"నాకూ నచ్చలేదు" అన్నాడు త్రయంబకరావు.
"నాకు వాడే కాదు. మీరు నచ్చలేదు. అవసరానికి చూసీ చూడనట్లు ఉన్నాను. లేకపోతే నీ అడ్డెడు తప్పాలా తలని రామకీర్తన పాడిద్దును. నీ కొడుకు ముఖం రక్కేద్దును" అనుకుంది అమల. వాళ్లనో ఆట కాలక్షేపానికి ఆడిద్దామనుకుంది.
"ఏయ్ పిల్లా ఇటురా!" అంది గంగారత్నంతో.
"నేను పిల్లను కాదే తల్లీ! అత్తయ్యనమ్మా అత్తయ్యని వాడేమో నీ బావ" దగ్గరకు వస్తూ అంది గంగారత్నం.
"అట్టాగా, వరేయ్ బావగా నువ్వూ ఇట్టా రారా!" అంది అమల.
ఇదే సందు అదే ముందన్నట్లు త్రయంబకరావు ఆమె దగ్గరకు వచ్చాడు.
"ఆ కుర్చీ ఆసనంలో కూర్చో బావగా!" అంది ఆమె.
ఆమె పక్కన సోఫాలో కూర్చుందామనుకున్న త్రయంబకరావు ఆశ నిరాశయింది. పిచ్చిదానితో తెలివిగా వ్యవహరించాలి గాని మొండిగా పొగూడదని తగ్గి కుర్చీలో కూర్చున్నాడు.
"నేనెక్కడ కూర్చోను తల్లీ?" ప్రేమగా అడిగింది. గంగారత్నం.
"నీవిలా కింద కూర్చో!"
"కిందనా!"
""ఆ కిందే, కూర్చోపోతే నే ఏడుస్తా."
"ఏడవకు తల్లీ! మళ్ళీ అదో గోల. అలాగే యిదిగో నీ ఎదుట కింద కూర్చుంటున్నాను. సరేనా!" అని కింద కూర్చుంటూ "రామచంద్రా!ఈ పిచ్చిదానితో ఏం కష్టమొచ్చింది! అని గొణిగింది.
"ఊ..... కాలిమీద కొట్టుకుంటూ పాట పాడు" అమల అంది.
"పాటా!"
"ఆ పాటే సంగీతం పాట పాడు. నేను బావగాడు వింటాము."
"నాకేం పాటలోచ్చు! ఇదెం ఖర్మ!" వాపోయింది గంగారత్నం.
"వరేయ్ బావగా ఆ పిల్లదానితో చెప్పరా పాట పాడమని."
"అలాగే చెపుతా. మరి నా మాట వింటావా!"
"నువ్వు మంచి వాడివి. ముందు పాట కావాలి. లేకపోతే గట్టిగా ఏడుస్తాను. ఏయ్ పాడమంటుంటే!"
"దీన్ని మంచి చేసుకోవాలంటే తప్పదు మరి పాడవే అమ్మా ఏదో ఒకటి!" త్రయంబకరావు విసుక్కున్నాడు.
గంగారత్నం యింక పాత ఎత్తుకుంది.
"విందూ చేసిరమ్మ వియ్యాలవారు......"
ఎవరన్నా వింటారన్న సిగ్గుతో బిక్కచచ్చిపోయి తగ్గు స్వరంతో గార్ధబ స్వరంతో పాడటం మొదలుపెట్టింది గంగారత్నం. ఆ పాటతప్ప పెద్దగా పాటలురావు గంగారత్నంకి.
అంతలో వదిలిపెడితే అమల గొప్పతనం ఏముంది.
"ఏయ్ పిల్లా పాట ఆపు!" పెద్దగా అరిచింది అమల.
గంగారత్నం మహా సంతోషించింది. "అమ్మయ్య, చాలా యింక!" అంది లేవబోతూ.
"లేవకు" మళ్ళి అరిచింది అమల.
మళ్ళి కూర్చుండిపోయింది గంగారత్నం.
"పాట యిలా పాడరు చాలా పెద్దగా పాడాలి. నీ పాట విని నేను బావగా చప్పట్లు కొడతాము. అందాకా వదలకుండా అదే పాట పాడాలి లేకపోతే నేను ఏడుస్తా."
"వదలకుండా ఎలా పాడటం, ఎప్పటికి చప్పట్లు కొట్టేను, అందాకా నా గతి అయ్యో!" గంగారత్నం వాపోయింది.
"పాడిందే పాడు. మంచి ఛాన్స్ వచ్చింది. నీ పాట రోజా వింటుంది అప్పుడు నేను కాస్త కాస్త జరిగి రోజా దగ్గరగా కూర్చుని కాస్త ముందుకు పోవటానికి చూస్తాను" త్రయంబకరావు మెరిసే కళ్ళతో అన్నాడు.


