Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 37

  

     ఇప్పుడు రవితేజ ఈ కొత్త స్కీమ్ తో వచ్చేసరికి చెంచురామయ్య పునాదులు కదులుతున్నట్టు అనిపించింది. పైకి మామూలుగా కనిపించినా, ఈ స్కీముగానీ విజయవంతం అవుతే అది ఎలా వేళ్ళతో సహా విస్తరిస్తుందో దేశమంతా పాకుతుందో కేవలం చెంచురామయ్య మాత్రమే వూహించగలడు. రవితేజ ఇక పులిలా విజ్రుంభిస్తాడు. రోజు కొత్త డిజైను వూహిస్తాడు. కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లు ఆలోచిస్తాడు.
   
    స్నానం చేస్తున్నప్పుడో-సీతాకోకచిలుకని చూస్తున్నపుడో-నీలం కారులోంచి పచ్చచీర కట్టుకున్న అమ్మాయి దిగుతున్నప్పుడో అతడికి ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన వస్తుంది. మూడు రోజులకల్లా ఒకవేపు కోట్ల రూపాయల విలువచేసే మిషన్లమీద లక్షల చీరలు తయారవుతూ వుంటాయి. మరోవేపు టీ.వీ.ల్లో రకరకాల అమ్మాయిలు ఆ చీరలు కట్టుకుని ఆడవాళ్ళ హృదయ కవాటాలు తెరుచుకుని నేరుగా లోపలి ప్రవేశిస్తూ వుంటారు. అయిదు రోజులకల్లా వంద రూపాయల నోటు వారినుంచి రవితేజవైపు ప్రయాణం చేస్తూ వుంటుంది. నెలరోజులు తిరిగేసరికల్లా మళ్ళీ ఇంకో డిజైను- మళ్ళీ టీ.వీ.ల్లో అమ్మాయిలు- ఈసారి మరింత అందంగా-
   
    "అరెరె, ఇంత మంచి చీర వుందని తెలియక- అది కొనేసేమే-" అనుకుంటూ ఆడవాళ్ళు. "ఏమండీ ప్లీజ్, ఇది కొనుక్కుంటానండీ-" అని భర్తల్ని అడుగుతారు. "అదేమిటి-నెల రోజుల క్రితమేగా రెండు చీరెలు కొన్నావ్!"
   
    "పోండి-పెద్ద వేలకు వేలుపెట్టి కొన్నట్టు మాట్లాడుతారు. రెండొందలేగా- ప్లీజ్ ప్లీజ్. ఈ రాత్రికి మీ కిష్టమైన వంకాయకూర వండి పెడతాగా- ఒక్క వందశాంక్షన్ చేయరూ?"
   
    "సర్లే," మరో వంద వారినుంచి రవితేజ కంపెనీవేపు ప్రయాణం!
   
    రవితేజా! నువ్వు సినిమా దైరెక్టర్ వై వుంటే నెంబర్ వన్ అయి వుండేవాడివి. రచయితవై వుంటే జ్ఞానపీఠం ఎక్కి వుండేవాడివి. ఈ బట్టల వ్యాపారంలోకి వచ్చి మమ్మల్ని చంపుతున్నావు కదయ్యా!
   
    చెంచురామయ్య ఇరిటేటింగ్ గా గెడ్డం గోక్కున్నాడు. ఇంకా అవతలి కంపెనీ మీటింగ్ తాలూకు నిర్ణయాలు బైటకు రాలేదు. లంచ్ అయిన తరువాత తిరిగి సమావేశం అయ్యారన్న విషయం మాత్రం తెలిసింది. లంచ్ కి ముందు తమ మనిషి (గూఢచారి) ప్రవేశపెట్టిన తీర్మానంతో మిగతా డైరెక్టర్లందరూ దాదాపు ఏకీభవించారన్న సంగతి కూడా తెలిసింది. చాలా సంతోషకరమైన వార్త అది. చెంచురామయ్య కంపెనీ డైరెక్టర్లందరూ తమ చిరునవ్వుని అదిమిపెట్టి - చివరి వార్తకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే ధైర్యం చెప్పుకుంటున్నారు- "వస్తున్న లాభాలు వదులుకుని కొత్త స్కీములు ఎవరు వప్పుకుంటారండీ? నేనేగాని ఆ కంపెనీ డైరెక్టర్ ని అయివుంటే అసలింతచర్చ లేకుండా అయిదు నిముషాల్లో తేల్చేసి వుండేవాడిని" అంటున్నాడు ఒక డైరెక్టర్.
   
    ఇలాటివాళ్ళు సాధారణంగా సినిమా కంపెనీల్లో తగుల్తారు. రెండు సినిమాలు ఒకేసారి రిలీజు అవుతాయి. ఒక ప్రొడ్యూసర్ చుట్టూచేరి వీళ్ళు అంటూ వుంటారు. "ఇప్పుడే రాష్ట్రం మొత్తం సెంటర్స్ అన్నిటినుంచి ఫోన్ లు వచ్చినయ్! మనది హౌస్ ఫుల్స్ అట."
   
    "అదెలా వుందో?"
   
    "నాలుగు వారాల పిక్చర్ అంటున్నారు."
   
    -ఇలా సాగుతుంది ఆ సంభాషణ. నిజమైన వ్యాపారవేత్త ఎవడూ ఈ సంభాషణకి విలువ యివ్వడు. దీనివల్ల కాస్త తాత్కాలికంగా మనశ్శాంతి లభిస్తే లభించవచ్చుగానీ-అంతకన్నా పెద్ద లాభం వుండదు. అందువల్లే చెంచురామయ్య చుట్టూ వున్న డైరెక్టర్ల మాటలు పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అయిదు నిముషాల తరువాత చివరి వార్త వచ్చింది.
   
    జనతా చీరల పథకానికి రవితేజ టెక్స్ టైల్స్ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదముద్ర తెలిపారు. తొమ్మిదిమంది డైరెక్టర్లు దీన్ని ఒప్పుకుంటూ ఓటువేస్తే కేవలం ఒక్కరు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. అదీ న్యూస్.
   
    అప్పటివరకూ ఊహాగానాలు చేస్తూ తమలో తామే సంతృప్తి పడుతున్న డైరెక్టర్లు ఒక్కసారిగా దెబ్బతిన్నట్లు మౌనం వహించారు.
   
    చెంచురామయ్య లేచి తన గదిలోకి వెళ్ళాడు. అప్పటికే మానేజర్ ని పిలిచాడు.
   
    "మన చేతిక్రింద ఎన్ని పేపర్లున్నాయి. ఎంతమంది రిపోర్టర్లు మన మాట వింటారు?" అని అడిగాడు.
   
    "రెండు ఇంగ్లీషు దినపత్రికలు వున్నాయి. మిగతా రిపోర్టర్లు కూడ బాగానే తెలుసు. తెలుగులో అయితే ఒకరిద్దరు చీఫ్ ఏజంట్స్ కూడా తెలుసు."
   
    "రేపు సాయంత్రం అందర్నీ తాజ్ కి డిన్నర్ కి పిలువు. మన కంపెనీ వారికి కాక్ టెయిల్స్ యివ్వబోతుంది. కారణం అడుగుతే-ఏదో ఒకటి చెప్పు రజితోత్సవం - వగైరా- ఏదైనా-"
   
    కారణం అదికాదని మానేజర్ కి తెలుసు. కానీ ప్రశ్నించే ధైర్యంలేదు. 'అలాగే సార్' అని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.
   
    చెంచురామయ్య అక్కన్నుంచి కార్లో బయల్దేరాడు. ఈ రెండో వ్యవహారాన్ని మాత్రం తానే స్వయంగా నిర్వహించాలి- చాలా రహస్యంగా చేయాలి. అతఃడికి బాగా కావల్సిన వ్యక్తి ఆ ఆఫీసులో వున్నాడు. అతడిని పట్టుకుని దేశం నలుమూలలా ఈ పని చేయించాలి, లక్ష ఖర్చయినా ఫర్వాలేదు. కానీ దీని వెనకాల చెంచురామయ్య కంపెనీ వుందని మాత్రం తెలియకూడదు. ఈ ప్లాను ఫలించిందంటే, కోట్ల ఖర్చుతో రవితేజ పరిచయం చేయబోతున్న స్కీము ఆదిలోనే కుప్పకూలిపోతుంది.
   
    చెంచురామయ్య వెళుతూంది-పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసుకి!
           
