Home » Cherukuri ramadevi » Baandhavya Bandhithulu

                                 


    గదిలోకి వస్తున్న నా చప్పుడు విని ఆనందంగా వెనక్కి తిరిగి, నావైపు రాబోతున్న ఆయన టక్కున నాగుపామును చూచినట్లు ఆగిపోయారు. పచ్చని ముఖం నిప్పులా కందిపోయింది. ఆయన ముఖంలోని భావాలు చదువుకోవడానికి నాకు ఎక్కువ కష్టం కలగలేదు. తల్లితండ్రుల ఆనందానికి కారణం క్షణకాలంలో ఊహించగలిగారు. వృద్ధ దంపతులు వారి కేమి తెలుసు? కొడుకు తండ్రి కాబోతున్నాడనీ, వంశోద్దారకుడు ఉద్భవించబోతున్నాడన్న వెర్రి ఆనందం తప్ప!
    ఆయన ముఖం మరొక్క క్షణంకూడా చూచే శక్తి నాలో లేదు. ఆయన నాలాంటి పాపాత్మురాలి ముఖం చూడలేననుకున్నారేమో, పక్కనున్న తలుపు దఢాలున తెరిచి వరండాలోకి వెళ్ళిపోయారు. ఆయనవైపు చూస్తున్న నాకు పై నుండి కురుస్తున్నది పండువెన్నెలలా లేదు. నా ఈ రోజుకు కారణమయిన జడివానలా ఉంది. మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలు చంద్రుని ప్రియురాళ్ళలా లేవు. నేను చేసిన పాపాన్ని వేలెత్తి చూపే విచ్చుకత్తులలా ఉన్నాయి. నా కాళ్ళు చల్లబడుతున్నాయి. గుండెల్లో దడ ప్రారంభమయింది.
    ఆ తరవాత ఏం జరిగిందో వినడంతప్ప, నాకు తెలియదు. మెళకువ వచ్చేసరికి జాజిమొగ్గలు పరిచిఉన్న తెల్లని దుప్పటీ మీద పడుకునిఉన్నాను. కళ్ళు తెరిచి చూచేసరికి ఆయన చల్లని చెయ్యి నా నుదుటిమీద పెట్టి ఉంది. మరో చేత్తో ధారావాహికంగా కారిపోతున్న కన్నీటిని తుడవ ప్రయత్నిస్తున్నారు, "ఊరుకో, ఏడవకు. ఇప్పటికే అలిసిపోయావు!" అంటూ. నాలోని బాధను సానుభూతి, ఓదార్పు ఆపగలిగేవి కావు. ఓ గంటసేపు వలవలా ఏడ్చాక తెలియకుండానే మాట్లాడగలుగుతున్నాను. "ఇప్పుడేమీ చెప్పక్కరలేదు. పడుకో" అన్న ఆయన మాటలనుకూడా లెక్కచెయ్యకుండా జరిగింది జరిగి నట్లు చెప్పాను. ఆయన మౌనంగా, తలవంచుకుని కనురెప్పయినా ఎత్తకుండా వింటున్నారు. నేను చెప్పవలసింది పూర్తి కాగానే ఏదో విధమయిన ఉపశమనం కలిగింది. 'నేను చేసిన పని ఎంత తప్పు పనైనా, ఆయనలాంటి నిర్మలమూర్తితో అబద్ధం ఆడలేదు. నిజం దాచలేదు. 'ఆయన ఆదరణపై నిలిచిఉంటుంది ముండు జీవితం. లేకుంటే నా నిర్ణయం నాకే ఉంది' అన్న ఆలోచనతో ఉన్న నాకు అలసటమూలంగా, హైరాణమూలంగా తెలియని నిద్ర పట్టింది.
    మెలకువ వచ్చేసరికి పరిసరాలన్నీ మారిపోయాయి. గదిలో ఆయన లేరు. రాత్రి జరిగిందంతా ఒక కలలా ఉంది. నాలోని భావసంఘర్షణ యథాప్రకారంగా మొదలయింది. ఇలాటి విషయాలు విన్నాక, ఆయన అంత మౌనంగా, నిదానంగా ఎలా ఉండగలిగారో తెలియలేదు. ఆయన ఏదోవిధంగా దైహికంగానో, మానసికంగానో శిక్షిస్తే నాకు శాంతిగా ఉండేదేమో! ఏదీ లేకుండా నాకు అంత ఆప్యాయంగా సేవ చేస్తూంటే, నా పాపఫలితం రెట్టింపవుతుందేమో ననిపించింది.     
