"ఏమిటి?" అన్నాడు. అతని గొంతు చలించింది.
"అమ్మగారి పరిస్థితేం బాగాలేదు. చాలా నీరసంగా వున్నారు."
"వెంటనే బయల్దేరుతున్నాను" అంటూ ఫోన్ పెట్టేసి బయటకు వచ్చి కారెక్కాడు.
* * *
దాదాపు మూడు నాలుగు గంటలు శ్రమపడితే, రెండు సైలెన్ బాటిల్స్ చాలా వేగంగా ఫ్లో అయ్యాక సీతమ్మగారి పరిస్థితి కొంతవరకు మెరుగై, మాట్లాడే పరిస్థితి వచ్చింది.
"దయా!" అని పిలిచింది. ఆమె కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
"అమ్మా! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?"
"...యోగి...యోగి..."
"వస్తాడమ్మా. వాడ్ని గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడుచేసుకుంటున్నావు."
"దయా! నువ్వు...పెళ్ళి...నేను బ్రతికుండగా..."
"చేసుకుంటానమ్మా, తప్పకుండా చేసుకుంటాను."
"ఎప్పట్నించో...అలా...అంటున్నావు...కాని...నా ఆశ..."
"ఈసారి నా మాట తప్పక చెల్లించుకుంటానమ్మా! మంచి అమ్మాయిని నీకు అన్ని విధాలా నచ్చే అమ్మాయిని చూసుకున్నాను."
ఆమె ముఖంలోకి కొంత కాంతి వచ్చింది. జీవకళ తరిగిపోతున్న కళ్ళలోకి చిన్న వెలుగు జీర తొంగి చూసింది.
"వీలైతే...నాకు చూపించు."
"అలాగేనమ్మా ! ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తాను" అంటూ దయాకర్ యింట్లోంచి బయటకు వచ్చాడు.
* * *
ప్రజ్ఞ గదిలో మంచంమీద పడుకుని ఓ వారపత్రిక తిరగేస్తోంది.
ఉన్నట్టుండి గోపీకృష్ణ యింట్లోంచి మాయమయ్యాడు. అస్మిత చనిపోయాక పోలీసులొచ్చి అతన్ని పట్టుకెళ్ళి యింటరాగేట్ చేస్తున్నారా? పోలీసులే చర్య తీసుకోవటం మొదలు పెడితే తమకు తెలీకుండా వుండదు. ఒకవేళ అస్మిత యింట్లో వాళ్ళు అతనిమీద కక్షతో ఏమయినా చేసి పారేశారా? వళ్ళు ఝల్లుమంది. వాళ్ళేమన్నా చేస్తారని భయపడి, వాడే...
ఏమీ తెలియటం లేదు. మనసంతా చాలా ఆందోళనగా వుంది.
పారిపోయి ఎక్కడయినా వుండి వుంటే యీపాటికి తనకు ఉత్తరం రాసేవాడు. అదీలేదు.
ఇటు చూస్తే తండ్రి ఆరోగ్యం రోజు రోజుకూ మరింత హీనస్థితికి జారిపోతోంది. తల్లిలో పరివర్తన రాను రానూ ఎక్కువయిపోతోంది. తమ్ముడు సురేంద్ర ఏదో దుకాణంలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.
పరిస్థితులేమీ బావున్నట్లు అనిపించటంలేదు. మనసంతా వ్యాకులపాటుగా వుండి నాలుగు రోజులు సెలవుపెట్టి యింట్లోనే వుండిపోయింది.
వారపత్రిక తిరిగేస్తోంటే ఓ కథ ఆమె దృష్టిని ఆకర్షించింది. చాలా పెద్ద కథ. ఆసక్తిగా చదివింది.
అందులో కథానాయిక చాలా పేదపిల్ల. ఎంత ప్రయత్నించినా ఆమె తల్లిదండ్రులు పెళ్ళి చెయ్యలేకపోతూవుంటారు. చివరికామె జీవితంలోకి ఓ యువకుడు తారసిల్లి ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా కాలం గడుపుతుంటారు.
ఆమె అత్తగారు కూడా వయసులో చిన్నదే. మావగారు కూడా వ్యాపారం చేస్తూ భార్య అంటే చాలా అనురాగంగా వుంటూ వుంటాడు.
ఈ అమ్మాయి గర్భవతి అయిన రోజుల్లోనే అత్తగారు కూడా గర్భం దాలుస్తుంది.
ఇద్దరికి కూడా పురుడు కొన్ని రోజుల తేడాతో వస్తుంది. అత్తగారికి కాన్పు కష్టమై పిల్లాడ్ని కని చనిపోతుంది.
మరిదిని కూడా ఆ అమ్మాయే సాకవల్సి వస్తుంది. తన కొడుకుతో బాటు మరిదికి కూడా పాలిచ్చి పెంచుతుంది.
సంవత్సరాలు గడిచిపోతూ వుంటాయి. కొడుకుతోబాటు మరిది కూడ పద్దెనిమిదేళ్ళవాడవుతాడు.
మామగారంతకు కొన్నేళ్ళముందే మరణిస్తాడు. ఓ యాక్సిడెంట్ లో భర్త మరణిస్తాడు.
కొడుకు చెడు అలవాట్లకు లోనయి యింట్లోంచి పారిపోతాడు.
మరిదే ఆమెకు రక్షకుడవుతాడు. సమాజంలో ఓ స్త్రీగా ఆమె ఎన్నో బాధలు పడుతోంది. ఎన్నో అరాచకాలకు గురి కాబోయి విశ్వ ప్రయత్నం మీద తప్పించుకుంటూ ఉంటుంది. ఆమె అనుభవించిన హింసలకు అంతులేదు. చివరికా బాధలు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకోబోతూంటే మొదట్నుంచీ బుద్ధిమంతుడయిన ,మరిది ఆమెకు బాసటగా, తోడుగా నిలవడానికి నిర్ణయించుకుని, ఆలోచించుకోటానికి వ్యవధి యివ్వకుండా తాళిబొట్టు కట్టేస్తాడు.
కథ చివరిదాకా చదివాకా ప్రజ్ఞ మనసు వికలమైపోయింది. తార్కికంగా ఆలోచిస్తే యిది సమజసంగా వుంది. కాని పాలిచ్చి పెంచిన మరిది ...
ఈ పరిణామం భరించలేకపోతోంది.
బయట కారాగిన చెప్పుడయింది. చాలా పరిచితమైన కారు హారన్. ఎందుకో శరీరం పులకరించినట్లయింది. చప్పున మంచంమీద నుండి లేచి గుమ్మం దాటి యివతలకొచ్చింది. డాక్టర్ దయాకర్ అప్పుడే కారు దిగుతున్నారు. ప్రజ్ఞని చూసి పలకరింపుగా నవ్వి దగ్గరకు వచ్చాడు.


