"నీకు నాయుడి గురించి తెలుసా?" అన్నది శకుంతల.
"ఫిరంగిపురంలో ఉంటూ నాయుడి గురించి తెలియకుండా ఉంటానా?"
"ఒకప్పుడు నేనూ-నువ్వు గోపీని నమ్మినంతగా నాయుడిని నమ్మాను."
"నిజంగా?" అన్నది విశాల ఆశ్చర్యంగా.
"అందులో ఆశ్చర్యమేమీలేదు. ప్రేమలోపడ్డ ఆడదానికి ప్రియుడెంతో ఉన్నతుడనీ, అందరు మగవాళ్ళలాంటి వాడూ కాదనీ అనిపిస్తుంది-"
"తర్వాత....?"
"మా అమ్మ నా చెల్లికి-నీ అక్కనదిలో మునిగిపోయి చనిపోయిందని చెప్పింది-" అన్నది శకుంతల.
విశాల అనుమానంగా-"అంటే?" అన్నది.
"ఏమేమో ఊహించుకోకు. ఈ ప్రపంచంలో మగాణ్ణి గుడ్డిగా నమ్మిన ప్రతి ఆడదాని కథా ఒక్కలాగే ఉంటుంది. ప్రస్తుతానికి నేను సెలవు తీసుకుంటాను-" అన్నది శకుంతల.
"అక్కా! అతడిని నేను నమ్మినమాట నిజం. కానీ మా పెళ్ళి మాత్రం అమ్మ ఆశీర్వాదంతోనే జరుగుతుంది. అంతవరకూ మేము వేరుగానే ఉంటున్నాం........"
శకుంతల విశాల తలనిమిరి-"బంగారు తల్లివి. నాకు అక్కవు కావలసినంత బుద్ధి ఉన్నది నీకు. నీ ప్రియుడినేలాగో త్వరగా ఈ ఊర్నించి తప్పించు. అమ్మకు చెప్పి పెళ్ళిచేసుకో. డబ్బు గురించి బెంగ పడకు. అన్ని విధాలా నీకు నేను సాయపడగలను-" అన్నది.
"నీకు నేనంటే అప్పుడే ఇంత అభిమానం ఏర్పడిందా?" ఆశ్చర్యంగా అన్నది విశాల.
శకుంతల నవ్వి- "అక్కా అని పిలిపించుకుంటే చాలదు. ఆ పిలుపుకు న్యాయంకూడా చేకూర్చాలి కదా-" అన్నది.
ఈలోగా గోపీ అక్కడకు వచ్చి-"మీ అక్కాచెల్లెళ్ల సంభాషణ ఇంకా పూర్తి కాలేదా?" అన్నాడు.
"అయిపోయింది. నేను వెడుతున్నాను" అని శకుంతల వెళ్ళిపోయింది.
22
శకుంతల అండ చూసుకుని విశాల గోపీని వేధించసాగింది-త్వరగా ఫిరంగిపురం వదిలిపోదామని! గోపీ ఆమెనేలాగో సముదాయించుకుని వస్తున్నాడు. తను ఫిఒరమ్గిపురమ్ ఎందుకు వచ్చాడో అతడామెకు చెప్పదల్చుకోలేదు.
చౌదరి గోపీకి ఒకొక్కటే తన రహస్యాలన్నీ తెలియజెపుతున్నాడు. అందుకు గోపీ ఆశ్చర్యపడితే-"నాకు నాయుడి ప్రళయనాదం వినబడుతున్నది. కొంతకాలంగా వాడు చాలా నిశ్శబ్దంగానూ, ప్రశాంతంగానూ ఉంటున్నాడు. అది రానున్న తుఫానును సూచిస్తుంది. వాడికి నా స్థావరాలన్నీ తెలుసు. నన్ను అంతం చేయడానికి చాలాగట్టి ప్రయత్నాలు చేస్తాడు. అందులో సందేహంలేదు. అందుకే నాయుడికి తెలియని విశేషాలు నీకు చెబుతున్నాను. నీకేమైనా జరిగినాకూడా నువ్వు చౌదరి పేరు నిలబెట్టాలి-" అని వివరించాడు.
"నీకూ నాయుడి వివరాలన్నీ తెలుసా?" అనడిగాడు గోపీ.
