'లేదు సుధాకరం లేదు-- తను హద్దులు మీరినట్లు వెకిలిగా ప్రవర్తించినట్లు ఏనాడూ అనిపించలేదు. తనని గురించి నీచంగా ఆలోచించటం కూడా మహా పాపం -- అసలు వసంత కి అలాంటి కొంచెం బుద్దులు వచ్చే ఆస్కారం ఎలా వుంటుంది? ఇటు ఏడు తరాలలో అటు ఏడు తరాలలో ఎక్కడా ఎంతగా వెతికినా మచ్చలనేది కనిపించని అగ్నిహోత్రం లాంటి వంశాలు మనవి-- అలా ఒకరు వేలెత్తి చూపించటానికే ఆస్కారం లేకుండా పరువూ ప్రతిష్టా గల వంశాలలో పుట్టిన వసంత, హాయిగా పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా సంసారం చేసుకుంటున్న వసంత, మరొక విధంగా ప్రవర్తించగలదని, అసలు అలాంటి ఊహలే తనకి వస్తాయని అనుకోటం పొరబాటు. ఆ దౌర్భాగ్యుడు ఉచితానుచితాలు సంభవా సంభావాలు ఏవీ ఆలోచించకుండా కేవలం కళ్ళకి పొర కమ్ముకుపోయిన వాడిలా ప్రవర్తించి ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు....'
'చాలు మురళీ చాలు. కేవలం చెల్లెలి మీది అభిమానంతో నేనూ, కడుపు తీపి తో అమ్మ వసంత ని నిర్దోష్టి గా నిర్ణయిస్తున్నాం అని ఎవ్వరూ ఇక మమ్మల్ని అనటానికి వీలు లేదు. నీలా మనుష్యులనీ పరిస్థితుల నీ అర్ధం చేసుకోగల కొంత మందయినా తనలో ఎలాంటి కళంకం లేదని మనస్పూర్తిగా నమ్మ గలిగితే , ఒక చల్లని మాట అనగలిగితే ఆ లోకంలో నుండి వింటున్న వసంత మనస్సు సంతృప్తి తో నిండి పోతుంది. వసంత ఆత్మ శాంతిస్తుంది '-- పసివాడిలా మురళీ ని చుట్టేసి బావురు మన్నాడు సుధాకరం.
ఆత్మీయత పెనవేసుకున్న స్నేహ భావంతో తనతో అడీ పాడీ తన కళ్ళ ముందు పెరిగిన వసంత మరణాన్ని అంత దగ్గరగా , కళ్ళారా చూసిన మురళీ మనస్సు గిలగిల లాడిపోతోంది. 'ఊరుకో సుధాకరం ఊరుకో. నేనే అన్నమాట ఏమిటి వసంత కధ విన్న ప్రతి మనిషీ యదార్ధాన్ని వూహించు కో గలడు. పరిస్థితులని అర్ధం చేసుకో గలడు. వసంత ఏ తప్పు చెయ్యలేదని చెప్పగలడు. అన్నాడు మురళీ అతన్ని వోదారుస్తూ.
ఇంతలో ఎవరో రావటం వలన సుధాకరం కళ్ళు తుడుచుకుని వీధి వరండా వేపుకి వెళ్ళిపోయాడు.
ఒంటరిగా కూర్చున్న మురళీ గుండె లలో ఏవేవో భావాలు ఉవ్వెత్తుగా ఎగిరెగిరి పడటం మొదలు పెట్టాయి-- అతని అంతరంగంలో సాగర మధనం ప్రారంభమయింది -- హాలాహలం లాంటి ఆలోచనలు తలఎత్తి ఆ సలసల మరుగుతున్న కాలకూట విషం తన చుట్టూ వలయాలుగా తిరుగుతూ తనలో అణువణువూ భగభగ మండి మసి అయిపోతున్న అనుభూతి కలిగేది ఒక్కొక్కసారి --
మళ్లీ అంతలోనే ఏవో దివ్యలోకాల నుంచి మెల్లిగా మృదువుగా వీస్తున్న చల్లటి పిల్లగాలికి అతని ఎద సేద దీరినట్లు, మనిషిని చిరంజీవి ని జేసే పీయూషంతో, చనిపోయిన వ్యక్తీ ని సహితం బ్రతికించగలిగే అమృతం తో అతని అంతరంగం నిండి పోయినట్లు అతి మెత్తని భావాలు తల ఎత్తేవి.
