"యోగీ !" అంది అతని భుజంమీద చేయి వేస్తూ. "అంతకన్నా డ్రింక్ చెయ్యవద్దు. ఇహరా" అంది.
"ఊహు. మూడ్ రావటం లేదు."
"ఇంత మగసిరి వున్నవాడివి నీకు మూడ్ రావటం లేదా?"
అతనేమీ జవాబు చెప్పకుండా ఆమెవంక ఓసారి చూసి మళ్ళీ గ్లాసు వంక దృష్టి మరల్చాడు.
"నీకు మూడ్ ఎలా తెప్పించాలో నాకు తెలుసు" అని ఆమె అతని మీదకు వ్రాలి చెంప మీద పెదిమలు ఆన్చింది.
"కాంచనా! అది...ఆఫ్ ట్రాల్ అది"
"ప్రజ్ఞ గురించి నీ కెందుకంత తాపత్రయం ?" ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. ఆమెలో అసూయ లేదు _ అల్లరి వుంది.
"నన్ను కాదన్న ఆడదంటే నాకు కసి పుట్టుకొస్తుంది."
"అంత కసి పనికిరాదు యోగీ! ఆ అమ్మాయి నీకేం అపకారం చేసిందని?"
"నన్ను ఆకర్షించటమే అది చేసిన అపకారం ?"
"అందుకని..."
"దాన్ని సాధించి తీర్తాను"
"తర్వాత...?"
"నా కోరిక తీరాక దాన్ని నాశనం చేసి పారేస్తాను"
ఆమె ఉలిక్కిపడి అతనివంక చూసింది. గ్లాసు చేతిలో వుంచుకుని గబగబా త్రాగుతున్నాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్నాయి.
ఆ సమయంలో అతన్ని చూస్తే భయం వేసింది. అప్రయత్నంగా అతన్ని చుట్టుకొని వున్న చేతులు వెనక్కి జారిపోయాయి.
11
తేజ కన్సల్టింగ్ రూంలో నుంచి యితరులకు వస్తూండగా ఎదురుగా ప్రజ్ఞ కనబడింది.
"హాయ్! యిక్కడున్నారా?" అనడిగింది సంతోషంగా.
ప్రజ్ఞ నవ్వుతూ తల వూపింది.
"ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? ఎప్పట్నుంచి ?"
"నాలుగయిదు నెలల నుంచీ"
"చెప్పలేదేం?"
"మనమీ మధ్య ఎప్పుడూ కలవలేదుగా. అవునూ, ఏమిటిలా వచ్చారు? వంట్లో బావుండలేదా?"
"స్టమక్ లో నిన్న విపరీతంగా నొప్పి వచ్చింది. ఇప్పుడంతగా లేదనుకోండి. డాక్టరుగారు ఎపెండిసైటిస్ కావచ్చునన్నారు. ప్రస్తుతానికి ఫర్వాలేదని చెప్పారనుకోండి. మీకు డ్యూటీ ఎన్ని గంటలదాకా వుంది?"
"సాయంకాలం ఏడుదాకా వుంది."
"ఇంటికి వెళ్ళేటప్పుడు ఓసారి కలవకూడదూ? మనం మాట్లాడుకుని చాలా రోజులయింది"
"అలాగే"
"అలాగే అంటే కాదు, తప్పకుండా రావాలి. మీకోసం ఎదురుచూస్తూ వుంటాను."
"తప్పకుండా వస్తాను"
ఆ సాయంత్రం ఏడు గంటలు దాటాక ప్రజ్ఞ డ్యూటీ నుంచి రిలీవయి తేజ యింటికి వెళ్ళింది.
తేజ యింట్లో ఒక్కతే వుంది.
"ఒక్కరే వున్నారా?" అనడిగింది ప్రజ్ఞ యథాలాపంగా.
"సాధారణంగా అదే జరుగుతూ వుంటుంది. డాడీ బిజినెస్ పనుల మీద తిరుగుతూ వుంటారు. మమ్మీ క్లబ్బులూ, సోషల్ యాక్టివిటీస్ వగైరాలతో ఊపిరాడకుండా వుంటుంది. నేను వంటరిగానే మిగిలిపోతూ వుంటాను."
ప్రజ్ఞ కొంచమాలోంచి "ఒంటరితనం పోగొట్టుకోవచ్చుగా" అంది
"ఎలా?"
"పెళ్ళిచేసుకుని"
"పెళ్ళి చేసుకుంటే వంటరితనం పోదు. ఇంకో మనిషితో కలిసి జీవించటమవుతుంది."
"ఇంకో మనిషితో కలిసి జీవించటమంటే వంటరితనం పోగొట్టుకోవటమేగా"
"ఇంకో మనిషి ప్రక్కన వున్నంత మాత్రాన వంటరితనం పోదు. పెళ్ళి అనేది మనిషి తగిలించుకునే ఓం జంఝాటం. అతడ్ని పరిపూర్ణుడ్ని చేసే శక్తి దానికి లేదు"
"అయితే అందరూ పెళ్ళెందుకు చేసుకుంటారు?"
"ఆ భయంకరమైన రొటీన్ నుంచి తప్పించుకోలేక, అంతకన్న యింకేవి చెయ్యాలో తెలీక. ఎక్కడో అక్కడ యిమిడిపోయే తత్వం నుంచి బయటపడలేక."
"పెళ్ళి రొటీన్ అవుతుందా ?"
"తప్పకుండా, అంతేగాక మనిషికీ డబ్బుకూ వుండే సంబంధం వివాహబంధం ద్వారా మరింత తీవ్రంగా వ్యక్తమవుతూ వుంటుంది.
"ఎలా ?"
"అసలు వివాహపు తంతే కట్నం, లాంఛనాలు మొదలయిన సారాలతో మొదలవుతుంది."


