Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 40

   

        కొంచెంసేపు మామూలుగా మాట్లాడాక జయంతివైపు తిరిగి "అవునూ ఈ గదిలో ఇద్దరేగా వుండాలి. మూడో మంచం ఎక్కడనుంచి వచ్చింది?" అని అడిగింది. అప్పుడే నాకు అర్ధం అయింది. జయంతిది ఈ రూమ్ కాదని?
   
    జయంతి మొహం వాడిపోయింది. రజని ఏదో నసిగింది. ఈ గదిలో ఇద్దరే వుండాలన్న అనుమానం నా కింతకాలం రానేలేదు? ఎంత మోసం చేశారో.....ఇప్పుడు ఇద్దరూ అలా చేతులు నులుముకుంటూ కూర్చుంటే నకు భలే సంతోషంగా అనిపించింది. 'ఇద్దరూ ఒకే మంచంమీద పడుకుంటారు' అని నోటి చివరివరకూ వహ్చిన మాటల్ని కష్టంమీద ఆపుకున్నాను.
   
    రాత్రే జయంతి గది ఖాళీచేసి వెళ్ళిపోయింది.
   
                                              *    *    *
   
    జయంతి వెళ్ళాక రజని నాతో కాస్త బాగానే వుంటోంది. కానే తనెప్పుడూ రూమ్ లో గడపదు.
   
    ఒక్కదాన్నే
   
    సాయంత్రంపూట బాగా కాలక్షేపం అవుతుంది. కిటికీ తెరిచి కూర్చుంటే బయట తోట. అబ్బాయిలూ.... అమ్మాయిలూ....
   
    చెట్ల వెనక, పొదల మాటున, స్కోటర్ల సీట్లమీద కూర్చొని, గంటల తరబడి ఏం మాట్లాడుకుంటారబ్బా వీళ్ళు? ఒకటి మాత్రం నిజం అందరూ నవ్వుతూనే వుంటారు. ఆ మాట్లాడుకుంటున్నంతసేపూ చిన్న చిన్న రాళ్ళతో కొట్టుకుంటూ వుంటారు. నాతోపాటు జేరిన జూనియర్స్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరికీ ఇంటిమీద బెంగపోయినట్టుంది.
   
    నేనేం చెయ్యను!
   
    నాకు అమ్మ గుర్తొస్తుంది.
   
                                  *    *    *
   
    ఈరోజు అమ్మ పుట్టినరోజు, ముందుగానే గ్రీటింగ్ వేసి పంపాను.
   
    పుట్టినరోజు నాడు అమ్మని మేం వంటింట్లోకి రానిచ్చేవాళ్ళంకాదు. పిండి నేనే రుబ్బేదాన్ని....నేనంత మిస్ అవుతున్నానో తల్చుకుంటేనే ఏడుపొస్తుంది. ఎలా కనిపెట్టిందో రమణి వచ్చి అడిగింది. "దానికేం? మనమూ సెలబ్రేట్ చేసుకుంటే పోలా?" అంటూ బయలుదేరతీసింది.
   
    హోటల్ కెళ్ళాం, చాలా ఖరీదైన హోటల్ లా వుంది. లోపల చాలా చల్లగా వుంది. అక్కడ ఎలా బిహేవ్ చెయ్యాల్లో, ఎలా తినాలో అన్నీ నెమ్మదిగా వివరించి చెప్పింది. మూడొందలు బిల్ అయింది. మూ....డొం....ద...లు
   
    మొట్టమొదటిసారి అంత పెద్ద హోటల్ కి వెళ్ళటం.
   
                               *    *    *

   
    కిరణ్మయి మరికొన్ని పేజీలు తిరగేసింది. అంతా రమణి గురించే వుంది. ఆ స్నేహానికి కరిగిపోతూ పేజీలకు పేజీలు వ్రాసుకుంది.
   
    మధ్యలో వాళ్ళ తాతగారు పోయారు. ఆమె బాధపడుతుందని వెంటనే తెలియబర్చలేదు. ఆ రోజే వాళ్ళ నాన్నగారొచ్చి ఆ వార్త చెప్పి వెళ్ళారు.
   
