Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

   

    అది ఎస్కేప్ కావడానికి వీల్లేకుండా అన్ని తలుపులూ వేసేసి బయటకు వచ్చేశాడు.    
    కింది లివింగ్ రూంలో ఫోన్ వుంది. పైన బెడ్ రూమ్ లో ఎక్స్ టెన్షన్ వుంది.    
    ఫోన్ ఎత్తాడు. పైన రిసీవర్ ఎత్తింది సౌదామిని.    
    "హలో?"    
    "నేను బయటికి వెళుతున్నాను. ఒక గంటలో వస్తాను" ఫోన్ పెట్టేసి పోర్టికోలోకి వచ్చాడు బాలు.    
    కారు ఎక్కబోతూ అప్రయత్నంగా తల ఎత్తి చూశాడు బాలు.    
    డాబా గోడని ఆనుకుని క్రీనీడలో నిలబడి వుంది సౌదామిని.    
    కారు స్టార్ట్ చేశాడు బాలూ కారు గేటు దాటింది.    
    ఎక్కడికి వెళ్ళాలి?    
    ఏదోలా వుంది మనసు. ఇది భయమా! కోపమా! దిగులా! చిరాకా! విరక్తా! వైరాగ్యమా!    
    ఏదీ అర్ధంకాని స్థితి.    
    ఈ అర్ధంకాని స్థితిలో నుంచి ఏమీ తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఎంత బావుంటుంది!    
    ఒక పెద్ద బార్ దగ్గిర ఆగింది కారు.    
                                                            15    
    గాలి దెయ్యంలా తనని ఆవహిస్తున్న ఆ భయాన్ని మర్చిపోవడానికి వరుసగా నాలుగు పెగ్గుల విస్కీ తాగాడు బాలు.    
    ఆ తర్వాత గుర్తు వచ్చింది అతనికి.    
    భయానికి భయపడి పెగ్గుమీద పెగ్గు తాగితే తన ప్లాను బెడిసికొడుతుంది. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో తను మరొకచోట వున్నాడన్న ఎలిబి సృష్టించుకోవాలి. అందుకోసం ఏం చెయ్యాలో అతను ముందే ఆలోచించి పెట్టుకున్నాడు.    
    మార్తాండ్ ని కలుసుకోవాలి.    
    మార్తాండ్ ఒక పబ్లిషింగ్ కంపెనీ యజమాని. తనూ, సౌదామినీ కలిసి రాసి పాడే పాటలు అందమైన బౌండ్ బుక్కుగా అచ్చువేయిస్తానంటాడు. ఆ బౌండ్ బుక్కులోనే వాళ్ళ మ్యూజిక్ కేసెట్ ఒకటి అమర్చి అమ్ముతానంటాడు.    
    ఊహ బాగానే వుంది. కానీ ఊహించినట్లు అది సక్సెస్ కాకపోతే? అదే చెప్పాడు బాలూ. కేసెట్లు మాత్రమే అయితే ఓ మోస్తరు ఖర్చుతో రికార్డు చేయవచ్చు. నిశ్చింతగా అమ్ముకోవచ్చు. కానీ పుస్తకం... అచ్చు... ఖర్చు....చాలా రిస్కే.. ఇవన్నీ విని నిర్లక్ష్యంగా తల వూపాడు మార్తాండ్. అతను అదేదో చిన్న సంస్థానానికి వారసుడు. సంస్థానాలు రద్దయ్యాయి. రాజభరణాలుపోయాయి. కానీ రాజసం పోలేదు అతనిలో. అతను వ్యాపారానికి పనికిరాడని అతనితో మాట్లాడిన అయిదు నిమిషాల్లోపల అర్ధమైపోతుంది ఎవరికన్నా! పట్టుదలే తప్ప పట్టూ విడుపూ తెలియవు. మార్కెట్ నాడి పట్టుకోలేడు.    
    అందుకనే పది రకాల వ్యాపారాల్లో ఇప్పటికే పదిలక్షలు తగలేశాడు. కాని పది తరాలపాటూ కూర్చుని తినటానికి తగినంత ఎస్టేటు సంపాదించి వెళ్ళాడు వాళ్ళ ముత్తాత. మార్తాండ్ కి దాన్ని తగలెయ్యడం ముఖ్య వ్యాపకం. ఒకదాని కొకటి సంబంధంలేని పది రకాల వ్యాపకాలూ- వ్యాపారాలూ పెట్టుకొని ఎప్పుడూ సతమతమవుతూ వుంటాడు.    
    నగరానికి ముప్పైకిలోమీటర్లు దూరంలో వున్న మేడ్చెల్ ని ఆనుకుని వుంది మార్తాండ్ తోటా, ఆఫీసూ.... తన కారుని అటువైపు పోనిచ్చాడు బాలూ. బాలూని చూడగానే బ్రహ్మానంద భరితుడయ్యాడు మార్తాండ్. "రండి! రండి!" అన్నాడు చేతులు బార్లాజాపి "ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను" అని, టీవీని ఆపెయ్యబోతూ "టీవీ ఉంచమంటారా! ఇంకో అరగంటలో మంచి ప్రోగ్రాం వుంది" అని అడిగాడు.    
    "మీ ఇష్టం" అన్నాడు బాలూ అనాసక్తిగా విస్కీ వాసన గప్పున వస్తుంది మార్తాండ్ దగ్గర కూడా.    
    కొద్దిక్షణాల తర్వాత టీ.వీ. స్క్రీన్ మీద "పాలూ-చేలూ" కార్యక్రమం కనబడింది. "ఇప్పుడు మీరు కుక్కగొడుగుల పెంపకం గురించి వింటారు" అన్న అనౌన్స్ మెంటు తెల్లబోయి "ఇదేమిటి" అన్నట్లు మార్తాండ్ వైపు చూశాడు బాలూ. "అంతా సరిగానే వుంది" అన్నట్లు తల గర్వంగా పంకించాడు మార్తాండ్. "మూడునెలల క్రితం టీ.వీ.లో వచ్చింది ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా వుందన్పించి వీడియో టేప్ చేశాను. అంతేకాదు వెంటనే నేనుకూడా ఒక ఎకరంలో కుక్కగొడుగుల పెంపకం మొదలెట్టాను కూడా?"    
    'ఒర్నీ తాడు తెగ!" అనుకున్నాడు బాలూ, మార్తాండ్ లో ఛార్లీ చాప్లిన్+రాక్ ఫెల్లర్ + రేలంగి కలిసిన అంశం కనబడింది.    
    ఇంతలో "ఇటురండి? బాల్కనీలో నుంచి కుక్కగొడుగుల్ని చూడొచ్చు" అని బాలూ చెయ్యి పట్టుకు తీసుకెళ్ళాడు మార్తాండ్.    
    పాదరసపు చుక్కల్లా కనబడుతున్నాయి కుక్కగొడుగులు. "మష్ రూమ్స్' అంటారు వాటిని ఇంగ్లీషులో.    
    "ఈ మష్ రూమ్స్ ని సిటీలోని ఒక పెద్ద స్టార్ హోటల్ కి రెగ్యులర్ గా సప్లై చేయడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నాను" అన్నాడు మార్తాండ్. బాలూ అనుమానంగా చూశాడు. "అంత డిమాండ్ వుందా వీటికి?"    
    భుజాలు ఎగరేశాడు మార్తాండ్. "వెల్! ఒకప్పుడు మష్ రూమ్స్ అంటే తక్కువగా చూసేవారు జనం. ఇప్పుడు ట్రెండ్ మారింది. మష్ రూమ్స్ అంటే పెద్ద హోటళ్ళలో మంచి కింద లెక్క మష్ రూమ్స్ బిరియానీ, మష్ రూమ్స్ సూప్... మష్ రూమ్స్ అదీ! మష్ రూమ్స్ యిదీ! వీటికోసం పడిచచ్చేవాళ్ళు చాలా మందివున్నారంటే నమ్మాలి మీరు చావడం అంటే గుర్తొచ్చింది. మష్ రూమ్స్ లో రెండు రకాలున్నాడు. ఒక రకం వాటిని మనం తినొచ్చు. రెండోరకం తినం.....తింటే మంచినీళ్ళడక్కుండా ఛస్తారు.....తెలుసా?"    
    "అలాగా?" అన్నాడు బాలూ మొహమాటానికి.    
    "మష్ రూమ్స్ అంటే గుర్తొచ్చింది. ఈ జోకు విన్నారా?"    
    సమాధానం చెప్పడానికి కూడా ఓపికలేక వూరుకున్నాడు బాలు.    
    అది పట్టించుకోకుండా మార్తాండ్ అన్నాడు-    
    "ఒక పెద్దమనిషి తన ఫ్రెండుతో తన కష్టాలు చెప్పుకుంటున్నాడు. నేను రెండుసార్లు పెళ్ళిచేసుకున్నాను. ఇద్దరు పెళ్ళాలు చనిపోయాడు. మొదటి పెళ్ళాం విషపు మష్ రూమ్స్ తిని చచ్చిపోయింది. రెండో పెళ్ళాం బుర్ర పగిలి చనిపోయింది" అని ఆపుచేశాడు.    
    "బుర్ర ఎందుకు పగిలింది?" అన్నాడు వింటున్న ఆసామి.    
    "విషపు మష్ రూమ్స్ తిననని మొండికేసింది. మరేం చేస్తాం?" అన్నాడా పెద్దమనిషి వేదాంతంగా పూర్తిచేశాడు మార్తాండ్.   
    బలహీనంగా నవ్వాడు బాలూ.    
    "ఇప్పుడు మా తోటలో కూడా విషపు మష్ రూమ్స్ పుట్టుకొచ్చాయి. ఆ తూర్పువైపున అంతా అవే. రేపు పీకెయ్యాలి" అన్నాడు మార్తాండ్.    
    ఆ తర్వాత ఇంకేవో జోకులు డోకు వచ్చేవరకూ చెప్పాడు.    
    ఆ తర్వాత సోఫాలో వెనక్కి వాలి కాళ్ళు బాలు కూర్చున్న సోఫామీద పెట్టిగుర్రుపెట్టి నిద్రపోయాడు. మార్తాండ్ వాళ్ళ నౌఖరు వచ్చి వినయంగా బాలూని "ఇక్కడే పడుకుంటారా సార్! పక్క వెయ్యమన్నారా" అని అడిగాడు.
    
    "వద్దు" అన్నాడు బాలు. టైం చూసుకున్నాడు. రెండవుతోంది. ఇంకో గంటలో నిశాంతమవుతుంది.    
    తన కొత్త జీవితానికి శుభోదయమవుతుంది.    
    దానితోబాటే సౌదామిని బ్రతుకు తెల్లారిపోతుంది.    
    ఇంకో గంట అంతే.    
    ఒక్కొక్క నిముషం ఒక్కొక్క గంటలా గడిచిన తర్వాత మూడయింది.    
    ఈ పాటికి లేచేసి వుంటుంది సౌదామిని.    
    లేవగానే ఆమె రోజూ చేసే పనులు గుర్తు తెచ్చుకున్నాడు బాలూ. లేచీ లేవగానే ఒకసారి బాబువైపు చూసి, వాడి వంటిమీద దోమలు వాలకుండా దుప్పటి సరిచేస్తూంది. తర్వాత నిద్ర కరువు తీరక అరమూతలు పడిపోతున్న కళ్ళతో, మోకాలిమీద చుబుకం ఆనించి, కొద్ది నిముషాలు అలా కూర్చుండిపోతుంది. ఆ తర్వాత రేగిపోయిన జుట్టుని రెండు చేతులతో వెనక్కి తోసేసుకుని లేచి నిలబడి నిద్రలో వదులైపోయిన కుడివేపుకో, ఎడమవేపుకో కొద్దిగా జరిగిపోయిన కుచ్చెళ్ళని సరిచేసుకొని బాత్ రూంలోకి నెమ్మదిగా వెళుతుంది. తర్వాత బ్రష్ మీద పేస్టు వేసుకుని పాలగిన్నెతో నిద్రమత్తులోనే స్టౌ దగ్గరికి వెళ్ళి, లైటర్ తో వెలిగిస్తుంది.    
    అంతే!
        అక్కడితో ముగిసిపోతుంది. ఆమె దినచర్య యివాల్టి దినచర్యేకాదు. జీవితచర్యే ముగిసిపోతుంది.    
    టైం చూసుకున్నాడు బాలు.    
    మూడు నలభై!    
    ఇంకో ఇరవై నిముషాలు ఆగి నాలుగు గంటలకి ఏమీఎరగనట్లు తను జరిగిపోయిన మారణహోమాన్ని ధృవీకరించుకోవటానికి ఫోన్ చేస్తాడు.    
    .... అతనికి హఠాత్తుగా హిట్లర్ గుర్తొచ్చాడు. ప్రపంచయుద్ద సమయంలో ఫారిన్ నగరాన్ని తగలెట్టెయ్యమని ఆదేశాలు ఇచ్చి అది పూర్తయిందో లేదో కనుక్కోవడానికి తన సేనానులను 'ఈజ్ పారిస్ బర్నింగ్, "ఈజ్ పారిస్ బర్నింగ్" అని హిట్లర్ పదే పదే ప్రశ్నించాడని చరిత్రకారులు చెప్పటం గుర్తొచ్చింది.    
    ఈజ్ సౌదామిని బర్నింగ్? సౌదామిని తగలబడి పోతోందా?    
    తెలుసుకోవాలి.    
    నాలుగైంది.    
    ధైర్యాన్నంతా చేతుల్లో కేంద్రీకరించి, ఫోన్ ఎత్తాడు. చూపుడువేలు వణుకుతూ నెంబర్ ని డయల్ చేస్తోంది. ఇంట్లో ప్రేలుడికి ఫోన్ కూడా ద్వంసమైపోయి వుంటుందా! నెంబర్ డయల్ చెయ్యడం పూర్తి అయింది.    
    వెంటనే రింగవడం మొదలెట్టింది ఫోను. ట్రింగ్ ట్రింగ్.... ట్రింగ్ ట్రింగ్.    
    రెండుసార్లు మొగకుండానే ఫోన్ ఎత్తారు?    
    "హలో!"    
    సౌదామిని కంఠం మృదువుగా.    
    మెదడు మొద్దుబారిపోయింది బాలూకి. ఏం జరిగింది?    
    అదికాదు ప్రశ్న? ఏం జరగలేదు?    
    "నేను" అన్నాడు అతికష్టంమీద గొంతుని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ.    
    వెంటనే సంతోషం వినబడింది సౌదామిని గొంతులో.    
    "మీరేనా! ప్రొద్దున్నే కాఫీ పెట్టమని చెప్పి తాగకుండానే వెళ్ళిపోయారేం".    
    తడారిపోతున్న పెదిమలని తడి చేసుకున్నాడు బాలు. "కాఫీ పెట్టావా?"    
    "ఫస్టు క్లాస్ కాఫీ! మీ కోసం ప్రత్యేకం!" అంది సౌదామిని.    
    ఆమె గొంతు కొంచెం రుద్దమయినట్లు అనిపించింది. కొంచెం వణుకుతున్నట్లు కూడా అన్పించింది. ఆ ప్రకంపనం టెలిఫోన్ తీగల ద్వారా వ్యాపించి తన చేతిలోని రిసీవర్ ని కంపింపజేస్తున్నట్లు అన్పిస్తోంది.    
    వణుకుతున్న చేతిని అదుపులోకి తెచ్చుకుని, "చాలా అర్జెంటుగా వెళ్ళిపోవలసి వచ్చింది" అన్నాడు బాలూ ముక్తసరిగా.   
    అతన్ని పీడిస్తున్న సందేహం తీరనేలేదు. కాఫీ పెట్టేసిందా సౌదామిని! అయినా ఏమీ కాలేదా? ఎలా సంభవం ఇది.    
    "ఫోన్ పెట్టెయ్యనా!" అన్నాడు చిరాకుని అణచుకుంటూ.    
    ఫోన్ పెట్టెయ్యడం ఇష్టం లేనట్లు అలాగే వుండిపోయింది సౌదామిని. లైన్ డిస్ కనెక్ట్ అయితే అతనితో తనకి సంబంధం తెగిపోతుందేమో అని బెదిరిపోతున్నట్లు రిసీవర్ ని చేతిలో పట్టుకుని వుండిపోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra