Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 38

   
    జనార్ధన్ ఎంతో అనుభవంతో చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉండిపోయాడు మోహన్ అదీకాక ఈ వ్యవహారంలో ఇరుక్కున్నది శ్యామ్ మాత్రమేకాదు. ప్రసూన కూడా వుంది. ప్రసూన అమాయకురాలా, కాదా, అన్నది వేరే విషయం.    
    తల చేతులతో అదుముకున్నాడు.    
    "ఏమంటావ్ మోహన్?"    
    మోహన్ మెత్తపడటం గ్రహించి మరింత ప్రాధేయ పూర్వకంగా అన్నాడు జనార్ధన్.    "మీ మాట కాదనలేను సార్"    
    నిట్టూరుస్తూ అన్నాడు మోహన్-    
    తలుపు తెరచుకొని తన దగ్గరికి వస్తోన్న మోహన్ ను ఆదరణతో ఆహ్వానించాడు సాంబశివం-    
    మోహన్ మాట్లాడకుండా తన దగ్గరున్న రికార్డు సాంబశివం ముందుపెట్టాడు-    
    సాంబశివం నవ్వి "నా 'రేపు' వచ్చిందన్నమాట." అన్నాడు.    
    "అందరికీ 'రేపు' వస్తుంది"    
    "అవును వస్తుంది. కానీ, ఏమవుతుందో తెలియదు. ఆ తెలియకపోవటంలోనే జీవిత మాధుర్యమంతా నిండి ఉంది. మనం వేసే ప్రతి అడుగూ రేపటిచుట్టూ మనం ఆశ లల్లుకునే బాటలలోనే!"    
    మోహన్ తెల్లబోయి చూశాడు. సాంబశివం ఇంత తెలివిగా మాట్లాడగలడని అతడనుకోలేదు.    
    శ్యామ్ దొంగతనం చేస్తుండగా తీసిన ఫోటోలు మోహన్ కిచ్చాడు. సాంబశివం తన చెయ్యిజాపాడు. ఆ చెయ్యి అందుకుని స్నేహపూర్వకంగా ఊగించి ఎలాగో బయట పడ్డాడు మోహన్-    
    జనార్ధన్ గారి ముందు ఆ ఫోటోలు పెట్టాడు.    
    మీరు నన్ను ఇంతవాణ్ని చేశారు. నేను మీకు ఎంతో ఋణపడి ఉన్నాను. అందుకు ప్రతిఫలంగా ఏదైనా కోరండి నా అంతరాత్మను మాత్రం కోరకండి- ఈ శరీరాన్ని పోషించుకునేది ఆత్మను చంపుకోవటానికి కాదు....."    
    కన్నీళ్ళతో చేతులు జోడించాడు మోహన్.
    
                                        19
    

    తెల్లని బట్టలతో కడిగిన ముత్యంలా వుంది ప్రసూన......    
    అప్పుడు తానున్న మానసిక స్థితిలో ప్రసూనను చూడగానే ఎంతో సంతోషం కలిగింది మోహన్ కి.    
    "కంగ్రాట్యులేషన్స్!" నవ్వుతూ అంది ప్రసూన......    
    "దేనికి?"    
    "ఇంత చక్కగా మీ ఉద్యోగం మీరు చేస్తున్నందుకు- రక్షక భటాధికారి ఈజ్ ఈక్వల్ టు తనవారిని సర్వదా రక్షించుకొనువాడు- అంతేనా!"    
    ప్రసూన ఇలా హేళన చేస్తోంటే మోహన్ కు కోపం రాలేదు. ఏవిధంగానూ ఏ సమాధానమూ ఇయ్యలేని నిస్సహాయస్థితికి తలుచుకుని తనమీద తనకే జాలికలిగింది.    
    ప్రసూన ఊరుకోలేదు.    
    "గుర్తుందా? నా ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ నాకున్నాయి అన్నారు. ఇదే కాంప్లిమెంట్ మీకు ఇస్తున్నాను. మీరు చక్కగా నిజాయితీ నటించగలరు. అవసరమని తోస్తే ముందు వెనుకలు ఆలోచించకుండా అన్యాయం చెయ్యగలరు. మాటల్లో ఎక్కడలేని ఖచ్చితమూ చూపించగలరు. చేతల్లో మీ స్వార్ధం మీరు సమర్ధంగా చూసుకో గలరు. మిమ్మల్ని నమ్మే అమాయకులకు మీరొక దేవత లాగ కనిపించగలరు. మీగుట్టుమట్టు తెలుసుకున్న వాళ్ళకి చేతులు జోడించగలరు! వాహ్వా! పోలీసు ఆఫీసర్ అంటే అందులోనూ సి.ఐ.డి. ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలి......"    
    ఇంకా సహించలేకపోయాడు మోహన్......    
    "సూనా! ఇవాళ నేను నీకే సమాధానము ఇయ్యలేను కానీ, గర్వంగా నీముందు నిలబడి నేనెవ్వరినో నిరూపించుకోగలిగే రోజు రాకపోదు!"    
    పకపక నవ్వింది ప్రసూన.    
    "మీదాకా వచ్చేసరికి ముందు రోజులుకూడా ఉంటాయని గుర్తు వస్తోందా? ఇలాగే అందరూ మాట్లాడతారు. రేఖ, సాంబశివం, శేఖర్...... అందరూ"    
    "సూనా! నేను ఈ రిపోర్టు ఇచ్చివుంటే నువ్వుకూడ ఇరుక్కోవలసి వచ్చేది!"    
    ఈ మాటలు వింటూనే తోక తొక్కిన త్రాచులా లేచింది ప్రసూన.

 Previous Page Next Page