Home » D kameshwari » Aruna


    మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకి మామూలుగా రుక్కుని మణిని కూర్చోపెట్టుకుని పాఠం చెపుతూంది అరుణ. ఎంత పని ఉన్నా, ఎంత అలసట అనిపించినా వాళ్ళకి పాఠం చెప్పడం మాత్రం ఏనాడూ అరుణ మానలేదు. ఎలాగో ఒకలాగ ఇంకో ఆరేడు నెలలు కష్టపడి చదువు చెప్పి మార్చిలో మెట్రిక్ పరీక్షకి కట్టించాలని అరుణ ఉద్దేశం. పాఠం చెపుతూంటే మధ్యలో గుర్తుకువచ్చినట్లు పుస్తకంలోంచి ఓ కవరుతీసి మా అన్నయ్య మీకీ ఉత్తరం ఈయమన్నాడండీ.    
    మరిచేపోయాను." అంది రుక్కు. "మీ అన్నయ్యా? ఏం ఉత్తరం?" అంటూనే అందుకుని వెంటనే చించింది అరుణ. ఉత్తరం వ్రాయవలసినంత ముఖ్యమైన సంగతిఏముంది? ఇద్దరు ఇంచుమించు రోజూ కలుసుకుంటూనే ఉంటారు గదా?    
    అందులో చదవడం ఆరంభించిన అరుణ సగం చదివేసరికి తత్తరపడి పోయింది. అర్ధం కానట్టు అయోమయంగా మళ్ళీ చదివింది. అర్ధం కాగానే మొహంలో రక్తం పొంగింది. ఛీ ఛీ? ఏమిటిది?" కలవరపడుతూ అనుకుని మిగతాది కూడా పూర్తిచేసింది చదవడం. చదవడం పూర్తిచేసేసరికి అరుణలో ఎన్నో రకాల భావాలు ముప్పిరిగొన్నాయి. సుబ్బారావు ఆ ఉత్తరం రాశాడంటే ఆమె అప్పటికీ నమ్మలేకపోతూంది మనసంతా ఏదో చేదుతిన్న నోరులా అనిపించింది అరుణకి. అసలా ఉత్తరాన్ని ఆ క్షణంలో చింపి ముక్కలు చేద్దామని అనిపించినా, ఎదురుగా రుక్కుమణి తనవంక చూస్తున్నారని తమాయించుకుంది. ఉత్తరం మడిచికవర్లో పెట్టి పక్కన పెట్టేసింది. ఏం జరగనట్టు మామూలుగా ఉండడానికి ప్రయత్నించి ఎలాగో ఇంకో పదిహేనునిమిషాలు పాఠం చెప్పడం పూర్తిచేసి, "ఇంకా చాలు ఈవేళకి." అనేసి రుక్కుని పంపేసింది అరుణ. మణిపుస్తకాలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయాడు.    
    ఉత్తరం పట్టుకుని పడక గదిలోకివెళ్ళి, మంచంమీద పడుకుని మళ్ళీ సావకాశంగా చదవడం ఆరంభించింది అరుణ.    
    "అరుణాదేవికి:" అసలా సంబోధనచూడగానే అరుణకిముందు చిత్రమనిపించింది. ఇన్నాళ్ళుఎప్పుడూ తనని సుబ్బారావుపేరు పెట్టి పిలిచినగుర్తు ఆమెకి లేదు. ఎదురుగా 'మీరు' అంటూ మాట్లాడేవాడు. ఇంకొకరితో చెప్పినప్పుడు 'డాక్టరుగారు' అనేవాడు.    
    "ఈఉత్తరం చదివి అపార్ధం చేసుకోరనే నమ్మకంతో నా ఉద్దేశం బయటపెడుతూ రాయడానికి సాహసిస్తున్నాను. దయచేసి అన్యధాభావించకుండా పూర్తిగా చదివి మీ అభిప్రాయం తెలపమని చెప్పలేకపోయాను. ఎదురుగా చెప్పడానికి అడ్డువచ్చేవి ఎన్నో ఉంటాయి. ఉత్తరం మూలంగా అయితేనే చెప్పదలచింది సరిగా చెప్పగలననిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను.    
