కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది జానకి.
కుసుమ చటుక్కున లేచి మాధవను తీవ్రంగా చూస్తూ "తరువాత ,మాట్లాడుదురు గాని , ముందు జానకి తేరుకునేట్లు చూడండి...." అంది.
మాధవ రెండు చేతుల్తో జానకిని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద చన్నీళ్ళు జల్లాడు.
"జానకీ!" అన్నాడు కాతరస్వరంతో.
ఆ స్వరం విని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నీళ్ళు నిండిన కళ్ళతో బేలగా, దీనాతిదీనంగా మాధవను చూసింది. మాధవ హృదయం ద్రవించిపోయింది.
ఒక్కసారిగా జానకిని తన హృదయంలో హత్తుకుని , ఆమెను తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలనిపించింది.
"ఎలా ఉంది జానకీ?" అని ఆప్యాయంగా అడిగాడు.
బాగానే ఉందన్నట్లు జానకి తల ఊపింది.
"నన్ను క్షమించు జానకీ! నువ్వు నాకు శాశ్వతంగా దూరమవుతావన్న భావం భరించలేక ఏదేదో ,మాట్లాడేశాను. నన్ను నమ్ము. నాకు ఆ డబ్బు మీద వ్యామోహం లేదు."
"నాకుందని అనుకుంటున్నారా?"
"మరి......?"
ఆగిపోయాడు మాధవ.
జానకి చూపులు కుసుమ చూపులతో కలుసుకున్నాయి. జానకి క్రింది పెదవి బాధగా కొరుక్కుంటూ కనురెప్పలు వాల్చుకుంది.
ఏదీ అర్ధం చేసుకోలేకపోయాడు మాధవ.
"నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి జానకీ! ఆ ఆస్తి కోసం వచ్చాననుకోకు. నువ్వు నాకు దూరమవటం సహించలేక వచ్చాను. నీ నిర్ణయం మారదా జానకీ? నాతొ రావా?"
జానకి దుప్పటి కొసలు వేలితో మెలిపెడుతూ కూచుంది. హృదయం కరిగి కళ్ళలోంచి ప్రవహిస్తున్నా నోరు విడివడలేదు.
ఆ కన్నీటిని తన చేతులతో తుడవాలని ఎంత కోరిక కలిగినా బలవంతాన నిగ్రహించుకున్నాడు మాధవ. భారంగా నిట్టూర్చి లేచాడు.
"సరళ నీకేం చెప్పిందో నాకు తెలీదు జానకీ! నువ్వు నా జీవితంలోకి ప్రవేశించి నా ఆలోచనలన్నింటినీ ఆక్రమించుకోకముందు నేను సరళను గాడంగా కోరిన మాట నిజమే! కాని , ఇప్పుడు నువ్వు తప్ప నాకెవరూ అక్కర్లేదు. ఏనాటికైనా నీ నిర్ణయం మార్చుకుని నువ్వు నా దగ్గరకు రాగలిగితే నీ స్థానం నీకు ఉంటుంది. ఆ స్థానాన్ని ఎవరూ బర్తీ చేయలేరు. నువ్వు నా దగ్గరకు రాలేకపోయినా కనీసం ఒక స్నేహితుడిగా నన్ను భావించి నీకు అవసరమైనప్పుడు నాకు ఉత్తరం రాస్తే వస్తాను" లేచాడు మాధవ.
భరింపరాని వ్యధ స్పష్టంగా ప్రతిఫలిస్తోన్న జానకి ముఖం అతని హృదయాన్ని ముక్కలు చేస్తోంది.
ఇంతకంటే స్పష్టంగా తన మనస్సును జానకికి ఎలా వివరించగలడు?
గుమ్మం దాకా నడిచిన మాధవ ఒక్క క్షణం ఆగి జానకి చూపులతో చూపులు కలిపాడు.
ఆర్తితో చూస్తోన్న జానకి చూపులతో కలిసిన చూపులను విడదీసుకోవటం మాధవ వశం కాలేదు.
"ఒక్కమాట జానకీ! నీకేం అవసరమైనా నాకే ఉత్తరం రాయి. వాళ్ళకీ, వీళ్ళకీ రాయకు. అది నేను సహించలేను. నీకు అవసరానికి సహాయం చేసే అర్హత కూడా నాకు లేదా?"
