచారాన్ని లెటర్ ద్వారా అందించటం జరిగిందా?"
"లేదు. ఆ కవరుని ఎవరయినా తెచ్చి యిచ్చినట్లయితే నమ్మేవాడ్నికాను. మీ కానిస్టేబుల్స్ స్వయంగా రావటంతో..."
"వాళ్లిద్దరూ రాత్రి నాదగ్గర డ్యూటీ మీద వున్నారు..."
"మీతో నేను ఫోన్ లో మాట్లాడాను."
"నాలాగా ఎవరన్నా స్వరంమార్చి మాట్లాడివుండవచ్చు కదా!"
"ఆ....అలాగే జరిగింది అనుకుందాము. మరి రమణ, రాజు వచ్చారు. వాళ్ళతో మాట్లాడాను. మా యింట్లో అందరుకూడా వాళ్ళిద్దర్నీ చూశారు. రమణ చేతిమీద గాయంకూడా అయింది."
"గాయం అయిందా!"
"ఊ....సైకిల్ మీద నుంచి పడ్డాడట. చేతిమీద నెత్తురోడుతూ సరీగ మూడంగుళాల గాయం వుంది."
బన్సీలాల్ చెప్పంగానే ఇన్ స్పెక్టర్ ముఖం వికసించింది.
"పదండి లలితా నర్సింగు హోమ్ కి వెళ్ళివద్దాము." అన్నాడు.
తాను చెప్పే విషయానికి లలితా నర్సింగు హోమ్ కి సబంధం ఏమిటో బన్సీలాల్ కి అర్ధంకాలేదు.
బన్సీలాల్ ముఖంచూసి విషయం గ్రహించాడు ఇన్ స్పెక్టర్. నవ్వితే బాగుండదని సీరియస్ గా ముఖం పెట్టి లేచి నుంచున్నాడు.
బన్సీలాల్ కుర్చీలోంచి లేచాడు.
"ఇప్పుడు నర్సింగ్ హోమ్ కి వెళ్ళటం అవసరమా?" స్టేషన్ లోంచి బయటికి రాగానే అడిగాడు బన్సీలాల్.
"చాలా అవసరం." ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు ఇన్ స్పెక్టర్.
"ఇప్పుడీ కేసు....."
"ఆ పని మీద ఓ సాక్ష్యాధారం కళ్ళారా చూపించటానికి మిమ్మల్ని నేను తీసుకు వెళుతున్నాను. దయచేసి ఇప్పుడేమీ ప్రస్నించవద్దు. మీరు అది కళ్ళారా చూసిం తరువాత ఏం చేయాలో చర్చించుకుందాము." ఇన్ స్పెక్టర్ మోటారు సైకిల్ ఎక్కుతూ అన్నాడు.
బన్సీలాల్ తల తాటించి తన జీపు ఎక్కాడు.
జీపు, మోటారు సైకిలు ముందుకు సాగాయి.
జీపులో సావధానంగా కూర్చున్న బన్సీలాల్ మనసు మాత్రం పరిపరివిధాల పోతున్నది. ఇప్పుడు లలితా నర్సింగ్ హోమ్ కి దేనికి? తన కేసుకి నర్సింగ్ హోమ్ కి సంబంధం ఏమిటి? లేక సంబంధం వుందా? అయితే అది ఎలాంటిది?
బన్సీలాల్ బుర్ర ఆలోచనతో వేడెక్కటం తప్పించి విషయం అణుమాత్రం కూడా ఊహకి అందలేదు.
పది నిమిషాల తర్వాత జీపు, మోటార్ సైకిల్ నర్సింగ్ హోమ్ ముందు ఆగాయి.
బన్సీలాల్, ఇన్ స్పెక్టర్ వారి వారి వాహనాలు దిగి నర్సింగ్ హోమ్ లోకి వెళ్ళారు.
అక్కడ...