ఒక వ్యక్తీ నిర్ధిషిత్వాన్నినిష్కళం కాన్ని నిరూపించే మార్గాలు ఏమున్నాయి -- ఏమీ లేవు. దానికి మనస్సు ఒక్కటే సాక్షి -- ఎదుటి మనిషి మనస్సుని నమ్మగలిగే మంచితనం మనలో వుండాలి'- వసంత ఎదురుగా నిలబడి 'అవునా ? అన్నయ్యా!' అని అడుగు తున్నట్లూ అనిపించేది. ఉలిక్కిపడి నట్లయిన మురళీ నిజం వసూ నిజం . చిన్నదాని వైనా ఎంత చక్కగా చెప్పావు, అనుకునేవాడు.
'అయినా కట్టుకున్న భార్య నడవడిని మాటలని నమ్మలేక అడుగడుగునా అపోహలతో ఆమెని చిత్రహింస కి గురి చేసే మొగవాళ్ళు వుంటే ఇంక ఆ స్త్రీకి ఆత్మహత్య వినా గత్యంతరం ఏముంది?' తల్లి ఒడిలో నిర్జీవంగా పడి వున్న వసంత తనని ఆ ప్రశ్న అడగటం కోసమే పోయిన శక్తి అంతా ఒక్కసారి వెనక్కి తెచ్చుకుని కళ్ళు తెరిచి తన వంక చూస్తూ అడుగు తున్నట్ల నిపించింది.
'ఔను వసూ నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను .' అనుకునేవాడు.
అలా నీరుండిన కళ్ళతో పరధ్యానంగా ఎటో చూస్తున్న అతనికి అంతలోనే ఆ వసంత రూపం మాయం అయిపోయి ఆ స్థానం లో మరెవరో వచ్చి నిలబడి నట్లయేది -- మొదట తన కళ్ళకి మసగ మసగగా , లీలగా సాక్షాత్కరించిన ఆ రూపం చూస్తుండగానే కళ్యాణి గా రూపం దాల్చి --
'ఏమండీ మరి, ఇంచుమించు మీ వసంత కి ఎదురైన లాంటి సమస్యలూ సంఘటనలే నాకూ ఎదురయాయి. అయినా మీరు నన్ను శంకించారు-- ఎదుటి మనిషి పరిస్థితులని అర్ధం చేసుకో గలిగే సంస్కారం సహృదయం మీలో వున్నాయని విర్రవీగే మీరు నా విషయంలో ఎందుకిలా ప్రవర్తించారు.' అని సంజాయిషీ అడుగుతున్నట్లుగా అనిపించింది.
వెంటనే ఏదో చెప్పాలను కున్నాడు. కాని ఏం చెప్పాలో తెలియనట్లు అసలు గొంతు విప్పటానికి వీలు లేకుండా ఎవరో తన మెడ రెండు చేతులతోటీ పట్టుకుని గట్టిగా నోక్కేస్తున్నట్లు గిలగిల లాడి పోయాడు.
'సమాధానం నేను చెప్తాను వినండి' కళ్యాణి గొంతు మళ్లీ ఖంగు మంది 'ఇటు ఏడు తరాలలో అటు ఏడు తరాలలో ఎక్కడా వెతికినా మచ్చ అనేది కనిపించని వంశాలు మీవి. ఆ వంశాలలో పుట్టిన ప్రతి వ్యక్తీ ఏ మాలిన్యమూ లేని అగ్ని హోత్రం లా వెలిగి పోతాడు-- ఆ నమ్మకం, ఆ ధైర్యం, ఆ గర్వం మీరు వెన్ను విరుచుకుని తిరిగేలా చేస్తున్నాయి. కాని నాకేముంది నేను బురదలో పుట్టాను పాపంలో పుట్టాను. నా అక్క, అమ్మ అమ్మమ్మ, వీళ్ళే కాదు ఇంకా ఇంకా అలా వెనక్కి వెళ్ళిన కొద్దీ మా వంశం అంతా తరతరాలుగా ఈ మురికిని ఒంటికి పులుముకుని తిరుగుతున్న వాళ్ళే -- అలాంటి ఇంట్లో పుట్టిన నా మనస్సులో ఆ పాపపు చ్చాయలు, ఆ మాలిన్యం ఏ మూలో చోటు చేసుకుని వుండక పోతుందా అనే అనుమానం మీలో వుండి పోయింది అంతే కదూ -- మనిషికి వ్యక్తీ గతమైన ప్రవర్తన ప్రధానం కాని పుట్టుకలో ఏముంది అని ఒకనాడు చెప్పిన మీరు నా పుట్టుక కనీ పెరిగిన పరిసరాల్నీ బంధువులనీ అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలతో మీరు అంతులేని వ్యధకి గురి అవుతూ నన్ను చిత్ర హింస పెట్టారు-- నా మీద ఎన్నో అభాండాలు వేశారు. చివరికి నన్ను మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనీ వదిలేసి వెళ్ళిపోయారు.....మీ తోబుట్టువు లాంటి వసంత కి ఇలాంటి పరిస్టితి ఎదురైనపుడు మీ తీర్పు , మీ న్యాయం ఆమె వైపునే వున్నాయి. మీకు కించిత్తయినా అనుమానం అపనమ్మకం అనేది కలగలేదు. కారణం వాళ్ళు పుట్టుకతోనే పునీతులు పవిత్రులు. అది నాకు లేదనేగా నన్ను కళంకి నిగా నిలబెట్ట టానికి మీ మనస్సు ఏమాత్రం సంక్షోభించలేదు....'
