
21
ఇంత పెద్ద వుత్తరం లో ఏం వ్రాసింది ఎప్పుడు కూర్చుని వ్రాసింది అనుకుంటూనే మడతలు విప్పి చదవటానికి వుపక్రమించాడు మురళీ.
అమ్మా, అన్నయ్యా,
నేనిలాంటి పని చెయ్యటం మీకెంత బాధగా వుంటుందో నాకు తెలుసు. కాని ఏం చెయ్యను? నాకు మరో మార్గం కనిపించలేదు -- మోడు లా గడుపుతూ మిగిలిన జీవితం అంతా బ్రతకటం నా తరం కాలేదు, అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను....' నీ జీవితం మోడు కాదు, అది మళ్లీ చిగిర్చి పుష్పించి ఫలించేలా మేం చేస్తాం' అంటూ మీరు నాకు ఎన్ని విధాల గానో ధైర్యం చెప్పారు. ఊరికే చెప్పటమే కాదు అందుకు అవసరం అయిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాని వాటి వల్ల నాకు ఎంత మాత్రం సంతోషం కలుగలేదు, సరికదా మరింత దుఃఖం తో అవమానంతో నా అంతరంగం బిగుసుకుపోవటం ప్రారంభించింది -- 'స్త్రీ రెండవ వివాహాన్ని చేసుకోటాన్ని నువ్వు విరసిస్తావా-- భర్త ధూర్తుడూ దుర్వాసన పరుడూ అయి భార్యని అనేక విధాల హింసిస్తుంటే ఆమె అతనికి విడాకులిచ్చి మరోకరిని వివాహం చేసుకోవటాన్ని నువ్వు ఆమోదించవా? నీవి ఇంతటి సనాతనా భావాలా?' అని మీరు అనుకోవచ్చు-- అలాంటి పరిస్థితిలో చిక్కుకున్న అందరి విషయం చెప్ప గలిగే శక్తి నాకు లేదు. నేను అంతదూరం అలోచించలేను. నా ఆలోచనలూ, నా వరకే పరిమితంగా వుంటాయి--
సరే, మా ఇద్దరి మధ్యా తెగతెంపులు కావాలని మీరు రేపు కోర్టు లో కేసుపెడతారు-- అది హియరింగు కి వస్తుంది-- అందరితో పాటు నేను కూడ కోర్టుకి రావాలి. బోను ఎక్కి సాక్ష్యం ఇవ్వాలి. లాయరు అడిగే ప్రశ్నలన్నింటి కి సమాధానాలు చెప్పాలి, ఏమని? 'నా భర్త నన్ను అవమానించాడు-- పరాయి మొగ వాళ్లతో నాకు నీచమైన సంబంధాలు అంట గట్టాడు-- అది కేవలం అయన అనుమానం తప్పితే అందులో నిజం ఎంత మాత్రం లేదు. నాలో ఎలాంటి మాలిన్యమూ లేదు, నేను పవిత్రమైన దానిని,' అంటూ ఇలాంటి మాటలేగా?
అమ్మా, అన్నయ్యా , ఒక్కసారి ఆలోచించండి -- అసలు పదిమంది ముందూ నిలబడి ఒక స్త్రీ ఎలాంటి కళంకమూ లేదు, నేను ఏ తప్పూ చెయ్యలేదు, అని చెప్పుకోవలసి రావటం అది ఎంతటి దౌర్భాగ్యం? అలాంటిది నిండు న్యాయస్థానం లో నిలబడి నన్ను గురించి నా పవిత్రత ని గురించి చెప్పుకుని వాదించి, ఆ జడ్జీలని ఒప్పించి....అబ్బ తలుచుకుంటుంటే నాలో అణువణువు భయంకరమైన వేదనతో ఎవగింపుతో ఎదురు తిరుగుతున్నాయి . అలాంటి దారుణమైన పరిస్థితిలో నేను నిలబడలేను-- ఆ ఊహే నా ఒళ్ళు జలదరించేలా చేస్తోంది.
అన్నయ్యా, నా జీవితాన్ని నా సమస్యని గురించి ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. అనాదిగా మనదేశంలో ఈ సమస్య అంటే, భర్త భార్యని అనుమానించటం అనేది అక్కడా అక్కడా ఎదురయేనెమో. లేకపోతె ఆదికావ్యం రామాయణం లో కూడా ఇదే అంశానికి అంత ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదేమో ఆ మహా కవి.
