Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 30


    గోపీ ఆలోచిస్తున్నాడు. ఏం మనుషులు వీళ్ళు?
    చౌదరి నాయుడిని చేరదీసి తనంతటివాడిని చేశాడు. ఇద్దరూ కలిసి చట్టవిరుద్ధమైన పనులు చేశారు. తను ప్రారంభించినది ఓ పెద్ద సంస్థ అనీ, అందువలన ఎందరో ప్రయోజనం పొందుతున్నారనీ, ఆ సంస్థను కొనసాగించడమూ, కలకాలం నిలబెట్టడమూ తన బాధ్యత అనీ చౌదరి భావిస్తున్నాడు చౌదరి స్వార్ధపరుడన్న విషయంలో సందేహంలేదు. కానీ తను నెలకొల్పిన సంస్థకోసం అతడు తన భార్యా బిడ్డల్ని త్యాగంచేశాడు. తనవారిని హత్యచేసి తనకు ఎదురుతిరిగిన నాయుడిని కూడా ఉపేక్షించాడు. ఇది ఎటువంటి స్వార్ధం?
    తన సంస్థపైనా, తనవారిపైనా ఉన్న అభిమానమే ఫిరంగిపురంలో చౌదరిని బలవంతుణ్ణి చేసింది. దురదృష్టవశాత్తు చౌదరివంటి ఉత్తమ నాయకులు తప్పుదారిలో నడుస్తున్నారు. ఉత్తమనాయకులనిపించుకుంటున్న వారు ప్రజలను తప్పుదారిలో నడిపిస్తున్నారు. రాంగ్ మెన్ ఎట్ రాంగ్ ప్లే సెస్.....ఇదే ఈ దేశపు దౌర్భాగ్యపుస్థితికి ఓ కారణం అయుండవచ్చును.
    "ఏమిటాలోచిస్తున్నావ్?" అన్నాడు చౌదరి.
    "నీవల్ల కానిపని నేను చేయగలనా?" అన్నాడు గోపీ.
    "నీ వయసు నాకుంటే నేనే ఈపని చేసి ఉండేవాణ్ణి. నీవిప్పుడు నా వయసులో నాకంటే సమర్దుడివి-"
    "అయితే నాయుడిమీద ఎలా దెబ్బతీయాలి-"
    "ట్రిక్.....ట్రిక్......ట్రిక్...." అన్నాడు చౌదరి.
    "అంటే?"
    "ఇంతవరకూ నువ్వు చేసిందే - అతడి ఊహకు అందని ట్రిక్సువేసి అతఃడిలో కలవరం, అతడి మనుషుల్లో కలకలం పుట్టించాలి. అందుకు ఈరోజే నాంది పలకాలి-" గోపి చౌదరి చెప్పేది శ్రద్దగా వింటున్నాడు-" "ఈ రాత్రంతా బాగా ఆలోచించు. రేపు ఉత్తరం వైపు కొండల్లోకి నాయుడి సరుకు వస్తున్నది. ఆ సరుకు నువ్వు స్వాధీనం చేసుకోవాలి. నీకూడా ఎంతమందిని కావాలంటే అంతమందినీ తీసుకుని వెళ్ళవచ్చును-"
    గోపి ఆలోచిస్తూ- "మరి విశాల సంగతేమిటి?" అన్నాడు.
    "మన బంగళావైపు నాయుడి మనుషులు కన్నెత్తికూడా చూడసాహసించరు. అయినా బంగళాలో జమాజెట్టీలాంటి మనుషులున్నారు. వాళ్ళు విశాలకు రక్షణగా ఉంటారు-" అన్నాడు చౌదరి.
    గోపి ఆలోచిస్తూ- "శకుంతలవంటి మనిషి నాకు తోడుగావుంటే-వేరే ఇంకెవ్వరూ సాయం అవసరం లేదనుకుంటాను-"అన్నాడు.
    చౌదరి అతడికి నాయుడి సరుకు గురించి మరికొన్ని వివరాలు చెప్పి- "శకుంతలను కూడా తీసుకువెళ్ళే పక్షంలో రేపు ఉదయం ముందుగా నువ్వామెను తన ఇంట్లో కలవడం మంచిది-" అన్నాడు.
    గోపి అతడివద్ద శకుంతల చిరునామా తీసుకున్నాడు.
    
                                          16
    
    "డియర్ విశాలా! నీవు ఆఫీసుకు వెళ్ళనవసరంలేదు. ఈ రోజునుంచీ నువ్వు నా సెక్రటరీవి-" అన్నాడు గోపి.
    "అంటే?" అన్నది విశాల ఆశ్చర్యంగా.
    "నీ కంపెనీ నీకెంత జీతం ఇస్తున్నదో అంతకు రెట్టింపు నీకు నేనిస్తాను!" అన్నాడు గోపి.
    "నీవు నన్ను సెక్రటరీగా తీసుకుంటానంటే నాకు జీతమెందుకు?" అన్నది విశాల చిరునవ్వు నవ్వుతూ.
    "నా దగ్గరకు వచ్చి ఎవరూ ఏమీ నష్టపోకూడదు-"
    "నీ దగ్గర నేను పోగొట్టుకునేదానికంటే పొందినదే ఎక్కువ...."
    "ఏం పొందావుట?"
    "కొన్ని కొన్ని విశేషాలు మాటల్లో చెప్పలేము. కానీ ఇప్పుడు నేను నీ కోసం ఏమైనా చేయగలను...." అన్నది విశాల.
    "ఏమీ చేయొద్దు. నా సెక్రటరీగా వుండు. అంతేచాలు!"
    "సెక్రటరీగా నా డ్యూటీలేమిటి?"
    "ఇల్లు నీటుగా ఉంచడం- నా అవసరాలు చూడడం, నేను కోరినప్పుడల్లా నాతో వచ్చి యుగళగీతాలు పాడడం...."
    "ఇవి చేయడం నావల్ల కాదు. నీ భార్య చేయాలి...."
    "భార్యనైతే ఇంకా ఏమో అడిగేవాడిని. ప్రస్తుతానికి మనపక్కలు వేరుగదా-అందుకని నువ్వు నా సెక్రటరీవి! ఆ లోటుకాస్తా తీరితే నువ్వే నా భార్యవు...." అన్నాడు గోపి.
    విశాల సిగ్గుతో చేతులు ముఖానికి అడ్డంగా కప్పుకున్నది.
    "చూడు.....నేను బయటకు వెడుతున్నాను. ఈ రోజుకింక ఇంటికి రాను-తెలిసిందా?" అన్నాడు గోపి.
    "ఎక్కడికి వెడుతున్నావు?"
    "ఈ రోజంతా నేను ఇంట్లో ఉండనన్న విషయం నువ్వు ఎవరడిగినా చెప్పగలగాలి. అది సెక్రటరీగా నీ బాధ్యత. నేను ఎక్కడికి వెడుతున్నానూ అన్నది భార్య అయేవరకూ-నీకు చెప్పవలసిన బాధ్యత నాకు లేదు-" అని గోపి ఇంత్య్లోంచి బయటకు వెళ్ళిపోయాడు.
    అతడు తిన్నగా శకుంతల ఇంటికి వెళ్ళాడు. తలుపు పదేళ్ళపని పిల్ల తీసింది. ఆమె అతణ్ణి చూస్తూనే- "మీరు గోపిగారాండీ? రాగానే మిమ్మల్ని లోపలకు పంపమన్నారు. అమ్మగారు గదిలో ఉన్నారు-" అన్నది.
    గోపి పనిపిల్ల చూపించిన గదిలోకి వెళ్ళాడు. గదిలో శకుంతల చిన్న నిక్కరు, టీ షర్టు ధరించి ఉన్నది. ఆ గదిలో మరొక మనిషికూడా ఉన్నాడు. అతడు సుమారు అయిదడుగుల పదంగుళాల పొడవుంటాడు. మనిషి బలిష్టంగా ఉన్నాడు అతడి వీపు గోపి వైపుకు తిరిగి వున్నది. ఆ మనిషిచుట్టూ పై నుంచీ వ్రేలాడుతున్న ఫుట్ బాల్ సైజు బంతులున్నాయి.

 Previous Page Next Page