                     *    *    *
   

    చెంచురామయ్య కలుసుకున్నది ఆ ఆఫీసులో పెద్ద అధికారిని కాదు. ఇలాటి పనులకు పెద్ద అధికారులు లాభంలేదు. చిన్నవాళ్ళే అమోఘంగా పని చేస్తారు. ఇద్దరిమధ్యా రహస్య చర్చలు అరగంటసేపు జరిగాయి. పాతికవేళా రూపాయలు చేతులు మారేయి. ఒకే పోస్టాఫీసునుంచి పెద్ద ఎత్తులో, ఎక్కువ సంఖ్యలో ఏమైనా వస్తువులు పంపవలసి వచ్చినప్పుడు, ఆ ఆఫీసు తాలూకు పోస్టు మాస్టర్ ఆ కస్టమర్ కోసం విడిగా ఒక క్లర్క్ ని కేటాయిస్తాడు. ఇపుడు రవితేజ కంపెనీకి ఆవిధంగా దాదాపు వందమంది క్లర్కులని ఆ పనిమీద నియమించవలసి వస్తుంది. అయితే యిది ప్రభుత్వానికి కూడా లాభదాయకం కాబట్టి యిందులో ఇబ్బందేమీ లేదు. రవితేజ మొదటి విడతగా దాదాపు పదివేల చీరలని పంపదల్చుకున్నాడు- అయితే యిది శాంపిల్ మాత్రమే అతడి ఆలోచనలు అతడికున్నాయి. లక్షలమీద పంపకం జరిగేటప్పుడు పోస్టుమీద యింత ఖర్చుపెట్టటం అనవసరం ఉపాధి పథకం క్రింద వేలమంది నిరుద్యోగుల్ని స్వంత బాధ్యతలమీద నియమించవచ్చు. దేశాన్ని విభాగాల క్రింద విడగొట్టి ఇలా ఒక్కొక్క విభాగానికి కొంతమంది యువకుల్ని నియమిస్తే మరింత వేగంగా పంపకం జరుగుతుంది. ఈ రిప్రజెంటేటివ్స్ కి కోడ్ నెంబరు, కస్టమర్ అడ్రస్ పంపిస్తే చాలు, వాళ్ళే స్వయంగా చీరెని ఇంటికి అందజేస్తారు. వారి ఖర్చు చీర ఒక్కటికీ పది పైసలకన్నా ఎక్కువ పడదు.
   
    ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నందుకు ఇది తప్పకుండా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తుంది. దీని ప్రారంభోత్సవం ఏ ప్రధానమంత్రితోనో చేయిస్తే అన్ని పేపర్లూ, రేడియో, టీ.వీ. కవర్ చేస్తాయి. పదిలక్షల రూపాయల వ్యాపార ప్రకటనల ఖర్చులేకుండా రవితేజ టెక్స్ టైల్స్ కి ప్రచారం లభిస్తుంది. (పెద్ద పెద్ద కంపెనీలు ప్రముఖుల ఆసరా ఎందుకు తీసుకుంటాయో రవితేజకి బాగా తెలుసు.) అయితే తన మనసులో మాట ఎవరికీ చెప్పలేదు అతడు. సమయం వచ్చినప్పుడు చెపుదామనుకున్నాడు. బోర్డుకి మాత్రం అన్యాపదేశంగా మాత్రమే అర్ధమయ్యేటట్టు ఒక పారాగ్రాపు ఎజెండాలో చేర్చి వుంచాడు.
   
    అర్ధం చేసుకోగలిగేవాళ్ళకి యిందులో కూడా వ్యాపార లక్షణం కనపడుతుంది. 'మిగతావారి అంగీకారం కోసం నువ్వొక ప్రపోజల్ పెట్టదల్చుకుంటే అందులో చిన్న లొసుగు వుందని నీ మనసులో ఏ మూలో కొద్దిగా అనుమానం వుంటే, అదే ప్రపోజల్ లో మరి రెండు మూడు పెద్ద లొసుగుల్ని చేర్చు. అందరి దృష్టీ వాటిమీదకి వెళ్ళి, సమయమంతా వాటిని చర్చించటానికే సరిపోతుంది. ఉదారంగా ఆ లొసుగుల్ని తొలగించటం ద్వారా మిగతావారికి నువ్వు దిగివచ్చినట్టు కనపడుతుంది. నువ్వు చెయ్యదల్చుకున్న పనీ నెరవేరుతుంది' అన్న సూత్రాన్ని అక్కడ అన్వయించాడు. అతడి ఆలోచన ఫలించింది. డైరెక్టర్లందరూ ఈ స్కీమ్ గురించే ఆలోచించారు తప్ప, ఇన్ని లక్షల చీరలు పోస్ట్ ద్వారా ఎలా పంపటం అన్న విషయాన్ని చర్చించలేదు. డీలర్ల వ్యాపారం తగ్గించి కొత్తగా కమీషన్ ఏజంట్స్ ని నియమించడం అన్న విషయంగానీ చర్చకి వచ్చి వుంటే అందరూ ముక్తకంఠంతో దాన్ని తిరస్కరించి వుండేవారే! దాదాపు పది లక్షల చీరెలు తయారయ్యాక తన ఆలోచనని అప్పుడు బోర్డులో ప్రవేశపెడదామనుకున్నాడు. కానీ తనకన్నా ముందే చెంచురామయ్య తమ ప్రణాళికని దెబ్బకొడతాడని వూహించలేదు అతడు. అదృష్టవశాత్తు అది ముందే బయటపడింది.

 Previous Page Next Page