సో!
నో రిగ్రెట్స్!
సీటులో కాస్త వెనక్కి జరిగాడు దినకర్. సంకెళ్ళు చేతులకి ఒరుసుకుపోయాయి.
మెకానిక్ పూర్తిగా చెప్పకపోయినా ఇప్పటికే చాలావరకూ తను గ్రహించగలిగాడు జరుగుతున్నదేమిటో.
విక్కీని చూడగానే-
విక్కీ.
జూనియర్ రాంబోస్!
అలా అనుకోగానే దినకర్ పెదిమల మీదికి విషాదంతో కూడిన చిరునవ్వు వచ్చింది.
యా! జూనియర్ రాంబోస్.
చైల్డ్ వారియర్స్!
పిల్ల సైనికులు! ఇవాళ ప్రపంచంలో పలుదేశాల్లో అనుసరించబడుతున్న యుద్ద వ్యూహంలో పావులు...
పసివాళ్ళు!
ఎనిమిదేళ్ళు వయస్సు నుంచి పదమూడు, పద్నాలుగేళ్ళ వయస్సు దాటని పసివాళ్ళని మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి యుద్దాల్లోకి పంపడం లేటెస్టు టెక్నిక్!
నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ నిజంగా జరుగుతోంది.
ఆప్ఘనిస్తాన్ యుద్దంలో జరుగుతున్నది అదే!
ఐర్లాండు, బర్మాలో, అమెరికాలో లాస్ ఏంజెలెస్ లో కూడా జరుగుతున్నది అదే!
భీషణమయిన యుద్దరంగంలో ముక్కు పచ్చలారని పసిపిల్లలు!
వాళ్ళ చేతుల్లో మృత్యుముఖంలాంటి మారణాయుధాలు!
ఎకె 47 అస్సార్ట్ రైఫిల్స్!
ఎమ్ 16 రైఫిల్స్!
ఆర్ పిజి సెవెన్స్!
లాంచర్స్ బజూకాస్!
కాలాష్ ని కొవ్స్!
ఎట్ సెట్ రా....ఎట్ సెట్ రా..
అన్ బిలీవబుల్!
దినకర్ ఛాతికి తగులుతోంది విక్కీ చేతిలోవున్న ఎమ్ 16 తాలూకు బట్...
విచారంగా విక్కీ మొహంలోకి చూసాడు దినకర్.
అదో రకమయిన ఉద్రేకంతో మెరుస్తున్నాయి విక్కీ కళ్ళు ఉన్మాదంలో వున్నవాడిలా ఉన్నాడు అతను!
ఆ పిల్లాడి మొహంలో పైశాచిక ఆనందం!
వయొలెన్స్ అనే మత్తుకి బానిస అయిపోతున్న తరానికి ప్రతీకలాగా వున్నాడు విక్కీ.
విక్కీ!
జూనియర్ రాంబో!
విక్కీ మొహంలోకి చూస్తూ తలపంకించి మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయాడు దినకర్.
బాల్యం!
మనిషి జీవితంలో అతి ముఖ్యమయిన ఘట్టం!
బాల్యం అంటే ఏ చీకూ చింతా లేకుండా బాధలు భరించవలసిన అవసరం లేకుండా గడిపెయ్యాల్సిన రోజులు!
బడికెళ్తూ చదువుకుంటూ కొత్తకొత్త విషయాలెన్నో సరదాగా నేర్చుకోవలసిన దశ!
పిల్లలు అలా ఆడుతూ పాడుతూ బతికెయ్యాలని పెద్దలు ఆశపడతారే తప్ప పిల్లలు ఇంకోళ్ళని చంపాలని ఎవరూ కోరుకోరు. కోరుకోకూడదు!
కాని ఇప్పుడు జరుగుతున్నది అదే!
నిన్న మొన్నటి దాకా చైల్డ్ లేబర్ అంటేనే తప్పుగా భావించారు జనం! పదేళ్ళు దాటని పిల్లలు హోటళ్ళలో, గ్యారేజిల్లో రోజుకి పన్నెండు గంటలూ, పధ్నాలుగు గంటలూ వెట్టిచాకిరీ చేస్తూ ఉంటే బాధపడ్డారు.
పిల్లలచేత చాకిరీ చేయించుకోకూడదని చట్టాలు చేసింది ప్రభుత్వం.
కానీ ఇవాళ...
గాడ్ ఇవాళ సొసైటీ ఇంకొంచెం ముందుకుపోయింది. చైల్డ్ లేబర్ దశ దాటిపోయింది ఇవాళ....చైల్డ్ వారియర్స్!
పిల్ల సైనికులు!
నిజం ఆయుధాలతో!
నిజంగానే యుద్దాలల్లోకి పంపబడుతున్నారు.
ప్రపంచంలో చాలా చోట్ల ఎనిమిదేళ్ళు వయస్సు వున్న పిల్లలు తమకే తెలియని శత్రువులతో తమకి అర్ధం కాని కారణాలకోసం పోరాటాలు సాగిస్తున్నారు.
ఏమీ తెలియని అర్భకులు వాళ్ళు!
యుద్దభూమిలో మృత్యుముఖంలాంటి మోర్టార్ షెల్ ఒకటి పక్కనే పడినా పారిపోవాలని తెలియక నవ్వులు చిందిస్తూ నిలబడే అమాయకులు.
చావు అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి.
సైన్యంలో ఇన్ ఫాన్ ట్రీ అనే ఒక విభాగం వుంటుంది. ఇన్ ఫాన్ ట్రీ అనేది ఫ్రెంచి భాషలో నుంచి రూపొందించిన పదం.
అంటే దాదాపుగా బాల్యం అని అర్ధం చెప్పుకోవచ్చును!
పిల్లల్లో వుండే ఎదురు చెప్పలేని విధేయత అలవాటు చేస్తారు సైన్యంలోని ఆఫీసర్లు తమ సైనికులకి.
చెప్పిన పనిని అదేమిటి ఇదేమిటని ప్రశ్నించకుండా భయభక్తులతో చెయ్యడం నేర్పిస్తారు. పెద్దలకు వుండే స్వతంత్ర భావాలు పిల్లలకి వుండవు. అందుకని వాళ్ళని డిసిప్లిన్ లో వుంచడం సులభం.
పెద్దలకి వున్నంత శారీరక దారుఢ్యం పిల్లకి వుండక పోవచ్చు. కానీ బరువు తక్కువ వుండే లైట్ వెయిట్ మారణాయుధాల యుగం ఇది! ఎకె 47, ఎమ్ 16 రైఫిల్స్ లాంటి ఆయుధాలని వుపయోగించడం చిన్న పిల్లలకి కూడా సులభంగా నేర్పించవచ్చు. చరిత్రకారుడు జాన్ కీగన్ ఎమ్ 16 రైఫిల్ ని, మోడరన్ ఆయుధాలలో ట్రాన్సిస్టర్ రేడియో లాంటిదని అన్నాడు. ఇలాంటి తేలికగా వుండే శక్తివంతమైన ఆయుధాల వల్ల శారీరకంగా బలహీనులు అయిన వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్ గా పోరాటం సాగించడం సాధ్యమవుతుంది.
ఇలా చిన్నపిల్లలు యుద్దాల్లో పాల్గొనడం వల్ల యుద్దాల తాలూకు ఫలితాల్లో పెద్దగా మార్పు వుండవచ్చు, వుండకపోవచ్చు.
కానీ-
పసిపిల్లల్ని కూడా దయాదాక్షిణ్యం లేకుండా యుద్ద రంగానికి పంపడం అనేది మనిషిలో వచ్చిన అతి హేయమైన మార్పుని స్పష్టంగా చూపిస్తోంది.
యుద్ధం ఎంత దారుణాతి దారుణమయిన పనులు చేయించగలదో బాగా అర్ధమయ్యేలా చేస్తోంది.
తన ఎమ్ 16 రైఫిల్ బట్ ని మరింత గట్టిగా దినకర్ కి తగిలేలా పట్టుకున్నాడు విక్కీ.
"కదలకు! బుల్లెట్లు స్ప్రే చేస్తాను" అన్నాడు హెచ్చరికగా.
అది ఉత్త బెదిరింపు కాదని దినకర్ కి తెలుసు. "ఓకే కిడ్ ఓకే! టేకిట్ ఈజీ!" అన్నాడు నెమ్మదిగా.
అతనికి ఇంకో విషయం గుర్తొచ్చింది.
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచంలో పదిహేనేళ్ళు దాటని పిల్లలు రెండు లక్షలమందికి పైగా సాయుధ పోరాటాలు సాగిస్తున్నారు. ఇథియోపియన్ నాయకుడు మెంగిస్టూ హెయిలీ మరియాకు పదమూడేళ్ళ వయస్సుగల పిల్లలతో కూడిన సైన్యం వుంది. ఆఫ్గనిస్తాన్ లో ముజాహిదిన్ సైనికుల్లో తొమ్మిదేళ్ళ వయస్సు పిల్లలున్నారు. బర్మాలో తిరుగుబాటుదారుల్లో పన్నెండేళ్ళ పిల్లలున్నారు అలాగే ఎల్ సాల్వెడార్ లో అలాగే ఇతర దేశాల్లో...
ఇరాన్, ఇరాక్ యుద్ద సమయంలో ఇరాన్ పదేళ్ళ పిల్లలని ఆయుధాలు లేకుండా యుద్దభూమిలోకి పంపడం జరిగింది.