    నాకు తీయని భాషలో కవిత్వం చెపుతూ ప్రేమలేఖలు వ్రాయడం రాదు. అందుచేతే సూటిగా నేను అడగదల్చిన విషయం ఒకే ఒక వాక్యంలో అడుగుతున్నాను...... నన్ను మీరు పెళ్ళాడగలరా?    
    "ఆశ్చర్యపోకండి ఇలా అడగడంలో అనుచితం ఉందంటారా? నేను వివాహితుడినని మీకు తెలుసు. రెండో పెళ్ళివాడినని నాకు తెలుసు. కానీ నాకు వయసు ముఫ్ఫై మాత్రమే నిండింది. సాధారణంగా రెండో పెళ్ళికి అభ్యంతరం పిల్లలు. నాకు పిల్లలు లేరు. అందుచేత రెండోపెళ్ళి అన్న పేరు తప్ప వివాహానికి నే అన్నివిధాల అర్హుడినే లోకం దృష్టిలో.    
    తరవాత నేను మీకంటే తక్కువ చదివిన వాడిని. ఉద్యోగం లేని వాడిని ఆ రెండు విషయాలూ మీ కభ్యంతరాలు కావని మాటల సందర్భంలో మీ మాటలవల్ల గ్రహించాను. ఈ విషయంలో మరి మీకభ్యంతరం ఉండదని నా ఉద్దేశం. ఇకపోతే మీరు ఎన్నో సందర్భాలలో మీకు పల్లెల్లో ఉండడం ఇష్టమని, పల్లెటూర్లు నచ్చుతాయని అన్నారుకనక, మీ రిక్కడే డాక్టరుగా స్థిరపడే ఉద్దేశంలో ఉన్నారు కనక పల్లెటూరిలో ఉండే నన్ను వివాహం ఆడడానికి అదో అభ్యంతరం కాదని నా ఉద్దేశం. అరుణాదేవి? మీరు ఈ ఊరొచ్చి  దగ్గిర దగ్గిర సంవత్సరం కావస్తూంది.    
    ఈ మధ్యకాలంలో మనం అతి సన్నిహితులమయ్యాం. నామీద మీకు ఎనలేని గౌరవం, అభిమానం ఉన్నాయని గుర్తించాను. గుర్తించనక్కరలేకుండానే ఎన్నో సందర్భాలలో మీ నోట ఆ మాటలు విన్నాను. అరుణ మాటలువిని, ఈ సంవత్సరం కాలంలో మన మధ్య సాన్నిహిత్యాన్ని గుర్తుంచుకుని మీ మీద నా కెలాంటి అభిప్రాయం ఏర్పడిందో నా మీద మీ కలాంటి అభిప్రాయమే ఏర్పడి ఉంటుందన్న నమ్మకంతో నా ఉద్దేశం మీ ముందు బయట పెడుతున్నాను మనం వివాహం చేసుకున్నా మీ డాక్టరు వృత్తికి అంతరాయం కలగదు అని హామీ ఇస్తున్నాను.  అంతేకాక పైవాడిగా ఇప్పుడు చేసే సాయం కంటే ఆప్తుడుగా, మీ వాడుగా మీ కెన్నివిధాల అయినా అన్ని సమయాలలో మీకు నా సహాయం లభిస్తుంది. మీకు చేదోడు వాదోడుగా ఉంటానని వేరే చెప్పనక్కరలేదు.    
    అరుణాదేవీ: ఆ రోజు రెడ్డిగారు మీ మీదజరిపించబోయిన అత్యాచారం గుర్తుంది కదా? ఒంటరిగా ఉన్న స్త్రీ అంటే అందరికి అలుసే. స్త్రీకి ఎప్పుడూ పురుడుడి రక్షణ అవసరం. చిన్నప్పుడు తండ్రి, వయసు వచ్చాక భర్త, ముసలి తనంలో కొడుకు.....ఇలా ఏదో పురుషుడి రక్షణ స్త్రీకి అవసరం, మీరు ఒంటరిగా ఉండబట్టేగదా రెడ్డిగారంత సాహసించారు? అదే మీ భర్త ఉంటే అలా జరిగేదా? అరుణాదేవీ? మీరు. మీ ఆశయాలు నాకు ఎంతగానో నచ్చాయి. మీ ఆశయాలని సంతోషంగా ఆమోదించగలిగే వ్యక్తిని మీరు భర్తగా చేపట్టడానికి సందేహించరని నా నమ్మకం. నా గుణగణాలు, కుటుంబం మంచిచెడ్డలు, నా ఆస్తి పాస్తులు చదువు సంధ్యలు అన్నీ మీకు వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. కేవలం మీకు ఇష్టమయితే 'ఊ' అన్నమాట చాలు. ఆ మాట నాకెంత ఆనందాన్ని ఇస్తుందో మీ రూహించలేదు.        
    ముఖత చెప్పలేక నా కోరిక ఈ ఉత్తరం ద్వారా వెల్లడించాను అలాగే మీరు అంగీకారం అయితే మీ జవాబు ఉత్తరం ద్వారా పంపగలరు.    
    ఎన్నో ఆశలు, కలలు మీ పై పెట్టుకున్న......    
    మీ సుబ్బారావు."    
    "ఛీఛీ సుబ్బారావు ఇలా వ్రాస్తాడని ఇలాంటి ఉద్దేశం అతనికి ఉందని కలలో కూడా ఊహించలేదు నేను. ఉత్తరం చదివిలజ్జతో, జుగుప్సతో అరుణ మొహం ఎర్రబడిపోయింది. అతని ఉత్తరం అరుణవేళ్ళ మధ్య నలిగిపోయింది.    
    సుబ్బారావును తనెంత అభిమానించింది నిజమే. కృష్ణమూర్తి అన్నయ్యతో సమానంగా అభిమానించింది. నిజమే ఎంతో చనువుగా సన్నిహితంగా మెలిగింది. కానీ తనచనువుని, సాన్నిహిత్యాన్ని అపార్ధం చేసుకున్నాడు. కలలోనైనా అసలు ఇలాంటి ఆలోచనతనలో రాలేదు. తన కెన్ని విధాలో సహాయం చేసిన సుబ్బారావు పట్ల కృతజ్ఞత గౌరవం తప్ప మరో భావం ఊహల్లో నైనా లేదు. తనమాటలని, తనచనువుని అన్నింటిని మరిచి మరో విధంగా అర్ధం చేసుకున్నాడన్న మాట సుబ్బారావు ఛీ: అసలు సుబ్బారావు ఎలా అడగగలిగాడు ఈమాట? రెండో పెళ్ళివాడనీ కాదు తనకి సరిపోయే అర్హతలులేని వాడనీ కాదు. కానీ అసలు ఈ ఊహ ఎందుకు వచ్చిందో సుబ్బారావుకి? అభిమానంగా మాట్లాడికాస్త చనువుగా ఓ ఆడది మసిలిందంటే ఈ అర్ధం తప్ప మరో అర్ధం స్ఫురించదు గాబోలు మగవాళ్ళకి. ఇందుకే కాబోలు రెండు మూడుసార్లు తనకన్న తక్కువ చదువుకున్న మగవాడిని భర్తగా స్వీకరిస్తుందా ఆడది అంటూ ఏవేవో అడిగితే, తను ఏదో మామూలుగా బాతాఖానీ క్రింద అప్పుడనుకుంది. ఉద్యోగంలేదనిపొలాల్లోనే తనకిగడిచి పోతూందని తనని తను కించపరుచుకుని ఓసారి అతను బాధపడుతుంటే ఇది మాత్రం ఉద్యోగం కాదా? ఆఫీసులో కూర్చుంటేనా ఉద్యోగం? స్వయంశక్తితో ఒకరిక్రింద ఆధారపడకుండా స్వశక్తితో కాళ్ళ మీదనిలబడ్డం కంటే మంచి ఉద్యోగం ఏముంటుంది?' అని సమాధానపరిచింది ఇంత దురాలోచనమనసులో పెట్టుకుని అడిగాడని ఆనాడు ఎలా అనుకుంటుంది అప్పుడు తను:    
    అసలు తను కనిపెట్టలేకపోయింది కాని, ఈ మధ్య అతనిచూపుల్లో, మాటల్లో ఏదో భేదం కనిపించింది చాలాసార్లు. మొదట్లో నమ్రతగా, మొహంవంకయినా చూడకుండా మొహమాటంగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఈ మధ్య కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. ఆ కళ్ళలో భావం అప్పుడు అర్ధంకాలేదు కాని. ఇప్పుడు అర్ధం అవుతూంది. తనకిసలహాలు ఇస్తూ, ఛలోక్తులు ఆడుతూ, కొన్నికొన్ని విషయాలలో ఆజ్ఞాపిస్తూ నవ్వుతూ మాట్లాడే సుబ్బారావుని తనెన్నడూ మరో విధంగా తలచలేదు. పరిచయం పెరిగి, కొత్తతొలగి చనువుగా మాట్లాడుతున్నాడనుకుంది. సుబ్బారావు తదేకంగా తనవైపు చూస్తూ, తను చూడగానే తడబడి చూపు మరల్చుకోవటం.    
    అప్పుడప్పుడు ముగ్ధుడవుతున్నట్టు ఆరాధనా పూర్వకంగా చూపులు ఏ లోకంలోనో ఉన్నట్టు పరవశంగా చూసేవాడు, ఆ చూపులు కొత్తగా అనిపించినా తన మనసులో మరో భావం చొరపడలేదు అంతే కాక ఈ మధ్య రెండు మూడుసార్లు తనురమేషుతో మాట్లాడుతూంటే అతను చూశాడు. హర్టు అయినట్టు ముఖంలో ఈర్ష్య తొంగిచూసింది రమేషు పక్కనున్నంతసేపూ ముఖం మాడ్చుకుని కూర్చునేవాడు. అతను వెళ్ళిపోగానే మళ్ళీ మామూలు మనిషి అయ్యేవాడు. ఏదో తను అతని హక్కు అన్నట్టు, మరొకరికి భాగం లేదన్నట్టు అప్పుడే తను అతనిస్వంతం అయిపోయినట్టు భావిస్తున్నాడన్నమాట. ఈ సంగతి ఇప్పుడు గుర్తించింది కానీ అప్పుడసలు ఇవేవీ తన మనసులో జొరపడలేదు అన్నింటిని కూడదీసుకుని ఆలోచిస్తే అప్పుడే నాలుగయిదు నెలలుగా సుబ్బారావులో ఈ ఉద్దేశం మొలకెత్తిందని స్పష్టం అవుతూంది. తనే గ్రహించలేకపోయింది ఇన్నాళ్ళూ అడగడానికి మొహమాటపడో, జంకో ఊరుకుని ఉంటాడు. మొన్న రెడ్డి తలపెట్టిన అత్యాచారం తరవాత తనని రక్షించే భారం భుజంమీద వేసుకుని తనకి రక్షకుడుగా నిలబడ్డానికి ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాడన్నమాట.    
    కానీ, సుబ్బారావుని పెళ్ళిచేసుకోవడమా? ఛా ఆ ఆలోచనే ఎందుకోకంపరం పుట్టిస్తూంది తనకి. అంటే తనకి తగడని అతనికా అర్హతలు లేవనికాదు. కానీ ఎందుకో సుబ్బారావుని ముందు నించి స్నేహితురాలి భర్తగా ఆ తరవాత ఓ అన్నయ్యలా మాత్రమే భావించింది. అలాంటివ్యక్తితో 'పెళ్ళి' అన్నమాటకి మనసేకాక శరీరం కూడా ఎదురు తిరుగుతూంది అతనికి నిరాశ అయినా కష్టం, కలిగించినా తనుమాత్రం ఈ కోరికను మన్నించలేదు.    

    వీలయినంత సౌమ్యంగా మృదువుగా కారణం వివరిస్తూ, అతనికోరికని తిరస్కరించినందుకు మన్నించమంటూ ఉత్తరం రాస్తుంది. ఎప్పటిలా తామిద్దరూ స్నేహితులలాగ ఉండాలని దానికి ఈ తన తిరస్క్రుతి ఆటంకం కాదని భావిస్తున్నానని రాస్తుంది. తనని సోదరీ సమానంగా భావించిఎప్పటిలా అతనినించి అభిమానం, సహాయం కోరుతున్నానని రాస్తుంది. అతను నొచ్చుకోకుండా ఏ విధంగా రాయాలో అరుణ మనసులో రెండు మూడుమాట్లు అనుకుని అప్పటికప్పుడే సుబ్బారావుకి సమాధానం రాసేసింది. తరవాత మనసుకాస్త తేలికపడింది. సుబ్బారావు ఈ విషయంలో తనపై కోపగించుకోకూడదని, తనని ఈ కారణంగా దూరంచేయకూడని అరుణ మనస్ఫూర్తిగా కోరింది.    
                                                                    * * *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra