"డబ్బు తప్ప నీకెప్పుడూ ఇంకేమీ గుర్తుండదా మామ్?"
"ఎందుకు గుర్తురావు? పరువూ, ప్రతిష్టా, ఆస్తిపాస్తులూ, కుటుంబగౌరవం, బంగళాలూ, క్లబ్బులూ, హై సొసైటీ......"
"వీటన్నిటికీ మించి మంచితనం, మానవత్వం, ప్రేమా, అవమానం, జాలీ, దయాదాక్షిణ్యం ఇవన్నీ కూడా వుంటాయని నీకెప్పుడూ తట్టలేదా మామ్?"
"నా టైము చాలా వాల్యుబుల్ అని నీకు తెలుసు సన్నీ! ప్రతినిమిషం కొన్ని వందలరూపాయల విలువ చేస్తుంది. వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం! చెక్కు యిచ్చేసి వెళ్ళిపో!" అంది సునీతా సుందరి ముభావంగా.
చెక్కు టీపాయ్ మీద పెట్టేశాడు అతను "బై మామ్!"
ఒక్కసారి అతని కళ్ళలోకి చూసింది సునీతా సుందరి.
ఎంత బింకంగా వుందామనుకున్నాకూడా ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.
"మామ్!" అన్నాడు అతను విచలితుడవుతూ.
కంపిస్తున్న స్వరంతో అంది డాక్టర్ సునీతా సుందరి "సన్నీ! వయసొచ్చిన కొడుకుని ఫ్రెండులా చూడాలంటారు పెద్దలు. నేను నిన్ను ఫ్రెండులాగానే చూద్దామనుకున్నాను. అందుకే నీకు బోల్డంత ఫ్రీడమ్ యిచ్చాను. నువ్వు అడక్కుండానే కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు యిచ్చాను.
నేను నిన్ను ఫ్రెండులానే చూశాను జెయ్!
అందుకు బదులుగా నువ్వు మాత్రం నన్ను ఎనిమీలా చూస్తున్నావు."
"మామ్!" అన్నాడు అతను వారిస్తూ.
వినిపించుకోకుండా అంది సునీతా సుందరి "ఓ.కె! సన్నీ! నేను ప్రస్తుతం నీకు ఎనిమీగా కనబడుతూ వుండొచ్చు. కానీ నువ్వు కాదనుకున్నా నేను ఒకప్పుడు నీకు తల్లిని. నీకు నా రక్తం, నా మాంసం పంచి ఇచ్చాను. నా పేగు తెంపుకుపుట్టావు నువ్వు. కళ్ళు తెరవని పసిగుడ్డుగా వున్నప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాను.
ఇప్పుడు నీకు రెక్కలొచ్చాయి జెయ్! పెద్దాడివైపోయావు. నీకు జతగా వుండే అమ్మాయిని నువ్వే వెతుక్కున్నావు. ఆ పిల్ల కోసం కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతున్నావు."
"మామ్!" అన్నాడు అతను.
అడ్డం రావద్దన్నట్లు చెయ్యెత్తి వారించింది సునీతా సుందరి.
"ఓ.కే! సన్నీ! దిసీజ్ యువర్ లైఫ్! నీ యిష్టం! వెళ్ళిపో! కానీ వెళ్ళిపోయేముందు ఒక్క ఫేవర్ చేసి వెళ్తావా?"
సందేహంగా చూశాడు అతను.
విషాదంగా నవ్వింది సునీతా సుందరి "కాదు! నాకింత విషమిచ్చి వెళ్ళమని అడిగేటంత పిరికి మనిషిని కాను నేను.
కానీ జెయ్! ఒక్క కోరిక కోరతాను. తీరుస్తావా?"
సందిగ్ధంగా చూశాడు అతను.
"ఎక్కువ కష్టపెట్టనులే నిన్ను! చిన్న పనే!"
"చెప్పు మామ్!"
"సాంబశివరావుగారి అమ్మాయిని నువ్వు వచ్చి చూస్తావని మాట యిచ్చాను. ఎప్పుడూ నీ ప్రేమ పురాణం గురించి తెలీకముందు. ఇప్పుడు గదా నీ సంగతి నాకు తెలిసింది. కానీ యిదంతా సాంబశివరావుగారికి తెలిస్తే నా పరువుపోతుంది."
"అయితే?" అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు అతను.