అది కల్పన కాదు-- యదార్ధంగా జరిగింది. వాళ్ళంతా కారణ జన్ములు అని అనుకుంటుంటే సాక్షాత్తూ ఆ భగవంతుని అర్ధాంగి కే ఇలాంటి పాట్లు తప్పలేదా అనిపిస్తుంటుంది........

మహా సాధ్వి , మహా పతివ్రత అయిన సీతాదేవి తన పాతివ్రత్యాన్ని నిరూపించు కోటానికి అంతమంది ఎదుట అగ్ని ప్రవేశం చేసింది. వాళ్ళంతా అవతార పురుషులు కనక శరీరం కందకుండా మొహం వాడకుండా చిరునవ్వుతో ఆ అగ్ని గుండం నిండి బయట పడ కలిగింది -- కాని ఈనాడు అది సాధ్యమా .
అసలు రాముడు దేవుడా , వాళ్ళంతా అవతార పురుషులా అన్న అంశాన్ని వదిలేసి మామూలు కధగా ఆలోచించినా తేలేది ఒక్కటే విషయం -- ఆనాటి నుంచీ యుగాలు మారాయి -- ఎన్నో తరాలు గడిచాయి-- కాని మనిషి ఆలోచనలలో మాత్రం మార్పు రాలేదేమో--
ఈనాడు మనదేశంలో స్త్రీకి అన్ని హక్కులూ వున్నాయి, వారసత్వపు హక్కు, వోటు హక్కు అన్నీ వున్నాయి. చదువు కుంటోంది. అవసరం అయితే వుద్యోగం చేస్తోంది-- అయినా జీవితంలో కొన్ని సందర్భాలలో అశాంతి కి గురి కాక తప్పటం లేదు-- తన వ్యక్తిత్వం నిలుపుకోటం కోసం, ఆత్మ గౌరవం కాపాడేకోసం పెనుగులాట తప్పనిసరి అయిన సందర్భాలు చాలా వుంటున్నాయి-- అవి ఏవో సామాన్య,మైన పరిస్థితులూ చిన్న చిన్న అభిప్రాయాలలో భేదాలు అయితే ఏదో సర్దుకు పోవచ్చును కాని ఇలా తన శీలాన్ని ప్రవర్తననీ శంకించటమే జరిగితే అలాంటి అభాగ్యురాలి గతి ఏమిటి ?
ఈనాడు ఎంతటి నిర్దోషి అయినా ఎలాంటి పవిత్రుడయినా అగ్ని లో దూకితే ఆహుతి కాక తప్పదు-- మరి ఒకరి నిర్దోషిత్వాన్ని నిరూపించి ఆమెలో ఎలాంటి కళంకం లేదని చెప్పగలిగే మార్గాలు ఏమున్నాయి-- ఏమీ లేవు. దానికి ఇంకొకరి చేత నమ్మించటానికి ఆధారాలేమీ వుండవు....
సరే, ఇక నా విషయంలో నా వాదనతో న్యాయస్తానాన్ని నమ్మించ గలననే అనుకుందాం. నన్ను మళ్లీ ఏలుకోవలసిందిగా కోర్టు వారు నా భర్తని ఆజ్ఞాపిస్తారనే అనుకుందాం-- ఇంత అల్లరి పడి, ఇంత పబ్లిక్ గా కోర్టుల కెక్కి సాక్ష్యాలూ, వాదోప వాదాలు ఇన్ని జరిగాక కేవలం న్యాయ మూర్తి అజ్ఞాకి కట్టుబడి కలిసి కాపురం చేసే మేము ఏమైనా సుఖంగా సంతోషంగా వుండగల మంటారా? అసలు వారిలో ఆ అనుమాన పిశాచం అంతరించి పోతుంది అంటే నాకేం నమ్మకం కలగడం లేదు-- అలా వారి అనుమానపు చూపులు నన్ను ఈటేల్లా గుచ్చుకుని చీల్చేస్తుంటే రోజు రోజుకి కాస్త కాస్త గా చచ్చిపోయే కంటే ఇలా ఒక్కసారి చచ్చి పోగలగటం నాకెంతో హాయిగా వుంటుంది.