    మెల్లిగా లేచి బయటికి వెళ్ళాను. మరునాడు పగటిపూట అందరితో సామాన్యంగా, మామూలుగా తిరుగుతూంటే, ప్రప్రధమంగా తండ్రి కాబోతూన్న ఆయన మీద బంధువులు విసురుతూన్న ఛలోక్తులు వింటూ, నవ్వుతూ నిదానంగా ఉన్న ఆయన్ని చూస్తూంటే, ఈయన రక్త మాంసాలు ఉన్న మానవుడా, లేక సర్వం త్యజించిన యోగా! అనిపించిన క్షణాలు లేకపోలేదు. కాని ఒంటరిగా ఆయన గదిలో కూర్చున్నప్పుడు. కాఫీ ఇవ్వడానికో, ఫలహారానికి పిలవడానికో గదిలోకి వెళ్ళినప్పుడు జట్టులోకి చెయ్యి పోనిచ్చి, దీర్ఘాలోచనులై ఉండేవారు. ఎర్రపడ్డ కళ్ళతో, అలసిన ముఖంతో ఆయన్ని చూస్తూంటే ఎంత క్షోభకు గురి అవుతున్నారో తెలిసేది. అందుకు కారకురాలినైన నన్ను ఏం చేస్తే ఆ పాపానికి నిష్కృతి కలుగుతుందని అనుకునేదాన్ని.
    ఆయన తల్లితండ్రులు పుట్టబోయే మనమన్ని గురించి సంతోషంగా, పరాచికంగా కబుర్లాడుకుంటూంటే వింటూ ఆశ్చర్యపోయేవారు! "మనమడు పుట్టగానే ఇంటెడు పనులు కోడలిమీదికి నెట్టి నేనూ, వాడూ కూర్చుంటాం. చిన్నపిల్ల దానికి పసివాడి సంరక్షణ ఏం చేతవుతుంది?" అనేవారు అత్తగారు. "ప్రపంచంలో నీకొక్కతెకే మనమడు పుడుతున్నట్లు మాట్లాడుతున్నావేం?" అనేవారు మీ తాతగారు. "ఎంతమంది పుట్టినా, నా మనమడు నా మనమడే! వాడికి, ఇంకొకరికి పాటేమిటి? వాళ్ళమ్మ అందం, నాన్న పసిమి పంచుకు పుడతాడు" అనేవారు. ఇలాటివి వింటే నా హృదయం కలుక్కుమనేది. ఆయన ముఖం వెలవెలపోయేది. పెద్దతనంలో పసివారి మీద ఇంత మమకారం ఎందుకో అనిపించేది.
    పదిమంది మధ్య భార్యాభర్తలమన్న పేరేగాని, మా ఇద్దరి మధ్య ఎటు వంటి సంబంధములేకుండాపోయింది. నే నేదయినా అడగవలసివస్తే అడగటం, ఆయన ఏదైనా చెప్పవలసివస్తే చెప్పటం....అంతే! ఆయన నాయందు చూపి స్తున్నది ఆదరణో, నిరాదరణో నాకే అర్ధంకాకుండాపోయింది. కాని ఆయన లోపల చెలరేగే వివిధ భావోద్వేగాలు అదుపులో పెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారనిపించేది.
    ఒకరోజు నాకు జరపవలసి ఉన్న వేడుకలను గురించి ప్రస్తావించారు అత్తగారు. ఆరోజు మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని ఎత్తారు. "ఇప్పుడు ఎన్నో నెల?" అడిగారు.
    "ఏడు." ఈ సమాధానం ఇవ్వడానికి నాలో నేను కుంచించుకుపోయాను.
    "అందరి ఉద్దేశంలో అయిదు కదూ!" అన్నారు. మౌనంగా తల ఆడించాను. సాలోచనగా ఉండిపోయారు. అధోవదనురాలైన నాకు ఎంత ఆపుకున్నా కన్నీరు ఆగలేదు. అది గమనించారులా ఉంది. దగ్గిరగా వచ్చి చేరువకు తీసుకున్నారు. స్పృహ తప్పినప్పుడు ఆయన చల్లని చేతిస్పర్శతప్ప ఏమి ఎరగని నేను, విశాల మైన ఆయన వక్షఃస్థలంలో, ఆప్యాయతా, ఔదార్యమే తప్ప మరోదానికి స్థానంలేని ఆయన హృదయంలో ముఖం దూర్చుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. తలమీద చెయ్యివేసి మెల్లగా నిమురుతూ ఓదార్చారు. "ఇంక ఏడవకు. అసలు ఇలాంటి పరిస్థితిలో ఇంతవరకు రాకూడదు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు చేయగలిగింది ఎలాగూ లేదు. ఇలా అయితే ఇప్పుడు బాధపడేది నువ్వూ, నేనే! కాకపోతే, నా నిరంకుశత్వం వల్ల ఎంతోమంది బాధపడవలసివస్తుంది. నిజం బయటపడితే అమ్మా, నాన్నల బాధ చూడలేను. వారి ఆనందానికి కారకుడవ వలిసిన నేను, దుఃఖానికి బాధ్యుడను కాలేను. నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలక మానదు. తప్పూ అంతే! తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్ష అనుభవించవలసిందే. అభం శుభం తెలియని నీవు మనస్సులో పడుతున్న బాధ ఇప్పటికి చాలు. ఎవరో చేసిన తప్పులో తెలియకుండా భాగం పంచుకున్న నీవు, నీ, నా జీవితాలు ముడిపడటంవల్ల నేనూ జీవితాంతం గుర్తుకు తెచ్చుకుని కొంత బాధపడుతూనే ఉంటాం. ఇందువల్ల ఏ విధంగానూ భాద్యతలేని అమ్మానాన్నలను, అంతకంటే ఏమీ తెలియని ఒక అమాయక శిశువునుకూడా బాధ పెట్టినవాళ్ళం అవుతాం. కనక జరిగింది మరిచిపోవడానికి ప్రయత్నించు. కనీసం నాముందు ప్రస్తావించకు మళ్ళీ." ఆ విధంగా ఆయన మాట్లాడటానికి, ఆ నిర్ణయానికి రావడానికి ఆయన మానసికంగా ఎంత బాధపడ్డారో గ్రహించగలిగాను. ఆ క్షణంలో భగవంతుణ్ణి మరేదైనా ప్రార్ధించి ఉంటే నా కడుపులో పెరుగుతున్న రూపం అక్షరాలా ఆయనలా రూపొందాలనే!
    నాకు ఆర్భాటంగా, అన్ని హంగులతోను వేడుకలు జరిగాయి. తొమ్మిదవ మాసం పూర్తి కాగానే మీ నాన్నగారికి ఆందోళన పట్టుకుంది. అప్పుడు అందరి ఉద్దేశంలో ఏడవమాసం పూర్తి అయింది. ఇంక పది, పదిహేను రోజుల్లో నువ్వు పుడతావనగా నన్ను తీసుకుని ఏవో ఊళ్లు చూడాలని బయలుదేరారు. అది అత్త గారికి, మామగారికి ఏమాత్రం ఇష్టంలేదు, నన్నా సమయంలో ప్రయాణం చేయించడానికి. వాళ్ళు వద్దని ఎంత చెప్పినా "తరవాత నేను ప్రాక్టీస్ పెట్టు కోవాలి. అప్పుడీ ఊళ్లు తిరగడం కుదర" దని వాళ్ళ మాటలు తోసిపుచ్చి బయలు దేరారు. "ఎప్పుడేం చెప్పినా, వాడికి తోచినట్లు చెయ్యడం తప్ప వినడంలేదు" అని విసుక్కుని ఊరుకున్నారు. మీ నాన్నగారి ఉద్దేశంలో నెలలు తక్కువగా పుడితే, వాళ్ళు వీళ్ళు ఏమయినా అనుకుంటారనీ, అభాండాలు వేస్తారేమోననీ భయం. తిరుపతి మొదలైనవి చూచి, మద్రాసు చేరేటప్పటికి నాకు నిజంగానే అలసట, ఆయాసం కలిగాయి. వారం తిరగకుండా నువ్వు పుట్టటం, మీ తాతగార్లకు టెలిగ్రాం ఇవ్వటం, ఉన్నపళంగా రెక్కలు గట్టుకుని వాలడం అన్ని ఒకటొకటిగా జరిగిపోయాయి. తీసుకువెళ్ళద్దంటే వినలేదని కొడుకుని చివాట్లుపెట్టి, దబ్బపండులా ఆరోగ్యంగా ఉన్న నిన్ను చూచేవరకు మీ మామ్మకు ప్రాణం తెరిపిన పడలేదు.
