Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 33


    "అయ్యో.... అదేవిటీ....? నీరసమా?" కంగారుగా అడుగుతూ ఆమెను పట్టుకున్నాడు గణపతి.
    
    "ఆఁ..... పొద్దుట్నుంచీ ఏమీ తినలేదు!" అంది.
    
    గణపతికి తను పొద్దుటే తిన్న పేపర్ దోస, పెసరట్టుప్మా గుర్తొచ్చి మనసంతా కలచివేసినట్లయింది.
    
    "పద, భోజనం చేద్దాం!" అన్నాడు.
    
    తిలక నవ్వి, "ఇది మీ పల్లెకాదు. పట్నం! కనపడిన ప్రతివాళ్ళకీ ఓ ఫ్లాష్ బాక్ వుంటుంది. అది విని కరిగిపోయి జాలిపడిపోకూడదు! డబ్బులు ఖర్చు చేయకుండా మీ ఊరెళ్ళిపో!" అంది.
    
    "నువ్వు ఇప్పుడు వచ్చి భోజనం చెయ్యకపోతే నాకు జన్మంతా మనశ్శాంతి ఉండదు!" ఉండకూడదనుకుంటే అలాగే కానీ!" అన్నాడు మొండిగా.
    
    "సరే.... పద!" అని ఆమె అతని వెంట నడిచింది.
    
    ఇద్దరూ కృష్టా కేఫ్ అనే హోటల్ కి వెళ్ళారు. భోజనాలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత గణపతి భగీరథ ఇచ్చిన ఆఫర్ గురించి చెప్పి చేతిలోని ఫైల్ లో ఉన్న ఫామ్స్ చూపెట్టాడు.
    
    తిలక ఆలోచించి "ఏ పనీ చెయ్యకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి చెయ్యడమే మంచిది! కానీయ్..... నీకు తెలిసిన అందరిచేత వెయ్యి పెట్టించినా.... ఓ రెండొందలమంది ఉండరూ?" అంది.
    
    అతనికి ఆ నిమిషంలో ఎడారిలో ఒయాసిస్ లా మహాపట్నంలో ఓ స్నేహితురాలు కనిపించినట్లయింది.
    
    ఇద్దరూ భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు.
    
    మాటల్లో తిలక తన ఇంటి పరిస్థితి గురించి చెప్పింది.
    
    "అమ్మ స్టేజ్ ఎక్ట్రస్. నన్నానా చిన్నప్పుడే ఆమెను వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. అన్నయ్య ఉన్నాడు కానీ, ఎవరికీ పనికిరాడు! సోమరిపోతు తల్లీ, చెల్లీ వేషాలు వేసి సంపాదించి తెస్తే తిని పడుకుంటాడు. అదేమిటో వాడి ఎస్. ఎస్.సి. క్వాలిఫీకేషన్ కే వాడికి బయటకు అడుగు పెడితే చాలు బోలెడు ఉద్యోగాలొస్తాయ్. ఒక్కటీ నిలుపుకోడు. పై పెచ్చు అందినన్ని అప్పులు చేసి అప్పులాళ్ళని ఇంటిమీదకి తెస్తాడు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం పాడయిపోయింది. వేషాలు మానుకుంది.
    
    నేను ప్రయివేటుగా బి.ఏ.దాకా చరివాను. అదెందుకూ పనికిరావడం లేదు!" అంది.
    
    "మీ అమ్మ ఇప్పుడు నటన మానేసిందిగా ... మానేషా కొయిరాలానా?" గణపతి వాతావరణం తేలికచేస్తూ అన్నాడు.
    
    ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది! "గణపతీ! పంటకలువ గలగలా, పాల వెన్నెల స్వచ్చతా నీ కబుర్లలో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రలోభం .... వెంపర్లాటా అన్నీ మానేసి నీ వెంట మీ ఊరు రావాలనిపిస్తోంది!" అంది.
    
    గణపతి భయపడి "అమ్మో! వస్తే ఏమని పరిచయం చెయ్యాలి?" అన్నాడు.
    
    "పనిమనిషి కావాలా అమ్మగారూ? అని అడుగుతానూ..... నటించడం వచ్చుగా! ఓ ముద్ద పారేస్తే మీ కాళ్ళదగ్గర పడుంటానండీ ... అయ్!" అంది యాసగా.
    
    గణపతికి వెంటనే ఫ్లాష్ లా ఓ ఆలోచన వచ్చింది.
    
    "అదేం అక్కర్లేదు. ఇద్దరం కలిసే వెళదాం. నాకంటే ముందుగా నువ్వు మా ఇంటికెళ్ళి హైదరాబాద్ నుండి వచ్చాననీ రాధ అనే అమ్మాయికి ఇంగ్లీషు చెప్పేందుకు ఇంటి యజమానిగారు పంపించారని చెప్పు! చిన్నమావయ్య పెద్దమావయ్య పంపించాడనుకుని మారుమాట్లాడకుండా నువ్వు వుండటానికి ఏర్పాటు చేస్తాడు. జీతం కూడా మాట్లాడేసేయ్. పెద్దమావయ్య వచ్చినా చిన్న మావయ్య చూశాడనుకుని ఏమీ డీటైల్స్ అడగడు. ఆ అన్నదమ్ములిద్దరూ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు పంచుకుంటారు. ఎలా వుంది?" అన్నాడు.
    
    "రాధ ఏమంటుందో?" అంది తిలక.
    
    "మాధవ్ కోసం అర్జెంట్ గా ఇంగ్లీషు నేర్చుకోవాలనుకుంటున్న రాధ నిన్ను చూసి చాలా సంతోషిస్తుంది. ఆమెకి తెల్లనివన్నీ పాలూ, నల్లనివన్నీ నీళ్ళూ.....అంత అమాయకపు పిల్ల.
    
    ఇక మా అత్తయ్యలు... ఎందుకులే చెప్పడం.... నేనే ఆ తులసివనంలో గంజాయి మొక్కలాంటివాడిని!" అన్నాడు.
    
    "అదేం?" ఆశ్చర్యంగా అడిగింది.
    
    తను డబ్బు దొంగతనం చేసి ఇలా వచ్చిన విషయం చెప్పి, "దేవతలాంటి అత్తయ్యనే మోసం చేశాను. అయినా ఆవిడ డబ్బుకన్నా నా క్షేమం గురించే ఎక్కువ ఆత్రుత పడుతూ ఉంటుంది!" అన్నాడు.
    
    "అన్నీ ఉదాత్తమైన కారెక్టర్లే అన్నమాట!" అంది చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ తిలక.
    
    ఆ రాత్రే తిలక గణపతి ఇచ్చిన వెయ్యి రూపాయలూ ఇంట్లో ఇచ్చి తనకి ఉద్యోగం వచ్చిందనీ, వేరే వూళ్ళో టీచర్ పోస్ట్ అనీ అబద్దమాడి అతనితో ప్రయాణమైంది.
    
    "నువ్వు వెళ్లి సెటిల్ అయ్యాక నేను రేపు వస్తాను. భయం లేదు. బెస్ట్ ఆఫ్ లక్!" అని ధైర్యం చెప్పాడు ట్రైన్ లో గణపతి.
    
    ఆ తర్వాత అప్పుడే పరిచయమైన ఎదుటి సీటు ఆసామిని సూపర్ హిట్ సినిమా నిర్మాతగా మార్చడానికి నడుం కట్టాడు. ఆయన్ని పడుకోనివ్వకుండా చెవిలో జోరీగలా రొద పెట్టడంతో ఆయన చివరికి "ఎక్కడో టేకు చెట్టుకొని లాభం కోసం నిరీక్షించడం కన్నా నువ్వు చెపుతున్నది థ్రిల్లింగ్ గానే ఉందయ్యా! కానీ ముహూర్తం ఫంక్షన్ కి మాత్రం చిరంజీవిని పిలవాలి మరి!" అని కండీషన్ పెట్టి, ఫారం నింపి వెయ్యి రూపాయలూ ఇచ్చాడు.
    
    "అలాగే....అలాగే.... ఒక్క చిరంజీవినేమిటీ, రజనీకాంత్ నీ, షారూఖ్ ఖాన్ నీ కూడా పిలుస్తున్నాం!" అంటూ హామీ ఇచ్చేశాడు గణపతి.
    
    అలా మొట్టమొదటి ప్రయత్నమే సక్సెస్ అవడం ఎంతో శుభంగా అనిపించింది గణపతికి.
    
    "నీకింక ఎదురే లేదు! కాబోయే హీరో కళ మొహంలో కనపడిపోతోంది!" అంది ఆనందంగా తిలక.
    
    "నువ్వు పక్కనుంటే అంతా విజయమే మరి!" అన్నాడు ఆమెను ఆరాధనగా చూస్తూ గణపతి.
    
    కొబ్బరాకు గలగలల్లో కొమ్మనకూసే కోయిల గొంతున ఒకనాధం పుడుతోంది. అల్లనల్లన సాగే గాలితెమ్మెర దాన్ని మోసుకుపోయి కోవెల ప్రాంగణంలో విడిచి పెడుతోంది. అక్కడ వినిపించే వేదంతో కలిసి ఆ ధ్వని పవిత్రతని సంతరించుకొని పరిపూర్ణమౌతోంది.
    
    తరచి చూస్తే ఆడపిల్ల జీవితమా అంతే.
    
    ఒకింత గారాబాల కూచి మరో ఇంటి సిరుల కాణాచి అవుతుంది. అల్లరిగా సాగిన బాల్యం అందమైన కౌమారంలో నుండి బాధ్యతాయుతమైన సంసారంలో ఐక్యమవుతుంది. ఆ ఇంటి పేరు నిలబెట్టి ఆ వంశాన్ని ఉద్ధరించి మరో కొత్త తరాన్ని ఆవిష్కరించిన సృష్టికర్తని మరిపించి ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటుంది.

 Previous Page Next Page