    ఆ రోజంతా ఆమె ఏడుస్తూనే వుంది. రమణి ఓదార్చి, సినిమాకి తీసుకెళ్ళింది.
   
    హాల్ దగ్గిర మరొ ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు కలిసారు.
   
    అక్కడే రమణి విజయ కుమార్ ని పరిచయం చేసింది. సినిమా అయ్యాక డిన్నర్ అన్నారు.
   
    అందరూ హోటల్ కి వెళ్ళారు.
   
    విజయ కుమార్ లాటి క్రికెటర్ తో కలిసి భోజనం చేయటం చాలా థ్రిల్లింగ్ గా వుంది. అతడు గొప్ప ఆటగాడు కాకపోయినా, రంజీప్లేయర్ కదా! తమ్ముడు ఆ టైములో వుంటే ఎంత సంతోషించేవాడో- అని వ్రాసుకుంది.
   
    రాజారావుతో పరిచయం అయింది కూడా అప్పుడే.
   
    కొత్త కొత్త పరిచయాలు.... కొత్త ప్రపంచం చాలా చి....త్రం....గా.....
   
    తాతయ్య మరణం గురించి ఎక్కువలేదు ఆ పేజీలో.
   
    కిరణ్మయి పుస్తకం మూసేసి ఆలోచనలో పడింది. రాయన్న ఇంకా పిక్చర్ లోకి రాలేదు. ఈ లోపులో మిగతా పేజీలు చదువుతూంటే లక్ష్మి గురించి పూర్తిగా తెలిసిపోయిందామెకు.
   
    పదిహేడేళ్ళ అమ్మాయి! ఆత్మీయత నిండిన కుటుంబంలో అపురూపంగా పెరిగింది. అమాయకమైన వాతావరణానికి అలవాటుపడిన ఆమె జీవితంలో ప్రతీ చిన్న సంఘటన కూడా తనవాళ్ళతో దట్టమైన పొదరిల్లులా ల్లుకుపోయింది.
   
    ఆ టైమ్ లో హాస్టల్ కొచ్చింది.
   
    నడి సముద్రంలో నావలాగా అయింది ఆమె పరిస్థితి. కిటికీ తెరిస్తే ఆహ్వానిస్తూ కొత్త ప్రపంచం?
   
    వంటరితనంతో కృంగిపోయిన ఆమెకు, తనకుతాను ధైర్యం చెప్పుకోగల వ్యక్తిత్వం కూడా లేదు.
   
    ఆ టైమ్ లో రమణితో పరిచయం-ముందు కేవలం ధైర్యంకోసం.....తరువాత రమణివల్ల మరిన్ని పరిచయాలు- మెస్ లో మంచి భోజనం- సాటి హాస్టల్ మేట్స్ కళ్ళలో భయంతో కూడిన గౌరవం-ఖరీదైన కొత్త ప్రపంచం - ఎదిగిపోయానన్న భావం-ఇంటిమీద తగ్గిన బెంగ-ఇంతకాలం జీవితంలో ఎంత మిస్ చేసుకున్నానన్న దిగులు - ఇంకా ఏదో అనుభవించాలన్న కసి.....కూపస్థంనుంచి పై కెదిగిన మండూకం...
   
    ఇప్పుడు అపురూపలక్ష్మికి ప్రపంచం ఆనందమయంగా కనిపిస్తోంది.
   
    రమణి 'ఐడియల్ షి' అయింది.
   
    రోజులు వేగంగా గడిచిపోతున్నాయి.
   
    సరిగ్గా ఆ టైములోనే పరిచయం అయ్యాడు రాయన్న.
   
                                                                      *    *    *
   
    తన భర్త గురించిన ప్రసక్తి డైరీలో రాగానే కిరణ్మయి నిటారుగా అయి, జాగ్రత్తగా చదవటం ప్రారంభించింది.
   
                                    *    *    *
   
    ఈ రోజు క్రికెట్ మ్యాచ్ కి తీసుకెళ్ళింది రమణి. విజయ కుమార్ ప్యాసులిచ్చాడట. అతనే వచ్చి వి.ఐ.పి. స్టాండ్ లో కూర్చోపెట్టి వెళ్ళాడు. రంజీట్రోఫీ మ్యాచ్ చూడాలన్న ఎన్నో ఏళ్ళ కోరిక ఈ రోజు నెరవేరబోతూంది.
   
    ఈ రోజు మ్యాచ్ లో రాయన్న వున్నాడట! రాయన్నని చూడబోతున్నానంటే చాలా ఎగ్జయిటింగ్ గా వుంది. ఆర్నెల్ల క్రితం నేనూ తమ్ముడూ టీ.వీ.లో చూసి ఇతనో గొప్ప ప్లేయర్ అవుతాడనుకున్నాం.
   
    నిజంగా ఈ రోజు రాయన్న చాలా బాగా ఆడాడు.
   
    నా ఫేవరేట్ అయిపోయాడు. వెళ్ళి ఆటోగ్రాఫు అడిగి తీసుకున్నాను. పెన్ను జేబులో పెట్టేసుకున్నాడు. అడిగితే, అభిమానంగా చూశాడు. తాతయ్య చివరి కనుక అని చెప్పాను. జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. ఈ రోజుని నా చరిత్ర ఫైల్లో నోట్ చేయమని నాన్నగారికి చెప్పాలి.
   
                                      *    *    *
   
    అనుకుంటున్నానేగానీ ఇవన్నీ నాన్నగారిక్జి చెప్పగలనా? నేను తప్పు చేయటంలేదుగానీ నాన్నగారు ఇవన్నీ తప్పుగా భావిస్తే!
   
    నేనిలా హోటళ్ళకూ క్రికెట్ మ్యాచ్ లకూ తిరుగుతున్నానని తెలిస్తే ఆయన బాధపడతారు. కాబట్టి చెప్పకపోవటమే మంచిది.
   
    డైరీలో కూడా ఇకనుంచీ ఇవన్నీ వ్రాయకూడదు. ఇంట్లో ఎవరైనా చదివితే బావోదు.
   
                                      *    *    *
   
    కిరణ్మయి చదవటం ఆపుచేసింది. సాలోచనగా కళ్ళు మూసుకుంది.
   
    తనవాళ్ళు లేకుండా తను లేననే (ఒకప్పటి) భావంనుంచి, తన వాళ్ళకు తెలియకుండా రహస్యాలు దాచుకునే స్థితికి అపురూపలక్ష్మి ఎదగటం(?) ఆ డైరీలో స్పష్టంగా తెలుస్తోంది.
   
    అమాయకత్వపు లార్వాదశనుంచి బయటపడ్డ గొంగళి పురుగులాటి యవ్వనదశ స్టేజినుంచి నెమ్మది నెమ్మదిగా సీతాకోకచిలుకలు, రకరకాల అనుభవాలు రుచిచూసి- ఆపై పరిపూర్ణత్వం సిద్ధించేకాలం!
   
    ఏ ఆడపిల్లకయినా తప్పదేమో!
   
    ఆ తరువాత పేజీల్లో అపురూపలక్ష్మి తనలో కలిగే మానసిక సంచలనం, పరస్పర విరుద్దభావాల ఘర్షణ గురించి వ్రాసుకుంది.
   
    కన్ ఫ్యూజన్!
   
    ఆ వయసులో వుండే కన్ ఫ్యూజన్ ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది!!
   
    మొగవాడికి సిగరెట్ అలవాటు అయ్యే వయస్సు ఆడపిల్లకి ప్రపంచమంతా ప్రేమమయంతో మంచితనంగా కనిపించే వయస్సు ఒకటే.
   
    మొగవాడికి సిగరెట్ అలవాటయితే ఊపిరితిత్తులకి దెబ్బ. ఆడపిల్లకి ప్రేమ అలవాటయితే మనసుకి దెబ్బ.
   
    అయితే ఈ నీతివాక్యాలన్నీ కేవలం చదువుకోవడంవరకే. ఈ ప్రపంచంలో యెవరూ ఇవి తమకోసమే అనుకోరు. తమ ప్రేమ గొప్పది. మిగతావాళ్ళ ప్రేమల్లాకాదు. ఒక కుర్రాడికి తమ ప్రేమ ఫలించక వేరొకర్ని చేసుకోవల్సి వస్తే -'అదొక మరపురాని గత జీవితపు అనుభవం'.

 Previous Page Next Page