Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 34


    "అలా నిరాశ చెందకు. నన్నిక్కడినుంచి బైటకు తీసుకుని వెళ్ళలేవు. కానీ నా ప్రాణాలజోలికి రాకపోతే నేనూ నీ ప్రాణాలజోలికి రాను. నిన్ను బయట దిగబెడతాను-" అన్నాడు చౌదరి.
    ఇద్దరూ కలిసి ఆ యింట్లోంచి బయటకు వచ్చారు. చౌదరికి కాస్త వెనుకగా నలుగురు తుపాకులు గురిపెట్టి బయటకు వచ్చారు. అయితే ఎవ్వరూ ఆయుధాలుపయోగించాల్సిన అవసరం లేకపోయింది. నాయుడు కారెక్కాడు చౌదరి లోపలకు వెళ్ళిపోయాడు.
    "ఏమయింది బాస్!" అన్నాడు సోము.
    "సోమూ-మన ట్రిక్కులు పాతబడిపోయాయి. అందుకు కారణం ఆ కొత్తవాడు గోపి. వాడి సంగతి తేల్చనిధే మనం తలెత్తుకుని తిరగలేము. నన్నింటి దగ్గర దిగబెట్టి నువ్వు వెళ్ళి చందూని పిల్చుకునిరా!" అన్నాడు నాయుడు.
    "చందూ బొంబాయి వెళ్ళాడు బాస్! నెలరోజులదాకా రాడనుకుంటాను-" అన్నాడు సోము.
    "అవునవును-" అని తలపంకించి- "నెలరోజులు నేను ఆగక తప్పదనుకుంటాను. ఈ నెలరోజులూ మనం మన వ్యవహారాలను వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉండాలి-" అన్నాడు నాయుడు.
    
                                           19
    
    "ఏమండీ-వంట్లో ఎలా ఉంది? ఈ మధ్య రోజూ ఆలస్యంగా లేస్తున్నారు. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టడం లేదా?" అన్నది మాలతి.
    నాయుడు బద్దకంగా వళ్ళువిరుచుకుంటూ- "అవును మాలతీ-ఈ మధ్య రోజూ నా కలలోకి ఒక రాక్షసుడు వస్తున్నాడు. వాడిని నాశనం చేయడానికి ఏ పూజలో, వ్రతాలో చేయకూడదూ-" అన్నాడు.
    "వాడు రాక్షకుడైతే వాడే నాశనమైపోతాడండీ-పూజలు, వ్రతాలు రాక్షసుల ప్రాణాలు నిలబెట్టడానికేగానీ తీయడానికి కాదు-" అన్నది మాలతి.
    "ఏమిటీరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. నువ్వుకూడా కొత్త ట్రిక్సు నేర్చుకుంటున్నావా?" అన్నాడు నాయుడు.
    "ఇందులో కొత్త ట్రిక్సేమున్నాయి? అలనాడు తులసి, మండోదరి తమ పూజలతోనే రాక్షసులైన భర్తల ప్రాణాలు నిలబెట్టారు. అయినప్పటికీ అవతార పురుషుడొకడుదయించి ఆ రాక్షసులనంతం చేయగలిగాడు. దుర్మార్గుడు ఏ రోజుకైనా తనంతట తాను నశించక తప్పదు-" అన్నది మాలతి.
    నాయుడు భుజాలు తడుముకుంటూ- "అయితే నా సంగతేమిటంటావ్? నీ పూజలవల్ల ఇంకా బ్రతికున్న రాక్షసుడినా? రాక్షసులనంతం చేస్తున్న అవతార పురుషుడినా?" అన్నాడు.
    మాలతి ఏమీ ఆలోచించకుండా- "మీ గురించి నేనేమీ ఆలోచించను. నేను కోరినవన్నీ మీరు నాకు ఇస్తున్నారు. నేను కోరేది మీ క్షేమం. మీ సంతోషం. అంతే!" అన్నది.
    "మాలతీ! నువ్వు భార్యగా లభించడం నా అదృష్టం-అందుకేనేమో నువ్వు నా ప్రాణం-" అన్నాడు నాయుడామెను దగ్గరగా తీసుకుంటూ.
    ఆమె అతడిలో కరిగిపోతూ-"ఈ రోజు అశోక్ వస్తున్నాడుగదా ఏర్పాట్లేం చేస్తున్నారు?" అన్నది.
    అశోక్ నాయుడి ఏకైక పుత్ర రత్నం. నాయుడు అతడిపై ఫిరంగిపురం నీడకూడా పడకుండా జాగ్రత్తగా పెంచుకుని వస్తున్నాడు. అశోక్ కి బాగా చదువు వచ్చింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనలియర్లోకి వచ్చాడు. సమ్మె కారణంగా రెండు నెలలపాటు కాలేజీ మూసివేస్తే ఇంటికి వస్తున్నాడు.
    అశోక్ ఫిరంగిపురం వాతావరణంలో యధాతధంగా తిరగడం నాయుడికి నచ్చదు అందుకోసమని అతడి గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాడు. అందుకు కొందరు మనుషుల్ని నియమిస్తాడు. ఆ కారణంగా అశోక్ కి ఫిరంగిపురం కూడా అన్ని ఊళ్ళలాగే తోస్తుంది.
    "ఈ వెధవూళ్ళో ఉన్న మూలాన ఏర్పాట్లు చేయక తప్పదు-" అన్నాడు నాయుడు విసుగ్గా-"ఊరు మారాలి-"
    "ఏ ఊరైనా మీరు మారాక ఒక్కలాగానే ఉంటుంది-" అన్నది మాలతి.
    "అంటే నీ ఉద్దేశ్యం?" అన్నాడు నాయుడు.
    "అంటే నాకు-అని-" అంటూ మాలతి నవ్వి- "మీరులేని ఏ ఊరైనా నరకమే నాకు. మీరుంటే ఏ ఊరైనా స్వర్గమే నాకు-" అన్నది.
    "చంపేశావ్ లే-అయినా ఈ మధ్య నేను నా నీడను చూసికూడా బెదిరిపోతున్నాను-అశోక్ గురించి నువ్వేమీ బెంగపడకు ..." అన్నాడు నాయుడు.
    అశోక్ మధ్యాహ్నానికి ఇంటికిచేరాడు. అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తల్లిదండ్రులకు అతడు తనకు వచ్చిన ఓ వెండి పతకాన్ని చూపించాడు.
    "అమ్మా-ఇది నాకెందుకు వచ్చిందో తెలుసా?" అన్నాడు అశోక్.
    "చెప్పు-" అన్నది మాలతి.
    "మా కాలేజీలో గోవిందరావని నా క్లాస్ మేటు. అతడికి ధనవంతులంటే అసహ్యం. పేదవాళ్ళని దోపిడీచేసి ధనికులందరూ సుఖజీవనం చేస్తున్నారని అంటాడు. అతడికి ముఖ్యంగా నేనంటే కోపం. మా క్లాసులో స్వంతకారులో కాలేజీకొచ్చేది నేనొకడినే! నాన్న గురించి వాడు చాలా చెడ్డగా చెప్పాడు, నా గురించీ దుష్ప్రచారం లేవదీశాడు. కానీ నేను రెచ్చిపోయే వాడిని కాదు. నేను రెచ్చిపోతే వాడి మాటలను నిజం చేసిన వాడిని అవుతాను కదా. శాంతంగానే వినేవాడిని. నా శాంతం కారణంగా చాలా మంది నిజమనుకున్నారు. అతడు కాస్త దుడుకు మనిషి. ఒక రోజు నేను, నా స్నేహితులు రెండో ఆట సినిమాకి వెళ్ళాం. హాల్లో గోవిందరావు కూడా కనబడ్డాడు. నన్ను చూసినా పలకరించలేదు. తర్వాత ఏమయిందో హాల్లో ఏదో పెద్ద గొడవయింది. గోవిందరావు ఎవరో అమ్మాయిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ. ఆ అమ్మాయి తాలూకు మనుషులు నలుగురు. చాలా బలంగాఉన్నారు. వాళ్ళు గోవిందరావును హాలు బయటకు తీసుకుని వెళ్ళి తన్నసాగారు. విషయం తెలిసి నేను వెళ్ళికలగజేసుకున్నాను. ముందు నేను నాలుగు దెబ్బలు తిన్నాను. తర్వాత నా అంతస్థు తెలిసి వాళ్ళు గోవిందరావును వదిలిపెట్టారు. నేను అతడి గురించి మంచిగా చెప్పాను. అయితే ఆ రాత్రే గోవిందరావు యాక్సిడెంట్లో ఇరుక్కున్నాడు. బహుశా ఆ సినిమాపిల్ల తాలూకు వాళ్ళే అయుండాలి. గోవిందరావు కొనప్రాణంతో హాస్పిటల్లో చేర్చబడ్డాడు అతడి ప్రాణాలు నిలబెట్టడానికి రక్తం కావాలన్నారు. నేను రక్తదానం చేశాను మా కథ కాలేజీ ప్రిన్సిపాలు వరకూ వెళ్ళింది. ఆయన ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి నాకీ పతకం బహూకరించాడు. ఇప్పుడు గోవిందరావు నా మిత్రుడు-" అన్నాడు అశోక్.

 Previous Page Next Page