అతన్ని బతిమాలుతున్నట్లు అంది సునీతా సుందరి "జెయ్! సన్నీ! ఈ మామ్ కోసం చిన్న ఫేవర్ చేస్తావా?"
"చెప్పు మామ్!"
"ఒక్కసారి వెళ్ళి సాంబశివరావుగారి అమ్మాయిని చూసిరా! చూసి నీకు నచ్చలేదని చెప్పెయ్యి. నా పరువు దక్కించిన వాడివవుతావు."
"అంతేనా?" అని తేలిగ్గా నిట్టూర్చాడు అతను.
అతనికి హఠాత్తుగా తన తల్లిని చూస్తే జాలివేసింది. ఒక్కసారిగా ఆమె పాదాల దగ్గర కూర్చుండిపోయాడు. పాదాల దగ్గర కూర్చున్నాకూడా దాదాపు ఆమె అంత ఎత్తున్నాడు అతను. అమ్మ భుజం చుట్టూ చేతులేశాడు.
"మామ్! నువ్వు చెప్పినట్లే తప్పకుండా ఆ సాంబశివరావుగారి అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పేస్తాను. హాపీ?" అన్నాడు.
"థాంక్స్ సన్నీ!" అంది సునీతా సుందరి. తన ఎడమ చేతిని వెనక్కి తిప్పి కళ్ళు తుడుచుకుంటూ.
"మామ్!"
"యస్ సన్నీ!"
"ఐలవ్ యూ మామ్!"
"ఐలవ్ యూ సన్నీ! వెరీ వెరీ మచ్."
"మామ్!"
"సన్నీ!"
"ఐ యామ్ యువర్ ఫ్రెండ్! నాట్ ఎనిమీ!" అన్నాడు జెయ్ చంద్ర.
చిన్నగా నవ్వి, అతని నుదుటిని తేలిగ్గా చుంబించింది సునీతా సుందరి. "సాంబశివరావుగారి అమ్మాయిని చూడటానికి రేపు సాయంత్రం వెళ్ళగలవా సన్నీ? మంచి రోజుట."
"ష్యూర్ మామ్!" అన్నాడు అతను.
ముద్దుచేస్తున్నట్లు అతని జుట్టు రేపేసింది సునీతా సుందరి.
"ఇహ వెళ్ళు! నేను నిన్ను ఇక్కడ కట్టిపడేశానని సితార భయపడి పోతుంటుందేమో!" అంది నవ్వుతూ.
చిన్నగా నవ్వి వెళ్లిపోయాడు అతను.
వెంటనే సునీతా సుందరి పెదిమలు పంతంతో బిగుసుకుపోయాయి. ఓ విధమైన విజయగర్వంతో కళ్ళు మిలమిల మెరుస్తుండగా ఫోన్ అందుకుంది.
లైన్ అవతల వైపు సాంబశివరావుగారి భార్య ఫోన్ అందుకుంది.
"మా జెయ్ రేపు మీ అమ్మాయిని చూడ్డానికి వస్తున్నాడు" అంది సునీతా సుందరి. ఆ తర్వాత ఓ క్షణం ఆగి అంది "ఆ మధ్యెప్పుడో మీరు అడిగారే? మెహిందీ బాగా పెట్టేవాళ్ళెవరని? సితార అని ఓ అమ్మాయి వుంది. ఎక్స్ పర్టు! ఆ అమ్మాయిని పిలిపించండి" అని ఫోన్ పెట్టేసింది.
తక్షణం ఆమె మొహంలో భావం మారింది. ఆమె కళ్ళముందు సితార కనబడుతోంది ఇప్పుడు.
"యూ! బ్లడీబీచ్! నా చెక్కు నా మొహానే కొడతావా? ఎండ్ దిసీజ్ ఎ ఛాలెంజ్! చూస్తుండు" అంది సునీతాసుందరి తన అదృశ్య శత్రువు సితారతో.
* * *
సితార డాబా మీద కూర్చుని వాళ్ళ నాన్న షర్టుకి కాలర్ చిరిగిపోతే కుడుతోంది. ఆమె పక్కనే చదరంగం బోర్డు వుంది. ఆ చదరంగంబోర్డు మీద నలుపూ, తెలుపూ బలగాలు పేర్చి ఉన్నాయి. రెండువైపుల ఆటా తనొక్కతే ఆడేస్తోంది సితార సవ్యసాచిలా. షర్టు కుడుతోంది, ఎక్స్ పర్టులా చదరంగం ఆడుతోంది కూడా.


