'నోర్మూయ్ ...నాకే సలహాలు ఇవ్వగలిగే తెలివి తేటలున్నాయను కోకు నీకు-- కుటుంబం గడపటానికి ఆసరాగా వుంటుంది కదా అని ఉద్యోగం చెయ్యటానికి అంగీకరించానని , ఆ స్వేచ్చని ఆధారం చేసుకుని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా-- ఆఫీసులో పనీ పాడూ ఏమీ చెయ్యకుండా మిగతా మొగవాళ్ళ తో బాతాఖానీ పెట్టుకుని కూర్చోటం వాళ్ళందరి తోటీ హాస్యాలు నవ్వులు ఇవన్నీ నాకు తెలియ వను కున్నావా'-- అంటూ నోరు నొప్పి పుట్టేదాకా కేకలేసి అప్పటికి అహంకారం చావక ఆమె లెంపలు కసిదీరా వాయగొట్టి చివరికి ఇంట్లించి బయటకి గెంటి తలుపు లేసేసు కున్నాడు.
దీప దీపాల వేళ రిక్షా దిగి ఇంట్లోకి వస్తున్న కూతుర్ని చూసి, 'ఏమ్మా అతను రాలేదా.' అంటూ పలకరించింది.
'లేదు. నాకు ఒంట్లో ఏం బాగుండ లేదు. నాలుగు రోజులు నీ దగ్గర వుందామని వచ్చాను.' అంది వసంత గదిలోకి వెళ్ళిపోతూ.
అప్పటికి కూతురి మొహం దగ్గరగా చూసిన కామాక్షమ్మ గారు, 'అయ్యో మొహం అంతా అలా ఎర్రబడి పోయిందే మిటే, కళ్ళూ రెండూ ఉబ్బిపోయాయి -- ఏమిటి సుస్తీ....' అంటూ ఆదుర్దాగా ఆ పిల్ల నుదురూ చెంపలూ తాకి చూసింది.
'ఆహా ఖంగారేం లేదు.' అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది వసంత.
ఆ తరువాత ఆ పిల్ల వైఖరి ఇటు కామాక్షమ్మ గారికి అటు సుధాకరానికి ఏదో అనుమానం రేకెత్తించినా ఏదీ గట్టిగా అడగలేక పోయారు. అసలు అందుకు అవకాశం కూడా ఇవ్వలేదు వసంత.
తరువాత నాలుగైదు రోజులు గడిచి పోయాక వసంతే జరిగినదంతా తల్లితో చెప్పి ఇంక జన్మలో మళ్లీ ఆ గుమ్మం ఎక్కను అని చెప్పేసింది.
'ఏదో కలతలు వచ్చాయని, పట్టుదలలు పెంచుకుని సంసారానికి నీళ్లు వదులు కోటం వివేకం అనిపించు కొదు,' అంటూ కామాక్షమ్మ గారు కూతురికి ఎన్నో విధాల నచ్చ చెప్పాలని ప్రయత్నించింది.
సుధాకరం కూడ ఒకసారి బావగారి ని కలుసుకోవాలని వెడితే అతను మంచీ మర్యాదా అనే మాటల అర్ధం కూడ మరిచి పోయిన వాడిలా బావగారిని, వసంత ని ఆ కుటుంబాన్ని అనరాని మాటలన్నాడు.
సుధాకరం కూడ అన్నింటికీ పౌరుషంగా సమాధానం చెప్పి లేచి చక్కా వచ్చాడు.
ఇది జరిగి ఆరు నెలలయింది. ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వుత్తర ప్రత్యుత్తరాలు కాని రాకపోకలు కాని లేవు. పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే అయింది.
అంతా విని ఒక్కసారి బాధగా దీర్ఘంగా నిట్టూర్చాడు మురళీ. అతను ఏదో అనబోతుంటే వసంత వచ్చి భోజనాలకి పిలవటం తో ఇద్దరూ లేచి వెళ్ళారు.
'ఏమిటో బాబూ-- మమ్మల్నందర్నీ చూద్దామని అభిమానంగా వచ్చావు. రాకరాక వచ్చిన నీకు పచ్చడి మెతుకులు పెడుతున్నట్లే వుంది నా వంట -- ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అన్నట్లు విధి లేక చేస్తున్నానే కాని అసలు ఏ పని మీద దృష్టి వుండటం లేదు. వసంత ని చూస్తుంటే కడుపు తరుక్కు పోతోంది.' అంటూ మళ్లీ ఆ గాధనంతా చెప్పుకొచ్చింది కామాక్షమ్మ గారు.
'ఆ గొడవతో ఇంట్లో వాళ్ళ బుర్రలన్నీ పాడయి పోయాయి. ఇంక చుట్టం చూపుగా వచ్చిన మురళీ అన్నయ్య మతి కూడా పోగొట్టి పంపించండి --' విసుగ్గానూ, విరక్తి గానూ అంటూ అక్కడ్నించి వెళ్ళిపోయింది వసంత.
'అందరితోటీ పైకి పది సార్లు చెప్పుకోదు కాని-- అతను దాన్ని యెంత గానో హింసించి , అవమానించి వుంటాడు. దాని మనస్సు పూర్తిగా విరిగి పోయింది. లేకపోతె ఇంతగా పంతగించుకోదు ,' అన్నాడు సుధాకరం.
'ఇంకా ఆ వుద్యోగం చేస్తోందా?' అన్నాడు మురళీ ఏదో ఒకటి అడగాలి కదా అనుకున్నట్లు.
'ఆ, చేస్తోంది. అదీ లేకపోతె అసలు కాలక్షేపం కూడ కాక మరీ వెర్రెత్తి పోయేది -- సరే ఏదో కాలక్షేపం అయిపోతోంది కదా అని ఇలాగే మోడులా జీవితమంతా గడప మానటం న్యాయం కాదు.-- దానికి పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు-- ఇంక అతని తో చట్ట రీత్యా తెగత్రేం పులు చేసేసి మళ్లీ పెళ్లి చెద్దా మను కుంటున్నాను....ఏవేవో లేని పోనీ అనుమానాలు పెట్టుకుని ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసే హక్కు తనకి లేదు అని అతన్నే అనుభవ పూర్వకంగా తెలుసుకోనీ -- నిజంగా మన ప్రభుత్వం ఈ విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టి వసంత లాంటి వారి కెంతో ఉపకారం చేసిందనుకో. భర్త సరిగ్గా చూసినా చూడక పోయినా, ఎన్ని విధాల అవమానించినా చచ్చినట్లు నోరు మూసుకుని వాడి దగ్గరే పడి వుండే ఖర్మేం లేదు-- విడాకు లిచ్చేసి హాయిగా తనకి నచ్చిన మరొకడి ని చేసుకుని సుఖంగా బ్రతకవచ్చు' అన్నాడు సుధాకరం.
"నిజమే.'
'ఇవాళో రేపో వెళ్లి వో మంచి లాయర్ని సంప్రదించి రావాలను కుంటున్నాను........ఆ......' నువ్వు నాలుగు రోజులుంటావుగా .'
'నాలుగురోజులే, ఈసారి వీలు కాదు -- పని మీద మద్రాసు వచ్చి అక్కడ్నించి కలకత్తా వెళ్దామని బయలుదేరాను. మధ్యలో బెజవాడ స్టేషను చూడగానే మీరు గుర్తు వచ్చారు. సరే టిక్కెట్టు పనికి వస్తుంది కదా అని దిగి పోయాను. రేపు తప్పితే ఎల్లుండి వెళ్లి పోతాను.'
'సరే, ఈసారెప్పుడైనా వదిన గారిని తీసుకురా......అన్నట్లు అడగనే లేదు, నీకు పిల్లలా?'
'ఒక అమ్మాయి.'
'బాగుంది....మరి ఇప్పుడు మీ వూరు వెళ్ళవూ--
'మీ అమ్మా వాళ్ళని, కలకత్తా నుంచి వచ్చే టప్పుడు చూస్తావా?' సమాధానం కూడా అందిస్తూ అడిగాడు సుధాకరం' యధాలాపం గానే.
'మరే,' అన్నాడు మురళీ క్లుప్తంగా.
ఆ రోజు గడిచి పోయింది.
రెండవ రోజు పగలంతా గడిచి పోయింది. రాత్రి మామూలుగా భోజనం చేసి అంతా నిద్రలకి వుపక్తమించారు-- ప్రొద్దుటే మైలు కి మురళీ ప్రయాణం పెట్టుకున్నాడు......
'గాడ నిద్రలో వున్న మురళీ కి ఒక్కసారిగా పెద్దగా ఏడ్పులు వినిపించి త్రుళ్ళి పడి లేచాడు-- హటాత్తుగా లేవటం వల్ల అతనికి ఒక్క క్షణం తను ఎక్కడ వున్నదీ ఎందుకు లేచిందీ ఏమీ గుర్తు రాలేదు.......ఇంతలో మళ్లీ ఏడుపు , అందులో కామాక్షమ్మగారు గొంతు గుర్తు తెలియటం తో ఒక్కసారి మత్తు విడిపోయింది.
'సుధాకరం,' అని పిలుస్తూ పెరటి వేపుకి పరుగు లాంటి నడకతో వచ్చాడు.
పెరటి వరండా మీది దృశ్యం దూరం నుంచి చూస్తూనే అతను కొయ్యబారి పోయాడు ఒక క్షణం. ఏమిటిది ఎందుకు కామాక్షమ్మ గారు వసంత తల నలా ఒడిలో పెట్టుకుని ఏడుస్తోంది. అసలేం జరిగింది -- తెల్లవారగట్ల నా ప్రయాణం వెల్టి కి కాఫీ ఫలహారాలు చెయ్యాలని చీకటితో లేచి పెరట్లో కి వచ్చేసరికి ఏ పురుగయినా ముట్టు కోలేదు కదా -- లేకపోతె -- అసలే మనస్సు కుదురు లేక , ఆరోగ్యం సరిలేక మరీ నీరసంగా వున్న వసంత కి ఏ హిస్టీరియా అయినా రాలేదు కదా.' అనుకుంటూనే ఒక్క వుదుటున వాళ్ళ దగ్గరికి వచ్చి, 'ఏమయింది -- వసంత కేమయింది.' అని ఆదుర్దాగా అడుగుతుంటే.
'ఏం జెప్పను మురళీ-- ముందు వో డాక్టర్ని పిలుచుకురా-- త్వరగా వెళ్లు,' అన్నాడు సుధాకరం కళ్ళు తుడుచుకుంటూ.
రెండిళ్ళ అవతల వున్న డాక్టర్ని పిలుచుకు రావటానికి పరుగు పెట్టాడు మురళీ కాలికి జోళ్ళ యినా వేసుకో కుండా --
అయిదు నిమిషాలలో డాక్టరు ఇంకా కొంతమంది ఇరుగు పొరుగూ కూడా వచ్చారు.
వసంత చెయ్యి పట్టుకుని చూసి ఇంక ఏమీ ;లాభం లేదన్నట్లు తల తిప్పేసుకున్నాడు. ఆ డాక్టరు. ఆయనకి వసంత వాళ్ళ కుటుంబం చాలా రోజుల నుంచి తెలుసు. ఆమె పరిస్థితి అంతా కూడ తెలుసు. ఆ చావుకి కారణం అయన వూహించు కో గలడు -- జీవితం మీద విరక్తి పుట్టి విషం తిని చనిపోయింది....
అందుకే ఎలాంటి గొడవలూ కాకుండా తరవాతి కార్యక్రమం జరిగి పోవటానికి అయన తోడ్పాడ్డాడు.
స్మశానం నుంచి తిరిగి వచ్చిం తరువాత కూడా ఈ జరిగిందంతా కల నిజమా అనే వూహ మురళీ కి మధ్య మధ్య రావటం మానలేదు.
'నిన్న రాత్రి కూడ తనతో మాట్లాడిన వసంత, ఇవాళ ఇప్పుడు, ఈ లోకంలోనే లేదు.' అనుకోటం , అతనికి నమ్మశక్యం కానట్టే వుంది.
'కాని ఆమె మృత దేహాన్ని తను చూశాడు. స్వయంగా స్మశానానికి వెళ్లి వచ్చాడు-- ఇంకా అదంతా జరగలేదని ఎలా అనుకోటం? మానవ జీవితాలు ఇంత బుద్బుదప్రాయాలా-- మనుష్యుల జీవితాలతో భగవంతుడు ఇలా ఆటలాడుకుంటాడా . తన చేతులతో తను కొంతమందికి మరణం విధించి, మరి కొంతమందికి జీవితం అంతా ముందు వుంది అనుభవాలన్నీ ముందువున్నాయి అని ఆశతో ఎదురు చూసే ధైర్యం, అనురక్తి లేకుండా జీవితం అంతా మరుభూమిలా చేసి వాళ్ళు విసిగి వేసారి బలవంతంగా ప్రాణాలు తీసుకునేలా చేస్తాడా -- ' రెండు కళ్ళ మీద చేతులు అన్చుకుని లోలోపలే కుమిలిపోతూ న్నాడు మురళీ. ఆ ఇంట్లో ఎవ్వరినీ వోదార్చాలన్నా అతని నోరు పెగాలటం లేదు-- హృదయ విదారకంగా వినవస్తున్న కామాక్షమ్మ గారి రోదన ధ్వనితో ఆ ఇంట్లో ప్రతి అంగుళం ప్రతి ధ్వనిస్తోంది. ఆ తల్లి కడుపు శోకం చూసేవాళ్ల కడుపులు తరుక్కు పోయేలా చేస్తోంది. సుధాకరం సుగునా మోకాళ్ళ మీద తల ఆనించుకుని కూర్చుని గుండెలు కుమిలి పోయేలా ఏడుస్తున్నారు.
మెల్లిగా సాయంత్రం అయింది --
పరిసరాల మీద ధ్యాస అనేది లేకుండా కేవలం శూన్యం లోకి చూస్తున్నట్లు అలా ఎటో దూరంగా చూస్తూ కూర్చున్న మురళీ తన భుజం మీద ఎవరిదో చెయ్యి పడినట్లయి త్రుళ్ళి పడి ఇటు తిరిగాడు -- ఎదురుగా సుధాకరం --
ఈ వుత్తరం చూడు. వసూ వ్రాసి బల్ల మీద పెట్టింది.' అని ఆ పైన మరి చెప్పలేక దుఃఖాన్ని ఆపుకోలేక కాగితాలు మురళీ చేతిలో పెట్టి తను దోసిట్లో మొహం దాచుకున్నాడు సుధాకరం.


