Previous Page Next Page 
సృష్టి పేజి 3


    ఆ మెడలో తెల్లటి పూసల దండ తప్పితే పెళ్ళయినట్టుగా ఎ గుర్తులూ లేవు.

 

    గబుక్కున లేచి కూర్చున్నాడు అభినవ్.

 

    కళ్ళార్పకుండా తదేకంగా, తేరిపార చూశాడు.

 

    కాళ్ళకు మట్టెలు కూడా లేవు.

 

    నల్లటి వంటి రంగులో ఆ అమ్మాయి నీలి కలువలా వుంది. కాళ్ళ దగ్గర పసివాడు తెల్లగా రబ్బరు బొమ్మలా వున్నాడు.

 

    చప్పుడు చేయకుండా లేచి ఎదురుగా వచ్చి ఆ అమ్మాయి వైపు చూశాడు. నల్లరాతితో చెక్కిన శిల్పంలా వుంది ఆ అమ్మాయి.

 

    అప్పుడే.....

 

    అదే క్షణంలో....

 

    అభినవ్ మనసులో చిత్రకారుడు నెమలిలా పురివిప్పుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయలేదతను.

 

    హేండ్ బ్యాగ్ లోంచి ఈజిల్ ని తీసి, ఎడ్జెస్ట్ చేసుకుని కాన్వాస్ ఫిక్స్ చేసి-

 

    కుంచెను అందుకున్నాడు.

 

    సరిగ్గా రెండు గంటలు గడిచాయి.

 

    ట్రైను ఎక్కడా ఆగకుండా పరిగెడుతోంది.

 

    స్కెచ్ పూర్తి చేశాడు.

 

    మరో రెండు గంటలు గడిచాయి.

 

    మసక చీకట్లోనే రంగులు వెయ్యడం ప్రారంభించాడు.

 

    ఆ చిత్రం గీస్తున్నంతసేపూ అతని హృదయంలో ఏదో తెలియని ఆనందం తొణికిలాడుతోంది.

 

    కనీ కన్పించని మసక చీకటిలో అతను చిత్రానికి రంగులు వేస్తున్నాడు. అయినా-

 

    అతని మనసు నిండా వెలుగు వెల్లువ!

 

    అభినవ్ దృష్టిలో ఆ కంపార్టుమెంట్లో మరెవ్వరూ లేరు. తను.....ఎదుట ఆమె, ఆమె బిడ్డా, అంతే!

 

    మరో అరగంట తర్వాత చిత్రం పూర్తయింది.

    
    తను వేసిన చిత్రాన్ని వెలుగులో చూసుకోవాలని ఆశగా వుంది అతనికి.

 

    సరిగ్గా-


    
    అదే సమయంలో......

 

    రైలు వేగం తగ్గు ముఖం పట్టింది. ఏదో స్టేషన్ సమీపిస్తున్నట్టుగా సందడి.

 

    ఆ చివర ఎవరో లైటు వేశారు.

 

    గబుక్కున కాన్వాస్ ను తీసేసి సీటుమీద బోర్లాపెట్టి ఈజిల్ ని మడత పెట్టేసి-

 

    లైటు స్విచ్ ఆన్ చేశాడు.

 

    మెరుపు తటాల్మని కళ్ళకు తగిలినట్లుగా అయింది.

 

    కింద రెండు బెర్త్ లకు మధ్య  అదే భంగిమలో ఆ అమ్మాయి!

 

    ముగ్ధమనోహరంగా!


    
    స్లీపింగ్ బ్లాక్  బ్యూటీ తనలో తను అనుకున్నాడతను.

 

    వరసగా కంపార్టుమెంట్లో లైట్లు వెలగడం ప్రారంభించాయి.

 

    ఇంతట్లో-


    
    టిక్కెట్ కలెక్టర్ వచ్చాడు. నిద్రపోతున్న ఆ అమ్మాయిని తట్టాడు. "మిస్.... లిపి... మీరేనా?"

 

    మగత కళ్ళని మత్తుగా విప్పిందామె. కలవరపడుతూ పైటచెంగుని సర్దుకుని  టిక్కెట్  కలక్టర్ వైపు చూసింది.

 

    "బెర్త్ ఖాళీ అయింది. థర్టీ సిక్స్ వెళ్ళండి."

 

    ఆ మాటతో ఆ అమ్మాయి గబుక్కున  లేచి సూటుకేసు అందుకుని "థాంక్సండీ" అంది  ముందుకెళుతూ.

 

    కాళ్ళ దగ్గర  బాబుని అసలామె పట్టించుకోలేదు.

 

    ఆశ్చర్యంగా అభినవ్ బాబువేపు, ఆమె వేపు చూస్తున్నాడు.

 

    అతనికేం అంతుపట్టలేదు.

 

    అభినవ్ సీట్లోంచి లేచి అంతంత కళ్ళతో అందరివైపూ చూస్తున్న బాబుని ఎత్తుకుని-

 

    "హలో" అని పిలిచాడు.

 

    రవివర్మ, శకుంతలలా తల తిప్పి చూసిందామె.

 

    "మీ బాబుని మరిచిపోయారు."

 

    ఆమె నీలి నీలి కళ్ళలో నీటి బిందువులంత ఆశ్చర్యం!

 

    "పెళ్ళికాని పిల్లకి బాబు నిస్తానంటావేంటి? నేను నిద్రపోతే ఆడుకుంటూ వచ్చేసినట్టున్నాడు."

 

    ఆ మాటలకు  తల తిప్పి చూశాడు అభినవ్.

 

    ఎదురుగా నలభై ఏళ్ళ పల్లె ఆడమనిషి.

 

    "ఈ బాబు మీ బాబా?" మరింత ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్.

 

    "అవును బాబూ! ఈడు రాత్రేల నిద్రోడు. పగటేల పడుకోడూ" అని చాంతాడంత దీర్ఘాలు తీసి బాబుని అందుకుని వెనక బెర్త్ వైపు నడిచింది.

 

    "హల్లో" అని పిలిచినా అభినవ్ వైపు ఒక్కక్షణం మాత్రమే చూసి ముందు కెళ్ళిపోయింది లిపి.

 

    అతనిలో ఏదో తెలీని ఆశ్చర్యం.

 

    ఊహ తెలియని పసివాడిని- పెళ్ళికాని ఓ అమ్మాయి దగ్గర  పెట్టి  తనకు తల్లీ పిల్లల్లా భ్రమ కలిగించాడు.

 

    ఆ భగవంతుడు వింత సృష్టి అంటే ఇదేనేమో!

 

    మరి నిద్రరాలేదతనికి.

 

    విశాలమైన భవనంలో ఒక్కొక్క కిటికీ రెక్క తెరుచుకుని వెలుగు రేఖలు ప్రసరించినట్టు అందమైన వెలుగు....! అద్భుతమైన వెలుగు! ఆ వెలుగు కోసమే ఎదురుచూస్తున్నాడతను.

 

    కేన్వాస్ ని బెర్త్ మీద అడ్డంగా పరిచి ఆప్యాయంగా దానివైపే చూశాడు.

 

    అద్భుతమైన మాతృత్వానికి అచ్చమైన నిదర్శనంలా ఆ చిత్రాన్ని చూస్తున్న కొలదీ అతనిలో కొత్త కొత్త  ఆలోచనలు పుడుతున్నాయి.


    
    ఎవరూ అతన్ని పట్టించుకోవడం లేదు. ఎక్కువమంది నిద్రలో ఉన్నారు. అతను తన చిత్రానికి ఫైనల్ టచెస్ చేశాడు.

 

    మరో నలభై  నిమిషాల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది . హేండ్  బ్యాగ్ తో కంపార్ట్ మెంట్  లోంచి ఫ్లాట్ మ్మీదకు దిగిన అభినవ్-

 

    రాత్రి తను చూసిన అమ్మాయినీ, ఆ బాబునీ మరోసారి చూడాలని పది నిమిషాలసేపు ఎదురుచూశాడు.

 

    ఆ అమ్మాయి పేరు గుర్తు తెచ్చుకోడానికి చాలాసేపు శ్రమపడ్డాడు.

 

    లిపి.....

 Previous Page Next Page