Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 41

   

    వేరొకరు ఆ పనిచేస్తే- "వాడుకున్నంతకాలం వాడుకుని వదిలేసేడ్రా."
   
    తను ప్రేమిస్తే రోమియో-
   
    అవతలివాదు ప్రేమిస్తే - వాడో రోడ్ సైడ్ రోమియో! ఇది చాలా సాధారణ సైకాలజీ.
   
    అపురూపలక్ష్మి సరిగ్గా అలాటి స్టేజిలోనే వుంది-తనేం తప్పు చేయటంలేదని డైరీలో మళ్ళీ మళ్ళీ వ్రాసుకోవటంలోనే ఆమె మానసికస్థితి అర్ధమవుతోంది. ఇప్పుడామె ఫేవరేట్ యాక్టర్ సల్మాన్ ఖాన్.
   
    ఒకరోజు కాలేజీ ఎగ్గొట్టి మాట్నీ కెళ్ళింది. ఆ రోజు బాగా బాధపడింది. ఇంటికి నెలకోసారి అయినా ఉత్తరం వ్రాయటంలేదని మరోచోట బాధపడింది.
   
    ఈ రకంగా విరుద్దభావాల ఘర్షణలో కొట్టుకుంటూన్న లక్ష్మికి మరోవైపు నుంచి ఇంకొ తాకిడి వచ్చింది.
   
    ఆ తాకిడి పేరు - 'రమణి'.
   
    రమణిమీద అభిమానంతో గౌరవంతో ఆమెనో దేవతగా పూజించుకునే లక్ష్మికి రమణి అందరూ ఆడపిల్లల్లాంటిదేనని, ఆమెలో మైనస్ పాయింట్లున్నాయని తనకు ఎదురుగా కనిపించే రూపుకాకుండా మరొక రూపు ఆమెలో వుందని గమనించేసరికి అదో పెద్దషాకే అయింది. ఆ నమ్మలేని నిజాన్ని ఆమె మనసు జీర్ణించుకోలేకపోయింది. హాలా మంది కంతే. డాక్టర్ ఫాస్టస్ లు ఎక్కడో నేలమాళిగల్లో వుండరని తమ మధ్యనే తిరుగుతున్నారని తెలీదు.
   
    నెమ్మది నెమ్మదిగా గొంగళి పురుగులా మారిన తన రూపాన్ని గమనించి తల్లడిల్లిపోయిన అపురూపలక్ష్మి తనను తాను అసహ్యించుకుంటూ, అందరూ తనను అసహ్యించుకుంటున్నారనే భయంతో వణికి పోయింది.
   
                                  *    *    *
   
    ఈ రోజు హోటల్లో రమణికూడా విస్కీ తాగింది. నన్నుకూడా రుచి చూడమని వేధించింది. నాకు భయం వేసింది. వద్దన్నాను. రమణినీ తాగవద్దన్నాను. పిచ్చిదాన్ని చూసినట్లు చూసి నవ్వింది. ఈ రోజు రాజారావు పుట్టిన రోజట. అందుకని తాగారు. ఆడవాళ్ళు తాగడం చూడడం ఇదే మొదటిసారి ఇదికూడా చరిత్ర ఫైల్లో కెక్కించమని నాన్నగారికి వ్రాయరాదూ అంటోంది మనసు. తాగినా, వాళ్ళంతా బాగానే వున్నారు. మామూలుగానే మాట్లాడారు, 'ఖరేధయిన డ్రింక్స్ కొద్దిగా రుచిచూస్తే తప్పులేదు. ఆ మాత్రం తాగితే తూలిపడిపోరు' అంది నవ్వుతూ రమణి. ఏమో నాకయితే భయమూ, దిగులూ, అసహ్యం, నామీద నాకే కోపం. నన్నర్ధం చేసుకున్నది రాయన్న ఒక్కడే. జాగ్రత్తగా తీసుకొచ్చి హాస్టల్లో వదిలాడు. నా మూడ్ బాగాలేదని వెళ్ళిపోయాడు. నాకు నిజంగా చచ్చిపోవాలని వుంది.
   
                                    *    *    *
   
    కిరణ్మయి డైరీలు చదవడం పూర్తిచేసింది.
   
    ఆమెకు ఒక్కటే అనిపించింది.

    ఈ ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు డెవరంటే, తను బ్రతుకుతున్న జీవన విదానంపట్ల అసంతృప్తి వున్నవాడు!
   
    అనూరాధ డైరీల్ని తీసుకెళ్ళి సూట్ కేసులో పెట్టేసి వస్తూండగా, కిరణ్మయి అడిగింది- "లక్ష్మి వ్రాసిన ఈ సంవత్సరం డైరీ దొరికిందా?"
   
    "క్రితం డిసెంబర్ లో వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కొత్త డైరీ ఇచ్చినట్టు నాకు చెప్పింది. కానీ ఎంత వెతికినా కనబడలేదు.
   
    "లక్ష్మి కన్య కాదని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ చెపుతోంది. నీ నుమానం ఎవరిమీద?"
   
    "ఆ విషయమే నాకు అర్ధంకావటం లేదు కిరణ్మయీ! నేను వూరువెళ్ళేవరకూ లక్ష్మి కన్యే! ఆ విషయంలో నాకు నమ్మకముంది. నేను వెళ్ళాక జరిగివుండాలి. అప్పటికి రాయన్నా లక్ష్మి నాలుగయిదు నెలల నుంచీ మంచి స్నేహితులు. అప్పటిదాకా లేనిది- పెళ్ళి సెటిల్ అయ్యాక ఎందుకు చేశాడన్నది ప్రశ్న."
   
    "ఇలాటివి చేసుకోవడానికి ముందుగానే ప్లాన్ వేసుకోనవసరం లేదు. అవకాశం రావాలి అంతే."
   
    "అవకాశమే కావాలి అనుకుంటే ఇలాంటి అవకాశాలు వాళ్ళిద్దరి మధ్యా చాలాసార్లు వచ్చాయి కిరణ్, అయినా రాయన్న శృతిమించలేదన్న సంగతి లక్ష్మి తన డైరీల్లోనే వ్రాసుకుందిగా."
   
    "ఇక ఎలాగూ తనకి పెళ్ళి అయిపోతుందని, ఒక ఛాన్సు వాడుకుని చూశాడంటావా?"
   
    కిరణ్మయికి ఈ టాపిక్ చాలా అసహ్యంగా, అనీజీగా వుంది. మాట మారుస్తూ... "పదమూడో నెంబర్ గదితాళం ఎవరిదగ్గర వుంది?" అని అడిగింది.
   
    "నా దగ్గిరే-" అంది అనూరాధ "....రజనీ ఆ గదిలోంచి వెళ్ళిపోయాక, నేను చేరానుగా."
   
    "రజని ఎందుకు ఆ గదిలోంచి వెళ్ళిపోయింది?"
   
    "తను చాలా కష్టపడి జయంతి రూమ్ కి టాన్స్ ఫర్ చేయించుకుంది. మొత్తం పలుకుబడి ఉపయోగించి వెళ్ళింది." అనూరాధ మొహంలో సన్నటి చిరునవ్వు, కిరణ్మయి కూడా అర్ధమైనట్టు నవ్వింది.
   
    "ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు కిరణ్? అయినా తాళం ఎందుకు?"
   
    "లక్ష్మి సామాన్లు ఒకసారి చూద్దామని."
   
    "ఆ డైరీలేదు. అందరం చూశాం."
   
    "దానికోసం కాదు. లక్ష్మి వాడిన వస్తువులు, పుస్తకాలు చూస్తే తన సైకాలజీ కొంత అర్ధమవుతుంది."
   
    "ఎందుకులే కిరణ్మయీ! అనవసరం. డైరీలే చెప్పలేనివి ఆ వస్తువులేం చెపుతాయి?" నిర్లిప్తంగా అంది రాధ.
   
    కిరణ్మయి ఆ అమ్మాయివైపు సాలోచనగా చూసింది.
   
    "రాధకి తానా వస్తువులు చూడటం ఇష్టంలేదా? ఎందుకు?" అనుకుంది మనసులో.
   
                                     *    *    *
   
    ఇండియా పాకిస్తాన్ జట్లమధ్య రెండవ క్రికెట్ మ్యాచ్ ఆ రోజే ప్రారంభం అయింది. చాలా ఆశ్చర్యంగా, క్లబ్ రూం ఆ రోజు అమ్మాయిల్తో కిటకిటలాడింది. అందులో చాలా మంది రాయన్నని చూడటానికి వచ్చిన వాళ్ళేనని కిరణ్మయి గ్రహించింది. ఒక పక్కన కూర్చుని అందర్నీ గమనిస్తోంది.
   
    తనే రాయన్న భార్యనని ఇప్పుడిక్కడ తెలుస్తే ఎలా వుంటుంది?
   
    తన ఆలోచన తనకే నవ్వు తెప్పించింది.
   
    .....మ్యాచ్ మొదలైన పదినిముషాలకి రాయన్న టి.వి. స్క్రీన్ మీదకి వచ్చాడు. క్లోజప్ లో చూపించారు.
   
    "అదిగో. అతనే..." ఎవరో అరిచారు. అందరూ కుతూహలంగా చూశారు.
   
    "మంచి పెర్సనాలిటీయేనే-"
   
    "ఫోటోలో కంటే మనిషింకా బావుంటాడు. నేను రెండుసార్లు చూశాను."
   
    కపిల్ బౌల్ చేస్తున్నాడు. ఇంకొక బ్యాచ్ అమ్మాయిలు వచ్చారు గదిలోకి.
   
    "అయ్యో ఆట మొదలైపోయిందా? కపిల్ బౌలింగా? రాయన్న అయితే చూసి వెళ్ళిపోదామనుకున్నానే" అందో అమ్మాయి.
   
    "ఇప్పుడే క్లోజప్ లో చూపించారు. కవర్స్ లో వున్నాడు. చూస్తూ వుండు. చూసి తరించు ఆ మోహనకారుడిని.." అన్నదో అమ్మాయి. అందరూ నవ్వేరు.
   
    కిరణ్మయి బాధగా అనుకుంది- "ఈ రాయన్న పేరేగానీ ఒక నేరస్తుడిగా పేపర్లలో రాకుండా వుండివుంటే, ఈ కామెంట్స్ అన్నీ మరోలా వుండేవి. 'రాయన్నకాదు....రావణుడులా వున్నాడే' అన్న అమ్మాయే 'భలేగా వున్నాడే' అని అనేది. 'రాయన్న కాదు రావణుడు! సినిమా పేరు బావుంది కదూ' అని జోకేసిన అమ్మాయే '..భలే ఆడుతున్నాడు కదూ" అని మెచ్చుకునేది.
   
    ఇంతలో ఒక అమ్మాయి లేచి, "ప్రముఖుల పైపై మెరుగుల్ని చూసి మోసపోకండి. ట్రింగ్.... ట్రింగ్" అంది అడ్వర్టయిజ్ మెంట్ ఇస్తున్నట్టు, అంతలో మరో అమ్మాయి నాటకీయంగా, "ఏ ప్రముఖుడి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అవకాశం దొరక్కపోతే ప్రవరాఖ్యులే సమస్తం...." అని కవిత్వం చెప్పింది.
   
    కిరణ్మయి వాళ్ళని మౌనంగా గమనిస్తోంది. ఈ మాటలన్నీ వాళ్ళ హృదయపు లోతుల్లో నుంచి వచ్చినవి కావు. ఒకరన్నారు కాబట్టి తామూ ఒక కామెంట్ చేయకపోతే, పక్కనున్న మరొకరు- "ఏమే, నువ్వేమీ మాట్లాడటం లేదంటే నీకు వాడు చేసిన పని కరెక్టయినదాన్లా కనపడుతున్నట్టుందే" అంటారేమో అని భయం. మాస్ మెంటాలిటీ వేరు మాస్ లోంచి బయటకొస్తే మనిషి మనస్తత్వం వేరు రాయన్న సెంచరీ కొట్టినప్పుడు చప్పట్లు కొట్టిన చేతులివే. విడివిడిగా మాట్లాడాల్సివస్తే అందరూ అతడితో నవ్వుతూనే మాట్లాడతారు.
   
    రాయన్న మళ్ళీ టి.వి. స్క్రీన్ మీదకి వచ్చాడు. ఎవరో అమ్మాయి అతడిని పరీక్షగా చూస్తూ అంది.
   
    "ఆ రాయన్న ఎస్.సి. అట. అపురూపలక్ష్మి వాడి ప్రేమలో ఎలా పడిందో?"

 Previous Page Next Page