రాయన్న బ్యాట్ తో ఆటలోకి వచ్చే సమయానికి ప్రేక్షకులందరూ టెన్షన్ లో వున్నారు. ఇంకా దాదాపు ఆరుగంటలు నిలబడి ఆడాలి. ముఖ్యమైన ఆటగాళ్ళు నలుగురు పోయారు. రాయన్న గొప్పగా బౌలింగ్ చేసి వుండవచ్చు. కానీ అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ లో అతడు 'సున్నా' పరుగులకే అవుటయివున్నాడు. దాంతో ఒక మంచి బ్యాట్స్ మన్ గా అతన్ని ఎవరూ వూహించలేదు. అతని గురించి తెలిసిన ఆంద్రరాష్ట్రం వాళ్ళు మాత్రం కాస్త నమ్మకంతో వున్నారు.
పాకిస్తాన్ తాలూకు పనీమ్ అక్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఎంత కహ్ద్నుకున్నా, అంతకుముందు ఆటలో తమవాళ్ళని చేల్చి చెండాడిన ప్రత్యర్ది అంటే అసూయ, కోపం వుంటుంది. ఆ కసితోనే పాకిస్తాన్ ఆటగాడు మొదటి బంతి 'బౌన్సర్' వేశాడు. పిచ్ మీద బంతి పడేచోట చిన్నరాయి వుండటంతో బంతి అనుకున్న దానికన్నా పైకిలేచి, రాయన్న మొహం పక్కకి తిప్పుకునేపోలులో విసురుగా వచ్చి కన్నుక్రింద తగిలింది. కలుక్కుమన్న చప్పుడు.
నరాలు మెలిపెట్టే బాధతో అతడు క్రిందకి కూలిపోయాడు.
అట్నుంచి అటే అతడు ఎక్స్ రేకి తీసుకువెళ్ళబడ్డాడు. వెంట్రుకవాసి ఫ్రాక్చర్ వున్నట్లు తేలింది. అంత అపాయకరం కాదుగాని, భరించలేని బాధ. క్షణాల్లో ఎడమవైపు మొహం వాచిపోయి వికృతంగా తయారయ్యాడు.
డాక్టర్ తో కలిసి అతను తిరిగి గ్రౌండ్ కి వచ్చేసరికి భారతజట్టు ఎనభై పరుగులకి ఎనిమిది వికెట్లు పోగొట్టుకుని ఓటమికి చేరువులోవుంది. ప్రేక్షకులలో నిశ్శబ్దం. విషన్నవదనలని పైకి కనిపించకుండా గంభీరంగా వుండటానికి ప్రయత్నిస్తున్నారు.
తగిలినప్పుడు లేదుగానీ, ఆ తరువాత కంటిక్రింద బాధ భరించలేనంతగా తయారు అయింది. "ఒక వారంరోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది" అన్నాడు డాక్టర్. రాయన్న ఏదో అనబోతుండగా మరొ భారత బ్యాట్స్ మన్ అవుట్ అయ్యాడు. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు ఆనందంతో గెంతులేస్తున్నారు.
అతడు తొమ్మిదోవాడు.
అంటే.....
భారతజట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూసిందన్నమాట. అజారుద్దీన్ ఒక్కడే అవుటవకుండా అటువైపు నిలబడి వున్నాడు.
అతడు ఆటగాళ్ళ గ్యాలరీవైపు చూస్తున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా ఇంకా ఫీల్డు వదిలిరాలేదు. దాని అర్ధం..... ఇంకా ఆట పూర్తి అయినట్లు అంపైర్లు చెప్పలేదు. అప్పటికి లంచ్ టైమ్ అయింది.
రాయన్న ఆడుతున్నాడో లేదో తెలియక వాళ్ళు పెవెలియన్ వైపు చూస్తున్నారు. అతడి కంటిక్రింద ఎముక విరిగినట్టు వాళ్ళకింకా తెలీదు. అప్పుడే అవుటయిన భారత ఆటగాడు నెమ్మదిగా వెనక్కి తిరిగి వస్తున్నాడు.
రాయన్న లేచి నిలబడి- "నేను వెళ్ళి ఆడతాను" అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో వాళ్ళు-మిగతా ఆటగాళ్ళు ఒక్కసారి తలతిప్పి చూశారు. అప్పటివరకూ గుసగుసగా సాగుతున్న ఓటమి తాలూకు మాటలు కూడా తగ్గిపోయాయి.
రాయన్న చెపుతోంది నిజమో, అతడికి మతిచెడిందో అర్ధంకానట్టు డాక్టర్ ఒక్కక్షణం దిగ్బ్రమతో చూసి, వెంటనే తెప్పరిల్లి "ఏమిటి నువ్వు చెపుతోంది? ఈ విరిగిన ఎముకతో వెళ్ళి ఆడతావా?" అన్నాడు.
రాయన్న ఆయనవైపు చూశాడు. "విరిగింది చేతి ఎముకకాదుగా డాక్టర్. చెప్పండి. ఎక్కువ టైమ్ లేదు. నేను ఆడటం ప్రాణానికి ఏమైనా ప్రమాదమా? లేక అయిదు నిమిషాల్లోనే స్పృహతప్పి పడిపోతనా?"
"లేకపోవచ్చు. కాని ఒంటికంటితో ఆడాలి..... కదిలేకొద్దీ బాధ- అందులోనూ మొహంలో ఎముక-"
"ఆ సంగతి నాకు వదిలిపెట్టండి."
"ఎంతసేపు ఆడగలవు? పావుగంట.... అరగంట...."
"మనదేశపు ఓటమిని అరగంట దూరం చేయగలిగినా అది చాలు డాక్టర్ గారూ."
డాక్టర్ మాట్లాడలేకపోయాడు. రాయన్న ఆడుతున్నట్టు ప్రకటించారు. అంపైర్లు 'లంచ్' చెప్పగానే ఆటగాళ్ళు వెనక్కివచ్చారు. అప్పటి వరకూ ఫీల్డ్ లో వున్న అజారుద్దీన్ కి బయట జరుగుతున్న విషయాలు ఏమీ తెలియవు. రాయన్న మొహంలో ఎముక విరిగిందనీ, అయినా అతడు ఆడటానికి సిద్దపడ్డాడనీ తెలియగానే "ఎందుకలా?" అన్నాడు.
"కనీసం ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మీకు ఎవరైనా పక్కన స్టాండ్ ఇవ్వాలి కదా."
"ఓటమి ఎలాగు తప్పదు. కానీ ఇప్పుడు నువ్వు ఆడితే ఆ గాయం మరింత ప్రమాదించవచ్చు. ఇప్పటికే నీకు భారత టీమ్ లో స్థానం లభించే చాన్సు వుంది. అనవసరంగా ఈ గాయం వికటించడంవల్ల ఆ స్థానం పోతుందేమో ఆలోచించు."
"ఒక కెప్టెన్ గా మీరు నన్ను బ్యాటింగ్ చేయవద్దంటే మానేస్తాను. కానీ 'నా భవిష్యత్తు రిస్కు' అనే స్వార్ధంతో మానెయ్యమంటే మాత్రం వప్పుకోను. మన ప్రిస్టేజిముందు నా భవిష్యత్తు ముఖ్యంకాదు. వీలైనంత వరకూ నేను మీకు రెండోవేఇపున నిలబడి సపోర్ట్ ఇవ్వటానికే ప్రయత్నిస్తాను. వప్పుకోండి."
"సరే, నీ ఇష్టం" క్లుప్తంగా అన్నాడు కెప్టెన్ అతడి కళ్ళల్లో మాత్రం అంతర్లీనంగా మెచ్చుకోలు కనపడింది.
అవతలి జట్టు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకుంది.
ఎంతసేపు? పది నిముషాల్లో అట ముగిసిపోతుందనుకున్నారు. లంచ్ అయిన తరువాత బౌలింగ్ ప్రారంభించారు. అయిదు.... పది నిముషాలు.....పావుగంట.....
భారత స్కోరు మరో పది పరుగులు పెరిగింది.
ఇంకొ అయిదు పరుగులు చేస్తే-ఓటమి తప్పకపోయినా, అవమానకరమైన ఇన్నింగ్స్ డిఫీట్ తప్పుతుంది.
ఇంకొక్క పది పరుగులి చేయాలన్న టెన్షన్ తో వున్నారు ఆఖరి ఆటగాళ్ళు అజారుద్దీన్, రాయన్నలు.
మొదట్లో దీన్ని తేలిగ్గా తీసుకున్న పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇది సాధ్యమవకూడదన్న పట్టుదలతో వున్నారు ఫలితం.... ఫాస్ట్ బౌలర్లు రంగంలోకి వచ్చారు. రాయన్న దెబ్బ విషయం వాళ్ళకి అనవసరం. అతడిని అవుట్ చేయాలి. అంతే!
వేగంగా బౌన్సర్లు వేయసాగారు.
మొహం పక్కనుంచి బాణాల్లా వెళ్ళసాగాయి బంతులు. అతికష్టం మీద నాలుగుబంతులు ఆడాడు. విరిగిన ఎముక దగ్గిర భరించలేనంత బాధ పళ్ళబిగువున బిగపట్టి ఓవర్ పూర్తి చేశాడు.
తరువాత అజారుద్దీన్ బ్యాటింగ్ కి వచ్చాడు. 2 పరుగులు తీశాడు.
రెండు బంతుల తరువాత మరో రెండు పరుగులు.....
పరుగెత్తుతూంటే మొహం కదిలి- మరింత బాధ-
ఓవర్ పూర్తయింది.
రాయన్న బ్యాటింగ్ స్కోర్ బోర్డుమీద అక్షరాలు మెరుస్తున్నాయి.
భారత జట్టు - మొదటి ఇన్నింగ్స్ : 128
రెండో ఇన్నింగ్స్ : 91/9
పాకిస్తాన్ - మొదటి ఇన్నింగ్స్ : 220
బౌలర్ వేసిన బంతిని లాగికొట్టాడు. గ్రౌండంతా చప్పట్ల హోరు. బాల్ గీత దాటింది. నాలుగు పరుగులు. జనం లేచి హర్షధ్వానాలు చేస్తున్నారు.
భారతజట్టు ఇన్నింగ్సు ఓటమి తప్పించుకుంది.
టీ విరామసమయంలో నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ చేయించుకున్నాడు.
మళ్ళీ ఆట ప్రారంభమయింది.
పాకిస్తాన్ ఆటగాళ్ళలో 'కసి' ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ప్రేక్షకులు దాదాపు భారతదేశమే విజయం సాధించినంత ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు.
ఇంకా గంటన్నర టైమ్ వుంది ఆట పూర్తవడానికి. భారతదేశం ఓడిపోవడం ఖాయం. కేవలం ఇన్నింగ్సు డిఫీట్ తప్పిపోయిందని ప్రేక్షకుల ఆనందం!
ఇమ్రాన్ ఖాన్ వేగంగా పరుగెత్తుకు వస్తున్నాడు, ఆ బంతిగానీ వికెట్ కి తగిలితే అది రెండుగా విరగవలసిందే. అంత వేగంగా వస్తోంది. రాయన్న కాలు ముందుకు పెట్టి చలాగ్గా 'లేట్ కట్' చేశాడు. బంతి బౌండరీ దాటింది.
జనం అసలు కుర్చీల్లో నిలవలేదు.
రాయన్నకి ఒక్క విషయం అర్ధమైంది. ఇక ఇప్పట్నుంచీ తాము ఎన్ని పరుగులు తీస్తే - పాకిస్తాన్ జట్టు అన్ని పరుగులు తీయాలి. గంటన్నరసేపు తాము ఎలాగూ ఆడలేరు. కాబట్టి ఓడిపోయేముందు రిస్కుతీసుకున్నా తప్పులేదు.
ఈ ఆలోచన రాగానే అతను నిటారుగా అయ్యాడు. చేతులమధ్య బ్యాట్ బిగుసుకుంది. ఎదుటి స్పిన్ బౌలర్ నాట్యం చేస్తున్నట్టు వచ్చి గాలిలో బంతివేసి 'కొట్టు' అన్నట్టు రెచ్చగొట్టాడు. ఇలా అప్పుడప్పుడు అవతలి మనిషిని రెచ్చగొట్టి అవుట్ చేయటం మామూలే. అయితే అతడు రాయన్నని తక్కువ అంచనా వేశాడు. అతడి కవర్ డ్రయివ్ లో ఒకప్పటి వెంగ్ సర్కార్ ఛాయలూ, కళలూ వున్నాయి. రాయన్న ఎడమకాలు ముందుకేసి బంతిని గాలిలోకి లేపాడు. దాదాపు మేఘాల్లోకి దూసుకు వెళ్ళినట్టు వెళ్ళి అది గ్రౌండ్ అవతల కార్ల మధ్య పడింది.
సముద్రం మధ్య వాయుగుండం ఏర్పడితే ఆ గాలి తాకిడికి శబ్దం అలలు అలలుగా ఎలా వస్తుందో ఆడిటోరియంలో ఘోష ఆ విధంగా ఆకాశాన్నంటింది.
రాయన్న చుట్టూ చూశాడు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు.