Previous Page Next Page 
స్త్రీ పేజి 35

 

    "నాకేం లేదు. అసలు నీకోసమే నేను రెండు రోజులుగా వీధులన్నీ వెతుకుతున్నాను. రోడ్లన్నీ సర్వే చేస్తున్నాను. దాదాపు అన్నీ ఆఫీసుల్లో నూ వాకబు చేశాను. ఈ ఊళ్ళో ఉంటూ కూడా నువ్వు కనిపించలేదంటేనే ఆశ్చర్య పోయేదాన్ని. తెలిసిందా?"
    "అయితే నువ్విక్కడ కొచ్చి ఎన్నాళ్ళయింది?"
    "మూడు రోజులైంది. ఈ గవర్నమెంటు హాస్పిటల్ లో ఓ డాక్టరు రెండు నెలల లీవు మీదున్నాడు. ఆ ప్లేస్ లో జార్జిని వెళ్ళమంటే ఒప్పుకున్నాడు. సరే! నాకు నిన్ను కలుసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. తప్పకుండా ఈ ప్రయాణం సెటిల్ చేసుకుందామనుకున్నాను. నేను లీవ్ పెట్టి జార్జి వెంట వచ్చాను. నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. కాస్త వెదర్ మార్పు కూడా పనికి వస్తుందనిపించింది లే."
    "ఏం? నీకేం బాగాలేదు?"
    పద్మజ అందంగా నవ్వింది. "ఏం బాగలేదని చెప్పను?"
    "ఏం బాగాలేదో అదే చెప్పు." అమాయకంగా అడిగింది పార్వతి, పద్మజ మొహంలోకి చూస్తూ.
    పద్మజ కళ్ళలో సిగ్గు దొంతరలు కనిపించినట్టయ్యాయి. అలాగే నవ్వుతూ జవాబు చెప్పకుండా కూర్చున్న పద్మజ ను చూస్తుంటే కాస్త ఆశ్చర్యం వేసింది. "అదేమిటి పద్మా? ఎన్నడూ లేనిది ఎందుకు కలా సిగ్గు పడుతున్నావు?"
    "ఎన్నడూ లేనిది జరుగుతోంటే సిగ్గు పుట్టదంటావేమిటి?"
    పార్వతి ఏదో అనుమానంతో పద్మజ కళ్ళలోకి చూసింది. "నిజం చెప్పు, తల్లివి కాబోతున్నావు కదూ?" అవునా?"
    అవునన్నట్టే నవ్వింది పద్మజ ప్రశాంతంగా.
    "సంతోషం, పద్మా! చాలా సంతోషంగా ఉంది." స్వగతం లాగ అనుకొంది పార్వతి.
    "నిన్ను కలుసుకోగలిగినందుకు నా కెంత సంతోషంగా ఉందొ చెప్పలేను , పారూ!"
    "అందుకే కాబోలు ఒక్క ఉత్తరం కూడా వ్రాయకుండా సంవత్సరాలకు సంవత్సరాలే గడిపావు."
    "నువ్విలా నిష్టూరం వేస్తె నేనేమీ అనలేను. కాని, ఉత్తరాలు వ్రాసినంత మాత్రాన నా మనస్సు నీకు చెప్పలేను. ఆనాటి నుంచీ నిన్ను ఒక్కసారి చూసి మాట్లాడాలని అనుకుంటూనే ఉన్నాను."
    "పోనీ, పెళ్ళికి ముందైనా మాట మాత్రం చెప్పావా? నేనసలు నీకు గుర్తే రాలేదు కదూ?"
    "రాలేదు. ఎలా వస్తావు? పెళ్ళి కూతురికి పెళ్లి కొడుకు ధ్యాస తప్పితే మరేమైనా ఉంటుందా?" హాస్యంగా చూసింది పద్మజ. పార్వతి మూతి ముడుచుకుని నటిస్తూ, "అదేమో నాకు తెలీదులే" అనేసింది.
    ఇద్దరూ నవ్వుకున్నారు.
    కారు కాంపౌండ్ లో వదిలి లోపలికి నడుస్తూ పార్వతిని వెంట తీసి కెళ్ళింది పద్మజ. ప్లాస్క్ లో కాఫీ కప్పుల్లోకి వంచి పంచదార కలుపుతూ ఫాన్ అన్ చేసి వచ్చి కూర్చుంది. "ఇక ఇప్పుడు అడుగు, పారూ! నీకు తిట్టాలని ఉంటె ఖచ్చితంగా తిట్టేయ్!"
    "ఎన్నిటి వరకూ హద్దు పెట్టావు? ఓ వంద తిట్లా?' నవ్వి కప్పు అందుకుంది పార్వతి. "తిట్టటం కాదు గానీ నీ ప్రేమ గురించీ , పెళ్ళి గురింఛీ నాతొ ఒక్క మాటైనా చెప్పావా? సడెన్ గా నీ మేరేజ్ ఫోటో పేపర్ లో చూస్తె నమ్మలేకపోయాను , తెలుసా? ఓ వారం క్రిందటే నీకెవరో పెళ్ళి చూపుల వాళ్ళోస్తున్నారాన్నట్లు వ్రాసింది సుజాత. అంతలోనే ఈ వార్తా. ఆశ్చర్యంతో తల మున్కలయ్యాననుకో."
    "క్షమించు పారూ! నా పెళ్ళి విషయం ఒక్క నాన్న కే చెప్పగలిగాను."
    'అన్నట్టు , బాబాయ్.....' చటుక్కున ఆగి పద్మజ మొహంలోకి పరిశీలనగా చూసింది పార్వతి. పద్మజ మొహం నిండా విషాదం ఆవరించుకొంది. "నాన్న పోయిన సంగతి నాకూ తెలుసు, పారూ!"
    "నీకు తెలుసా? ఎలా తెలిసింది? సుజా ఉత్తరం వ్రాసిందా? అబ్బే! అలా వ్రాస్తుందా?"
    "మన ఊరునుంచేదో స్పెషల్ కేసు వచ్చింది మద్రాస్ లో నేను పనిచేస్తోన్న హాస్పిటల్ కి. ఆ పేషెంట్ నలబై ఎళ్ళావిడ. అస్తమానూ వస పిట్టలా వాగుతూంటుంది. విన్నా వినకపోయినా ఊరూ పేరూ అన్నీ తనకు తనే చెప్పుకునేది. మన పూరు నుంచి వచ్చారని వినగానే ఉండబట్టలేక అడిగాను-- ఫలానా తాసిల్దారు గారు బావున్నారా? అని. ఆవిడ రకరకాలుగా చేతులు తిప్పుతూ, "ఇంకెక్కడి , బాగమ్మా! పెద్ద కూతురు ఇంట్లోంచి పోయి ఎవడ్నో పెళ్ళి చేసేసుకుందిగా? ఆ బెంగతో ఆ మారాజు మరి వీధి మొహం చూడలేదు. ఎడాది తిరిగే సరికే కన్ను మూశాడు' అంటూ సంగతంతా చెప్పింది, పారూ! నాన్న చనిపోయారన్న కబురు తలుచుకుంటే ఇప్పటికీ నాకెంతో ఆవేదనగా ఉంటుంది. అందరి లాగే అయన వృద్దాప్యం లో ఏవో శారీరాక రోగాలతో బాధపడి పొతే అది వేరు. కాని నాన్న మాత్రం పూర్తిగా నా బెంగతోనే కృశించి పోయారు. అసలే బ్లడ్ ఫ్రెషర్ కంప్లయింట్ ఉందేమో -- దానికి తోడుగా మనస్సు ఆందోళన చెందటంతో ఎంతో కాలం తట్టుకోలేక పోయారు. చివరికి అయన మరణానికి నేనే కారణ మయ్యాను, పారూ! అయన నాకు జీవితాన్నిచ్చి జీవించే అర్హతలు కలిగించినందుకు ఇలా ఋణం తీర్చుకున్నాను." పద్మజ కళ్ళలో విషాదం కదిలింది.
    పార్వతి కేం మాట్లాడటానికీ తోచలేదు.
    "నాన్న నా కోరిక అర్ధం చేసుకున్నారు. ఒక రకంగా అంగీకరించారు కూడాను. కాని అయన సంస్కారం వేరు. అయన సంఘం వేరు. దాన్ని కాదని ధిక్కరించలేకపోయారు. నలుగురి లోనూ నవ్వుల పాలై పోయామే అన్న దిగులే ఆయన్ని అంతం చేసింది."
    "కాని, పద్మా, నువ్వు చాలా సహాసమే చేశావు."
    పార్వతి మనస్సులో మాట కాస్తా వెల్లడి చేసింది.
    "నా కంత సాహసంగా కనిపించక పోయినా ఒప్పు కోక తప్పదు లే, పారూ! నేను చేసిన పని గురించి మాత్రం ఎన్నడూ పశ్చాత్తాప పడలేదు. ఇక ముందు కూడా అలా జరగదు."
    ప్రసంగం మార్చింది పార్వతి. "అయితే బాబాయి పోయిన కబురు తెలిసినప్పుడైనా నువ్వు ఒక్కసారి రాకపోయావా?"
    "ప్రయోజన మేమిటి? నాన్న ఎలాగూ లేరు. ఆయన్ని ఆఖరి చూపు కూడా చూడ లేకపోయాను. అమ్మ ఉన్నా నా మొహం చూడదు. ఏ ఆశతో వచ్చేది?"
    "పోనీ , బాబాయి ఆఖరి రోజుల్లోనే నీకా కబురు తెలిస్తే...."
    "తెలిసినా వచ్చేదాన్ని కాదు, పారూ! ఆయనకి ఎన్నో విధాల కర్మకాండలు జరుగుతుంటాయి. నా రాక వల్ల వాటిని అపవిత్రం చేసి వాళ్ళ నమ్మకాలేందుకు నాశనం చెయ్యాలి? నాన్నని చూడక పోవటమే నాకు తృప్తిగా ఉంది. అయన నా హృదయం లో సజీవంగా ఉన్నారు."
    "ఊ" ఊకొట్టి ఊరుకుంది పార్వతి.
    తిరిగి క్రమంగా సంభాషణ ,మామూలు ధోరణి లో పడింది.
    "అయితే ఇంతకీ నీ జీవితం ఎలా సాగుతోంది?" ఆప్యాయంగా అడిగింది పద్మజ, పార్వతి చూస్తూ.
    "నేను చెప్పటాని కేముంది? నా జీవితంలో చెప్పుకోదగ్గ విశేషాలు మాత్రం ఏమున్నాయి?"
    "మరి ఇంకా ఎన్నాళ్ళి లా ఒంటరిగా ఉందామనుకుంటున్నావు? నువ్వు నెత్తి మీద వేసుకున్న బాధ్యతలన్నీ తీరిపోయాయిగా? ఇప్పటి కైనా జీవితంలో నీకు మరో సుఖం అక్కర్లేదా?"
    "నన్నేం చెయ్యమంటావు?' సగం నిరాశగా సగం అపహాస్యంగా అడిగింది పార్వతి.
    "అసలు నీకు పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ఉందొ లేదో నాకు చెప్పు. లేకపోవటం ఏమిటి? లేకపోతే ఎలా? నువ్వేం మానవాతీతంగా ఊడి పడ్డావా? పెళ్ళి చేసుకోకపోతే జీవితానికి అర్ధం ఏమిటి?" మందలింపు గానే అంది పద్మజ. పసిపిల్లలా సిగ్గుపడింది పార్వతి. "అయితే నాకో మంచి సంబంధం చూడరాదూ?' అంది కళ్ళతో నవ్వుతూ.
    "అందుకే అడుగుతున్నానోయ్! నువ్వు సరేనంటే నీ పెళ్ళి జరిపించే పూచీ నాది. పెళ్ళి కొడుకు రఘు బాబు లాగ నోట్లో నాలిక లేకుండా ఉంటాడనుకున్నావేమిటి? కత్తి లాంటి వాణ్ణి చూసి నిర్ణయిస్తాను. ఇంతకీ వర్ణాంతరమైనా అభ్యంతరం లేదా? లేకపోతె ఒక్క కులం వాడూ, ఒక్క శాఖ వాడూ తప్ప పనికి రాదా?" ఎర్రగా ఉండాలా? తెల్లగా ఉండాలా? పచ్చగా ఉండాలా?"
    "ఆహా! నల్లగా ఉండాలి." నవ్వేసింది పార్వతి. "నాకు పెళ్ళీ వద్దు ఏమీ వద్దు గానీ నీ కంత అభిమానం ఉంటె...."
    "ఊ , అభిమానం ఉంటె? ఆగిపోయావెం?"
    "నీకు కొడుకు పుడితే నా కిచ్చెయ్!"
    "కుతురైతేనో!"
    "ఊహూ , వద్దు. కష్టపడి పెంచి పెద్ద చేస్తే నీలాగే అదీ నన్ను ధిక్కరించి పోతుంది. కొడుకైతే వాడి చేతుల్లో నా తనువూ వెళ్ళి పోతుంది."
    "హాస్యం కాదు, పారూ! నిజం చెప్పు. నువ్వు పెళ్ళి చేసుకోరాదూ?"
    "తర్వాత ఆలోచిద్దాం లే, పద్మా! మరేదైనా కబుర్లు చెప్పు."
    కబుర్ల సందట్లో టాక్సీ హార్న్ విన్పించనే లేదు. జార్జి విలియమ్స్ బూట్లు టకటక లాడించుకుంటూ వచ్చాడు. పద్మజ జార్జీని పార్వతి నీ పరస్పరం పరిచయం చేసింది. పార్వతి సిగ్గుపడుతూ కూర్చుంది ఇబ్బందిగా. "పద్మా! నేనిక వెళ్ళి పోతాను లే. మళ్ళా రేపు వస్తాను."
    విసుక్కుంది పద్మజ. "చాల్లే ఊరుకో. నీ కంగారు నువ్వునూ."
    జార్జి నవ్వునూ అన్నాడు: "మీరు ఉండి పొండి, సిస్టర్! నాకు నైట్ డ్యూటీ కూడా ఉంది. చాలా కాలానికి కలుసుకున్న ఫ్రెండ్స్ కదా? ఆ మాత్రం కబుర్లు చెప్పుకోక పొతే ఎలా?"
    "థాంక్స్!" అంటూ నవ్వింది పద్మజ. "తమరు అనుకోకుండా ఇల్లు విడిచి పోతున్నందుకు మెనీ మెనీ థాంక్స్!"
    పార్వతి రాబోతున్న నవ్వు పెదవుల్లో బంధిస్తూ కూర్చుంది. పద్మజ కోరి వివాహం చేసుకున్న జార్జిని పరిశీలనగా చూసింది పార్వతి. ఆ దంపతుల దగ్గర తను దిష్టి బొమ్మలా ఉన్నానేమో అన్నంత శంకతో నేలచూపులు చూస్తూ కూర్చుంది.

 Previous Page Next Page