రామకృష్ణ తాగి వచ్చినందుకన్నా అబద్ధం ఆడినందుకు సీత భరించలేనంత బాధ పడుతున్నది పిచ్చి పిచ్చిగ వూహించుకుని బాధ పడుతున్నది. కళ్ళముందు అనేక భయంకర దృశ్యాలు కదలాడుతున్నాయి.
కొద్దిసేపు నెత్తిన చేతులు పెట్టుకుని బాధపడుతూ ఆలోచించాడు రామకృష్ణ. అసలు విషయం సీతతో చెపితే గోల వుండేది కాదు కదా! విషయం తను దాయటం, అది బైటపడటంతో తన పరిస్థితి మహా ఘోరం అయింది. ఇప్పుడు నిజం చెప్పినా సీత నమ్మదు.
ఇప్పుడు సీత ఏం చేస్తుంది?
తను చెప్పింది నమ్ముతుందా?
నమ్మకపోతే ఏమిటి గతి?
సీత నిర్ణయం ఏమిటి?
ఎలా సీత కోపం పోగొట్టాలి!
అలా ఆలోచిస్తున్న రామకృష్ణ ఉలిక్కిపడ్డాడు.
సీత ఏమైంది?
అవును. సీత ఏమైంది?
కోపంతో గదిలోంచి బైటికి వెళ్ళింది.
చాలా ఆవేశంగ కూడా వెళ్ళింది.
కొంపదీసి ఏ అఘాయిత్యానికైనా పూనుకోలేదు కదా!
రామకృష్ణ వణికిపోతూ కుర్చీలోంచి లేచాడు. జరిగిందానికి నీరసానికో మందు ప్రభావమో మరి వళ్ళు తూలింది.
మందు పనిచేయటం లేదుకదా!
సీతా! అని పిలవబోయి షీషా అని పిలుస్తాడేమో!
రామకృష్ణ భయంతో సీతా! అన్నాడు చిన్నగ. ఎవరి మాట వారికి వినపడ్డా అది సరిగా వుందో లేదో అన్న అనుమానం వస్తే కష్టమే. ఇప్పుడు రామకృష్ణ అదే అనుమానం వచ్చింది. తను సీతా! అన్నాడా షీషా అన్నాడా?
అంతా భ్రాంతియేనా అన్నట్లు రామకృష్ణ తల విదిలించి తడబడే అడుగులతో గదిలోంచి బైటికి వచ్చాడు.
ఎక్కడ చడి చప్పుడు లేదు
రామకృష్ణ గుండె దడ దడ లాడింది. గబ గబ వంట గదిలోంచి వెళ్ళాడు. గ్యాస్ స్టవ్ కట్టేసి వుంది కిరసనాయిలు రెండు లీటర్లు పట్టే టిన్ను నిక్షేపంగా మూల గూట్లో వుంది.
అమ్మయ్య అనుకున్నాడు రామకృష్ణ. దొడ్లో పంపు గాక బావి వుంది. అది గుర్తుకు వచ్చి అటు పరుగెత్తాడు. చీకట్లో పెరట్లో నీళ్ళు ఏం కనపడతాయి! మళ్ళి యింట్లోకి పరుగెత్తుకు వచ్చి టార్చిలైటు తీసుకుని అదే వేగంతో పెరట్లోకి వెళ్ళి టార్చిలైటు బావిలోకి వేసి చూశాడు.
బావిలో నీళ్ళు ఏ కదలిక లేకుండా ప్రశాంతంగ కానవచ్చాయి.
అమ్మయ్య అనుకున్నాడు రామకృష్ణ. ఏమో ఏం చెప్పగలం? ఆవేశంతో యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం కోల్పోతారు కొందరు. వెనుక చూడకుండా అఘాయిత్యం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమనుకుని ఏం ప్రయోజనం!
రామకృష్ణకి తెలుసు. సీతలాంటి స్త్రీ మంచికి ప్రాణం పెడుతుంది. ఆవేశం వస్తే ప్రాణం తీసుకుంటుంది అని......
రామకృష్ణ సీతకోసం పెరడంతా గాలించాడు. ఆ తర్వాత గది గది గాలించాడు.
సీత కనపడలేదు.
సీతాదేవి కానరానప్పుడు శ్రీరామచంద్రుడిలా దుఃఖిస్తూ వీధిలోకి వచ్చాడు రామకృష్ణ.
వరండా మెట్లమీద కూర్చుని మోకాళ్ళ మధ్య తల దూర్చుకుని అశోకవనంలో సీతలా దుఖిస్తున్నది సీతా మనోహరి.
రామకృష్ణకి చాలా సంతోషం వేసింది. తను కూడా వెళ్ళి మెట్లమీద కూర్చుని "సీతా!" అన్నాడు.
సీతకి దుఃఖం రెట్టింపు అయింది. పెద్దగ ఎక్కిళ్ళు పెట్టింది.
"సారీ సీతా!"
సీత మాట్లాడలేదు.


