"పోదు నా అటెండెన్స్ ఎవరో ఒకరు పలికేస్తారు. అయినా నువు వెళ్ళమన్నా నేను హైదరాబాద్ కి వెళ్ళనంటే వెళ్ళను."
"ఏం కధ?"
"నువు రోజు జీవన్ ని హాస్పిటల్ లో కలుసుకుంటున్నట్లు కాకి కబురందించి నా వల్లో పడ్డ జేవన్ ని నువు నీ వల్లో పడేసుకుంటే నీ వల్లో పడ్డవాన్ని బా వల్లో వేసుకోవడం కష్టం కదా అందుకని" కన్ను కొట్టి నవింది.
అణు నవలేదు. జీవితాన్ని యింత తేలిగ్గా తీసుకునే యీ పిల్లని సరిగ్గా అర్ధం చేసుకోకుండా తన దారిలో తను జీవన్ ని చక్కదిద్దుకోకుండా క్షణికమైన ఉద్రేకంలో సంసారం ఒదిలేసుకుని రావడం ఎంత పొరపాటైనది?
టెలిఫోన్ మోగింది. మొదట్లో ఫోన్ రింగ్ అవగానే ఆశతో రిసీవర్ ఎత్తేది అణు. కాని రాను రాను రకరకాలుగా వస్తున్న ఫోన్ కాల్స్ విసిగిపోయి ఫోన్ దగ్గిరకు వెళ్ళడం మానుకుంది. వందన తీస్తోంది ఫోన్ ఇప్పుడు. ఏదైనా ముఖ్యమైనదనుకుంటేనే అణుకిస్తోంది. వందన ఫోన్ అందుకుని అవతలివాళ్ళు చెప్పింది విని, మౌత్ పీస్ చేత్తో మూసి, అణు వైపు తిరిగి, "ఎవరో టి.వి. వాళ్ళట నీతోనే మాట్లాడాలని అంటున్నారు.'
అణు వచ్చి ఫోన్ అందుకుంది. అటువైపు నుంచి అడగొంతు. "మేడమ్! మీ పాప తప్పిపోయిందని తెలుసు. మీ బోటి ప్రముఖురాలికి యిలాంటి కస్టాలు రావడం మాకందరికీ కష్టంగానే వుంది. ఈ సందర్భంలో మీరు మా టి.వి ఆడియెన్స్ కి ఏదైనా అభ్యర్ధన యిస్తారా? పోనీ మా ప్రశ్నలకి సమాధానాలిస్తారా! టి.వి చూసే లక్షలాది ప్రేక్షకులలో ఎందరో మీ ఫాన్స్ ఉండొచ్చు మీ యిబ్బంది తెలుసుకుని మీకు సాయం చెయ్యడానికి ముందుకు రావొచ్చు."
కొంతసేపు ఆలోచించింది అణు. టి.వి మహిళా విభాగం ప్రొడ్యుసరు, ఆమె యిద్దరి అసిస్టెంట్లు వచ్చారు. అణు అందరికి నమస్కారాలు చేసి కూర్చోమని కుర్చీలు చూపించింది.
"వెంటనే కార్యక్రమం ప్రారంభిద్దామా?" అడిగింది ప్రోడ్యుసరు.
కెమెరా మెన్ వీడియో కెమెరా ఎడ్జెస్ట్ చేసుకుంటూ "మేడమ్! ఇఫ్ యూ డోన్త్ట్ మైండ్.
కొంచెం మేకప్ అవుతారా? టి.వి స్క్రీన్ పైన బొమ్మ బాగా వస్తుంది.' అన్నాడు. నావలో ఏడవాలో అర్ధం కాలేదు అణుకి.
కూతురు తప్పిపోయి తను కుములుతుంటే వీళ్ళు మేకప్ అంటారు. ఎవరి గోల వాళ్ళది. టి.వి మహిళా ప్రోడ్యుసరు, "మేడమ్ రాగ ఫోటో వైపు చూస్తూ మాట్లాడితే ఇంటర్యూ మరింత ఎఫెక్టివ్ గా వస్తుంది". అంది. ఆవిణ్ణి చాచి కొట్టాలన్నంత కోపం వచ్చినా సభ్యత కోసం బలవంతా నిగ్రహించుకుంది.
"రాగ ఫోటో యీ గదిలోనే వుంది". సైడ్ టేబిల్ మీద వున్న ఫోటో వేపు చూపించింది. జీవన్, అణు రాగ కలిసి వున్న ఫోటో అది.
"మీరింకా యీ ఫోటో మీ టేబుల్ మీదే వుంచుకుంటూన్నారా?" ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
"అంటే?"
"మీరు జీవన్ విడిపోయారు కదా అందుకని....." ఆవిడ ధోరణి చాలా చికాకు కలిగించింది అణుకి.
