ఆమె గొప్ప అందగత్తెకాదు. కానీ ఆమెలో అదో విధమైన.....ఉహు దాన్నేమనాలో అతడికి తెలియలేదు. ఆమె కళ్ళు నిర్మలంగా వున్నాయి. కానీ దానికి వ్యతిరేకంగా ఆమె వక్షం చాలా ఎత్తుగా వుంది. కాళ్ళకు పసుపు, నవ్వులో స్వచ్చత వున్నాయి. కానీ చూపులో చిరునవ్వు వుంది. భగవంతుడు చాలా కాంట్రాడిక్షన్స్ తో బాధపడుతూ సృష్టించి వుంటాడు ఆమెని.
"చూశారా- మా ఆవిడకు ఒక చెవిలేదు..." అన్నాడు ఆయన బిగ్గరగా నవ్వుతూ. పాటలకోసం అది కోసేసుకుంది - అన్న అర్ధంతో.
ఆ ముసలాడి జోకుకి బాలూకి నవ్వు రాలేదు. ఆమెకూడా నవ్వలేదు. లోపలికి వెళ్ళి రెండు కప్పులతో కాఫీ తెచ్చి పెట్టి మళ్ళీ వెళ్ళిపోయింది.
ఆయన తాసిల్దారుగా చేసి వాలంటరీగా రిటైరయ్యాడనీ, అది రెండో పెళ్ళనీ తెలిసింది. మొదటి భార్య పిల్లల్లేకుండా చచ్చిపోతే నలభై ఎనిమిదో యేట ఈవిడని చేసుకున్నాడు. కాఫీ తాగుతూ ఆయన చెప్పిన విషయాలు అవి.
బాలు మరికొంచెంసేపు మాట్లాడి లేచి "వెళ్ళొస్తాను" అన్నాడు. గేటువరకూ వచ్చి అప్రయత్నంగా వెనుతిరిగి చూశాడు. ఆమె కిటికీలోంచి చూస్తూ వుంది అయితే ఇంతవరకు ముందు లాగా చప్పున వెనక్కి తప్పుకోలేదు. నెమ్మదిగా పక్కకి వెళ్ళింది.
అతడు చూసే సమయానికి ఆమె పై పెదవిని నాలుకతో రాస్తోంది. అతడు చూడగానే మామూలుగా అయిపోయింది కానీ, సిగ్గుగా నవ్వుకోవటం అతడి కంటపడింది.
బాలూ తన ఇంటివరకూ వెళ్ళాక మళ్ళీ తిరిగి చూశాడు.
ఎవరూ కనపడలేదు.
* * *
నాలుగు రోజులు గడిచాయి.
ఈ నాలుగు రోజుల్లోనూ ఫోను రింగవడం, అతను రిసీవరు యెత్తగానే డిస్ కనెక్టు కావడం రెండుసార్లు జరిగింది. అది టెలిఫోన్స్ వారి అసమర్ధతే అనుకున్నాడు అతను విసుక్కుంటూ.
ఐదో రోజు రాత్రి.
పడుకోబోయేముందు అలవాటుగా గ్లాసులో పాలు తెచ్చి యిచ్చింది సౌదామిని.
ఆ రోజు కొత్త డీల్ ఒకటి సెటిల్ అయ్యింది. అందుకని హుషారుగా వున్నాడు బాలు. సౌదామిని దగ్గరకు లాక్కుని చెవిలో చెప్పాడు.
"పాలు చూస్తూంటే గుర్తొస్తోంది ఒక ఇంగ్లీషు జోకు చెప్పనా!"
"ఏం వద్దు!" అంటూ వదిలించుకొబోయింది సౌదామిని.
"ఇది చెప్పి తీరవలసిన జోకు. విను. అన్ని పాలకంటే తల్లిపాలు శ్రేష్ఠమట. ఎందుకో తెలుసా?"
చెవులు మూసుకోబోయింది సౌదామిని.
ఆమె చేతులు బలవంతంగా పక్కకి లాగి చెప్పాడు.
"తల్లిపాలు ఎందుకు మంచివంటే అవి పాడైపోవు. వేడి చెయ్యనక్కర్లేదు. చక్కెర కలపవలసిన అవసరం ఉండదు. దొర్లి పోవు. ఒకచోట నుండి ఇంకోచోటికి తీసుకు వెళ్ళడం సులభం. అన్నిటికన్నా మించి అవి అందమైన ప్యాకింగులలో లభిస్తాయి."
"ఎప్పుడూ అదే ఆలోచనలు, అదే మాటలు" అంది ఆమె విసుక్కుంటూ.
నవ్వుతూ పాలు తాగేశాడు బాలు.
రెండు నిముషాల్లో అతని కళ్ళు మూతలు పడిపోయాయి. ఒళ్ళెరుగని నిద్ర పట్టేసింది.
మర్నాడు ప్రొద్దున్న తొమ్మిదిన్నర దాకా అలా మొద్దు నిద్దుర పోతూనే వున్నాడతను.
ఎవరో తట్టినట్లు మెలకువ రాగానే వాచ్ చూసుకుని ఉలిక్కిపడి మంచం దిగాడు.
ఎందుకింత నిద్రపట్టింది తనకు? ఎప్పుడూ ఇలా జరగదే.
ఎంత అలసిపోయి వచ్చి పడుకున్నా, అర్ధరాత్రివేళ ఒకసారి మెలకువ వస్తుంది తనకు. అలవాటుగా లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాడు. చిన్నప్పటినుండీ అంతే.
మంచినీళ్ళు తాగడానికి కూడా మెలకువ రానంత గాఢమైన నిద్ర తనకు పట్టిందంటే....
చిత్రంగానే వుంది.
అతను మొఖం కడుక్కుని వచ్చేసరికి, వెచ్చటి సువాసనలు వెదజల్లుతున్న కాఫీగ్లాసుతో వచ్చింది సౌదామిని. తలంటు పోసుకుని వుంది తను. పెద్ద బొట్టుతో పవిత్రంగా కనబడుతోంది.
హడావిడిగా కాఫీ తాగేసి, బట్టలు తగిలించుకుని చెప్పుల స్టాండు దగ్గరికి నడిచాడు బాలు.
ఆమె ఆశ్చర్యంగా చూసింది ఎక్కడికి ఆ పరుగులు?
అతని కంగారంతా ఆమెమీద విసుగ్గా మారింది.
"ఎక్కడికా? ఏట్లోకి కాస్త ముందుగా లేపివుంటే నీ తాత సొమ్మేమన్నా పోయి వుండేదా?" అన్నాడు కరుస్తున్నట్లు.
నొచ్చుకుంటున్నట్లు చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. అతను చిరాగ్గా అలా మాట్లాడటం అదే మొదటిసారి అతనికంత చిరాకు రావటానికి కారణమేమిటో ఆమె కర్ధం కాలేదు. ఈ లోపులో --
కోపంగా చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు బాలు.
పాదాలు చెప్పుల్లో దూరలేదు.
కిందికి చూశాడు.
అవి తన చెప్పులు కావు.
తెల్లచెప్పులే అవి. తన సైజులోనే వున్నాయి. కానీ తన చెప్పులు కావు. కొంచెం చిన్నవి. ఒకే రకంవి. ఎవరో పొరపాటున వాళ్ళ చెప్పులు ఇక్కడ వదిలేసి తన చెప్పులు తీసుకు వెళ్ళారు.
షాక్ తగిలినట్టు దిగ్భ్రమ చెంది నిలబడిపోయాడు అతడు.
ఎవరు?
ఎవరు వచ్చి వుంటారు ఇక్కడికి?
'సౌదామినీ' అని పిలవబోయి ఆగిపోయాడు. తమాయించుకుని "ఆసెయ్యా" అని పిలిచాడు.
"ఏమిటి దొరా?" అని హాజరయ్యాడు - ఆసెయ్య.
"ఎవరన్నా వచ్చారా ఇంటికి?"
"ఇంటికా, రాలేదు దొరా!" అన్నాడు చాలా గట్టిగా నొక్కి చెబుతూ.
"రాలేదా!" అన్నాడు బాలు అనుమానంగా అతని చూపులు మళ్ళీ ఆ చెప్పులు మీదకి పోయాయి.
అది గమనించాడు ఆసెయ్య.
"ఏమిటి దొరా చూస్తుండవు?"
"ఈ చెప్పు లెవరివి! నా చెప్పులు కనబడవేం?"
ఆ చెప్పులని కాసేపు మిర్రిమిర్రి చూసి "దూత్తెరికీ!" అని కిటికీలో నుంచి ఉమ్మేశాడు ఆసెయ్య.
"మా క్రిష్ణగానికి ఈ దొంగబుద్దులింక పోలేదన్న మాట."
"కృష్ణ యెవరు?"
"క్రిష్ణ మా సాలగాడు దొర!"
"అంటే?"
"అంటే - మా ఆడదానికి తమ్ముడు, వణికి షోకు లెక్కువ దొరా? నిన్న కరీంనగరం నుంచి నన్ను చూడటానికి వచ్చిండు వచ్చినవాడు ఊకబోయెనా? నీ చెప్పులు.... (ఆ చెప్పులని క్రిష్ణ ఏం చేశాడో అచ్చ తెలుగులో చెప్తాడు) మధ్య నా పేరు బద్నాయ్ అయె! పరేశాన్ కాకు దొరా? కరీంనగరం నుంచి నీ చెప్పులు నీకు తెప్పించి ఇచ్చే జిమ్మెదారి నాది. ఈ క్రిష్ణగాడే ఇదివరకు మైసూరు రెడ్డివి ఛడావులు తొడుక్కుని ఉడాయించాడు దొరా?"
చెప్పడం పూర్తిచేసి - తన వాళ్ళవల్ల యజమానికి నష్టం కలిగినందుకు సిగ్గుతో కుంచించుకు పోతున్నట్లు తల వంచుకుని నిలబడ్డాడు ఆసెయ్య.
"పోన్లే! మళ్ళీ నువ్వు ఆ చెప్పులు తెప్పించినా నేను వేసుకోనుకదా? ఈసారి అతనొస్తే జాగ్రత్తగా కనిపెట్టి ఉండు-" అన్నాడు అతను.
"ఈసారి మళ్ళీ అలాంటి తప్పు జరిగితే గిదో, గీచెప్పుతోనే కొట్టు దొరా!"
విసుగ్గా నార్తుస్టార్ బూట్లు తొడుక్కుని వెళ్ళిపోయాడు బాలూ.
ఏదో చెప్పుదామని, మళ్ళీ ఎందుకో ఆగిపోయాడు ఆసెయ్య.
14
కళాకారులు, అందులోనూ క్రియేటివ్ ఆర్టిస్టులు మనశ్శాంతి ఉన్నప్పుడు ఉద్వేగంగా సృష్టి చేయగలరా, మనసు మధనమైపోతూ ఉంటే మంచి కళకు ప్రాణం పోయగలరా అన్న దానిమీద ఎప్పుడూ రెండురకాల అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి.
ఏ చిక్కులూ లేకుండా రెండుపూటలా తిండి గడిచిపోతూ నిశ్చింతగా వుంటే ఇరవై నాలుగు గంటలూ కళకోసం శ్రమపడగలననుకుంటాడు ప్రతి కళాకారుడూ.
కానీ అది అన్నివేళలా నిజంకాదు.
కడుపు కాలిపోతూ వున్నప్పుడో, గుండెలు మండిపోతూ ఉన్నప్పుడో నిద్రాణమై ఉన్న భావాలు కమ్చీతో కొట్టినట్లు లేచి, విశృంఖలంగా విన్యాసం చెయ్యడం తరచుగా జరుగుతూ ఉంటుంది.
అతని పరిస్థితి ఇవాళ అలాగే వుంది. ముందు ఒక పని చూసుకొని తర్వాత ఆర్కెస్ట్రాని కలిసి, మిగిలిపోయిన రెండు మ్యూజిక్ బిట్స్ ఫైనలైజ్ చేసి చెప్పి రిహార్సల్ మొదలెట్టమనాలి.
ఎక్కువ టైమ్ లేదు.
దానితోపాటు మనశ్శాంతి లేదు.
ఫలానా అని ఇతమిత్ధంగా చెప్పలేని అశాంతి. దానికొక స్పష్టమైన కారణంలేదు. రంగులే తప్ప నిర్దిష్టమయిన రూపంలేని "బీరేన్ డే" అబ్ స్ట్రాక్స్ పెయింటింగుల్లా అశాంతి క్రితంరోజు జరిగిన సంభాషణే అతడిలో ఆ అశాంతి రేపుతోంది.
క్రితంరోజు మెడికల్ కాలేజీవాళ్ళు అతన్ని ముఖ్య అతిధిగా పిలిచారు.
ఫంక్షన్ అయిపోయాక రాత్రి అక్కడ కొంచెంసేపు తమతో గడపమని అడిగారు అక్కడి డాక్టర్లు. అందరూ పెద్ద పెద్ద డిగ్రీలున్న వారు. అయినా చాలా సరదాగా గడిపారు. డిన్నర్ అయిన తర్వాత లోకాభిరామాయణం మొదలైంది.
"ఎంతమంది పిల్లలు మీకు?" ఎవరో అడిగారు. బాలూ చెప్పాడు.
"తరువాత లేరా?"
"భయంగా వుంది" నవ్వుతూ అన్నాడు.
"ఎందుకు?"
క్రితంసారి జరిగిన అనుభవం చెప్పి "అఫ్ కోర్స్, 12 పౌండ్ల బేబీయే అనుకోండి. కానీ భయంగా వుంది" అన్నాడు. ఆ భయం అతడికి ఎప్పటినుంచో వుంది. కానీ ఎవరి దగ్గరా వెలిబుచ్చలేదు. ఇప్పుడు మంచి అవకాశం దొరికింది, అందుకని అలా అడిగి, ".... ఏమీ ఫర్వాలేదంటారా?" అన్నాడు.