దాంతో వీళ్ళిద్దరూ సిగ్గుపడి, ఎవరి తల వాళ్ళు సరీగా పెట్టుకుందే కాక - ఆ ఫళాన నోరు మూసుకున్నారు.
దాంతో వీళ్ళలో కొత్త విషయం అర్ధమయింది - తమ పక్కన ఉన్న జంట కూడా ఏదో మాట్లాడుకుంటున్నదని.
పక్కవాళ్ళ మాట వినటం మహా పాపం అని రామకృష్ణకి, సీతకి తెలుసు. అదేం పాపమో గాని, పనిగట్టుకు వినకపోయినా వాళ్ళ మాటలు వచ్చి వీళ్ళ చెవుల్లో దూరుతున్నాయి.
తెరమీద దొంగల స్థావరంలో దొంగ పిల్లిలా ప్రవేశించిన తుపాకీ రాముడు దొంగపిల్లిలా చడీ, చప్పుడు కాకుండా నడుస్తున్నాడు. అందువల్ల వాయిద్యాల చప్పుడు లేదు. దానివల్ల వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. పైగా వాళ్ళు పరిసరాలు మరచి మాట్లాడుకుంటున్నారు.
"క్రితం వారమూ అంతే - సినిమా మధ్యలో తీసుకు వెళ్ళారు. ఈ ఒక్కసారికి...." ప్రాధేయపూర్వకంగా అంటున్నది భార్య.
"పేరు చూడబోతే ఉత్తమ ఇల్లాలు - సీన్ లు చూడబోతే అన్నీ సెక్స్ దృశ్యాలే అందువల్ల ఆ సినిమా మధ్యలోంచి లేచిరాక తప్పలేదు. జన్మనిచ్చిన దేవత సినిమాకని వస్తే అది ఎప్పుడో పోయిందని చెప్పారు. డైలీ పేపరులో మాత్రం సినిమా ఉన్నట్లు రాసి తగలేట్టారు. లే లే - వెళదాం!"
"ఈ సినిమాలో సెక్స్ లేదుకదండీ!"
"సెక్స్ లేదా! వాడు ఆడపిల్లలమీద అందిన చోటల్లా దరువు వేస్తుంటే ఛీ...... ఛీ..... ఇలాంటివి చూసే సగంమంది ఆడవాళ్ళకి వికృతమైన కోరికలు పుట్టేది. పద పద చాలా నీతివున్న సినిమా అని ఆ గడ్దే కొడుకు చెపితే వచ్చాను. నేను వెళుతున్నాను....." అంటూ అతను లేచాడు.
ఆమె లేచి నిండా పమిటి కప్పుకుని తల వంచుకుని అతని వెనుకే బైటికి వెళ్ళిపోయింది.
రామకృష్ణకి ఏమీ పట్టలేదు గాని సీతకి మాత్రం వాళ్ళంతా కారం రాచుకున్నట్లు అనిపించింది.
సినిమా పూర్తి అయిందాకా ఇంటికి వచ్చి భోజనం పూర్తి అయిందాకా మౌనంగా వున్న సీత బెడ్ రూమ్ లోకి వచ్చిం తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడిగింది. "మీకేమనిపించింది?"
"ఏదో కాలక్షేపంగా చూశాము. అంతే ఇలాంటి సినిమాలు గురించి స్పెషల్ గా అనిపించటాలు ఉండవ్!" అంటూ రామకృష్ణ సీత చెయ్యి పుచ్చుకుని దగ్గరగా కూర్చోపెట్టుకున్నాడు.
సీత మంచం మీద జరిగి కూర్చుని "నేను దిక్కుమాలిన తుపాకీ రాముడి గురించి అడిగానా?" అంది.
"మరి దేన్నీ గురించి ఏదేదో అనిపించటం! ఓహో అమ్మాయిగారి అందాల గురించా!"
"కాదు..... కాదు..... కాదు......"
"అలా అరవకు సీతా! ఇరుగు పొరుగు వింటే నిన్ను నే కొడుతున్నారనుకుంటారు. అర్ధరాత్రి మద్దెల దరువులా, సరేలే అలా కోపంగా చూడక విషయం చెప్పు."
విషయమేమిటో భర్తకి అర్ధం కాలేదని సీత గ్రహించింది.
"సినిమా హాల్లో ఆ మొగుడు పెళ్లాల మాటలు విన్నారు కదా! వాళ్ళ మాటలు విని మీకేమనిపించింది?"
"ఓహో వాళ్ళ సంగతా?"
"ఆ వాళ్ళ సంగతే."
"లోకంలో సవాలక్ష రకాలు. వాళ్ళలో వీల్లోకళ్ళు."
"అంతేనా?" నీరుగారిపోతూ అంది సీత.
"అంతే మరి" నవ్వుతూ అన్నాడు రామకృష్ణ.
"నిజంగా ఏమి అనిపించలేదా!" అనుమానం తీర్చుకోటానికి అడిగింది సీత.
"అందుట్లో అనిపించటానికి ఏముంది? సరే నీకేమనిపించిందిట?"
"నరికిపోగులు పెట్టాలనిపించింది."
"ఎవరిని?" నవ్వాపుకుంటూ అడిగాడు రామకృష్ణ.
"ఇద్దరిని."
"అదేం పాపం?"
"భార్యకి సినిమా చూడాలని వుండదా? ఆమెకి కోరికలు వుండకూడదా! భర్త అభిరుచులే భార్య అభిరుచులు కావాలా అతగాడు నుంచోమంటే నుంచుని కూర్చోమంటే కూర్చుని ఇలాంటి మగవాళ్ళని భర్త అనరు? పతిదేముడని అసలే అనరు."