ఇంక నాకు మిగిలింది అంతులేని ఆలోచనలు.
నేనెవరికి అపకారం చేయలేదు.
నాకెవరూ శతృవులు లేరు.
మరి.
నాకెందుకో చెరసాల!
డీప్ గా ఆలోచించాను. ఎవరో దేనికో, ఏ ప్రయోజనం ఆసించి నాకీ శిక్ష విధించారు.వక్కో వ్యక్తి నా స్మ్రుతి పధంలోకి వచ్చారు.
ఎంతో ఆలోచిస్తే మధుసూదనం తప్ప నాకు అపకారం చేసేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. వొకానొకనాడు దీపమీద కన్నువేసి సంసారాన్ని వీధికి లాగుతానని బెదిరించినవాడు. దీప నా సలహామీద లెటర్ రాస్తే అరక్షణంలో మంచివాడు అయినవాడు.
మధుసూదనం గత్యంతరం లేక మంచివాడు అయాడా! ప్లాను వేసి సమయంచూసి నాపై దెబ్బతీసి దీపని పెళ్ళాడనున్నాడా! ఇలా ఆలోచించాను.
ఓ వుపాయం ఆలోచించాను.
మర్నాడు భోజనం తీసుకుని వాడు వచ్చాడు.
"నీ గురూగారు ఎవడో నాకు తెలుసు. మధుసూదనం అతనితో చెప్పు దీపని అతను పెళ్ళి చేసుకుంటానంటే చేసుకోమను. కావాలంటే దీప జోలికి రానని రాసిస్తాను. నన్ను వదిలేస్తే చాలు. అదే నాకు పదివేలు" అన్నాను.
నేచెప్పింది విని వాడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అలా మాట్లాడనివాడు మర్నాడు వచ్చినప్పుడు కూడా మాట్లాడకుండా వుంటే సరిపోయేది. పనిగట్టుకుని వాడు...
"మా గురూగారి పేరు రాజమార్తాండ. సమయం వచ్చిందాకా వారి లక్ష్యం నెరవేరిందాకా నిన్ను వదలరు. ఎప్పుడు వారిపనైతే ఆ మరుక్షణానే నీకీ చెర తప్పుతుంది. అందాకా నోరు మూసుకుని పడుండమన్నారు. మధుసూదనం ఎవరో మాకు తెలియదు. వాడు నీకు శత్రువా!" అన్నాడు.
"నాకు అర్ధమైంది. కీలకవ్యక్తి మధుసూదనమే అని"
"మీ గురూగారితో మాట్లాడాలి రమ్మను" అన్నాను.
"వారు ఇక్కడికి రారు" అన్నాడు.
"పోనీ నన్నే అక్కడికి తీసుకెళ్ళు" అన్నాను.
"తీసుకెళ్ళేది లేదు" అన్నాడు.
మధుసూదనం కాబట్టే నా ఎదుటికి రావటంలేదు. కథ అర్ధమైంది. కాని ఖైదీ జీవితం గడుపుతూన్న నేనేం చేయగలను! నా ప్రయత్నాలు ఫలించలేదు.
నాని నన్ను చూడటం నీతో చెప్పటం. నీవు అమ్మ కలసి కాశీవిశ్వేశ్వరుడు గారిని సలహా అడిగి ఆయన చెప్పినట్లు చేయటంతో నా ఖైదీ జీవితం ముగిసింది.
బాబాయి కాశీ విశ్వేశ్వరుడు పోలీసులతో సహా రంగప్రవేశం చేసి నన్ను విడిపించి రంగంలో వున్నముగ్గురు రౌడీలను పట్టుకున్నారు. మధుసూదనాన్ని కూడా పోలీసు స్టేషనుకి రప్పించాము.
మీ బావకి ఎదురుకుండా ఢీకొనే ధైర్యంలేదు. చాలా పిరికి. రౌడీలకి డబ్బు ఇచ్చి నాపై చాటు దెబ్బతీశాడు. ఇదంతా చేసింది నిన్ను పెళ్ళాడాలనే కోరిక తోట. తన నాటకాల మితృడికి ఇన్ స్పెక్టర్ వేషం వేసి ఈ వూరు తీసుకురావటం దొంగ లెటరు సృష్టించటం నన్ను మాయంచేయటం అన్నీ వివరంగ మొదటినుంచి చెప్పాడు.
చాటు పనులు చేయటం తప్ప హత్యలుచేసే ధైర్యం లేనందువల్ల నన్ను బందీ చేయటం తప్ప ఏమిచేయలేదు. దీపని తను పెళ్ళాడి ఆ తర్వాత నన్ను విడిపిద్దామనుకున్నాడుట. అప్పుడిహ నేనేమి చేయలేను వకటి, తను నన్ను బందీచేశానన్న సాక్ష్యంలేదు రెండు అదీ ధైర్యం.
అనుకోకుండా ఇన్ స్పెక్టరు నాతో చదివిన ఫ్రెండ్. నా కోరిక ప్రకారం మధుసూదనంని మందలించి జరిగిందంతా స్వహస్తాలతో లెటర్ రాయించి ఇహపై మనలోగాని భార్యకిగాని ఎవరికేమి జరిగినా ఆ అపకారానికి ప్రమాదానికి తనే బాధ్యుడవుతానని... ఎవరి జోలికి రాకుండా బుద్ధిగా వుంటానని పకడ్ బందీగా స్టేట్ మెంటు రాత పూర్వకంగ తీసుకుని వదిలేశాడు.
అక్కడ పనులన్నీ పూర్తిచేసుకుని బాబాయితో రాత్రి పన్నెండింటికి ఈ ఊరువచ్చాను. మీబావ ఈ జన్మలో మన జోలికి రాడు. మీ అక్కని పల్లెత్తుమాట అనడు. ఏ చిన్న పాడు పని చేయడు.
దీపా! క్లుప్తంగ జరిగిందంతా చెప్పాను. ఇక్కడికి రాంగానే అమ్మ జరిగిందంతా చెప్పింది. అమ్మసంగతి నాకు తెలుసు. అమ్మ పంచప్రాణాలు నాపైననే. అమ్మయింత జరిగినా జీవించి వుందంటే కారణం నీవు దీపా. ఈ విషయంలో నీకెంతో రుణపడివున్నాను అంటూ అనిల్ ముగించాడు.
"బాధని తనలో దాచుకుని నాకు ధైర్యం నూరుపోసి కొత్తవూపిరి ఇచ్చింది దీప." అంది పార్వతమ్మ.
"అత్తయ్యని రక్షించుకోవటం నా ధర్మం అనిల్. బావ నీకుచేసిన అపకారానికి సిగ్గుపడుతున్నాను..." అంటూ దీప యింకా ఏదో అనబోయింది కాశీవిశ్వేశ్వరుడు లోపలికి వచ్చాడు.
"ఆడపిల్లకి సిగ్గే ఆభరణం. నీ తప్పేముందని జరిగిందానికి సిగ్గుపడాలిట. పెళ్ళినాడు పడుదువుగాని సిగ్గుల మొగ్గలు దాచేసుకో అమ్మాయ్. ఈవూరు మొత్తంమీద మణిపూసలాంటి ఆడపిల్లవు నీవు. గర్వించాలి. నీ కథ ఎందరో యువతులకి దీపం వెలుగులా ధైర్యసాహసాల మార్గం చూపాలి. అన్నింటికి సామాన్యురాలిలా సిగ్గుపడితే ఎలా. దీప ఎవరు! ఈ కథకి కథానాయిక ఈ యింటి కథానాయిక."
"ఫో బాబాయ్! మరీ పొగిడేస్తున్నావ్. కష్టాలుపడింది అనిల్. పేరు నాకా" అంది దీప.
"అదికాదులే నేను ఒకటి నీ నుంచి ఆసించాను. అందుకు లంచంగా ఈ పొగడ్త." గుబురు మీసాలచాటు నుంచి నవ్వుతూ చెప్పాడు కాశీవిశ్వేశ్వరుడు.
"అడుగు బాబాయ్! నేను తీర్చగలిగేది, న్యాయమైనది అయితే అలాగే." దీప అంది.
"మాట తప్పవుగా."
"ఉహూ."
"నీ కొడుక్కి నాపేరు పెట్టుకోవాలి అంతే."
దీప పెదవి కదిపే లోపలే అనిల్ అన్నాడు. "బాబాయ్, నీ పేరు అంటే కాశీవిశ్వేశ్వరుడు అనా! బాబాయ్ అనా."
"నీ కొడుకుని చంటి బాబాయ్ అని పిలుస్తాలేవోయ్. వూళ్ళో అందరూ మాత్రం నా పేరు పిలవాలి."
"ఇప్పుడు పిలుస్తున్నారు కదా!" దీప చిరునవ్వుతో అంది.
"అదిగో నీవరస చూస్తుంటే మాట తప్పేటట్లున్నావు. అమ్మాయ్!" అన్నాడు కాశీవిశ్వేశ్వరుడు.
"దీప మాట తప్పకుండా నే చూస్తాగా బాబాయ్!" అన్నాడు అనిల్. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు.
ఆ యింట్లో నవ్వులు పువ్వులు మొదలయ్యాయి ఆ నిమిషం నుంచే.
44
దీప అనిల్ ల వివాహం ఏ అడ్డంకి లేకుండ జరిగిపోయింది. కళ్యాణం తిరుపతిలో జరిగింది.
ఇంటికి వచ్చిం తరువాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుని తెలిసిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు.
మధుసూదనం ముఖం చెల్లక రాలేదు గాని లలితని పంపించాడు.
"నన్ను క్షమించవే దీపా!" గదిలో దీప చేతులు పట్టుకుని అడిగింది లలిత కన్నీళ్ళతో.
"అక్కా! నేరం చేసింది నీవు కాదు. ఈ సమయంలో గతాన్ని వదిలేద్దాము." జరిగింది తిరగ దోడటం యిష్టంలేని దీప చిరునవ్వుతో అంది.
అన్నీ సవ్యంగా పూర్తి అయాయి.
నాంచారమ్మ కామాక్షమ్మ మీనాక్షమ్మని కూడా పెళ్ళికి పిలిచారు. వాళ్ళే ముఖం చెల్లక రాలేదు.
కాశీవిశ్వేశ్వరుడు పెళ్ళి పెత్తనం తీసుకున్నాడు.
"వదినగారూ! నేను తెలివితక్కువగ మీపట్ల!" అంటూ ఆదిలక్ష్మమ్మ ఏదో చెప్పబోయింది.
"మనిషికి కాకపోతే మానుకు వస్తాయటండీ కష్టాలు! విధి రాతప్రకారమే జరుగుతుంది. మనదేముంది. ఏదీ మనసులో పెట్టుకోకండి. అందరం క్షేమంగ వున్నాము. అన్నీ సవ్యంగ జరుగుతున్నాయి." హుందాగ వ్యవహరిస్తూ అంది పార్వతమ్మ.
ఇంత జరిగాక.
ఊరంతా.
ముఖ్యంగా ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు దీప గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆడిపోసుకున్న వాళ్ళు కూడా అభినందించారు.
చక్కగా సవ్యంగా అన్నీ పూర్తయ్యాయి.
ఆ రాత్రి.
"దీపా!"
"ఊ..."
"దీపా డార్లింగ్!"
"ఊ..."
"ఓ దీపా. ఓ అందాల అమ్మాయి గారూ."
"ఊ...."
"నాకు కోపం వస్తే మనిషిని కాదు సుమా! దీపా! అని పిలుస్తుంటే ఊ...ఊ... లతో సరిపెడతావేమిటి? ఏమిటి అనిల్! అని పెదలవి కదిపితే నీ దొండపండు లాంటి పెదవులు కందేనా! నోటి ముత్యాలు రాలేనా" అనిల్ కోపంగా అడిగాడు.
"ఊ..." అంది దీప పెదవి వొంపులో నవ్వు దాచుకుంటూ.
"నాకు కోపం వచ్చింది."
"ఊ..."
"నాకేనా అంత రోషం లేనిది. ఇహపై నేనుకూడా ఊ...ఊ...లతో సరిపెడతాను."
"ఊ..." అంది దీప.
"నాకు కోపం వచ్చింది. నీవు మాట్లాడిస్తే తప్ప మాట్లాడను." అనిల్ గంభీర్యంగ సెలవిచ్చాడు.
"ఇప్పుడు తమరు చేసింది ఏమిటి?"
"హాయ్. మాట్లాడావు మాట్లాడావు" అనిల్ పిల్లవాడిలా ఆనందపడుతూ అన్నాడు.
"మీరు మాట్లాడనని ఓ పక్క అంటూనే మాట్లాడారు. మీ అడుగు జాడల్లో నడవాల్సిన దానిని...


