Home » Mainanpati bhaskar » Vennela Metlu

 

    చీరె కట్టుకుని, పమిట సరిచేసుకుంటూ బాత్ రూమ్ లో నుంచి వచ్చిన ప్రతిమ ఇంగ్లీషు భాషలోని ఆ అక్షరాలని ఇదివరకెన్నడూ చూడనంత ఆశ్చర్యంగా, ఆనందంగా, అపురూపంగా చూసింది.
    
    "డాక్టర్ (మిసెస్) ఆర్. ప్రతిమా శ్రీరాం, ఎమ్.బి.బి.ఎస్."
    
    వాటర్ జగ్గులోనుంచి గ్లాసులో నీళ్ళు పోసి, ఎత్తి పట్టుకున్నాడు శ్రీరాం.
    
    "ఫర్ ద హెల్త్, వెల్త్ అండ్ ఫేమ్ ఆఫ్ డాక్టర్ ప్రతిమా!" అన్నాడు టోస్ట్ చెబుతున్నట్లు.
    
    "థాంక్స్! థాంక్స్ ఎ లాట్!" అంది ప్రతిమ కృతజ్ఞతగా అతని వైపు చూస్తూ.
    
    "ఉత్త థాంక్ స్ తో సరిపోతుందా? ఇంకేం ఇవ్వక్కర్లేదా?"
    
    "ఏమడిగినా ఇచ్చేస్తాను."
    
    "మరి అలాంటప్పుడు చీరె మళ్ళీ అప్పుడే ఎందుకు కట్టేసుకున్నావ్?"
    
    "ఆఁ! ఇంకేం పన్లేదు!" అంది ప్రతిమ చిరునవ్వుతో.
    
    అరగంట తర్వాత-
    
    టైమ్ చూసుకుని, "అరె! పదిన్నర అయిందే! క్రికెట్ కామెంటరీ స్టార్టయిపోయి ఉంటుంది!" అని హడావిడిగా చిన్న పాకెట్ సైజు ట్రాన్సిస్టర్ ఆన్ చెయ్యబోయాడు శ్రీరాం.
    
    అతను స్విచ్ ఆన్ చెయ్యకముందే, ఫుల్ వాల్యూమ్ లో రేడియో పెట్టినట్లు కిందనుంచీ రమణయ్య కామెంటరీ వినబడటం మొదలెట్టింది. అతనీ మధ్య తరచుగా వస్తున్నాడు వీళ్ళింటికి.
    
    ఏ పార్టీ పవరులో ఉంటే ఆ పార్టీలోకి రాజకీయ నాయకులూ కప్పల్లాగా దూకినట్లు, కేశవరావు గ్రూపులోనుంచి విడివడి శ్రీరాం వాళ్ళ గ్రూపులో చేరిపోయాడు రమణయ్య.    

 

    వద్దనుకున్నా చెవుల్లో జొరబడుతున్నాయి అతని మాటలు.
    
    "కేశవరావుగాడు పరమ భ్రష్టుడమ్మా! 'కనకపు సింహాసనమున' అన్న పజ్జెం వీణ్ణి చూసే రాసి ఉంటారు. వాడి కూతుర్ని మీరు ఏరి కోరి చేసుకుని కడుపులో పెట్టుకుంటే అది గ్రహించక, నానా అవాకులూ, చవాకులూ వాగుతాడా? కేవలం అప్రాచ్యుడమ్మా!" అంటున్నాడు సరస్వతితో.
    
    "పోనీలెండి! ఎవరి పాపాన వాళ్ళు పోతారు. నాకు ముద్ద బంగారం లాంటి కోడలు దొరికింది! అదే చాలు!"
    
    "వాడు వూరిలో అందరితో ఏమి పేలుతున్నాడో తెలుసా? మీరు తన కూతురి అందచందాలు చూసి, తన వంశం చూసీ చేసుకోలేదుట! అమ్మాయి చదువు చూసి చేసుకున్నారుట! ఆ చదువు పెట్టుబడిగా పెట్టుకుని లక్షల మీద లక్షలు సంపాదించాలని మీ కోరికట! అందుకే కట్నం కూడా అక్కర్లేదని పిల్లని దొంగచాటుగా ఎత్తుకెళ్ళిపోయి, కాగితం పెళ్ళి చేసేసుకున్నారుట - వ్యాపారస్థుల బుద్దులుట మీవి!"
    
    కింద సరస్వతి ఏం మాట్లాడినట్లు వినిపించలేదు. కాస్సేపు దుర్భరమైన నిశ్శబ్దం.
    
    "అమ్మా! పంట తాలూకు డబ్బు రేపొక రెండువేలు రావలసి ఉంది. ఇవాళ ఇంటి శిస్తు కట్టడానికి ఆఖరి రోజు! ఒక రెండొందలుంటే సర్దండి! రేపు ఇచ్చేస్తాను" అంటున్నాడు రమణయ్య.
    
    శ్రీరాం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళలో ఎర్రజీర కనపడింది.
    
    ఆటను నిదానంగా ప్రతిమ వైపు తిరిగాడు.
    
    "సారీ ప్రతిమా! నీకు ఈ బోర్డు మీద అంత ముచ్చటగా ఉంటే దీన్ని బెడ్ రూంలోనే తగిలించుకో! లేదా కప్ బోర్డులో దాచెయ్! అంతేకానీ ఇది బయట వేళ్ళాడదియ్యడానికి వీల్లేదు. అలా వేలాడదీస్తే, నా పరువుకి ఉరి తీసినట్లే! నా పెళ్ళాం  చదువుతో వ్యాపారం చేసే పనికిరాని వెధవను కాను నేను!" అంటూ చటుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
    
    వూహించని ఈ పరిణామానికి నిర్ఘాంతపోయి, అలానే చూస్తూ నిలబడిపోయింది ప్రతిమ.
    
                                                             * * * * *
    
    "ఊఁ! ఎప్పుడు మొదలెడతావే ప్రాక్టీసు?" అంది శృతి. తను బంధువుల ఇంటికి మెడ్రాసు వెళ్ళి, నెల రోజులు ఉండి వచ్చింది.
    
    తలెత్తి చూసింది ప్రతిమ. "ఎప్పుడో మొదలెట్టేశాను" అంది వినీ వినబడకుండా.
    
    "అదేమిటి?" అంది శృతి ఆశ్చర్యపోతూ.
    
    "అవును. ఇంట్లో కూర్చుని గోళ్ళు గిల్లుకోవడం ప్రాక్టీసు చేస్తున్నాను. అప్పుడప్పుడు గోళ్ళు నెయిల్ కట్టర్ తో కట్ చేస్తాను. ఆ తరవాత చిన్న ఆకురాయితో ఫైల్ చేస్తాను. నెయిల్ పాలిష్ వేసుకుంటాను. అదే నాకు కాలక్షేపం! అదే ఆయనకి ఇష్టం!" అంది ప్రతిమ, సంతోషం లేని నవ్వు నవ్వుతూ.
    
    "పజిల్ లా మాట్లాడకు! ఏం జరిగిందో చెప్పు!"
    
    అంతా చెప్పింది ప్రతిమ.
    
    "నేను మాట్లాడనా శ్రీరాంతో?"
    
    "సరే!" అన్నట్లు తల వూపింది.
    
    రాత్రికి -
    
    విశాలమైన పెరట్లో, సిమెంటు చప్టా మీద జంబుఖానా పరిచి భోజనాలు వడ్డించాడు సుబ్రమణి. చుట్టూతా చెట్లు, పైన పౌర్ణమి చంద్రుడు. ఆ వెన్నెల అంత తెల్లటి అన్నం వెన్నెల కన్నా తెల్లటి పెరుగు. నైట్ క్వీన్, పున్నాగ, పొగడ సువాసనలు.
    
    పొగడటానికి చేతకానంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం.
    
    అప్పుడు-
    
    ఒక రంగు రంగుల చిన్న పురుగు రంగంలో ప్రవేశించింది.    

 

    అందమైన చిన్న పురుగు అది. బంగారు రంగులో ఉంది. మృదువైన అమెరికన్ జార్జెట్ చీరె కట్టుకున్నట్లు పలచటి ఎరుపు రంగు రెక్కలున్నాయి. దానికి రెక్కలున్నా గాలిలో విహరించకుండా, నమ్రతగా సీరియస్ పనేదో ఉన్నట్లు శృతి పక్కనుంచి, పాయసం కప్పు పక్కనుంచీ, కాలీఫ్లవర్ కూర గిన్నె పక్కనుంచీ గబగబ వెళ్ళిపోతూంది. ఉన్నట్లుండి క్లియరెన్స్ సిగ్నల్ అందుకున్న విమానం లాగా సన్నగా శబ్దంచేస్తూ ఏటవాలుగా పైకి ఎగరటం మొదలెట్టింది.
    
    శృతి పక్కన ఉన్నప్పుడే దాన్ని గమనించి, కుతూహలంగా చూస్తున్న శ్రీరాం, "బ్లడీ ఫెలో! ఎగిరి అన్నంలో పడిపోగలదు ఇది!" అంటూ ఒక మూత తీసి దాన్ని అదిలించాడు.
    
    చొరవపాలు అంత ఎక్కువగా లేనట్లు కనబడుతున్న ఆ అందమైన పురుగు వెంటనే అతని పాదాలకి దగ్గరగా వాలిపోయింది. తక్షణం దానిమీద నేర్పుగా మూత బోర్లించేశాడు శ్రీరాం.
    
    లోపలనుంచీ సన్నగా అస్పష్టంగా రొద. పైకి వెళ్ళడానికి, బయటికి రావడానికీ వీల్లేక, ఆ కాస్త పరిధిలో తనని బంధించేసినందుకు ఆరాట పడుతూ కలవరపడిపోతూంది నాజూకైన ఆ పురుగు.
    
    ఆ ట్రాజెడీ నాటకాన్ని అప్రయత్నంగానే అందరూ తదేకంగా చూశారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra