Previous Page Next Page 
స్త్రీ పేజి 40

 

    "ప్రియమైన పార్వతి అక్కయ్య కు,
    ఈ మధ్య నువ్వు బొత్తిగా ఉత్తరాలు వ్రాయడం లేదేం? నా మీద కోపం గాని రాలేదు కదా? అప్పుడెప్పుడో కొన్ని నెలల క్రిందట అక్కయ్య కనిపించిందని వ్రాసిన ఉత్తరం తర్వాత మళ్ళా అంత విపులంగా మంచి విశేషాలతో వ్రాయనే లేదు.దానికి జవాబు కూడా వ్రాశాను కదూ?
    'అమ్మా, అక్కయ్య కనిపించిందని పార్వతి వ్రాసిందే! ఇప్పుడు అక్కయ్య కు .....' అని చెప్పబోతుంటే--
    "ఛీ! నోరుముయ్యి! దాని మాట నా దగ్గరెందుకు తెస్తావ్, బుద్ది లేనిదానా' అంటూ కసిరేసిన అమ్మ మరి కాస్సేపటికి అడిగేసింది-- 'ఊ, ఏమైంది అక్కయ్య కి? చెప్పేదేదో పూర్తిగాచేప్పి తగలడరాదూ?' అని.
    "మూడో నెల కడుపని....'
    'శివశివా!' అంటూ చెవులు మూసుకున్న అమ్మ ఎన్నోసార్లు తనలో తను రహస్యంగా మాట్లాడుకోవటం విన్నాను, పార్వతీ, 'అది ఎలా తిరుగుతుందో ఏమో? నెలలు నిండి ఉంటాయి. తోలి చూలు. ప్రసవించి ఉంటుంది? అబ్బే, అప్పుడే కాదు. మరో మాసం పొతే గానీ తొమ్మిది నిండవు. దానికేం? మహారాణీ! డాక్టరమ్మ చదువు వెలగ బెట్టిందిగా?నెప్పులు పడకుండానే కంటుంది. ఊ ఖర్మ! కాకపోతే ఏమిటి?' ఇలా పిచ్చి పిచ్చిగా మాటకూ మాటకూ పొంతన లేకుండా మాట్లాడు కొంటూ ఉంటుంది. నిజంగా ఆ పరిస్థితులో అమ్మను చూస్తుంటే ఎంత జాలి వేస్తుందనుకున్నావు, పారూ! కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతాయి. ఏది ఏమైనా అమ్మ మనస్సు కొంచెం మారిందేమో అనిపిస్తుంది నాకు.
    'అమ్మా! సుజా! పార్వతే మైనా ఉత్తరాలు వ్రాస్తోందే?" అంటుంటుంది. అకస్మాత్తుగా గుర్తు వచ్చినట్టు. నువ్వు ఉత్తరం వ్రాస్తే అక్కయ్య కబుర్లేవేవో ఉంటాయన్న ఆశ కావచ్చు.
    "ఇవ్వాళ నేనే వ్రాస్తున్నానమ్మా!" అంటూ ప్రారంభించానీ ఉత్తరం నీకు.
`    అక్కయ్యా! నీకేన్నో విషయాలు వ్రాయాలని ఉంది. ఎన్నో సంగతులు చెప్పాలని ఉంది. మరెన్నో కబుర్లు అడగాలని ఉంది. ఏమిటిలా పిచ్చిపిచ్చిగా వ్రాస్తూందనుకోకు. ఇప్పుడు అక్కయ్య గురించి ఆలోచిస్తుంటే పాపం! అక్కయ్య ఏమంత ఘోరమైన తప్పు చెప్పాలేదేమో అనిపిస్తుంది. అక్కయ్యను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాననీ , నీతో కూడా వితండంగా వాదించాననీ, మనిషి మనస్సు కు లొంగి పోతాడన్నది చాలా వరకు నిజమే కావచ్చు ననీ తెలిసి వస్తుందిప్పుడిప్పుడు. నిజమే! మనిషికి కావలసిందేదో పొందలేనప్పుడు , జీవితమంతా దుఃఖ పూరితమై బాధ పడవలసి వచ్చినప్పుడు ఈ సంఘాలకూ, నియమాలకూ అర్ధమేమిటి? క్షణికమైన ఈ జీవితాలూ సుఖ పడటానికి కాకపొతే ఎందుకిన్ని బంధాలు?
