"భాధపదకండి. భాధపడి, మనం చేసేదేముంది? బాధపడుతూ కూచుంటే ఎంత మాత్రం ప్రయత్నం చెయ్యలేము. పాప ఆచూకి తెలుసుకోవడానికి అన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే మనకి జాడ తెలుస్తుంది. "ఎదురు వాళ్లనే ఓదార్చింది అణు. ఏమి మాట్లాడలేక పిచ్చి దానిలా కళ్ళప్పగించి చూసింది అచ్చయమ్మ. ఆ చూపుల్లో భాధ చక్కగా అర్ధమైంది అణుకి. పాపం ఆ వృద్దురాలు మనవరాలి కోసం నిజంగానే భాదపడుతోంది.
పరిస్థితులని బట్టి, వాతావరణాన్ని బట్టి వ్యక్తిత్వాలు రకరకాలుగా వుంటాయి గాని, ప్రేమాభిమానాలు ఎవరికి తక్కువలేదు ఎదుటి వ్యక్తుల్ని వాళ్ళ కోణంలోంచి చూడగలిగితే లోకంలో ప్రతి ఒక్కరి మీద మనకి సానుభూతే కలుగుతుందేమో? మొదటిసారిగా ఆ ముసలి అత్తగారి మీద అంతులేని జాలి కలిగింది అణుకి. బతుకు మొత్తంలో పాపం ఆవిడ ఏం సుఖపడింది? భార్యగా, భర్త దగ్గిర యే రకమైన చనువుని, ప్రేమని అధికారాన్ని పొందలేకపోయింది.
ఎక్కడిక్కడ సర్దుకుపోతూ ప్రాణికొటి సహజ స్వభావంతో కనీసం చీరల్లో నగల్లో ఆనందాన్ని చుసుకోవాలనుకుంది. కొడుకు అది కూడా దక్కనియలేదు. భర్త మీదే కాదు, కొడుకు మీద కూడా యే అధికారము లేదా తల్లికి. చివరికి చీరాలకి, నగలకి కూడా నోచుకోలేక రోల్డు గోల్డు నగల్లో తన పెత్తనాలకి తలవొగ్గిన ఆమె అత్తగా తన అధికారం చూపించుకోవాలని ఎంతో ఉవిళ్ళురింది. కాని తను ఆవిడ ఆశకి అడ్డుపడింది. మూల కూర్చోబెట్టి కావలసిన అవసరాలు చూసిందే కాని ఏనాడూ పెత్తనం చెలాయించనీయలేదు.
చివరికి యే దారి లేక మనుమరాలితో అడుకుంటు ముసలితనంలో మొత్తం జీవితంలోని చికాకుల్ని మర్చిపోవడానికి ప్రయత్నించింది. చివరికి ఆ మనవరాలు కూడా తప్పిపొతే కుమిలిపోక ఏం చేస్తుంది? గమ్మత్తేమిటంటే నిజంగా జరిగిన దారుణం ఆ ముసలావిడకు తెలియదు. అంత తీవ్రంగా బాధపడే ఓపిక కూడా ఆవిడకి లేదు. ఏ చిన్న కష్టం వొచ్చినా కాస్సేపు కన్నీళ్ళు పెట్టుకుని అంతటితో మరచిపోయి యాంత్రికంగా బతకటానికి అలవాటు పడింది. అలా అలవాటు పడకపోతే అవిడింత కాలం బ్రతగ్గలిగేది కాదు.
మిగిలిన అన్నీ కష్టాలకి కన్నీళ్ళు పెట్టుకున్నట్టే, ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటోంది. అంతకన్నా ఆవిడ చెయ్యగలిగింది లేదు.
సులభ చదువుకున్నదైనా తల్లిలాగ యే సమస్య వచ్చినా ఏడవడం తప్ప ఏం చెయ్యాలో ఆలోచించదు.
వాళ్ళిద్దరి భోజనాలకి అణు ఏర్పాటు చేస్తుండగా వచ్చింది జలజ.
"మీ అయన దగ్గిరనుంచి మళ్ళీ ఓ వర్తమానం మోసుకొచ్చాను"
"ఏమిటో చెప్పు?"
"వాళ్ళ అమ్మా, అక్క అంటే మీ అత్తాగారు, ఆడబడుచు యిక్కడికొచ్చారని జీవన్ కి తెలిసిందట వెంటనే వాళ్ళని బయటికి పంపేయమని చెప్పమన్నాడు."
తన కలవాటైన ధోరణిలో అయోమయంగా చూసింది అత్తగారు.
"నా ఖర్మ కట్టుకున్న మొగుడికి లోకువయ్యాక ఇహ అందరికి లోకువే. ఏదో కూతురు తప్పిపోయింది కదాని ఓదర్చడాని కొస్తే ఇంట్లోంచి పోమ్మంటాడా! నేను ముష్టిదాన్ననుకున్నాడా మాకు బోలెడంత ఆస్తి వుంది"
జమిందారీ కుటుంబాల్లో చాలామంది లాగే ఆస్తిని అనుభవించగలిగినా, అనుభావించలేకపోయినా , ఆస్తిని తల్చుకుని తల్చుకుని అస్తిత్వాన్ని ఉపిరి పోసుకోవడం సులభకి అలవాటు.
"ఎవరూ! ఎక్కడికి వెళ్ళారు. ఇక్కడే వుంటారు. ఈ కబురు మోసుకుంటూ నువు జీవన్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. నేను చెప్తాను."
తల్లి కూతుళ్ళీద్దరూ తెల్లబోయి చూశారు అణుని. ఈ సమాధానం అణు నోట ఉహించలేదు వాళ్ళు. లోక సామాన్యంగా తప్ప మరొకలా ఆలోచించలేదు వాళ్ళు బొటనవేలు, చూపుడు వేలు గుండ్రంగా చుట్టి పెదవుల మధ్య బిగించి ఈల వేసింది జలజ.
"ఆహా! ఉత్తమ ఇల్లాలు" అని చప్పట్లు చరిచింది.
"నీ మొహం! బాధలో ఉన్న మనసు ఎదుటి మనసు బాధని గుర్తించగలదు అంతే."
"అయితే మనుష్యులేప్పుడు బాధల్లో ఉండటమే మంచిదంటావు" నవింది జలజ.
తలుపులు తోసుకుని లోపలి కొచ్చిన సోదెమ్మను చూసి జలజ కసురుకుంటూ, "ఏయి! ఎవర్నువు! నేరుగా లోపలికే వస్తున్నావు. బయటికి నడు" అంది.
సోదెమ్మ ఒరియాలో, "కోప్పడతారేమిటి? ఈ ఇంట్లో పసిపిల్ల తప్పిపోయిందని అనుకుంటున్నారు. కొంచెం బియ్యం, రూపాయి డబ్బులు యిప్పిస్తే పాపాయి ఎక్కడుందో సోదేలో కళ్ళతో చూసినట్లు చెప్తాను" అంది.
"నీ కంగిరి పింగరి బాధ మా కర్ధం కాదు" అంది జలజ.
"నేను సోదెమ్మనమ్మా! పసికూన పోయి కుములుతుండారు. ఉన్నది ఉన్నట్లు సక్కంగా సూపి చెప్తాను."
"మాకు తెలుగు కుడా రాదు."
"ఇది తెలుగని మీ కేట్టా తెలిసిందమ్మా? ఎంచక్కా తెలుగు కట్టు కట్టినారు తెలుగు బొట్టు పెట్టినారు. తెలుగు వాళ్ళలాగ భోరుభోరున యేడుస్తుంటారు. తెలుగు రాదని సేప్తుంటారు. తెలుగోళ్ళు కారేంటి?"
ఫకాల్న నవింది జలజ.
"సుభాష్! సోదిలో ఏం చూడగలవో, ఏం చూడలేవో కాని లోకాన్ని బాగానే చూడగలవు. ఇంత తెలివైన సోదేమ్మని చచ్చిన నమ్మకూడదు."
ఇంతసేపటికి అచ్చయమ్మాదేవి కల్పించుకుంది. ప్రాధేయపడుతూ.
"అమ్మా! అణు! ఒక్క రూపాయి యియ్యి. కొంచెం బియ్యం, పోనీ అడిగి చూద్దాం. ఏ పుట్టలో ఏముందో!" అంది. సోదెమ్మ ల సోదేలో అణుకి ఏ కోశానా నమ్మకం లేదు. ఆ ఆశ మీదే మానవుడు నిలబడేది. ఆ ఆశను తుంపెయలేకపోయింది. రాగ జాడ తెలియకపోవచ్చు కాని సమస్యలని ఎదుర్కోలేని అత్తగారి మనసుకి సమస్యనించి పారిపోవడానికి కొంత టైం దొరుకుతుంది. సోదేమ్మాయి తన సామాన్లు నేలమీద పరుచుకు కూర్చుని ముసలావిడ చెయ్యి పట్టుకుని, "సోదోయమ్మ సోది!" అంటూ తన ధోరణిలో సోది ప్రారంభించింది. జలజ టి.వి. ముందు కూర్చుంటే అణు ఏదో మేగజైను తెరుచుకు కూర్చుంది.
"మమ్మీ! సారీ! అంటా వుంది."
"మమ్మీ! సారీ! అంటా వుంది."
"మమ్మీ! సారీ! అంటా వుంది." ఖంగున మోగింది సోదెమ్మ కంఠం. ఉలికిపడి మేగజైను మూసేసింది అణు. "ఏంటంటున్నావు?" అంది సోదెమ్మ నుద్దేశించి.