"మీరు ప్రశ్నలడడగండి," అంది శాంతంగా. మైక్ అణు నోటి ముందు పెట్టి ప్రశ్నలు ప్రారంభించింది ఆవిడ.
"మీ అమ్మాయి ఎలా తప్పిపోయింది?"
"మా మామయ్య గారింట్లో మాట్లాడుతూ కూర్చున్నాను. రాగ ఎందుకో రోడ్డు మీదకి పరిగెత్తింది. మామయ్య గారి అమ్మాయి వందన వెంటనే తనూ రోడ్డు మీదికి వెళ్ళింది. ఏదో కారు అడ్డుగా వచ్చిందట. కారు వెళ్ళేసరికి రాగ కనపడలేదు.'
"చిత్రంగా వుందే! అసలు పాప రోడ్డు మీదికి అలా ఎందుకు పరిగెత్తింది? రద్దీగా వుండే రోడ్డు మీద అటూ యిటూ పరిగెత్తకుడదని మీరు పాపకి చెప్పలెదూ?"
"చెప్పాను"
"చెప్పినా కూడా, కార్లు వస్తున్నా లక్ష్య పెట్టకుండా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తేటంతా ఎగ్జేట్ మెంట్ పాపకి ఎలా కలిగింది?"
"నాకు తెలియదు"
"ఏదైనా ఏక్సిడెంట్ అయి ఉండొచ్చని ఉహిస్తున్నారా?"
"భువనేశ్వర్ హాస్పిటల్స్ అన్నీ చూశాము లేదు"
"మీరేమీ అనుకోకుండా వుంటే ఒక ప్రశ్న. ఈ రోజుల్లో డిసిప్లెన్ పేరిట కొందరు తల్లిదండ్రులు పిల్లల విషయంలో మరి స్ట్రిక్ట్ గా వుంటున్నారు. చిన్న పిల్లలకి "డు- నాట్స్" లో కాకుండా బుజ్జగించే రీతిలో ఏ విషయమైనా నచ్చజెప్పాలని చాలా మందికి తెలియడం లేదు. ఈ స్ట్రిక్ట్ నెస్ భరించలేకే ఎందరో పిల్లలు ఇళ్ళల్లోంచి పారిపోతున్నారని- వాళ్ళని అటు హరేరామ హరే కృష్ణ మఠం వాళ్ళు, ఇటు హిప్పిలు తమ లాలనతో, తియ్యని మాటలతో వశ పర్చుకుంటున్నా రని మాకు వర్తమానం అందింది. మీరు రాగ విషయంలో మరీ స్ట్రిక్ట్ గా వున్నారా?"
"లే-లేదు"
"మరి ఏవైనా ఆటబొమ్మలు గాని, ఏదైనా ఎన్ టర్ టైన్ మెంట్ గాని, ఆ సమయంలో వీధిలో రాగకి కనిపించి ఉంటుందా?"
"తెలియదు"
"మేం ఎంక్వయిరీ చేశాము. అలాంటిదేమీ ఆ సమయంలో అక్కడ లేదని తెలిసింది. ఆరోజు రాగని స్కూలు కి పంపలేదని తెలిసింది. ఎందుకు పంపలేదో చెప్పలగరా?"
వెంటనే సమాధానం చెప్పలేకపోయింది అణు సునాయసంగా అబద్దాలు చెప్పడం ఆవిడకు చేతకాదు.
"క్షమించండి ఆ మధ్య ఒక తల్లి ఇలాగే భర్త నుంచి విడిపోయి తిరిగి అతనితో కలుసుకోవడానికి మరే దారిలేక తన కూతురు తప్పిపోయిందని తనే ప్రచారం చేసి కూతుర్ని అన్న వారింట్లో దాచేసింది. మీరు అలాంటి ప్రయత్నమేదన్నా చేశారా?"
"ఛ! ఛ! అలాంటిదేమీ లేదు"
"అయితే జీవన్ తో రాజి పడే ఆలోచన మీకేమి లేదన్నమాట."
మాట్లాడలేదు అణు.
"కంగ్రాచ్యులేషన్ అణుగారూ! మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటె మన సమాజం ఎంతో ముందుకి వెళ్తుంది. పాతకాలపు సంప్రదాయాల నుండి బయటపడి మనం కూడా పాశ్చాత్య దేశాలల్లో లాగ అభునికత మార్గాల్లో జీవిస్తాం. మీ జీవన్ గారు మరొక అమ్మాయితో ఉంటున్నారని విన్నాం. ఏంతో ఆనందంగా ఉంది."
కూర్చున్నది నిర్ఘాంతపోయి చటుక్కున లేచి నిలబడింది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. నోట మాట రాలేదు. అక్కడే వున్న జలజ మాత్రం మనసారా హాయిగా నవుకుంది.