    పుట్టిన ప్రతి వ్యక్తీ మరణిస్తాడు. ఆ మరణం అందరికీ సమానమైనా ఆ చివరి దశలో , ఆ మరణవస్థలో ఓ వ్యక్తీ కి మరో వ్యక్తికీ కంటి కదలికలలో ఎంత విభేదముంటుందో కదా? ఆ కను కొలకులతో నిలిచేవి ఆనంద భాష్పాలు కావచ్చు: దుఃఖ శ్రవులూ కావచ్చు. జీవితం ప్రసాదించిన అనుభూతులన్నీ ఆ చివరి చూపులో ప్రతి బింబం కావచ్చు. ఆ ఒక్క చూపైనా తేజోమాయం కావాలంటే, ఆ చివరి క్షణం లో నైనా సంతృప్తి నిండాలంటే, ఆ జీవితంలో మధురాతి మధురమైన అనుభూతు లెన్ని కావాలో గదా? చివరికి ఏది శాశ్వతం? ఏదీ కాకపోవచ్చు. మరి ఎందుకిన్ని పట్టింపులు? మనిషీకి, మనిషికీ ఎందుకిన్ని అంతరాలు? ఏ మనిషి ఏం కోరుకుంటాడో , ఏ మనస్సు దేన్నీ వాంచిస్తుందో? అన్నిటికీ ఒకే బంధం ఎలా? ఎమిటంత అయోమయంగా వ్రాస్తుందనుకుంటున్నావా? ఈఆలోచన లేమిటో నాకే అర్ధం కావడం లేదు. ఏ సంగతి విన్నా విమర్శించ బుద్ది వేస్తుంది. ఏకబురు విన్నా వాదించాలని పిస్తుంది.
    అక్కయ్య నెంతో మెచ్చుకోవాలని పిస్తుంది. ఇదంతా ఏమిటో నాకే అర్ధం కావడం లేదు.
    ఏమైనా పెళ్ళి సంబంధాలు  వస్తున్నాయా అని వ్రాశావూ. ఎందుకు రావటం లేదు? రాకపోయినా తీసుకొస్తున్నారు. వచ్చినవి వచ్చినట్టే వెళ్లనూ వెళ్ళుతున్నాయి. తన పెళ్ళయింది మొదలు గుమ్మం తొక్కని అక్కయ్య ఈ యింటి నెలా అనాచారం చేసిందీ అర్ధం కావటం లేదు నాకు. అన్నయ్య కిదో సమస్యే అయింది.పెద్ద పిల్ల అప్రదిష్ట పాలు చేసిన ఈ కుటుంబం లో చిన్న పిల్లకు పెళ్ళేలా చెయ్యగలడు తను? అమ్మకిదో ఆవేదనగా చుట్టుకొంది. చిన్నదాని కైనా లక్షణంగా పెళ్ళి చెయ్య లేక పోతామా ఏమిటీ? అన్న ఆలోచనే! రానురానూ ప్రశాంతత అనే మాటంటూ ఒకటి ఉందన్న జ్ఞాపకం కూడా పోవచ్చును నాకు.
    ఏదో వ్రాయాలని ప్రారంభించి మరేదో వ్రాశాను. అసలీ ఉత్తరానికీ అర్ధం పర్ధం లేదు. చదువుకుని మర్చిపో. నీకు వీలుంటే ఒక్క సారి వచ్చి వెళ్ళు. నీకోసం ఎదురు చూస్తాను.

                                                                                            నీ సుజా."
    ఉత్తరానికి అర్ధం ఉంటె అదేమిటో మాత్రం అర్ధం కాలేదు పార్వతికి. సుజా ఎప్పుడూ ఇంత చిత్రంగా వ్రాయలేదు. అక్కగారిని అతి తీవ్రంగా విమర్శించిన సుజాత ఇంత మారిందంటే కారణం ఏమై ఉంటుంది? తల్లి మార్పుకి బిడ్డ మీద ప్రేమ సహజం కావచ్చు. కాని, సుజా... సుజా.....
    ఏమీ బోధ పడలేదు పార్వతికి.
    తర్వాత వారంలో రామం దగ్గరి నుంచి కూడా ఓ ఉత్తరం వచ్చింది. "బాబుకు జ్వరం వస్తుంది. మా అమ్మ ఒంట్లో కూడా ఏమంత కులాసాగా లేదు. రుక్కు ఒక్కతీ ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి నువ్వు వచ్చి వెళ్తే బావుటుంది , వదినా!"
    పార్వతికి వెంటనే వెళ్ళాలని బుద్ది పుట్టింది.

 Previous Page Next Page