"నాయుడు నాతో పనిచేసి విడిపోయిన వాడు. వాడికి నాగురించి చాలా హేలుసు. వాడి గురించి నాకు మరీ ఎక్కువతెలియదు. వాడినెలా అంతం చేయాలో నాకు తెలుసు. కానీ వాడి స్థావరాల గురించి నాకు సరైన సమాచారం తెలియదు. నేను వినడం ఏమిటంటే-ఈ ఊరంతా మిలటరీతో నిండిపోయినా-నాయుడొక్కడూ రహస్యంగా తప్పించుకుని పోగలడని....ఆ నాయుడిప్పుడు నామీద తీవ్రంగా పగబట్టి ఉన్నాడు...." అన్నాడు చౌదరి.
నాయుడు చౌదరిమీద పగబట్టిన మాట నిజం. నాయుడు సాధారణంగా తన అనుచరులను హత్యకు పురిగొల్పాడు పేరు పొందిన గూండాల నందుకువినియోగించి అటుపైనవారిని చంపేసి ఏ వివరాలూ దొరక్కుండా చేస్తాడు. కానీ గోపీ విషయంలో ఏదారీ తోచక చందూనే హత్యకు వియోగించాడు. గోపీని చంపేక-చందూని బ్రతకనివ్వడం తనకు మంచిది కాదనుకున్నాడు. కానీ ఆ విషయంలో అటూ చందూ, ఇటు నాయుడు కూడా మోసపోయారు. గోపీ నిక్షేపంలా బ్రతికి ఉన్నాడు. అటు చందూ కూడా నాయుడికి లేకుండా పోయాడు. గోపీ చేతిలో రెండుసార్లు దెబ్బతిన్న చందూతో తనకింత అవసరం తీరిపోయిందని నాయుడు భావిస్తున్నాడు. కానీ ఇంత తెలివి తక్కువగా చందూని త్యాగం చేయడం-నాయుడి అభిమతంకాదు.
నాయుడికిప్పుడు ఒక్కటే దారి కనిపిస్తున్నది. అది మెరుపుదాడి! చౌదరి ఊహించనైనా ఊహించలేడు తనలా దాడి చేయగలడని!
నాయుడిలో ఈ ఆలోచన ప్రవేశపెట్ట గలిగినవాడు ఎడ్వర్డ్.
ఎడ్వర్డ్ గోపీ మనిషి. గోపీ కారణంగా చౌదరి ముఠాలో చేరాడు. గోపీ కారణంగానే చౌదరి అతడిని పూర్తిగా నమ్మాడు. ఈ ఎడ్వర్డ్ ఎప్పటికప్పుడు చౌదరి గురించిన సమాచారాన్ని నాయుడికందించి-అతడి మెప్పుపొందాడు. క్రమంగా నాయుడికి ఎడ్వర్డ్ మీద గురికుదిరింది. చౌదరిపై ఎప్పుడు ఎలా మెరుపుదాడి చేయాలో ఎడ్వర్డ్ వివరంగా నాయుడికి సూచించాడు.
"నువ్వు చెప్పినట్లు జరిగిందీ-సరే! ఇందులో మోసమున్నదంటే-నువ్వేకాదు-ఈ ఫిరంగిపురమే సర్వనాశనం కాగలదు-" అని నాయుడు ఎడ్వర్డ్ ని హెచ్చరించాడు. ఎడ్వర్డ్ నవ్వి ఊరుకున్నాడు.
ఎడ్వర్డ్ నాయకత్వంలోనే నాయుడి ముఠా చౌదరి ముఠాపై మెరుపుదాడి జరిపింది. అందుకు గోపీ అన్ని విధాలా అనుకూల పరిస్థితులు సృష్టించాడు. సమయానికి తనురంగంలో లేకుండా తప్పుకున్నాడు.
అప్పుడు చౌదరి తన అనుచరులతో కొలువుతీరి ఉన్నాడు. పోరాటానికి సిద్డంగాలేడు. గోపీ తనను పంపాడంటూ ఎడ్వర్డు అక్కడ ప్రవేశించాడు. అతడి వెనుకనే అతడి మనుషులూ ప్రవేశించారు.
చౌదరిలో అనుమానం అణుమాత్రంకూడాలేదు. గోపీని అతడి మనుషులను పూర్తిగా నమ్మాడు చౌదరి.
ఉన్నట్లుండి ఎడ్వర్డు, అతడి మనుషులు పిస్తోళ్ళు తీశారు.
క్షణంలో ఆప్రాంతం రణరంగంలా మారిపోయింది. చౌదరి మనుషులు చాలామంది మరణించారు. చౌదరి శరీరం తూటాలతో చిల్లులు పడిపోయింది. అతడి జీవితం చాలా మామూలుగా అంతమయింది.