ఎంత తేలిగ్గా అనగలిగింది సరళ! ఈ బంధమింత అర్ధహీనంగా సరళకు తోచటానికి కారకులెవరు?
బాధపడకండి సరళా! ఏడవకండి. ఆయనతో చెప్పండి. నేనేం పతివ్రతను కాను. నా ఆశ్రయం నేను చూసుకోగలను....."
సరళ ఆశ్చర్యంగా చూసింది.
"అంటే?"
వెంటనే జానకి ఏం చెప్పలేకపోయింది.
"ఇప్పుడెం చెప్పలేను. అన్ని విషయాలూ తర్వాత అవే తెలుస్తాయి.'
"మీకు అన్నివిధాల అనుకూలమైన సంబంధం."
"క్షమించండి. నాకు సంబంధం మీరు వెతకక్కర్లేదు"
"అంటే! మీరే వెతుకున్నారా?"
జానకి పేలవంగా నవ్వింది.
సరళ ఒక్కక్షణం అయోమయంగా చూసి, "అయితే మీరు కూడా మాధవకు విడాకులిచ్చి మరొకరిని పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నారని చెప్పనా మాధవతో?" అంది.
"ఎలా చెబితే మీకనుకూలంగా వుంటుందో అలా చెప్పండి."
"మీరు మళ్ళీ మాధవతో కాదనరుగా!"
"ఏమీ అనను"
"థాంక్స్ , వెళ్తాను"
"ఉండండి. భోజనం చేసి వెళ్దురుగాని."
"ఏం అక్కర్లేదు. ఈ శుభవార్త మాధవ కెంత తొందరగా చెప్దామా అని తహాతహాలాడుతున్నాను.'
సరళ వెళ్ళిపోయింది.
శుభవార్త!
మాధవకు కూడా శుభవార్తేనా?
కొన్ని క్షణాలు చైతన్యం పోయినదానిలా కూచున్న జానకి లేచి మాధవకు తను రాస్తున్న ఉత్తరం చింపి ముక్కలు చేసింది.
ఎంతో అపురూపంగా తను దాచుకున్న మాధవ ఉత్తరాలన్నీ బయటకు తీసి ఎంతోసేపు వాటిని చూస్తూ కూచుంది. చివరకు వాటినన్నిటిని కట్టకట్టి ఒక పెద్ద కవరులో పెట్టి పైన మాధవ చిరునామా రాసి మాధవ గదిలో బల్ల మీద పెట్టేసింది.
* * *
సరళ తన స్వగ్రామానికి బయలుదేరిన దగ్గర్నుంచీ ఏదో ఉద్వేగంతో కొట్టుకుపోతుంది మాధవ హృదయం.
సరళను చూడగానే జానకి ఏమనుకుంటుందో? సరళ జానకితో ఏం చెపుతుందో?
జానకి సున్నిత హృదయం ఆ మాటలకెంత బాధపడుతుందో?
పొరపాటు చేశాడు. మోహన్ కు భయపడి ఆగిపోయాడు. సరళతో తను వెళ్ళవలసింది. అసలు ముందే జానకితో సరళ విషయం చెప్పవలసింది.
అదంతా గతమనీ, ఇప్పుడు జానకికి తప్ప తన మనసులో మరొకరికి స్థానం లేదనీ జానకికి స్పష్టపరచవలసింది.
ఏదెలా జరుగుతుందో?
జానకి ఏమయిపోతుందో?
ఆ రోజు సాయంత్రానికే తిరిగొచ్చేసింది సరళ. సరళ ముఖంలో వెల్లివిరుస్తున్న ఉత్సాహం చూసి మాధవ మనసు వణికిపోయింది.
"ఆవిడ ఒప్పుకుంది మాధవా! ఇంక మన పెళ్ళికి ఏ ఆటంకమూ లేదు"
"దేనికి ఒప్పుకుంది?" అనుమానంగా అడిగాడు.
"విడాకులివటానికి...."
"అందుకు ఒప్పుకుంటుందని నాకు తెలుసు. ఆ తరువాత మోహన్ ను చేసుకుంటానందా?"
గతుక్కుమంది సరళ. తనసలు మోహన్ ప్రస్తావనే తీసుకురాలేదు.
"మోహన్ ను చేసుకుంటాననలేదు."
మాధవ ముఖం వెలిగింది.
"నాకు తెలుసు. అందుకే జానకిని వదలలేను."
"ఏం తెలుసు నీకు? ఆవిడ నీతో చెప్పమంది - నేనేం పతివ్రతను కాను. నా ఆశ్రయం నేను చూసుకోగలను అని. నన్ను సంబంధం వెతకక్కర్లేదంది. వెతకక్కర్లేకుండానే ఆవిడ దృష్టిలో ఎవరో ఉన్నారు...."
"అబద్దం!"
"ఎవరిదీ? నేను అబద్దమాడుతున్నానంటావా? కావాలంటే ఆవిడనే అడుగు. నీతో అబద్దమాడితే చెప్పలేను గాని నాతొ మాత్రం అలాగే చెప్పింది."
మాధవ హృదయం కుతకుత ఉడికిపోసాగింది.
"అంతకుముందే ఆవిడ దృష్టిలో ఎవరో ఉన్నారు" ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు.
"అసంభవం, అసంభవం " అని ఆక్రోశించసాగింది అతని మనసు.
సరళతో ఈ విషయం వాదించలేక మౌనం వహించాడు.
కొంచెం సేపు మాధవ దగ్గర కూచుని అతను ముభావంగా ఉండటం గమనించి 'నెమ్మదిగా సర్దుకుంటాడులే' అనుకుని ఇంటికి బయలుదేరింది సరళ.
జానకిని కలుసుకుని ఆమెతో మాట్లాడిన తరువాత మాధవ జానకిని వదలలేననటానికి కారణం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదేమోనని అనుమానం కలగసాగింది సరళలో. ఆ ఆలోచనను భరించలేక దాన్ని బలవంతాన వెనక్కు నెట్టింది.
సరళ తన దగ్గర్నుంచి వెళ్ళిపోయాక ఒక్క క్షణం కూడా నిలవలేకపోయాడు మాధవ.
వెంటనే జానకిని కలుసుకోవాలి. సరళ మాటల వల్ల ఆమె హృదయం గాయపడిందేమోనని కనుక్కోవాలి. జరిగినదంతా వివరంగా చెప్పి, క్షమాపణ వేడుకోవాలి. తనే తనకు సర్వస్వమనని జానకిని నమ్మించాలి.
ఎంతో ఆరాటంతో ఇంటికి చేరుకున్న మాధవకు ఇంటి తలుపులకున్న పెద్ద తాళం కప్ప ఎదురైంది. ఎన్నడూ తాళం వెయ్యని ఆ తలుపులకున్న తాళం చూసి మాధవ మనసు విలవిలలాడింది.
తనను ఎంతో ఆత్మీయంగా పెంచిన కాత్యాయని లేని వెలితి స్పష్టంగా కనిపించింది ఆ క్షణంలో. జానకి ఏమయిందోనని అల్లాడిపోయింది మనసు. ఆ ఆవరణలోనే పూరింట్లో ఉన్న పాలేరు మాధవను చూసి పరుగు పరుగున వచ్చి తలుపు తెరిచాడు.
"అమ్మగారెక్కడికెళ్ళారు?"
"ఊరెళ్ళిపోయారు బాబూ!"
"ఎప్పుడు? ఏ ఊరు?"
"ఇయాల పొద్దుటే బాబూ! ఏ ఊరో తెలవదు. నాకేం చెప్పలేదు. ఇదిగో తాళాలిచ్చి పోనారు. మీరోత్తే ఇయ్యమన్నారు"
దడదడలాడుతోన్న గుండెలతో తాళాలు తెరిచాడు మాధవ.
బయట చీకటంతా ఒక్కసారి లోపలకు ప్రవేశించింది. తడుముకుంటూ లైట్ వేశాడు. ఇల్లంతా శుభ్రంగా సర్ది ఉంది. శూన్యంగా ఉన్న ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. జానకి తనకేమైనా ఉత్తరం వదిలిందేమో అన్న ఆశతో ఇల్లంతా చూశాడు. తన గదిలో తన చిరునామా ఉన్న కవరు కనిపించింది . ఆశగా తెరిచాడు.
అందులో ఉన్నవన్నీ తను రాసిన ఉత్తరాలు. తన ఉత్తరాలు తనకిచ్చేసిందా జానకి?" అంటే పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లేనా? భరించలేకపోయాడు మాధవ. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆ అన్న కాక ఇంకెవరున్నారు తనకి? అక్కడికే వెళ్ళి ఉంటుంది.