మోహన్ హోటల్ లోటస్ కి వచ్చి స్వతంత్రంగా ప్రసూన గదిలోకి వెళ్ళబోయాడు- శేఖర్ అడ్డు తగిలాడు.....
"అది మేనేజర్ గారి ప్రైవేట్ సెక్రటరీ రూం సార్! ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు......"
"నాకు అక్కడే పని ఉంది......."
"మీకు పని ఉంటే బయట ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వీల్లేదు....."
"నేను ఆ గదిలోకి వెళ్ళవలసినది డ్యూటీమీద! మాట్లాడటానికి కాదు......"
తన జేబులోంచి ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు మోహన్.....శేఖర్ ఏమీ మాట్లాడలేకపోయాడు ......
స్ప్రింగ్ డోర్ తలుపులు తెరుచుకుని మోహన్ లోపలకు వచ్చాడు.
అతడిని చూసి కంగారుగా లేచి నిల్చుంది ప్రసూన......
"కూర్చోండి!" అన్నాడు మోహన్, తనూ కూర్చుంటూ.....
ప్రసూన బల్లమీది ఫోన్ మ్రోగింది......
"ప్రసూనా? జాగ్రత్త? మోహన్ కు ఏ విషయమూ తెలియనివ్వకు!"
గట్టిగా పలికింది సాంబశివం కంఠం. ఎదురుగా కూర్చున్న మోహన్ కి కూడా వినిపించేటంత స్పష్టంగా......
ప్రసూన వెలవెలపోయింది.......
మోహన్ చిరునవ్వుతో "ఆ రికార్డుకోసం వచ్చాను" అన్నాడు.
"అది......దాని సంగతి నాకు తెలియదు!"
"ఫర్వాలేదులెండి. నాకు తెలుసు!"
మోహన్ లేచివెళ్ళి ఆ గదిలో ఒక మూలగా పడివున్న పాత మేగజిన్ల కట్టలోంచి చిత్తుకాగితాల పుస్తకంలా వున్న ఒకదానిని తీసి పరిశీలించి చూశాడు. వికసించిన ముఖంతో జేబులో పెట్టుకున్నాడు. అయోమయంగా చూస్తోన్న ప్రసూనను ఉద్దేశించి "దొరికిందిలెండి. వెళ్ళొస్తాను" అన్నాడు......
గుమ్మందాకా వెళ్ళి ఆగి వెనక్కు తిరిగిచూసి వెటకారంగా నవ్వుతూ "సాయంత్రం సంఘ సేవకి వస్తారుగా? అప్పుడు మాట్లాడుకుందాం!" అనేసి తలుపు మూసేశాడు......
ఆ తలుపులు ఒకదానితో ఒకటి టక్కున కొట్టుకున్నాయి. ఆ శబ్దం ఏదో అదృశ్యశక్తి తన హృదయం మీధ కొడుతున్న దెబ్బకి ప్రతిధ్వనిలా అనిపించింది ప్రసూనకు......
మోహన్ ఆ హోటల్ ఆవరణ దాటకుండానే శేఖర్ కలుసుకున్నాడు......
"మిమ్మల్ని మా మేనేజర్ గారు ఒకసారి రమ్మంటున్నారు సార్!" అన్నాడు.....
అంతవరకూ మోహన్ సాంబశివాన్ని కలుసుకుని మాట్లాడలేదు. ఒక్కక్షణం ఆలోచించి "ఆల్ రైట్!" అని సాంబశివం గదిలోకి వచ్చాడు.....శేఖర్ వెళ్ళిపోయాడు.
సాంబశివం లేచి మర్యాదగా మోహన్ ను ఆహ్వానించాడు. ఇద్దరూ ఒకరి నొకరు పరిశీలించుకుంటూ కొన్ని క్షణాలు మౌనంగా వున్నారు.
ఏవిధమయిన ఉపోద్ఘాతాలూ లేకుండా విషయంలోకి వచ్చేశాడు సాంబశివం.....
"మీ రేటెంత?"
మోహన్ ఠంగుణ సమాధానం చెప్పాడు.
"నేను అమ్ముడుపోయే మనిషిని కాను."
సాంబశివం నవ్వాడు.
"మనమంతా అమ్ముడుపోయి- పోబోతున్న వాళ్ళమే ఏదో ఒక విధమైన రేటు మనకి ఉండక తప్పదు. ఇవాళ కాకపోతే...... రేపు!....."
"సరే! అలాంటి రేపులోకి మీరు రాగలిగినపుడు నాతో మాట్లాడండి!"
"అలాగే! రేపటివరకూ ఆగకుండా ఇవాళే పరిష్కరించుకోలేమా?"
"లాభంలేదు!"
"ఒక్కసారి ఆలోచించుకోండి!"
"ఆలోచించుకోవలసిన అవసరమేమీలేదు."
మోహన్ లేచి చెయ్యిజాపాడు. సాంబశివం చిరునవ్వుతో ఆ చెయ్యి అందుకుని "గుడ్ బై!" అన్నాడు.
మోహన్ తన గది దాటగానే రేఖకు ఫోన్ చేశాడు సాంబశివం.
"నువ్వు నీపని ప్రారంభించవచ్చు!"
రేఖ మెరుపులా వెళ్ళి వెళ్ళబోతున్న మోహన్ కి అడ్డుగా నిల్చుంది......
"ఇంతదూరం వచ్చి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతారా?"
"ఇప్పుడు పని ఉంది....."