Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 36


    వెంటనే యాష్ ట్రేనుంచి తుపాకీగుండు-హమీద్ గుండెల్లోంచీ దూసుకుపోయింది.
    నాయుడు గదిలోంచి బయటకు వచ్చాడు. హాల్లో అతడికోసం చందూ ఎదురు చూస్తున్నాడు. నాయుడు చాలా తాపీగా-"బొంబాయి విశేషాలేమిటి?" అన్నాడు.
    "చందూతో పనులెలా జరుగుతాయో మీకు తెలియదా?" అన్నాడు చందూ గర్వంగా.
    "నువ్వింకా ఓవర్ కాన్ఫిడెన్సులోనే ఉన్నావు. నాకిప్పుడు కాన్ఫిడెన్సే లేకుండాపోయింది. ఆ చౌదరి మనవి చావు దెబ్బతీశాడు. నేను కాబట్టి తట్టుకో గలిగాను. ప్రస్తుతం నీకోసం ఎదురు చూస్తున్నాను...."
    "చెప్పండి బాస్- ఆ చౌదరిని చంపేద్దామా?"
    "చంపవలసిన అవసరముంది కానీ చౌదరిని కాదు-గోపీని!"
    "గోపీనా." ఆశ్చర్యంగా అన్నాడు చందూ. అంతలోనే అతడి పిడికిలి బిగిసింది-"వాడిని నేనే స్వయంగా చంపుతాను-"
    "వద్దు చందూ-నువ్వొద్దు-" అన్నాడు నాయుడు.
    "ఎందుకని?"
    "నిన్ను ఆ గోపీ చాలా సులభంగా ట్రిక్ చేశాడు...." అన్నాడు నాయుడు అతణ్ణి రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో.
    "అందుకే వాడిప్పుడు ఫలితం అనుభవించాలి-"
    "వాడు జిత్తులమారి వాడి ముందు మన ఎత్తులేమీ ఫలించటంలేదు-"
    చందూ నవ్వి- "బాస్-మీరిలాగంటున్నారు కాబట్టి ఆ గోపీ దగ్గరకు నేను వెళ్ళను. నామనిషి చాలు ఇందుకు-" అన్నాడు.
    "సరే-వెంటనే రంగంలోకి దిగు. నీ మనిషి ఫెయిలైనాకనే నాక్కనిపించు-అప్పుడేమిగతా విశేషాలుమాట్లాడదాం-"అన్నాడునాయుడు.
    
                                              20
    
    ఎటువంటి వాడినైనా నిర్దాక్షిణ్యంగా చంపగలవాడు అన్వర్. అతడు చందూకు కుడిభుజం. గోపీని చంపే బాధ్యత అన్వర్ కు అప్పగించాడు చందూ.
    "వాడి శవాన్ని మీరు చూస్తారా? స్మశానానికి పంపేయనా?" అన్నాడు అన్వర్ మొదటి ప్రశ్నగా.
    "రెండూవద్దు. వాడిని చంపి శవం దగ్గరే ఉండి నాకు కబురు చెప్పు. నేను వస్తాను-" అన్నాడు చందూ.
    "శవానిక్కాపాలా కాయడం నాకు మహాచిరాకు-" అన్నాడు అన్వర్.
    "వీడి శవానికి తప్పదు. మహాజిత్తులమారి వీడు-" అన్నాడు చందూ.
    "నేను ఒక్కపోటు పొడిస్తే స్వర్గానికి వెళ్ళడానికి ఆత్మకూడా బ్రతకదు. వాడి జిత్తులు నాకొక లెక్కా?" అన్నాడు అన్వర్.
    "అదంతా ఎందుకు-నేను చెప్పినట్లుచేయి-" అన్నాడు చందూ.
    అన్వర్ వెళ్ళాడు.
    అతడు సాయంత్రం కనుచీకటి పడేవరకూ ఆగి అప్పుడు గోపీ ఇంటికి వెళ్ళాడు. నెమ్మదిగా తలుపు తట్టాడు.
    అప్పుడు గోపీ ఇంట్లోనే ఉన్నాడు. అతడు డోర్ వ్యూలోంచి తలుపు ఎవరు తట్టిందీ చూశాడు. మనిషిని చూడగానే ఏ పనిమీద వచ్చాడో అర్ధమయింది. గోపీ పక్కగదిలోనికి వెళ్ళి విశాలతో-"నువ్వీ యింట్లో ఉన్నట్లు వచ్చినవాడికి తెలియకూడదు. ఏ గొడవా లేకుండా వాడిని బయటకు పంపేస్తాను-" అన్నాడు. విశాల తల ఊపింది.
    ఈలోగా అన్వర్ మళ్ళీ తలుపు తట్టాడు. ఈసారి మరి కాస్త గట్టిగా....
    గోపీ-"వస్తున్నా-" అని అరిచి తూలుకుంటూ తలుపు దాకా వెళ్ళి తలుపుతీసి నాలుగడుగులు వెనక్కు వేశాడు.
    అన్వర్ చటుక్కున లోపలకు వచ్చి తలుపులు వేసి- "హేండ్సప్! అన్నాడు. అతడి చేతిలోనికత్తి తళతళ మెరుస్తున్నది.
    గోపీ మరోరెండడుగులు వెనక్కువేసి-"నేను చేతులెత్తను. నువ్వు నన్ను చంపేసివెళ్ళిపోవచ్చు-" అన్నాడు కొద్దిగా తూలుతూ.
    "నేను వేళాకోళమాడ్డంలేదు-" అన్నాడు అన్వర్ అయితే అతడు ముందడుగువేయడానికి భయపడ్డాడు. ఏం చూసుకుని గోపీ అంతధైర్యంగా ఉన్నాడోనని అతడాలోచిస్తున్నాడు.
    "నేనూ అడ్డంలేదు-" అన్నాడు గోపీ.
    "అయితే నీకు చావాలని ఉందా?"
    "అవును ఎలాచావాలా అని ఆలోచిస్తూంటే నువ్వొచ్చావు. మంచిదే అయింది. సరిగ్గా టైముకి వచ్చావు. అట్టేబాధకలక్కుండా మా ఆచార్లు గారింజెక్షన్ చేసినట్లు-నొప్పితెలీకుండా గుండెల్లో పొడిచేసి వెళ్ళిపో-" అన్నాడు గోపీ.
    అన్వర్ ఆశ్చర్యపడి-"నీకు చావాలన్న కోరికఎందుక్కలిగింది? ఎవడైనా బలవంతుడితో విరోధం పెట్టుకున్నావా?" అన్నాడు.
    "చీమకుకూడా హానిచేయలేనినేను ఎవరితోనైనా విరోధంపెట్టుకుంటానా- నాజీవితంవ్యర్ధం, నేనెవరికోసం బ్రతకలనుకుంటున్నానో ఆమె నన్నువదిలి రమేష్ ని పెళ్ళిచేసుకుంది-" అన్నాడు గోపీ.
    తను పొరపాటున మరోఇంట్లో అడుగుపెట్టాడా అని అనుమానం కలిగించి అన్వర్ కి అతడింకా ఆలోచిస్తూండగానే -"ఆమెనన్నుకాదని రమేష్ ని ఎందుకు పెళ్ళిచేసుకుందీ-అని అడుగు....." అన్నాడుగోపీ.
    అన్వర్ అనాలోచితంగానే అలా అడిగాడు.
    "చెప్పడానికేముంది-రమేష్ భాగ్యవంతుడు. నేను పేదవాన్ని.....అందుకని నా ప్రియురాలునన్ను కాదనేసింది...."
    అన్వర్ కుతూహలంగా-"అయితే పేదవారందరినీ ప్రియురాండ్రి లాగే తిరస్కరిస్తారంటావా?" అన్నాడు.
    "ఏమో-నేను అందరిలాంటి పేదవాడినీ కాదు నిరుద్యోగినికూడా!"
    "అయితేమాత్రం-జీవితాంతం నిరుద్యోగిగానేఉండి పోతావా?"
    "ఏమో-ఆసంగతి తెలియదుకానీ-ఉద్యోగంవచ్చినా జీవితాంతం తీరని అప్పులు కూడాఉన్నాయినాకు....."
    అన్వర్ జాలిగా-"నీమీద అన్నిబాధ్యతలు వదిలిన నీకన్నవారిని అనాలిగానీ అందుకు నిన్ను తప్పుపట్టి లాభమేమిటి-" అని-"ఇంతకీ నీపేరుగోపీయేనా?" అనడిగాడు.
    "నా పేరుగోపీయా -"అని పకపకానవ్వాడు గోపీ-" నువ్వా గోపీగాడికోసం వచ్చావన్నమాట-చాలామంది గోపీకోసం ఈ యింట్లోకే వస్తారు. అది అడ్రసుమహత్యం అనుకుంటాను....."

 Previous Page Next Page