డాబామీద చల్లగాలి వీస్తోంది.
ఉన్నట్లుండి సుడిగాలి వచ్చింది అక్కడికి.
అంటే నిమ్మీ కపూర్ వచ్చిందని అర్ధం.
నిమ్మీకపూర్ స్నానానికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా కూడా సుడిగాలిలాగానే వెళ్తుంది. అది ఆమెకి జన్మతః వచ్చిన అలవాటు.
"ఏంటి గిరాకీ?" అంది సితార నిమ్మీతో నవ్వుతూ.
నిమ్మీ చేతులు మిస్టీరియస్ గా తన వెనక పెట్టుకుని వుంది. ఆ చేతుల్లో ఏవో వున్నాయి.
"చేతుల్లో ఏమిటి? బాంబుగానీ వుందా?" అంది సితార సరదాగా.
"కాదు."
"మరి?"
"మిఠాయ్ ప్లస్ తాంబూలం!"
నుదురు చిట్లించింది సితార "ఎందుకూ?"
"గురుదక్షిణ!"
"అదేవిటీ?"
"అది అంతే!"
"అంటే?"
"ఇవాల్టి నుంచి నువ్వు గురువూ, నేను శిష్యురాలిని, తుమ్ ఉస్తాద్, ఔర్ మై తుమ్ హారీ బేలా!"
"అర్ధమైచచ్చేట్లు చెప్పు!"
"నువ్వు చదరంగం ఆడతావ్ గదా!"
"అయితే?"
"చదరంగం ఆడే వాళ్ళంతా తెలివైనవాళ్ళు కదా!"
"ఏమో!"
"అలా తేల్చెయ్యకు! తెలివైన వాళ్ళే! ఎత్తులకి పై ఎత్తులేస్తూ వుండాలిగదా చదరంగం అంటే!"
"పోనీ సరే అనుకుందాం! అయితే!"
"పైగా నువ్వు బోల్డంత జీనియస్సువి కూడా గదా!"
"నా మొహం గానీ, ఎందుకీ కాకా?"
"కాలీజీలో ఫస్టు మార్కులూ, బెస్టు మార్కులూ ఎప్పుడూ నీ సొంతమేగా!"
"మునగ చెట్టెక్కిస్తున్నావా? ఏం?"
అది వినిపించుకోకుండా "అందుకని నువ్వు నాకు ఫేవర్ చెయ్యాలి" అంది నిమ్మీ.
"ఏంటది!" అంది సితార.
"చేస్తానంటేనే చెప్తా!"
"చెప్పు! చూద్దాం!"
"చూద్దాం కాదు! చేద్దాం అను!"
"పిక్నిక్కులకీ, రమ్మీ ఆటకీ నేను రాను. ఆ విషయంలో నాకు మొహమాటం లేదు. ఫేవర్ చెయ్యను" అంది సితార నిక్కచ్చిగా.
"మరీ అంత కష్టమైనపని కాదులే!"
"మరైతే చెప్పమంటుంటే!"
"నేను పెళ్ళిచేసుకోదల్చుకున్నా!" అంది నిమ్మీ సిగ్గు నటించడానికి విఫల ప్రయత్నం చేస్తూ. సిగ్గుకూ, ఆ అమ్మాయికీ ఆమడ దూరం!
ఆమె బదులుకూడా తనే కాస్త సిగ్గుపడింది సితార. జెయ్ చంద్రతో జరగబోయే తనపెళ్ళి గుర్తొచ్చింది ఆ అమ్మాయికి.
"ఎవరిని?" అంది యధాలాపంగా అన్నట్లు.
"జెయ్ చంద్రని!" అంది నిమ్మీ.
అది విని సితార దారుణంగా షాకయిపోలేదు. ఆ సంగతి ఆ ఊళ్ళో ప్రతివాడికీ తెల్సు ముగ్గురు మూర్ఖిణులూ జెయ్ చంద్రని పెళ్లి చేస్కోవాలని చూస్తున్నారని.
ఆ ఊళ్ళో ప్రతివాడికీ తెలీనిది ఏమిటంటే..... జెయ్ చంద్ర సితారని మాత్రమే ప్రేమిస్తున్నాడనీ, సితారని మాత్రమే పెళ్ళిచేసుకుంటాడనీ..... అమ్మాయి కోసమే అసలతను ఆస్తినీ, అమ్మనీ కూడా వదిలేశాడనీనూ!
అందుకని.....
నిమ్మీమీద జాలేసింది సితారకి.
కానీ ఏం చెయ్యగలదు తను?
తనూ జెయ్ భార్యాభర్తలు కావాలని ఆ బ్రహ్మదేవుడే మార్కింగ్ పెన్నుతో యిద్దరి నుదుతా బ్రహ్మరాత రాసేశాడు.
అది అర్ధం చేసుకోకుండా ఈ నిమ్మీ జెయ్ చంద్ర తనకే సొంతం కావాలనుకుంటే అది అయ్యే పనేనా?
"అయ్యేపని కాదు అందువల్లే నీ సహాయం కోసం వచ్చాను" అంది నిమ్మీ.
తను అప్పటికి చాలా సేపట్నుంచీ ఏకధాటిగా మాట్లాడేస్తోంది. సితారని వినిపించుకోవట్లేదు.
"సీతారావలక్ష్మీ! నువ్వు తప్ప నాకు వేరేదిక్కులేదు. అన్యధాశరణం నాస్తి! నా బాధని ఆర్చేవారూ తీర్చేవారు నీవుతప్ప నాకింకెవరూ లేరు. మై బహుత్ దుఃఖీ హూ! తుమ్ మేరే కూ జరూర్ మదత్ కర్నా! దయచేసి జంగయ్యనీ నన్నూ కలిపి పుణ్యం కట్టుకో!" అంది.
"మధ్యన ఈ జంగయ్య ఎవరు?" అంది సితార తెల్లబోతూ.
తెప్పరిల్లుకుంది నిమ్మీ "అదా! మా పితాజీ ఎప్పుడూ అంటూ వుంటాడులే! జాన్ జానీ జనార్ధన్, జంగయ్యా.....అలా ఎవర్ని చేసుకున్నా తనకి అభ్యంతరం లేదని. ఆ అలవాటు కొద్దీ వచ్చేసింది. జంగయ్యకాదు. అతని పేరు జానీ."
"ఎవరే...?"
"అదేనే జనార్ధన్....కాదు.....జాన్."
"సరిగ్గా చెప్తావా? చంపనా?"
"జెయ్ చంద్ర!" అంది నిమ్మీ ఈసారి సరిగ్గా.
"అయితే నేనేం చెయ్యాలి?"
బేలగా మొహం పెట్టింది నిమ్మీ.
తర్వాత కంప్లయింట్ చేస్తున్నట్లు చెప్పటం మొదలెట్టింది. "జెయ్ చంద్ర వున్నాడా? నేనున్నానా? మరేమో నేను జెయ్ చంద్రని ప్రేమిస్తున్నానా? మరేమో జెయ్ చంద్ర ప్రపంచంలో అందర్నీ ప్రేమిస్తున్నట్లు వుంటాడు గానీ నిజానికి అతను తనని తాను తప్ప యింకెవర్నీ ప్రేమించడు? ఎన్నిసార్లో నేను నా ప్రేమని ప్రైవేట్ గా అతని చెవులో చాటింపు వేద్దామన్నా దొరకడు.....ఇంకెట్లా చచ్చేది చెప్పు! అంది గుడ్లెంబడి నీళ్ళు కక్కుకుంటూ.