పోనీ, మరోలా ఆలోచిద్దాం-- మనసులు కలయని ఆ కాపురాన్ని వదులుకోటానికి అనుమతిస్తూ ఆ వైవాహిక బందాన్నుండి నన్ను విడుదల చేస్తారనుకో, అప్పుడైనా మరో వివాహం మీద నాకు కోర్కె లేదు. నేను ఇంతకూ ముందు గడిపిన జీవితంతో నాకు ఆ జీవితం అంటేనే వెగటు పుట్టింది.
ఇంతవరకూ చదివాక నీకు ఒకటి అనిపించవచ్చు-- నా ఈ సాహసానికి కారణం నువ్వు కోర్టుకి ఎక్కే ప్రయత్నాలు చెయ్యటం అనీ, అసలు మా మధ్య కలతలు మరీ భరించ లేనివిగా తయారయి మేము విడిపోవటానికి కారణం ఆనాడు రాఘవేంద్రం, బావ మా యింటికి రావటం అనీ మీకు అనిపించవచ్చు-- కాని అదెంత మాత్రం నిజం కాదు.
పెళ్లి అయిన దగ్గిర నుంచీ వారి ప్రవర్తన తో వారు అనే సూటీ పోటీ మాటలతో నా హృదయం తూట్లు పడిపోయింది-- వారికి నా ప్రవర్తన మీద నా నైతిక బలం మీద నమ్మకం లేదనీ, ఏనాడైనా ఎలాంటి ప్రలోభాని కయినా గురై అయి పోతానేమో అనే భయంతో నా చుట్టూ కోట గోడ లాంటి పరిస్థితులు కల్పించాలని వారు ప్రయత్నిస్తున్నారని తెలుసు కున్నప్పుడు నా ఆత్మ ఎంతగా కన్నీళ్లు వోడ్చిందో మీకు మాటలలో చెప్ప గలిగే శక్తి లేదు నాకు-- క్రమంగా ఆత్మ చినికి చినికి శిధిలమై పోయింది. ఇన్నాళ్ళూ మిగిలింది ఒట్టి కట్టే మాత్రమె....ఇలాంటి పని చెయ్యాలని ఎన్నడో అనిపించినా, ఆ రోజుల్లో వారు పెట్టిన బాధలని సహిస్తూ , ఆ తరువాత ఇన్నాళ్ళూ అందరూ అనే అన్ని రకాల మాటలు వింటూ నూ ఇలా ఎందుకు బ్రతికి వున్నానో నాకు తెలియటం లేదు -- ఇక నాలో ఆ శక్తి పూర్తిగా నశించి పోయింది. నా ఆలోచనలని ఆచరణలో పెట్టగలిగే తెగువ వచ్చింది. నేను వెళ్లి పోతున్నాను.
అన్నయ్యా-- పుట్టి పెరిగిన ఇద్దరిలో ఒకదాన్ని ఇలా మధ్యలో వెళ్ళిపోవటం ఆ లోటు నీకు తీరని బాధ కలిగిస్తుంది నాకు తెలుసు-- ఇంక అమ్మ సంగతి ఈ వయసులో ఆవిడికి కలిగిన ఈ కడుపు శోకాన్ని భరించే శక్తి ఆమెకి వుంటుందో లేదో కూడా నేను వూహించ లేక పోతున్నాను. ఆమెకి నాలోటు తెలియకుండా చూసుకునే భారం వదినదే-- మీ అందరికీ నమస్కారాలు . సెలవు.
వసంత.
ఉత్తరం మడిచి అలాగే చేతిలో పట్టుకుని, చెమర్చిన కళ్ళని పంచె కొనతో అడ్డుకున్నాడు మురళీ.
ఒక మనిషి మీద ఒక నింద వేసే టప్పుడు , ఒక మాట అనేట ప్పుడు , ఆ మనిషి ఎలాంటి క్షోభకి గురి అవుతాడో ఆలోచించు కోవాలి-- అందునా కేరక్టర్ నే అనుమానించటం అంటే అది అవతలి వారికి జీవన మరణ సమస్య గానే ఉంటుంది. అ విషయం మనం గ్రహించు కోవాలి' అన్నాడు సుధాకరం --
'అవును అన్నట్లు మురళీ తల వూగించాడు.
'నువ్వు చెప్పు మురళీ -- వసంత నీకు చిన్నప్పటి నుంచీ తెలుసు. పదిహేను పదహారేళ్ళ వచ్చేదాకా నీ కళ్ళ ముందు పెరిగింది. ఆమె ప్రవర్తనలో ఎప్పుడైనా ఏదైనా లేకితనం , అనుచితం అయినది చూశావా?'