    బారసాల, అన్నప్రాసన ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరిపించుతున్న మీ నాన్నగారికి జోహార్లర్పించని దినం లేదు. ఆయన ఆటపాట లతో నిన్ను మరిపిస్తూన్నప్పుడు ఆయన్ని చూస్తూ మనస్సులో ఏదో బాధకు గురి అయ్యేదాన్ని.
    ఆయనలాంటి పుణ్యమూర్తి బిడ్డను నేను కని పెంచే యోగ్యత లేకో, నా పాపానికి ఫలితంగానో మాకు మళ్ళీ బిడ్డలు కలగలేదు. ఒకసారి ఆయన చేతులలో నువ్వుండగా, "ఒక అనాథ కావలసిన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ ఋణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను" అన్నాను. వెంటనే నా నోరు మూస్తూ "అలా మాట్లాడతావెందుకు, సావిత్రీ? ఇంత చక్కటి పాపను దేవుడు మాత్రం అనాథను చెయ్యగలడా? అయినా వీడిని చిన్నచూపు చూచేందుకు వీడు చేసిన తప్పు ఏముంది? మనకు బిడ్డలు ఇంతవరకు లేరు. ఇక కలుగుతారన్న ఆశ కూడా లేదు. వీడు లేకపోతే మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళమా! వీడిని కాదని ఎవడినో పెంచుకుంటే, నామీద వాడికి వీడికంటే ఎక్కువ అభిమానం ఉంటుందంటావా? పాపల్ని ప్రేమించడానికి కనక్కరలేదు. అయినా నువ్వు ఇంకెప్పుడూ ఇలా మాట్లాడవద్దు. గోడలకు చెవులుంటాయి" అన్నారు.    
    అదే ఆఖరుసారి ఈ విషయం మాట్లాడడానికి. దాదాపు ఆ విషయం మరిచిపోయాం. కనీసం మరిచిపోయినట్లు నటించాం.
    మీ నాన్నగారికి నిన్ను డాక్టరుగా చూడాలని ఎంతగాఉన్నదో నీకు తెలియనిది కాదు. ఆయన మరణం తరవాత నేనీ ప్రయత్నంలో ఓడిపోయానని తెలిసినా, నాకెందుకో తృప్తిగా లేకపోయింది. ఎలాగయినా నిన్ను డాక్టరుగా చేసి బీదసాదలకు వైద్యం చెయ్యాలన్న ఆయన కోరిక తీరాలని ప్రయత్నించాను. అదే కారణంగా వైజాగ్ లో ఉన్న కృష్ణమూర్తి దగ్గిరికి వచ్చి చెప్పాను. ఆయన ముందు మంచిది కాదన్నాడు. కాని అసలు నువ్వెవరివో తెలియగానే ఆయన ఉద్దేశం ఎలా మార్చుకున్నారో నాకే తెలియదు. ఇక తరవాత ఏం జరిగిందీ నీకు తెలుసు.
    ఈ గొడవంతకూ మూలం నేను. ఇంకా ఎందుకో, ఎందరిని బాధపెట్టడానికో ఇంకా బ్రతికేఉన్నాను. కాని కృష్ణమూర్తి ఏదో విధంగా అపకారం తప్ప ఉపకారం చెయ్యడంలేదు. నీకు జరిగిపోయిన ఈ విషయాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందో నా కర్ధం కాలేదు. తెలియని ఈ నిజం నీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే, నన్ను ద్వేషించినా నేను బాధపడటం లేదు. కాని నాకు ఒకే చింత. మీ నాన్నగారి ఔదార్యపు నీడలో, ఆదర్శపు పెంపకంలో పెరిగిన నీకు ఏమాత్రం ఆయన పోలికలు రానందుకు సిగ్గుపడుతున్నాను. నా తప్పిదాన్ని ఆయనలాంటివారు క్షమించారు. నాకు జీవితంలో ఏ లోటూ రాకుండా చేశారు. ఇక నువ్వనగా ఎంత?

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra