ఎదురుగా గుబురుగా పెరిగిన పొదలు, ఆ వెనక వున్న సింధూర వృక్షాలు పులి వెళ్ళటానికి అనువైన ప్రదేశాలుగా గుర్తించిన సింగ్ మరో ఆలోచన లేకుండా ముళ్ళకంచెల మధ్యగా పొదల్ని చేరుకున్నాడు .అతని దృష్టిని ఆకర్షిస్తూ నేలపై పడి వున్న ఓ కొమ్మ__దానికి చిక్కుకుని చీరపేలిక కనిపించింది.
పరిసరాన్ని ఏకాగ్రతగా గమనిస్తూ అక్కడకి చేరుకున్నాడు. సాయంకాలపు నీరెండలో పొడల్లా నేలపై వ్యాపించి నీడలు, వణుకుతున్న చేతుల్తో చీరపేలికని అందుకున్నాడు. రక్తంతో తడిసి వుంది.
స్మశాన స్థబ్దతను మించిన నీరసం!
రివ్వున వీస్తున్న గాలికి పొదలు పాము పడగల్లా తల లాడిస్తున్నాయి.
పొదలను దాటి బయటికి వస్తే తను పులి కంట పడవచ్చు. ఒకవేళ ఆ సమీపంలోనే అది మాటువేసి వుంటే ఏ పక్క నుంచైనా తనపై ఛార్జిచేసే ప్రయత్నం చేయొచ్చు.
ముందుకు వెళ్ళాలా, వద్దా అన్న సందిగ్ధత!
పాదాల క్రింద ఒక్క ఎండుటాకు చిటుక్కుమన్నా సునాయాసంగా గ్రహిస్తుంది పులి. పైగా అది మేనీటర్. వేటలో అపారమైన అనుభవం గల సింగ్ కు తెలీంది కాదు_మేనీటర్సును ఎంత అప్రమత్తంగా ఎదుర్కోవలసిందీను!
వేగం, ఒడుపు, ఏకాగ్రతలనే ఆయుధాలతో ప్రతిక్షణమూతనను తాను కాపాడుకోగలిగితే తప్ప పులిని_ అందునా మనిషి మాంసానికి అలవాటుపడ్డ పులిని_ఢీ కొట్టడం సాధ్యం కాని పని.
చలికాలం కావటంతో సూర్యుడు త్వరితగతిని పశ్చిమాద్రికి జారిపోతున్నాడు. మునివేళ్ళపై నక్కికూచోవడంతో పాదాలు నొప్పిపుడుతుంటే సదుచేయకుండా మరి కాస్త ముందుకు నడిచాడు.
చెవులు రిక్కించి, దృష్టిని నిశితంగా సారిస్తూ గుబురుగా పెరిగిన చెట్లమధ్యకు చూశాడు. ఒకవేళ ఆ ప్రాంతంలోనే పులి శవాన్ని తినడం మొదలుపెడితే ఎముకలు విరుగుతున్న చప్పుడు వినిపించాలి.
ఏ అలికిడీ లేకపోవడంతో, దైర్యాన్ని కూడగట్టుకుని ఖాళీ ప్రదేశంలోకి వచ్చి వేగంగా ఓ సింధూర వృక్షాన్ని ఆనుకుని నిలబడ్డాడు.
ఏ క్షణాన ఎటువంటి పరిణామాన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా రైఫిల్ సేప్టీ కాచ్ ను ముందుకు జరిపి ట్రిగ్గర్ గార్డు దగ్గర వేలినుంచాడు.
పక్కనే పొదల్లో ఏదో చప్పుడు కావడంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు.
రేస్ బెర్రీ తీగలపై పికిలిపిట్ట రెక్కలు కొట్టుకుంటోంది. రిలాక్సింగ్ గా నిట్టూర్చాడు. అంత టెన్షన్ లో కూడా!
వేటగాళ్ళ యుక్తులకు అలవాటుపడ్డ మేనీటర్ వాళ్ళను మించి కుయుక్తుల్ని ప్రదర్శిస్తుంది. పులి జాడని గుర్తించాలని ప్రయత్నిస్తున్న ప్రత్యర్థిని దెబ్బ తీయాలనుకున్నపుడు తన పాదాల క్రిందని మెత్తని భాగాన్ని కుషనింగ్ గా ఉపయోగించుకుంటూ సద్దుచేయకుండా నడుస్తుంది. ముందు పాదాల్ని ఉంచిన స్థానంలోనే వెనక పాదాల్ని సైతం ఉంచుతూ క్రమంగా శతృవును సమీపిస్తుంది. సుమారు తొమ్మిది నుంచీ పది అడుగుల పొడవుండే పులి ప్రత్యర్ధిపై ఛార్జిచేయడానికి అనుకూలమైన దూరాన్ని చేరేవరకూ గుర్రుమన్న శబ్దాన్ని సైతం చేయదు. ఆ తర్వాత పైకి లంఘింస్తూ పులి గాండ్రించడంతో ప్రత్యర్ధి గుండె ఆగినంతపనై కర్మేంద్రియాలన్నీ చచ్చుపడిపోతాయి. నిస్సత్తువగా పులికి ఆహారమైపోతాడు.
మసక వెలుతురులో పరిసరాలను గమనిస్తున్న నట్వర్ సింగ్ దృష్టి సుమారు పది గజాల దూరాన సిరీస్ చెట్టుమొదట్లో నేలకొరిగిన తుప్పలపై పడింది. పులివంటి భారీ మృగం నడిచినపుడు దాని పడఘర్పున్ని సూచించే సంకేతాలవి.
