"ఇంట్లోవున్నా అపవాదులు సృష్టించబడతాయి, నాన్నగారూ!"
నిజమే! ఎదురింటామె చేసిన గొడవకాక ఇంకా చాలా జరిగాయి.
కొంతమంది ఈ ఇల్లు కాళీ చేయించాలని చూశారు, ఈ పిల్లల మూలంగా తమపిల్లలు పాడై పోతున్నారని! తను ఉండీ లేనట్టుగా అయిన తండ్రి! ఎవరూ అడిగే దిక్కులేదని అందరూ అనేవాళ్ళే! పేదరికం ఒక తప్పయితే పేదపిల్లలు అందచందాలతో పుట్టడం మరో తప్పన్నట్టుగా చూసే సమాజమిది. ముందుముందు ఇంకెన్ని కష్టాలుపడాలో ఈ పిల్లలు? ఇలా మంచంలోపడి నిస్సహాయంగా చూడడం ఎంత నరకం! ఏం చూడకముందే భగవంతుడు కళ్ళుమూయిస్తే ఎంత బాగుండును!
పదవినుండి తొలగింపబడిన వృద్ద సింహంలా ఆయన కళ్ళలో కదలాడే నిస్సహాయత చూసినప్పుడల్లా అపురూప మనసు పిండినట్టుగా అవుతుంది.
కాని, ఏం చేస్తుంది? ఈ విషయంలో నిస్సహాయ!
"వస్తాను, నాన్నగారూ!" ఆయన పాదాలకి నమస్కరించి, హాండ్ బాగ్ భుజాన వేసుకొని చెప్పులేసుకొని కదిలింది.
రెండు రోజులు నగరంలో తిరిగేసరికి చాలా విషయాలు తెలిశాయి అపురూపకు.
క్రింది తరగతి వాళ్ళు అసలు పేపరు తెప్పించరు. ఎరుపు పేపరు చదవడం కూడా అంతంతే! పై తరగతి వాళ్ళు పేపరు తెప్పిస్తారు. మాగజైన్సు కూడా తెప్పిస్తారు. అయితే అవి ఇంగ్లీషులో ఉంటాయి. తెలుగు వాళ్ళే అయినా వాళ్ళకు తెలుగంటే ఎలర్జీ.
"తెలుగు పత్రికలు చదవక, తెలుగు సినిమాలు చూడక ఎన్నేళ్ళయిందో?" అందో పెద్దింటి ఇల్లాలు.
ఇహ మధ్యతరగతి వాళ్ళయినా దినపత్రికలంతగా కొనరు. ఎరుపు పత్రిక చదవడానికే మక్కువ ఎక్కువ!
ఒక్క పేపరు నాలుగైదిళ్ళయినా తిరుగుతుంది. ఆ తిరగడమనేది పేపరు తెప్పించే వాళ్ళ ఉదారత్వం మీద ఆధారపడుతుంది.
రెండు రోజులు సంకోచపడినా మూడోరోజు నిస్సంకోచంగానే గుమ్మం తట్టింది అపురూప.
తలుపు తెరిచింది నలభయ్యేళ్ళ వయస్సుండే ఒకావిడ. చూస్తే చదువుకున్న దానిలాగే వుంది.
"నమస్కారమండీ!"
"ఎవరు కావాలి?" అపురూపని ఆవిడ శల్య పరీక్ష చేస్తున్నట్టుగా చూడసాగింది.
"నాకు కావలసింది మీరే!" చిన్నగా నవ్వుతూ లోపలికిరానిస్తారా అన్నట్టు చూసింది.
ఆవిడ కొంచెం అయిష్టంగా , కొంచెం అనుమానంగా చూసి లోపలికి ఆహ్వానించింది. "రండి, కూర్చోండి!"
అపురూప అక్కడున్న కుర్చీలో కూర్చొంది. "మీరు ఏ పేపరు తెప్పిస్తారు మేడమ్?"
ఆమె ఓ పేపరు పేరు చెప్పింది.
"ఉషోదయం చూశారా? ఈ మధ్యే ప్రారంభమైంది"
"ఆఁ పత్రికలో అడ్వర్ టైజ్ చూసినట్టు గుర్తు!"
"ఇదిగో, చూడండి!" బాగ్ లోంచి మడిచిన పేపరు తీసి విప్పదీసి ఇచ్చింది. "ఇటీవలే ప్రారంభమైన ఉషోదయం పత్రిక ఏ పత్రిక్కీ తీసిపోదు. ఏ పార్టీకీ చెందని పత్రిక! నిష్పాక్షికమైన విమర్శ, చీల్చిచెండాడి నట్టుగా ఉండే సంపాదకీయం, ఉద్యోగవిజయాలు, విద్యావకాశాలు -ఇవన్నీ ఒకెత్తు అయితే స్త్రీల కోసం ఇందులో పూర్తిగా ఒక పేజీ కేటాయింపబడడం ఒకెత్తు. ఉషోదయం ఈ పత్రికలో స్త్రీల సమస్యలనెన్నో చర్చిస్తుంది ఎందరి సమస్యలకో సమాధానం చెబుతుంది. ఎందరికో స్పూర్తి దాయకంగా ఉంటుంది! ఒక నవలా సీరియల్ లో, ఒక కథ ఒక కవిత, ఒక వ్యాసం, ఒక గ్రంధ విమర్శ -ఇలా ఒక పూర్తి పేజీ స్త్రీలకోసం కేటాయింపబడిన పత్రిక ఇదే!
"అహఁ" ఆవిడచాలా నిరాసక్తంగా అంది.
"ఉషోదయం పత్రిక తెప్పించండి, మేడమ్! మీ ఇల్లు విజ్ఞానంతో నిండిపోతుంది. మీరు పెట్టిన రూపాయి పావలా ధరకి పూర్తి సంతృప్తి నివ్వగల పత్రిక ఉషోదయం"
"చూడమ్మాయ్! మేము చాలా ఏళ్ళుగా తెప్పిస్తున్న పత్రికే మాకు అలవాటయ్యింది. ఇప్పుడు అది మానేసి క్రొత్త పత్రిక తెప్పించాలంటే కుదరదు" నిష్కర్షగా చెప్పిందావిడ.
"మనసుంటే మార్గముండదా అని ఎందుకు కుదరదు మేడమ్? జీవితంలోకి క్రొత్తదనాన్ని ఆహ్వానించకపోతే చార్మ్, థ్రిల్ ఏముంటాయ్? ఉషోదయం మీ జీవితాలకే ఉషోదయం కాగల పత్రిక"
"ఇలా ఉన్న పత్రిక మానిపించి మీ పత్రిక మా చేత కొనిపించాలని తాపత్రయ పడేకంటే మీ పత్రిక సేల్ అయ్యేమార్గం చనేను చెబుతాను! అదిగో, ఆ ఎదురింటి వాళ్ళకు పేపరు చదివే అలవాటు బాగా ఉంది. వచ్చిన చిక్కేమిటంటే కొని చదివే అలవాటు లేదు! నీ వాక్చాతుర్యాన్నంతా ఒలకబోసి వాళ్ళచేత ఉషోదయం కొనిపించావా, మా జ్యోతిని బ్రతికించిన దానివి అవుతావు! ఎందుకంటే మేం సరిగా పత్రిక చదవకముందే పత్రిక్కోసం పిల్లల్ని పంపిస్తాడా ఎదురింటాయన. వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళ పక్కించి వాళ్ళు, అక్కడి నుండి ఇంకొకరు. అలా తిరిగి తిరిగి సాయంత్రం బిగితరిగి, నలిగిన వెలయాల్లా ఇంటికివస్తుంది. అప్పుడు మాకు దాని ముఖమైనా చూడాలనిపించదు"