జానకి ముందుకు వాలి మాధవ పాదాలనల్లెసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
మాధవ అయోమయంగా చూసి ఆమెను భుజాలు పట్టుకుని లేవనెత్తి "ఎందుకీ క్షోభ జానకీ! రా ! నాతో వచ్చెయ్యి" అని అనురాగమంతా ఉట్టిపడే స్వరంతో చివరిసారిగా అడిగాడు.
ఎంత తుడుచుకున్నా ఆగని కన్నీళ్లు ఒత్తుకుంటూ జానకి తల ఊపింది అడ్డంగా....."
ఒక్క నిట్టుర్పు విడిచి , గుమ్మం దిగి టాక్సీలో కూచున్నాడు మాధవ.
ద్వారబంధాన్ని పట్టుకుని శిలాప్రతిమలా నిలబడిపోయిన జానకి మూర్తి అతని మనస్సులో హత్తుకు పోయింది.
"ఏమిటిదంతా?" ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్."
"తెలుస్తుంది ఒక్క నెలలో!' శాంతంగా సమాధానం చెప్పింది కుసుమ.
తూలిపడబోతున్న జానకిని పొదివి పట్టుకుని హృదయానికి హత్తుకుంది .
చెమ్మగిల్లిన కళ్ళను పై కండువాతో ఒత్తుకోవటం కంటే ఏం చెయ్యలేక పోయాడు శ్రీనివాస్.
* * *
మాధవ వచ్చాడని మోహన్ ద్వారా విన్న సరళ వెంటనే మాధవను చూడటానికి వచ్చింది.
అసలే చికాగ్గా ఉన్న మాధవ మనసు సరళను చూడగానే మరింత చికాకు పడింది.
ఎందుకో అతనికి జానకి అనుభవిస్తోన్న మూగబాధకు సరళ మాటలే కారణమయి ఉండాలని బలంగా అనిపించసాగింది. ఆ కారణం చేత సరళ పట్ల మరింత విరక్తభావం కలిగింది మనసులో.
కనుబొమలు చిట్లించి "కూచో!" అన్నాడు పొడిగా.
తనను చూడగానే మాధవ ముఖంలో కనిపించిన విసుగూ, చిరాకూ సరళను చాలా బాధించాయి. ఆమె కుంగిపోయింది.
"జానకి కనిపించిందా?"
"ఆ!"
"ఏమందీ?"
".........."
"ఆస్తి స్వాధీనం చేసిందా?"
"......."
"నేను చెప్పలేదూ? జానకి ఎవరినో....."
సరళ మాటలు పూర్తీ కాకుండానే విసురుగా లేచాడు మాధవ.
"సరళా! ఇక మీదట నా దగ్గర జానకిని గురించి ఎప్పుడూ ఏమీ మాట్లాడకు. జానకి మంచిదైనా, చెడ్డదైనా , నన్ను ప్రేమించినా, ప్రేమించకపోయినా, నాకు జానకి తప్ప ఎవరూ అక్కర్లేదు. ఏనాటికో ఒకనాటికి జానకి న దగ్గరికి వచ్చి తీరుతుందనే నమ్మకం నాకుంది. ఆ నిరీక్షణలోనే నా కానందం. జానకి ప్రస్తావన నా దగ్గర తెదలుచుకుంటే నా దగ్గర కసలు రాకు" కఠినంగా అన్నాడు మాధవ.
గంభీరంగా ఉన్న మాధవ మూర్తిని చూస్తూ అతని కటు స్వరాన్ని వింటూ ఏమీ మాట్లాడలేకపోయింది సరళ.
ఆ తరువాత సరళ ఎంత ప్రయత్నించినా మాధవ హృదయంలో స్థానం పొందలేకపోయింది.
జానకిని తలుచుకున్నంత మాత్రానే ఆమె హృదయం దహించుకుపోసాగింది.
ఈ జానకి కారణం ఇంతకూ. ఈ జానకి మధ్యలో రాకపోతే ఈపాటికి తనూ, మాధవా హాయిగా సంసారం చేసుకుంటూ ఉండేవారు.
అవును, జానకి లేకపోతే-
అకస్మాత్తుగా జానకి చచ్చిపోతుంది. మాధవ చాలా కుంగిపోతాడు. తను దగ్గరుండి అనునయ వాక్యాలతో అతని హృదయానికయిన గాయాన్ని మానుస్తుంది. మంచి మాటలతో అతని మనసును తన వైపు తిప్పుకుంటుంది. జానకి ఎలాగూ లేదు గనుక మాధవ మళ్ళీ తననే ప్రేమిస్తాడు . అప్పుడు....
ఇలా సాగిపోయేవి సరళ ఆలోచనలు.