ఇలా ఆలోచించటం తప్పో, వొప్పో అన్న జిజ్ఞాస లేదు అసలు. అలా ఆలోచించకపొతే బ్రతకలేని దశలో ఉంది కనుక.
* * *
రిజిస్ట్రాఫీస్ నుండి ఇంటికి వచ్చారు అందరూ. కుసుమా, శ్యామ్ లకు రిజిస్టర్ మారేజ్ అయిపొయింది. అందరూ విశ్రాంతి గా కుర్చీలలో కూర్చున్నారు. కుసుమ తన వివాహ పత్రాన్ని భద్రంగా దాచుకుని , చేతిలో దస్తావేజులు పట్టుకుని వచ్చింది.
"ఇవిగో జానకీ, నీ ఆస్తి దస్తావేజులు. వెంటనే మీ అయన దగ్గర కెళ్ళి నిజం చెప్పు" అంది దస్తావేజులు జానకి చేతిలో పెడుతూ.
తెల్లబోయి చూశాడు శ్యామ్.
"అలా తెల్లబోతావేం? వివరంగా చెప్తాను విను. నువ్వు ఏ ఆస్తి నా పేర ఉందనుకుని కట్నం కోసం బేరమాడకుండా నన్ను పెళ్ళి చేసుకున్నావో ఆ ఆస్తి నాది కాదు జానకిది. పెళ్ళయ్యేవరకూ నిన్ను ఊరించటం కోసం నా పేర పెట్టుకున్నాను. నామీద ప్రేమ కొద్దీ అందుకు ఒప్పుకుంది. నా మీద ప్రేమతోనే దారుణమైన క్షోభని సహిస్తూ కూడా భర్తతో నిజం చెప్పలేకపోయింది. ఇప్పుడు మన పెళ్ళయిపోయింది కనుక మళ్ళీ ఆమె ఆస్తి ఆమె పేర మార్పించి జానకి కిచ్చేస్తున్నాను. అర్ధమయిందా?" అల్లరినవ్వుతో వివరించింది కుసుమ.
కుర్చీలోంచి దిగ్గున లేచాడు శ్యామ్. పళ్ళు కొరుకుతూ. "ఎంత మోసం?" అన్నాడు.
పకపక నవ్వింది కుసుమ.
"మోసమా? ఎవరిది?" వెటకారంగా ప్రశ్నించింది.
"ఇల్లలకగానే పండుగనుకుంటున్నావా? పెళ్ళయినంత మాత్రాన నిన్నేం చెయ్యలేననుకుంటున్నావా? నిన్ను వదిలేస్తాను"
"మహారాజులా వదిలెయ్యి. అక్కడ నువ్వు, ఇక్కడ నేనూ ఒంటరిగా బ్రతుకుదాం. ఎందుకంటే నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోలేవు. నేను ఒప్పుకోను గనుక. నేను ఒప్పుకోకపొతే లా ఒప్పుకోదు గనుక. ఈనాటి సంఘంలో ఆడదానికి కొన్ని యిబ్బందులతో పాటు కొన్ని అవకాశాలూ ఉన్నాయి. బహుభార్యాత్వ నిషేధం మా పాలిట వరం."
"లా దారి లాది. మా దారి మాది. లా ఎంతవరకూ ఆపగలదు?"
"ఏం చెయ్యగలవో చేసుకో! ఇంతకూ నాకు కావలసింది ఆ వివాహపత్రం. నా సంతానానికి తండ్రి ఫలానా అని సంఘానికి చూపడానికి ఆస్కారం. నేను పతితగా సంఘం ముందు నిలవనక్కర్లేకుండా వర పత్రం. నీమీద ఆధారపడి బ్రతుకుతున్న దాన్ని కాను. తిండేలాగా అని బెంగ పెట్టుకోవడానికి. ఇప్పటికైనా అర్ధం చేసుకొని బుద్దిగా సంసారం చెయ్యదలుచుకున్నావా, ఇద్దరం ఆనందంగా ఉంటూ మన సంతానాన్ని పైకి తీసుకొద్దాం. ఈరోజు నుంచీ నేను మీదాన్ని కనుక నీ చెల్లెలి వివాహ బాధ్యత నాది కూడా అవుతుంది. ఒకరి సంపాదనతో పొదుపుగా గడుపుకుంటూ , మరొకరి సంపాదన బేంక్ లో వేసుకుంటే మీ చెల్లెలి పెళ్ళి రెండేళ్ళలో చేసెయ్యవచ్చు. అలా కాదంటావా నీ కర్మ! పరువు గల అడదెవరూ రెండో పెళ్ళికి ఒప్పుకోదు. నీకన్నా అధికురాలయిన స్త్రీ నీకు రెండో భార్యగా రావటం అసంభవం. నువ్వు కోరిన డబ్బు నీకు ఎలాగూ రాదు. అన్నీ ఉండి, కట్నం కూడా ఇచ్చుకోగలిగిన స్త్రీ పెళ్ళయిన వాడినెందుకు చేసుకుంటుంది? నామీద కసితో ఎవతెనైనా కక్కుర్తిగా కట్టుకుంటావో , అన్ని విధాల అనుకూలమైన సంసారంలో సౌఖ్యాన్ని అనుభావిస్తావో నీ యిష్టం" అని నిర్లక్ష్యంగా చెప్పింది కుసుమ
చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్యామ్. చివరకు ఎప్పటిలా తేలిగ్గా నవ్వేస్తూ "నువ్వు చాలా గట్టిదానివి కుసుమా!" అనేశాడు కుసుమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
శ్రీనివాస్ తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు.
కుసుమ శ్యామ్ చేతిలో నుండి తన చేతిని మృదువుగా విడిపించుకుని జానకి దగ్గరగా వచ్చింది. "నన్ను క్షమించు జానకీ! నీకు చాలా క్షోభ కలిగించాను. రా! నిన్ను రైలెక్కిస్తాను. ఒక్కమాట! మాధవను చూడగానే అర్ధమయిపోయింది నాకు. అయన నిన్ను గాడంగా ప్రేమిస్తున్నారని . ఎవరి మాటలో పట్టుకుని నీ ఆనందాన్ని నువ్వే నాశనం చేసుకోకు."
జానకి ఏమీ సమాధానం చెప్పలేదు.
కుసుమ వెళ్ళి టాక్సీ తీసుకొచ్చింది. రైలు స్టేషనులోకి రాగానే జానకిని రైల్లో కూచోబెట్టి "జాగ్రత్త! మాధవకు అన్నీ వివరంగా చెప్పు. అయన నమ్మరనే అనుమానమే లేదు. గతాన్ని మరిచి మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండండి." అంది. రైలు కదిలింది. జానకి కనుమరుగయ్యేవరకూ కుసుమ చెయ్యి ఊపుతూనే ఉంది.
* * *
ఎప్పటి తన ధోరణిలోనే ఆలోచించుకుంటూ పడుకుంది సరళ. జానకి చచ్చిపోతుంది. అప్పుడు మాధవ.....
తలుపు తట్టిన చప్పుడుకు లేచి, తలుపు తెరిచి దెయ్యాన్ని చూసినట్లు దిగ్భ్రాంతితో నిలబడిపోయింది. ఎదుట జానకి నీరసంగా నవ్వుతూ.
"అలా చూడకండి. ఇక్కడుండటానికి రాలేదు. మీతో ఒక్క మాట చెప్పి వెళ్ళటానికి వచ్చాను" అంది.
"కూచుండి" ఈర్ష్యతో ఆణువణువూ భగ్గున మండుతున్నా జన్మ సిద్దంగా వచ్చిన సభ్యత కనబరచింది సరళ.
జానకి కూచుని తన చేతిలో దస్తావేజులు సరళకందించింది.
"ఏమిటది?'
"ఆస్తి అయన పేర మార్పించాను. అయన కందజేయండి. అందుకే వచ్చాను. ఈ ఒక్క నిజం చెప్పటానికే౧ ఇంక మీకే విధంగానూ అడ్డు నిలవను" చూస్తుండగానే జానకి ముఖం మారిపోసాగింది. కంఠస్వరం సరిగ్గా నిలవటం లేదు.
"నేను లేకపోయిన తరువాత మాధవ మిమ్మల్నే ప్రేమిస్తారు. అందుకే నేను లేకుండా పోతున్నాను. నాకంటే ముందు నుంచీ మాధవ మీద ఆశలు పెంచుకున్నారు మీరు. అన్ని విధాలా మాధవ కనుకూలమైనవారు. నేనుండగా మాధవ మిమ్మల్ని స్వీకరించరు. కాని నేను చచ్చిపోయాక....."
"ఏమిటిది? ఏం చేశారు? ఏదైనా మింగారా?" గాభారాగా అడిగింది సరళ.
"........అప్పుడు మాధవ తప్పకుండా మిమ్మల్ని చేసుకుంటారు. ఆస్తి గురించి మాత్రం నిజం....." జానకి కళ్ళు తేలిపోతున్నాయి.
సరళ ఒక్క గంతులో వెళ్ళి డాక్టర్ కి ఫోన్ చేసింది . మాధవకూ, మోహన్ కూ కూడా ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చేవరకూ క్షణమొక యుగమనిపించింది. డాక్టర్ రాగానే "చూడండి డాక్టర్!...... ఈవిడ ఆత్మహత్యకి ప్రయత్నించి నట్లున్నారు. ఎలాగైనా బ్రతికించండి" అంది కన్నీళ్ళతో . డాక్టర్ వెంటనే జానకిని పరీక్షించి స్లీపింగ్ టేబెట్ల్స్ మింగినట్లు తెలుసుకుని వాంతులవటానికి ఇంజక్షన్ ఇచ్చాడు.
జానకి ఎలాగైనా బ్రతకాలని ఆర్తితో మనసారా ప్రార్ధించుకుంది సరళ.
ఒక్క క్షణం క్రితం వరకూ తను అతి గాడంగా కోరుకుంటున్న ఒక పాపిష్టి కోరిక ఇలా క్రియారూపం పొందబోవటంతో తను పాపం చేసినట్లు వణికిపోయింది సరళ మనవ హృదయం.
ఇంతలో మాధవ, మోహన్ వచ్చారు.
"నన్ను క్షమించు మధవా! నీ జానకికి నేనే ప్రాణాపాయం తెచ్చాను." అని బావురుమని ఏడ్చేసింది సరళ.
"ఊష్ !" అన్నాడు మోహన్.
"లేదు సరళా, లేదు. జానకిని నాకు దక్కించావు. సమయానికి నువ్వు డాక్టర్ ని పిలవకపోతే జానకి ఏమయిపోయేదో! నువ్వు చాలా మంచిదానివి సరళా! నేనే కిరాతకుణ్ణి. నా బలహీనత వల్ల ఇటు నువ్వు, అటు జానకీనీ అత్తయ్యనీ అందరినీ బాధపెట్టా. నువ్వే నన్ను క్షమించాలి" అన్నాడు మాధవ.
డాక్టర్ కృషి వల్లా, మాధవ ఆర్తి వల్లా సరళ శ్రద్ధ వల్లా జానకికి అపాయం దాటిపోయింది.
"జానకీ! మాధవ నీవాడు. నువ్వు దగ్గరయినా, దూరమయినా , నేను మాత్రం ఇక మాధవకు దగ్గర కాలేను. ఈ విషయం అర్ధం చేసుకోలేక నీకు క్షోభ కలిగించాను. నా సంగతి మరిచిపోయి మాధవను సుఖపెట్టు" అని ఆప్యాయంగా అంది సరళ.
"మీ దంపతులిద్దరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు" మనసారా అన్నాడు మోహన్.
జానకిని టాక్సీలో తన పక్కన కూర్చో బెట్టుకుని, అందరి దగ్గరా సెలవు తీసుకున్నాడు మాధవ.
* * *
తనకి తాంబూలం అందిస్తోన్న జానకి చేతిని అలానే పట్టుకున్నాడు మాధవ. ఇన్నాళ్ళకు చొరవగా తన హృదయం మీదకు లాక్కుని ఆర్తిగా హత్తుకున్నాడు . బేలగా అతని హృదయానికి హత్తుకుపోయింది జానకి.
"నేను ఎంత రమ్మని ప్రాధేయపడినా రానుగాక రానన్నావానాడు. నిజం చెప్పు జానకీ! నీకు నా మీద ప్రేమ లేదూ?"
జానకి కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూసింది. చిరునవ్వు నవ్వి అతడినల్లెసుకుంది.
లోకం లోని ఆనందమంతా నింపుకున్న కళ్ళ మెరుపులలో, సిగ్గులు గులాబీలై విరిసిన చెక్కిళ్ళ నిగ్గులలో, అనురాగం అరవిచ్చిన పెదవుల వంపులలో, మమతలు నిండిన మనసులు అందించే కౌగిలిబిగిలో ఏ శభ్దాలకు అందని జానకి ప్రణయగీతాన్ని తన్మయత్వంతో వినగలిగింది మాధవ హృదయం.
------***------