ఈ వెంట్రిలాక్విజమ్ అనే విద్య ద్వారానే టాకింగ్ డాల్ ప్రదర్శనలు ఇస్తూ వుంటారు. కొంతమంది ప్రదర్శకులు. మాట్లాడే బొమ్మని ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు ప్రదర్శకుడు. ఒక చేత్తో దాని వెనుక ఉన్న మెకానిజం హాండిల్ చేస్తూ అది కళ్ళు ఆర్పుతున్నట్లు తల వూపుతున్నట్లూ, నోరుతెరిచి నవ్వుతున్నట్లూ చేస్తాడు. అదే సమయంలో ఆ బొమ్మతో మాట్లాడుతున్నట్లు అభినయిస్తూ, ఏదో ప్రశ్న వేస్తాడు ప్రదర్శకుడు. ఆ తర్వాత వెనువెంటనే తను నోరు మూసేసుకుంటాడు. అప్పుడే బొమ్మ నోరు తెరుస్తుంది. ప్రదర్శకుడు తన గొంతు దగ్గర ఉన్న కండరాలు కదిలిస్తూ, పెదిమలు తెరవకుండానే బొమ్మ గొంతు పెట్టి మాట్లాడతాడు. టూకీగా టాకింగ్ డాల్ ప్రదర్శన పద్దతి!
వినేవాళ్ళకి మాత్రం బొమ్మే మాట్లాడుతున్నట్లు భ్రమ కలుగుతుంది.
అలాంటి టెక్నిక్ ని ఉపయోగించి, అకౌంటెంటు శవం చేత 'మాట్లాడించాడు' దినకర్.
"విన్నావా? నువ్వు టీనేజ్ అమ్మాయిల వెంటపడే రంగేళీ రాజానే కావచ్చు! కానీ నీకు ఎదిగిన కొడుకు ఉన్నాడు. నీ క్రైం ఎంపైర్ లో నీకు కుడిభుజం అతను. అతనే ఈ అకౌంటెంటు. ఇప్పుడు గనుక నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే, నీ కొడుకు నీకు దక్కడు! అండర్ స్టాండ్?
అలా అనేసి పెదిమలు బిగబట్టి అకౌంటెంటు గొంతుతో అన్నాడు దినకర్.
"డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ! ప్లీజ్!"
చలించిపోయాడు మెకానిక్.
"ఎన్నో ఆపరేషన్ లు చేశారుగానీ నా ఆపరేషనంత నొప్పి ఎవరికీ కలిగివుండదు" అని వాపోయాట్ట తనే ఆపరేషన్ చేయించుకున్న ఓ డాక్టరు.
అలాంటి ఫీలింగ్ కలిగింది అతనికి. అతను ఎంతోమందిని చంపించాడు. స్వయంగా ఎంతోమందిని చంపాడు కూడా.
అతని కొడుకుకి తను స్వయంగా చంపేటంత ధైర్యం లేదు. కానీ చంపించగలడు. అతను లెక్కలేనంత మందిని చంపించాడు కూడా.
ఏ పాపం ఎరుగని ఎంతోమందిని పిల్లా పాపా, పెద్దా చిన్నా అనే అంతరం లేకుండా మనుషుల్ని చంపడంలో తండ్రీ కొడుకులిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు తీసిపోరు.
"మిస్టర్ మెకానిక్! ప్రెషస్ టైం వేస్ట్ చెయ్యకు! కౌంట్ డవున్ మొదలైంది! చెప్పు! వాటీజ్ యువర్ స్ట్రాటెజీ! నీ ప్లాన్ ఏమిటి! చెప్పు! టెన్...నైన్...చెప్పు....ఎయిట్...సెవెన్....నో టైం....చెప్పు!" రష్ చేస్తున్నాడు దినకర్.
"ఆలోచించకు డాడీ! నా ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటావా?" మళ్ళీ దినకర్ అన్నాడు అకౌంటెంట్ గొంతుతో.
"సిక్స్....ఫైవ్.....ఫోర్..." దినకర్ గొంతు.
హఠాత్తుగా అన్నాడు మెకానిక్ "చెబుతాను! చెబుతాను! డోంట్ కిల్ మై సన్! ప్లీజ్!"
అదే క్షణంలో...
మెకానిక్ దినకర్ తో తను చెప్పదలచుకున్నది చెప్పకుండానే ఒక వైపు వున్న కిటికీ అద్దాలు భళ్ళుమని పగిలిపోయాయి. వెనువెంటనే వడగళ్ళలా లోపలికి వచ్చి పడ్డాయి బుల్లెట్లు. ఆ మరుక్షణంలోనే కిటికీ అవతల కనబడ్డాడు పదేళ్ళ వయస్సు కూడా లేని ఒకపిల్లవాడు.
ఆ కుర్రాడి చేతిలో అత్యంత శక్తివంతమయిన ఎమ్ 16 రైఫిల్ వుంది.
చిన్నపిల్లలు పట్టుకుని మొయ్యలేనంత సైజులో వుంటుంది ఎమ్.16 రైఫిల్. అందుకని దాని బారెల్ ని సగానికి కోసేసారు. అయినా కూడా అది దాదాపు ఆ పిల్ల వాడంత పొడవు వుంది!
ఆకుపచ్చ, చాక్ లెట్ రంగుల డిజైన్ తో వున్న యూనిఫారం వేసుకుని వున్నాడు ఆ పిల్లవాడు. అతని తలమీద క్యాప్ వుంది. కళ్ళకి నల్లటి గాగుల్స్.
మురిపెం కొద్దీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి మిలిటరీ యూనిఫారం లాంటి ఫ్యాన్సీ రెడీమేడ్ డ్రెస్సు వేస్తూ వుంటారు. తమ పిల్లలు ఆడుకోవడానికి టాయ్ గన్స్ కొనిస్తూ ఉంటారు.
అలాంటి రెడీమేడ్ డ్రెస్ వేసుకుని ఉన్నట్లు కనబడుతూ ఆ పిల్లాడు అలాంటి టాయ్ గన్ చేతిలో పట్టుకుని వున్నట్లు కనబడుతున్నాడు.
కానీ తేడా ఏమిటంటే.
ఆ పిల్లాడు వేసుకున్నది ఉత్తుత్తి ఫ్యాన్సీ మిలిటరీ డ్రెస్సు లాంటిది కాదు.
నిజం యూనిఫారం అది.
అతని చేతిలో వున్నది ప్లాస్టిక్ బొమ్మ తుపాకీ కాదు.
మారణాయుధం లాంటి ఎమ్ 16 రైఫిల్ అది!
నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నా కూడా ఆ కుర్రాడి మొహం చాలా ఫెమిలియర్ గా కనబడుతోంది దినకర్ కి.
ఇతను-
ఇతను-
చటుక్కున స్ఫురించింది!
ఇతనే ఆరోజున కోర్టులో తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వైశాలి తమ్ముడు.
విక్కీ!
దినకర్ అలా సంభ్రమంగా చూస్తూ వుండగానే కిటికీలోనుంచి లోపలికి దూకి వచ్చేసాడు విక్కీ వస్తూనే రైఫిల్ ని దినకర్ కి గురిచూసి పట్టుకున్నాడు.
తనచేతిలోని మెషిన్ పిస్టల్ వైపూ విక్కీ వైపూ సాలోచనగా చూశాడు దినకర్.
తను ఎక్స్ పర్ట్ షాట్!
అందులో సందేహం లేదు.
ప్రత్యర్ధి చేతిలో ఎమ్.16 రైఫిల్ కాదు రాకెట్ లాంచర్ వున్నా సరే ఒక్క బుల్లెట్ తో వాడిని మట్టి కరిపించగలడు తను!
కానీ ఈ ప్రత్యర్ధి పసివాడు!
వైశాలి తమ్ముడు!
విక్కీ!
పట్టుమని పదేళ్ళ వయసులేని ఈ పసివాడి ప్రాణాలు ఎలా తియ్యగలడు తను!
పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం ఎలా వెయ్యగలడు.
దినకర్ సంకోచాన్ని గ్రహించాడు విక్కీ.
అదోలా నవ్వుతూ వడగళ్ళ వర్షంలా మళ్ళీ బుల్లెట్లు కురిపించడం మొదలుపెట్టాడు.
ఆత్మరక్షణ కోసం చటుక్కున ముందుకు డైవ్ చేసాడు దినకర్.
ఈలోగా విక్కీని ఆగమని సైగ చేసి పెద్దపులిలా దినకర్ మీదికి దూకాడు మెకానిక్. కదలకుండా బలంగా పట్టుకున్నాడు.
షూట్ చేయడం ఆపి ఎమ్ 16 రైఫిల్ దినకర్ వైపే గురిపెట్టి నిల్చున్నాడు విక్కీ.
మెకానిక్ దినకర్ ని కదలకుండా పట్టుకుని ఉండగా రైఫిల్ ని దినకర్ వైపు చూపిస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళి టేబుల్ డ్రాయల్ లోంచి సంకెళ్ళు బయటికి తీశాడు విక్కీ.
దినకర్ చేతులని వెనక్కి విరిచి పట్టుకుని వాటికి సంకెళ్ళు తగిలించాడు మెకానిక్. తర్వాత లేచి నిలబడ్డాడు అతను.
సూట్ కి అంటిన దుమ్ము దులుపుకుంటూ "నో మోర్ మంకీ బిజినెస్! నోరెత్తకుండా నాతోరా" అన్నాడు దినకర్ తో కఠినంగా.
భుజాలు ఎగరేసి తల పంకించాడు దినకర్.
మరునిముషంలో ముగ్గురూ మెకానిక్ కారులో వున్నారు.
జరిగిపోయిన దానికి పెద్దగా కలవరపడలేదు దినకర్.
విక్కీ చిన్న పిల్లవాడు కావడం వల్లా అతను వైశాలి తమ్ముడు కావడం వల్లా అతన్ని ఏమీ చెయ్యలేకపోయాడు తను.
తను అలా తాత్కాలికంగా కన్ ఫ్యూజ్ అయిపోయివున్న స్థితిలో తనని అదుపులోకి తీసుకున్నాడు మెకానిక్.
అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.
తప్పించుకుపోవడం పెద్ద బ్రహ్మవిద్యేమీ కాదు.
కానీ!
మెకానిక్ తోబాటు వెళ్ళి అతని గుట్టు అంతా పూర్తిగా తెలుసుకోవడం కూడా తనకి చాలా అవసరమే.