ఈసారి మురళి గుండెలని ఇనప ముళ్ళ చక్రం లో పెట్టి నోక్కేస్తున్నట్లు ఆ గుండెలు పగిలి రక్తం పైకి ఎగజిమ్మి ధారలుగా ప్రవహిస్తుందేమో అన్నట్లు భరించ శక్యం కాని బాధతో విలవిల్లాడిపోతూ ఒక చేత్తో గుండెలని గట్టిగా అదుముకున్నాడు. ఆ రక్త ప్రవాహాన్ని అరికట్టటా నీకా అన్నట్లు -- అతని తల కళ్ళు గిర్రున తిరుగుతున్నట్లు గా వుంది -- ఆ కళ్ళకి ఒకసారి వసంతా మరోసారి కళ్యాణి ఎదురుగా నిలబడి ఒకసారి జాలిగా, మరోసారి బాధగా ఇంకోసారి కఠోరంగా పౌరుషంగా ఇలా అనేక భావాలని కళ్ళల్లో నింపుకుని ప్రాధేయ పడుతున్నట్లు సంజాయిషీ అడుగుతున్నట్లు అనేక అనుభూతులు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి--
భయంతో ఒళ్ళు జలాదరించగా రెండు కళ్ళూ గట్టిగా మూసుకుని రెండు చేతులతోనూ తల పట్టుకునో, 'ఇప్పుడు నాకే మయింది-- ఇవాళ నేనేమయి పోతున్నాను' అని తనలో తనే ప్రశ్నించు కోటం మొదలు పెట్టాడు-- చివరికి అతనికి సమాధానం దొరికింది -- అతని మొహం నిండా అవరించుకున్న బాధా చిహ్నాలు క్రమంగా విడిపోయి అతని మొహంలోనూ కళ్ళల్లో నూ కాంతి పరుచుకోసాగింది. గుండెలలోని ఆ అలజడి ఆ ఉద్విగ్నం చల్లబడి మామూలుగా కొట్టుకో సాగాయి -- వేడెక్కిపోయిన మెదడు ని సేద దీర్చటానికా అన్నట్లు వోసారి మెల్లిగా తల తడుముకుని, మొహం మీద పట్టిన చెమటని రుమాలుతో తుడుచుకుని గదిలో లైటు వేశాడు.
కాస్సేపటి తరువాత గదిలోకి వచ్చిన సుధాకరం మురళీ పెట్టె సర్దుకుని ప్రయాణ సన్నాహంలో వున్నట్లు కనిపించటం తో 'ఇదేమిటి?' అన్నాడు అంతకన్న మరేమనాలో తెలియక.
'ఔను సుధాకరం-- నీకు చెప్పలేదు-- కళ్యాణి ని ఎలాంటి భయంకరమైన పరిస్తితులల్లో వదిలి వచ్చానో మీకేవరికి చెప్పలేదు-- అది ఎవ్వరికీ చెప్పుకోకపోవటమే నాయమయిందిలే -- ఎందుకంటె ఇవాళ నేను నిజం తెలుసుకో గలిగాను -- వసంత భర్త లాగే నాలో కూడా వో అనుమానం ఏ మూలో వుండి పోయింది -- అది వుండి వుండి తల ఎత్తి నన్ను తెలు కొండిలా పొడుస్తుంటే నేను పశువులా రాక్షసుడి లా ప్రవర్తించాను కళ్యాణి ని హింసించాను. చివరికి పరిత్యజించి వచ్చేశాను....ఇది సుధాకరం నేను చేసిన పని. ఇక ఇప్పుడు నిజం గ్రహించాక కళ్ళు తెరిచాక మరి ఒక్క క్షణం అయినా ఆలశ్యం చెయ్యకుండా రెక్కలు కట్టుకుని కళ్యాణి ముందు వాలానని వుంది.' అని చెప్పాలను కున్నాడు.
కాని అదంతా చెప్పకుండా, 'వెళ్ళాలి సుధాకరం -- నా మనస్సేమీ బాగులేదు...కలకత్తా ప్రయాణం కేన్సిలు చేసుకుని తిన్నగా హైదరాబాదు వెళ్ళిపోతాను .' అన్నాడు.
'అప్పుడే వెళ్లి పోతావా-- ఈ పది రోజులూ ఇక్కడ వుండి అమ్మకీ నాకూ కాస్త ధైర్యం చెప్తావను కున్నాను.' అన్నాడు సుధాకరం.
'ఏమీ అనుకోకు -- అమ్మగారితో కూడా నేను చెప్తాను....అనుకోకుండా ఇలా రావటం, వచ్చిన వాడిని సరదాగా వెళ్లి పోకుండా వసంత మరణాన్ని కళ్ళారా చూడటం....' ఆ పైన మాటలు పెగలలేదు మురళీ కి.
'నిజమే -- కొన్ని కొన్ని సంఘటనలు చూస్తె గుండె చెదిరి పోయినట్లయి పోయి-- మనవాళ్ళని విడిచి కాస్తంత దూరంగా అయినా సరే వుండలేమేమో అన్నంత బేలతనం కలుగుతుంది -- సరేలే. వెళ్లిరా.' అన్నాడు.
తరువాత మురళీ కామాక్షమ్మ గారితో కూడా చెప్పాడు.
చీకటిలో గేటు తెరుచుకుని, చీడీలు ఎక్కి, వరండా దాటి , గడప లో అడుగు పెట్టిన వ్యక్తీ ని ఏదో పిశాచాన్ని చూస్తున్నట్లు గుడ్లు అప్పగించి చూస్తుండి పోయాడు సుధాకరం -- క్రమంగా అతని కళ్ళల్లో ఆ భావం కొద్దిగా కొద్దిగా అంతరించి ఆ స్థానంలో కసి, బాధ, డుఖమూ చోటు చేసుకోటం-- మొదలు పెట్టాయి.
'ఏం నాయనా, నా చెలెల్లు నిజంగా చచ్చి పోయిందో లేదో చూద్దామని , నిన్ను దారిలోకి తీసుకు రావాలని మేమిలా అబద్దమాడామేమో తెలుసుకోవాలని వచ్చావా...' ఎత్తి పొదుపుగా, క్రూరంగా , వాడిగా వున్న బాణాల లాంటి అతని మాటలు ఇంకా పూర్తీ కాకుండానే అవతలి వ్యక్తీ దోసిట్లో మొహం దాచుకుని కుమిలిపోతూ.
'నా తప్పు తెలుసుకున్నాను బావా-- నేను కళ్ళు తెరిచాను -- ఈ ఒక్కమాట చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను-- నాకూ తెలుసు-- పరిస్థితి అంతా మించి పోయిందని నేను ఇప్పుడు ఏం చెప్పినా లాభం లేదనీ ....మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు-- వెళ్తాను' అని గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ మళ్లీ ఒక్క క్షణం ఆగి .
'వసంత కి జరిపించాల్సిన కర్మ కండంతా యధావిధిగా నా చేతులతో నేను చేస్తాను' అనేసి మళ్లీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
'హు బ్రతికి వున్నన్నాళ్ళు అది ఒక మనిషి అనే జ్ఞానం అయినా లేకుండా ఎంతో నీచంగా చూసి, హింసించి , చివరికి అది చచ్చిపోయాక దేవతలా పూజిస్తా నంటున్నాడు.' అన్నాడు సుధాకరం. దానికి సమాధానం ఏం చెప్పాలో తోచలేదు మురళీ కి-- ఏవేవో నాలుగు వోదార్పు మాటలు చెప్పి సూటు కేసు చేత్తో పట్టుకుని గేటు దాటి స్టేషను కి వెళ్లాడు.
* * * *
ఉదయం తొమ్మిది గంటల వేళ -- ఇంటి ముందు ఆగిన టాక్సీ లో నుంచి ఒక్క వుదుటున క్రిందికి దిగి డ్రైవరు కి డబ్బు ఇచ్చేడు. సూట్ కేసు చేత్తో పట్టుకుని ఆత్రంగా గేటు తెరుచుకుని లోపలికి రాబోయిన మురళీ కళ్ళకి తలుపులకి వేసి వున్న పెద్ద తాళం కప్ప కనిపించింది.
హటాత్తుగా , బ్రేకు పడినట్లు గా అతని పాదాలు ఆగిపోయాయి. 'ఇంటికి తాళం వుందేమిటి? ఈ వేళప్పుడు కళ్యాణి ఎక్కడికి వెళ్తుంది?' అనుకుంటూ అసలది తమ వాటా అవునా కాదా అనే అనుమానం వచ్చినట్లు కళ్ళు చిట్లించుకుని చూస్తూ యాంత్రికంగా అడుగులు వేస్తూ ఆ తలుపులని సమీపించాడు.