రెండు అంగల్లో సిరీస్ చెట్టు ఆవలి భాగాన చేరుకోబోయిన నట్వర్ సింగ్ ఏదో తన్నుకుని తూలి పడబోయాడు.
అదురుతున్న గుండెతో క్రిందికి చూసేసరికి__
పులి పంజా వేటుకి పగిలిన బొమ్మలా పీలికలై కసిగా కబళించిన మృత్యువును ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్న యువతి.
నారమ్మ శవంపై పడి వున్న ఆకుల్ని, పొదల్ని పక్కకు జరిపి ఆపాదమస్తకం పరిశీలించాడు.
కంఠం నుంచి కుడి వక్షం వరకూ అప్పటికే మాంసాన్ని తిని వేసిన పులి_మిగతా కళేబరం మరే జంతువుకీ కనిపించకుండా జాగ్రత్త పడిందంటే మళ్ళీ సాధ్యమైనంత త్వరలో వస్తుందన్నమాట. సమీపంలో పులి సెలయేటి దిక్కుగా వెళ్ళిన సూచనగా పాదాల గుర్తులు.
ఆలోచించాడు.
పులి తిరిగి వచ్చేసరికి శవానికి అందుబాటులో వున్న ఓ చెట్టుపై మంచె (కూర్చోడానికి చెట్టు కొమ్మలపై ఏర్పాటుచేసే ప్లాటు ఫారం) తయారు చేయించాలి _అదీ తుపాకి రేంజ్ కు మించినంత దూరంలో సమీపంలోని సింధూరపు చెట్లు ఎత్తుగా వున్నాయి. నలభై అడుగుల యెత్తున ఉన్న కొమ్మలపై మంచె ఏర్పాటున్నది కష్టంతో కూడినపని. పైగా అప్పటికే చీకటి ముసురుకుంటూ ఉండటంతో గ్రామస్థుల సహాయంతో మంచెను ఏర్పాటు చేసుకునే వ్యవధి లేదు .ఈలోగా మనుభుల అలికిడి గమనిస్తే సూక్ష్మబుద్ధిగల మేనీటర్ శవాన్ని సైతం సమీపించకుండా జాగ్రత్త పడుతుంది.
అవకాశాన్ని వెంటనే సద్వినియోగ పరచుకోవాలంటే మంచె లేకుండానే సరాసరి చెట్టుపయినే కూచోవాలి.
ఎన్నోసార్లు విఫలుడైన తను ఎంత రాత్రయినా మాటువేసి అటు అటవీశాఖకి, ఇటు పల్లె ప్రజలకి సమస్యగా మారిన మేనీటర్ ను అంతం చేయాలి. చాలా దృడంగా నిర్ణయించుకున్నాడు.
హఠాత్తుగా గుర్తుకొచ్చింది_టార్చ్ తను తేవటం మరిచిన విషయం. అతడు నిజానికి బయలుదేరింది మృతకళేబరాన్ని, పులి వున్న పరిసరాలను ట్రాక్ చేయాలని తప్ప మాటువేయాలని కాదు.
అసలే చీకటి రాత్రులు!
గుబురుగా పెరిగిన చెట్లు నక్షత్రాలు వెలుగును సైతం నేలపైకి జారనివ్వని కాళరాత్రిలో పులి రాకను గుర్తించడం కష్టం.
అనుమానం కలగగానే టార్చి వెలిగించడం, కాంతికిరణాల వెలుగులో పులి తొట్రుపడి నిలబడి ఉండగా రెప్పపాటులో గురిచూసి తుపాకిని పేల్చడం ఓ ప్రోసెస్.
వేగంగా నడిస్తే పది నిముషాల్లో రెస్టుహౌస్ ని చేరుకోవచ్చు.
సింగ్ ఆలస్యం చేయలేదు.
అడవిలో పక్షులు గూళ్ళకు చేరుకుని అసురసంధ్యవేళను సూచిస్తూ చీకటికి ఆహ్వానంగా కూతలు పెడుతున్నాయి రాత్రి పక్షులు.
ఆవేళలో చెట్లపై విశ్రమించిన కోలంకి, మైనా, భరద్వాజ పిట్టలు పాడే పాటలు అడవి అందాన్ని ఇనుమడింప చేస్తుంటే, ప్రకృతికాంత హృదయ నాదాల్లా వినిపించే సంగీత ఝురికి సింగ్ ఎప్పటిలా పరవశించ లేకపోయాడు.
అతడి ప్రస్తుత మానసిక స్థితివేరు.
హడావుడిగా రెస్టు హౌస్ ని చేరుకున్నాడు.
స్టేండుకు అమర్చిన డబుల్ బేరల్ గన్, మరో హైవెలా సిటీ రైఫిల్ ను క్షణంపాటు చూశాడు.
అతడి చేతిలో ఉన్న 0.375 మేగ్నట్ రైఫిల్ నే ఆ రోజు ఉపయోగించాలనిపించింది. మేనీటర్ విషయంలో వరుసగా రెండు కార్డ్రిడ్జెస్ మాత్రం ఫైర్ చేయగల డబుల్ బేరల్ గన్ కంటె, ఒకదాని వెంట మరొకటి అయిదు రౌండ్లు ఉపయోగించే అవకాశమున్న మేగ్నమ్ రైఫిల్ ను వాడటం సమంజసం. ట్రౌజర్ లో మరికొన్ని బుల్లెట్స్ నింపుకుని. ఎలక్ట్రిక్ టార్చితో సహా బయటికి నడిచాడు.
ఎదురుగా పూలసజ్జతో నిలబడి ఉంది తులసి.
మలిసంధ్యలా దర్శనమిచ్చిన తులసిని ఆసమయంలో అక్కడ చూడటంతో ఆశ్చర్యపోయాడు నట్వర్ సింగ్.