Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 31


    
    గణపతి 'అదీ సంగతి!' అనుకుంటూ తన ముంజేతిని చూసుకున్నాడు. ఎంతో థ్రిల్ గా అనిపించింది.
    
    తిలక ఉస్సురంటూ లేచి బయటకు నడిచింది.
    
    గణపతి వచ్చినపని మరిచిపోయి ఆమెను ఫాలో అయి వెళ్ళాలనుకున్నాడు.
    
    "ఎస్.... మీరొచ్చిన పని చెప్పండి" డన్ హిల్స్  పాకెట్ లోంచి ఓ సిగరెట్ బయటకు తీసి నోట్లో పెట్టుకుంటూ అడిగాడాయన.
    
    గణపతి తిలకా కొయిరాలా ఇచ్చిన షాక్ లోంచి తేరుకుంటూ "ఆహా.....ఏమి నటనా... ఏమి ఈజ్!" అన్నాడు.
    
    "ముందు మీరొచ్చిన పని చెప్పండి!" అంటూ ఆయన విసుగ్గా వాచ్ చూసుకున్నాడు.
    
    "మీ ప్రకటన పేపర్ లో చూశాను, సార్!" అంటూ పేపరు తీసి టేబుల్ మీద పెట్టాడు ప్రూఫ్ గా ఆ తర్వాత ఓసారి క్రాఫ్ సరిచేసుకుని "నాకు నాటకానుభవం వుంది సార్! సినిమా నటుడవ్వాలన్నది నా చిరకాల వాంఛ" అన్నాడు.
    
    ఆయన చిన్నగా ఓ నవ్వు నవ్వి, "చూడుబాబూ! నువ్వు నటుడవడానికి నాటకానుభవం అవసరంలేదు. సైకిలొస్తే స్కూటర్ డ్రైవింగ్ వస్తుంది, స్కూటరొస్తేనే కారు నడపగలవూ అన్నది నిజంకాదు! అలాగే సినిమాలో నటించడానికి పూర్వకాలంలా మంచి గాత్రం, నృత్యం, ఆంగికం అభినయం, వాచికం, అందం, ఆహార్యం ఏదీ అవసరం లేదు!" అని యాష్ ట్రేలో సిగరెట్ నుసి దులిపాడు.
    
    గణపతి బూస్ట్ తాగినంత ఉత్సాహంగా ఆయనవేపు చూశాడు.
    
    "మీ పర్సనాలిటీకి, అందానికి హీరో అవడం ఏమంత కష్టంకాదు!" అన్నాడు సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ.
    
    గణపతికి తన ఛాతీ తనే మొయ్యలేనంత విశాలంగా పెరిగిపోయినట్లు అనిపిస్తోంది.
    
    "అసలు మాకు కావాల్సింది హీరో కాదు" అన్నాడు ఆయన.
    
    బాగా గాలి ఊది బుడగకి గుండుసూది గుచ్చినట్లనిపించింది. గణపతి ఒణుకుతున్న స్వరంతో మరి..... ఇందాకా మీకు కావాల్సింది హీరోయిన్ కాదన్నారు... మరి మీకెవరు కావాలి?" అన్నాడు.
    
    "నిర్మాతలు" ఆయన నున్నటి తల చేతులతో రాసుకుంటూ తాపీగా చెప్పాడు.
    
    గణపతి మొహం అవమానంతో కందినట్లయింది. "ఆ సంగతికూడా పేపర్ లో ప్రకటిస్తే ఇంత డబ్బు పోసుకుని హైదరాబాద్ వచ్చేవాళ్ళం కాదుగా!" అన్నాడు నిష్టూరంగా.
    
    ఆయన తన రేషన్ చిరునవ్వొకటి మళ్ళీ పారేసి, "రాకపోతే మేం తీయబోయే సూపర్ హిట్ సినిమాకి నిర్మాతయ్యే అదృష్టం కోల్పోయేవారు" అన్నాడు.
    
    "నిర్మాతా?" గణపతికి తను అత్తయ్య పెట్లోంచి డబ్బు దొంగిలించడం గుర్తొచ్చింది. ఉట్టికెగరలేని అమ్మ ఊటీ వెళ్ళిందన్నట్లుంది అనుకున్నాడు.
    
    "ఔను! ఆ తర్వాత హీరో చాన్స్ కూడా వస్తుంది" అన్నాడాయన.
    
    "నిర్మాతంటే బోలెడు డబ్బు పెట్టాలి. నా దగ్గరెక్కడుందీ?" నిరుత్సాహంగా అన్నాడు గణపతి.
    
    "మీదగ్గర లేకపోతే ఉన్నవాళ్ళచేత పెట్టించండి. మీలాంటి ఔత్సాహిక యువకులు చెయ్యలేని పనేమీ ఉండదు" అంటూ కొన్ని ప్రింటెడ్ ఫారాలు తీసి గణపతికిచ్చాడు.
    
    "లక్షలు పెట్టేవాళ్ళెవరూ నాకు తెలీదు" అన్నాడు సిగ్గుపడుతూ గణపతి.
    
    "వేలు పెట్టేవాళ్ళు తెలుసా?" అడిగాడాయన.
    
    గణపతి అర్ధంకానట్లు చూశాడు.
    
    "చూడు, మిస్టర్ నీ పేరేమిటో?"
    
    "గణపతి!"
    
    "గణపతీ! రామానాయుడులా, ఏ.ఎం.రత్నంలా నిర్మాతలయి పోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. అటువంటివాళ్ళచేత ఇరవై వేలూ, పదివేలూ, ఐదువేలూ, హీనంగా వెయ్యి అయినా సరే పెట్టించు. వాళ్ళ పేర్లు నిర్మాతల లిస్ట్ లో వేస్తాము. ఓ రకంగా ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంటులా పనిచెయ్యాలి. యాభైవేలు దాటగానే నిన్ను ఆ ఏరియాకి ఫీల్డ్ ఆఫీసర్ని చేస్తానన్నమాట! ఇంకో యాభైవేలు చేయిస్తే వేషం గారంటీ! ఇంకో యాభై చేయిస్తే సైడ్ హీరో కారెక్టర్. ఇంకో యాభై చేయిస్తే హీరో కారెక్టర్ ఇచ్చేస్తాను నెక్స్ట్ పిక్చర్ లో! నువ్వు చెయ్యాల్సిందల్లా ఓపిగ్గా తిరిగి ఈ ఫారం నింపించి వాళ్ళచేత డబ్బు కట్టించడం నిర్మాతలందర్నీ వాళ్ళుపెట్టిన డబ్బునిబట్టి కాకుండా సమానంగా చూడటం జరుగుతుంది. ముహూర్తం ఫంక్షన్ కీ, ప్రివ్యూలకి ఫామిలీస్ తో రావచ్చు. జీవితంలో ఓ సూపర్ హిట్ సినిమాకి నిర్మాతగా చెప్పుకుని మురిసిపోవచ్చు. లాభాలు మాత్రం వాళ్ళ పెట్టుబడులనిబట్టి పంచడం జరుగుతుంది. ఇటువంటి స్కీమ్ ఇంతకు ముందు ఎవరూ తల పెట్టకపోవడంవల్ల మనకి బోలెడంత పబ్లిసిటీ! సువర్ణ అవకాశం ఎవరూ వదులుకోలేనిది!" అన్నాడు.
    
    గణపతి ఆసక్తిగా వింటున్నవాడల్లా "సినిమా అంటే అప్పుడే సూపర్ హిట్ సినిమా అని ఎలా చెప్పగలుగుతున్నారు?" అన్నాడు.
    
    ఆయన తాపీగా పొగ వదులుతూ, "ఆ సినిమా పేరే అది కాబట్టి ప్రతి నిర్మాతా సూపర్ హిట్ సినిమాకి నిర్మాతలమని చెప్పుకుని మురిసిపోవచ్చు" అన్నాడు. 'అశ్వత్దామా హతః కుంజరహః' అన్న ధర్మరాజులా!
    
    "మరి మీరేం చేస్తారు?" అడిగాడు గణపతి.
    
    "డైరెక్షన్" స్టయిల్ గా చెప్పాడాయన తలగోక్కుంటూ.
    
    'నీ డైరెక్షన్ దురద తీర్చుకోవడానికి ఇంత స్కీమ్ ఆలోచించావా గురూ!' అనుకున్నాడు గణపతి.
    
    మళ్ళీ ఆయనే అన్నాడు. 'గణపతీ! ఇలాంటి షార్ట్ కట్ దారిలో హీరో అవడం అనేది మళ్ళీ జన్మలో రాని అదృష్టం. ఏ స్మగాతీ ఆలోచించి వెంటనే చెప్పు!"
    
    "నేను రెండు లక్షలు ఎప్పటిలోగా చేయించాలి?" అడిగాడు గణపతి.
    
    "రెండు నెలలు! ఆలోగా స్క్రిప్ట్ వర్క్ అవుతూ వుంటుంది. మొత్తం రెండుకోట్ల ప్రాజెక్ట్ ఇప్పటికే పాతిక లక్షలు చేయించిన కుర్రాళ్ళున్నారు నాదగ్గర.  ఈ రెండు నెలలూ అవగానే సెట్స్ మీదకి వెళ్ళడమే" అన్నాడాయన.
    
    "మరి వాళ్ళని వదిలి నాకే హీరో ఛాన్స్ ఎలా ఇస్తారు?" తెలివిగా అడిగాడు గణపతి.
    
    "వాళ్ళకి నీకున్న గ్లామర్ లేదు కాబట్టి"
    
    ఆ జవాబుకి గణపతికి వొళ్ళంతా ఉబ్బిపోయినట్లుగా అనిపించింది.
    
    "ఇంకేమయినా డౌట్లున్నాయా? లేకపోతే ఈ ఫారాలు తీసుకుని వెళ్ళి ఈ రోజునుండే పని మొదలు పెట్టు మన సినిమాలో అమితాబ్ బచ్చన్ రేఖా హీరోకి తల్లిదండ్రుల వేషాలు వేస్తున్నారు. మ్యూజిక్ రెహమాన్ చేత చేయిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు గెడ్డం గోక్కుంటూ.
    
    "రెహమాన్ అయితేనే క్రేజ్ ఉంటుంది సార్!" ఉత్సాహంగా అన్నాడు గణపతి.
    
                                                               * * *

 Previous Page Next Page