"మీరు స్నేహితులు కదూ!"
"ఛా"
"ఛా దేనికి?"
ప్రసూన మాట్లాడలేదు __ అవును ___ రేఖను చీదరించుకొనే అధికారం తనకెక్కడిది?
"రేఖ మాత్రం మీరు తనకు దగ్గర స్నేహితులన్నట్లే మాట్లాడింది!"
"తను చాలా మంచిది. అందరూ స్నేహితులనే అణుకుంటుంది."
"అవును మంచిదానిలాగే కనిపించింది. నన్ను స్నేహితుడనే అనుకుంటోంది. నన్ను చూడకుండా ఉండలేనంది - తరచు కన్పించమంది."
"మీరేమన్నారూ?"
"ఏమంటాను? అలాగే అన్నాను"__
వాలుగా ప్రసూనను చూస్తూ అన్నాడు మోహన్ - మోహన్ పెదవులమీద చిరునవ్వు ప్రసూనను వెక్కిరించింది - గభాలున ముఖం తిప్పుకుంది.
ముగ్గురూ కారుదిగి కూలి పేటకు వెళ్ళేసరికి ఎవరో తప్పతాగి ఎదురొచ్చాడు- ప్రసూన చీదరించుకుంటూ.
"ఇలా తాగుతారు. అందుకే అలా నాశనమవుతారు" అంది.
ఆ మాటలు విన్నవాడు టక్కున ఆగిపోయినాడు ప్రసూనను చూసి పకాలున నవ్వాడు.
"ఏటమ్మా! త్రాగడం తప్పన్నావా? కూసింత ఈ సుక్కేసుకోకపోతే ఈ వెధవ బతుకు బతగ్గలనా? ఏటున్నాది? కూడా? గూడా? కట్టం కట్టం ఒకటే కట్టం! కాసింత ఏసుకో. సొరగాలు అగుపిస్తయి ఆ సొరగాలముందు కట్టాలన్నీ బలాదూరు! సుఖం సివరకు తిండిలో లేని సుఖం ఈ సుక్కలో ఉండాది. ఇదిగో! అమ్మాయిగారు! నీకు నిజంగా ఈల్లమీద దయవుంటే తల కూసింత సుక్కపోయించు వెధవ బతుకు గడియలన్నీ మరిచి సుకపడతారు."
ప్రసూన వంచిన తల ఎత్తలేకపోయింది. అతడి నవ్వులో- నిషాలో పలికే ఆ కంఠంలో - తొణికిసలాడుతున్న దుర్భర విషాదం __ అడుగడుగునా అతనికి ఎదురవుతోన్న అతి చేదు జీవిత సత్యం.....ప్రసూనను కుదిపి వేసింది- చిరంజీవి కూడా అలాగే కదిలిపోయాడు - మోహన్ ను చూసి "సార్! మీరే చెప్పండి! అలాచూసి చెప్పండి తాగటం తప్పంటారా" అన్నాడు.
మోహన్ అసలు మాటాడలేకపోయాడు.
వాళ్ళు మరో నాలుగడుగులు వేసేసరికి మాల ఎదురొచ్చింది. దాని అసలు పేరేమోగాని దానికదే స్టయిల్ గా మాల అని పెట్టుకొంది. దానిమీద కోపం వచ్చినవాళ్ళు కసిగా మాలచచ్చినదానా! అని తిడుతుంటారు.
మాల నల్లగా ఉంటుంది. - అస్థిపంజరంలా తయారయింది. ముఖాన కళాకాంతులు లేవు. చవకరకం పౌడరు దిట్టంగా పూసింది - కళ్ళనిండా కాటుక పులిమింది - నోట్లో తాంబూలం వుంచుకుని,. మధ్య మధ్యలో వుమ్ముతూంది. చిరంజీవిని చూడగానే ఆప్యాయంగా నవ్వింది___
"చిరంజీవి తల దించుకున్నాడు___
"ఏమయ్యా! అందరికీ సాయపడతావ్! నాకు సాయపడవా? గిరాకీలు చూసిపెట్టు! కమ్మని గారెలు వండిపెడతా! లేదా! నిన్నే నా యింటికి ఈడ్చుకుపోతా!"
మళ్ళీ నవ్వింది మాల- పాపం మాల మనసులో ఏ దురుద్దేశమూ లేదు. చిరంజీవి అంటే నిజంగా అభిమానమూ ఉంది. కాని అలా తప్ప మరోలా మాట్లాడటం మాలకు రాదు___
మాల ఎలాంటిదో ప్రసూనకు మోహన్ కు అర్ధమయి పోయింది. ప్రసూన బాధపడుతూ "సవ్యంగా బ్రతకరాదు?" అంది.
మాల ప్రసూనకు పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తూ "ఏటమ్మా ఒకదారిన పడినవాళ్ళు మరో దారి కెట్టావస్తారు?" అంది ___
చిరంజీవి ప్రసూనవైపు తిరిగి జాలిగా నవ్వాడు___
మోహన్ ఆ వాతావరణంలో నిలవలేని వాడిలా గబగబ ముందుకు సాగాడు __
పరమేశ్వరి ఇంటికి చేరుకున్నాక కాని ముగ్గురికీ ఊపిరాడినట్లు అనిపించలేదు.
పరమేశ్వరి మోహన్ ను చూసి నవ్వుతూ "ఏమిటండీ! మీరు మాకు సహాయం చెయ్యడానికి వచ్చారా? మా ఆపని పాడుచెయ్యటానికి వచ్చారా?" అంది ___
"నేను చెయ్యగల సహాయం ఉందా?"
"చెయ్యాలనుకోవాలే కాని ఎక్కడ చూసినా అంతులేనత పనిఉంది_ ఇవాళ పొద్దున్నే మల్లయ్యను అరెస్టు చేశారు."
"ఎందుకు?"
"మామూలే! తల్లి కేదో జబ్బుగా ఉందిట! యజమానిని అడ్వాన్సు అడిగితే ఇయ్యనన్నాడు __ వీడు డబ్బు దొంగిలించి పట్టుబడ్డాడు __ అరెస్టు చేశారు." __
ఒక పోలీసు ఆఫీసర్ గా ఇలాంటివాటికి మోహన్ దగ్గర సమాధానం లేదు.
"మనం ఏం చెయ్యగలం?" నిరాశగా అంది ప్రసూన-
"అదిగో? అదే వద్దన్నాను __ మనం ఎంతైనా చెయ్యగలం __ తప్పకుండా చెయ్యగలం"
దృఢ నిశ్చయంతో అంది పరమేశ్వరీ.
"ప్రతి క్షణమూ తనను ఎదుర్కొంటున్న ప్రతికూల శక్తులతో పోరాడుతూ చిరునవ్వుతో ఎదుగుతూన్న మన చిరంజీవి ఇందుకు సాక్ష్యం" పరమేశ్వరి మాటలకు క్రుంగిపోతున్న మనసుకు కొండంత బలం వచ్చినట్లయింది చిరంజీవికి. లేచి "నేను మల్లయ్య తల్లిని హాస్పిటలుకు తీసుకెళతాను" అని వెళ్ళిపోయాడు.