దీప సిగ్గుపడింది. అంతలోనే తేరుకుని "నా యిష్టం నేను ఏడుస్తాను" అంది.
"నే కాదన్నానా! కాకపోతే నా షర్ట్ తడిసిందే ఎలా?" అనుకుంటున్నాను అనిల్ నవ్వుతూ షర్ట్ చూపించాడు.
"కొంపకాలి వకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోటానికి నిప్పు దొరికిందని ఇంకొకడు ఆనందించాడట. నా కన్నీరు కన్నీ నీ షర్ట్ ముఖ్యమా" దీప చిరుకోపంతో అడిగింది.
"షర్టు నా హృదయాన్ని అంటిపెట్టుకొని వుంది మరి."
"అదృష్టం చేసుకుంది ఏనాడో"
"నీ కన్నానా! సరేగాని ఎలా వున్నావ్ దీపా."
"నీవెలావున్నావు అనిల్."
"ఇలా" అన్నాడు అనిల్.
దీప అనిల్ ని ఎగాదిగా చూసింది. అనిల్ గడ్డం గీసుకుని వున్నాడు. క్రాఫు నీటుగా వుంది. కళ్ళు మాత్రం బాగా గుంటలుపడి ముఖం పీక్కు పోయి బాగా చిక్కాడు.
అదే సమయంలో
అనిల్ దీపని పరిశీలించి చూశాడు.
దీప కళ్ళకింద నల్లని చారలు ఏర్పడ్డాయి. నలిగిపోయి నట్లు తయారయింది. ఆకుపచ్చచీర నీలం జాకెట్టు దానిని పట్టే తెలుస్తున్నది. అలంకరణ పట్ల శరీరం పట్ల ఎంత అశ్రద్ధగా వుంటున్న దీను.
"చాలా చిక్కిపోయావు దీపా." ముందే అన్నాడు అనిల్.
"నేను చిక్కిపోయానేమో, నీవు మాత్రం...
"ఆగావేం, చెప్పు దీపా. పాడయి పోయానా."
"చాలా బాధలు అనుభవించిన వాడిలా..."
"నీకు దూరం అయితే బాధ కాదా" అనిల్ నవ్వుతూ అన్నాడు.
దీప మూతి బిగింపులో చిరునవ్వు నొక్కిపట్టి కొంటెగ చూసింది.
"ఏమర్రా నేను రావచ్చా." బైటనుంచి పార్వతమ్మ కేక వినిపించింది. టక్కున ఇరువురు దూరం జరిగారు.
"కాఫీ చల్లారిపోతున్నది. పిలవక తప్పలేదు మరి." పార్వతమ్మ కాఫీ కప్పులతో గదిలో అడుగు పెడుతూ నవ్వుతూ అంది,
"పిలవకుండా రాకూడదా ఏమిటి! అత్తయ్యా. మీ అబ్బాయిని చూసేసరికి నీవు బాగా మారిపొయ్యావు. అబద్ధాలు ఆడి ఆట పట్టించావు.
"అబద్ధాలు ఆడితే ఏమవుతుందట?"
"అబద్ధాలు ఆడితే... ఆ... అందరూ ఆడపిల్లలే పుడతారు నా కోడలికి అంతేనా."
ముగ్గురూ నవ్వుకున్నారు.
కాఫీతాగి కప్పు కింద పెడుతూ "చెప్పండి" అంది దీప.
"కానియ్యరా" అంది పార్వతమ్మ.
"ఆరోజు నుంచి వరుస సక్రమంలో చెప్పండి" అంది దీప.
అనిల్ మొదలుపెడుతూ అన్నాడు "వివేకానంద పుస్తకంలో వక లెటర్ వుంచాను!"
"అది చూశాను అత్తయ్యకి చెప్పాను" దీప అంది. "పైగా అది నేను రాసింది కాదు" అని కూడా చెప్పింది.
"అప్పుడు నాకు తెలియదు. ఈ రూమ్ లోనే కూర్చుని వున్నాను. ఏడెనిమిదేళ్ళు వుంటాయేమో ఓ పాప నా దగ్గరకు వచ్చి నాకో కాగితం యిచ్చి వెళ్ళిపోయింది. మడతలు వున్న కాగితం విప్పి చదివాను. దీప రాసింది. మరీమరీ చదివాను. ఆ పరిస్థితులలో దీప రాసింది నమ్మాను. కారణం హేండ్ రైటింగ్ దీపదిలాగానే వుంది.
చీకటి పడింది. అటు యింట్లోంచి కాకుండా అటు పక్క తలుపు తీసుకుని తోటలోకి వెళ్ళాను. చెట్టుకింద నుంచుని దీప ఇంకా రాలేదే అని ఆలోచిస్తున్నాను. పరిసరాలన్నీ ఏదో తియ్యని వాసనతో వున్నట్లు అనిపించిందో లేదో స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏమయిందో తెలియదు.
ఓ గదిలో నలుగురి మనుషుల మధ్య తెలివివచ్చింది. వాళ్ళు నన్ను ప్రశ్నలు వేయలేదుగాని నేను వాళ్ళని వందల ప్రశ్నలు వేశాను. వాళ్ళు నా వక్క ప్రశ్నకి జవాబు యివ్వలేదు. ఎదురుతిరిగితే కొట్టారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం... నీవు మాకు బందీవి. మా గురూగారు చెప్పిందాకా నీవు యిక్కడనుంచి కదలటానికి వీలులేదు. నీవు అరిచి కేకలు పెట్టినా ఎవరూలేరు ఎటుచూసినా కొన్ని మైళ్ళవరకూ జన సంచారం లేదు.
ఏ అల్లరి లేకుండ మంచిగ వున్నావనుకో భోజనం చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ హాయిగా వుండవచ్చు. కాదంటే నీ యిష్టం. ఆపై నీ వళ్ళు నీది కాదు మాదవుతుంది. అయిం తరువాత ఏమి చేస్తామన్నది మా చేతుల్లో వున్నది. అంతే అన్నారు.
మొదట్లో ఎదురు తిరిగాను. లాభం లేకపోయింది. మొదటినుంచీ ఏ గదిలో వున్నానో పూర్తిగ అక్కడే వుంచారు. తెల్లారటం రాత్రికావటం క్యారేజీలో భోజనం ఉదయం వచ్చేది. రాత్రిళ్ళు రెండు బన్నులు అంతే నా ఆహారం.
రోజులు గడిచిపోతున్నాయి. నా దినచర్యలో మార్పు లేదు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినట్లు చీకటి గదిలో వుండే ఖైదీల నా జీవితం అయిపోయింది. ఎవరు దీనికి మూలం! నేను చేసిన నేరం ఏమిటి? నన్నిలా చీకటికొట్లో వుంచితే ప్రయోజనం ఏమిటి ఏమాసించి చేస్తున్నారు. ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు.
అమ్మ నేను కానరాక మంచం ఎక్కిందేమో! తల్డడిల్లి పోతున్నదేమో! అసలు జీవించి వుందా! ఓ పక్క ఈ దిగులు. మరో పక్క దీప ఎలావుంది! అన్న వేదన. ఇలా ఎందుకు జరిగిందో తెలియక పిచ్చిపట్టినట్లు అయింది.
అక్కడనించి పారిపోదామని వెయ్యివిధాల ప్రయత్నించాను. కుదరలేదు. భోజనం తెచ్చేవాడికి పాతికవేలు యిస్తానని ఆశపెట్టాను. లక్ష యిచ్చినా నిన్ను వదిలేది లేదు పొమ్మన్నాడు.


