Home » Vachaspathi » Antasthulu Antahkaranalu

 

                                     17
    నిలువుటద్దంలో ప్రతిబింబం చూసుకుంటూ జడ అల్లుకుంటుంది సుధీర. కానీ మెదడు మటుకు ఏవో విషయాలను గురించి ఆలోచిస్తుంది. ఆ ఆలోచనల తీవ్రత ముఖంలో బాగా కొట్టవచ్చినట్లు కన్పిస్తుంది.
    సూర్యుడు  నెమ్మదిగా పడమటి కొండల్లోకి పోబోతున్నాడు. సమీరుని చిలిపితనానికి తోటలోని గులాబీలే గాక, ఆకాశంలోని మేఘాలు కూడా మెల్లగా, అతి మెల్లగా నవ్వాయి.
    "శేఖరం గారొచ్చారు." అన్నాడు నౌకరు వచ్చి.
    "పైకి తీసుకురా!" అంది అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ.
    తెల్లని జరీ షిఫాను చీరా, అదే రంగు జాకేట్టూ ఆమె తెల్లని శరీరానికి మరీ తెల్లదనాన్ని కలిగిస్తున్నట్లున్నాయి. కెంపులు, ముత్యాలూ తాపిన దిద్దులు, శ్రీకారాల్లాంటి చెవులకు వెల లేని అందాన్ని సంతరించి పెట్టాయి. ముత్యాల హారం శంఖం లాంటి మెడ మీద తళతళ ప్రకాశిస్తున్నది. తనకు తెలీకుండానే హాస చంద్రిక పెదిమల మీద నాట్యం చేసింది. కాటుక పెట్టుకున్న నల్లని కళ్ళు మిలమిల లాడాయి. తెల్లని చెక్కిళ్ళు అరుణిమను రంగరించుకున్నాయి.

                       


    శేఖరం సిల్కు కర్టెను తొలగించుకుని లోపలికి అడుగు పెట్టాడు.
    "కూర్చోండి!" అంది సుధీర అడ్డం ముందు నుండి కదిలి.
    శేఖరం సుధీర వేపు పరిశీలనగా చూసి - "ఎక్కడికో ప్రయాణమైనట్లుందే?' అన్నాడు.
    సుధీర కేం చెప్పాలో తోచలేదు. కాదంటే యీ అలంకరణంతా తనకోసమే అనుకుంటాడెమో ? అనుకుంటే ఏం? ఊహు.... బాగుండదు. పోనీ.... సినిమా కెళ్తున్నట్లు చెప్తే?
    "సినిమా కెళ్ళాలని ...." నసిగింది.
    "మరి నన్ను పిలిపించడమెందుకో?" కుర్చీలో కూర్చుని చిన్నగా నవ్వి అన్నాడు.
    "మీరూ వస్తేనేం?' క్రీగంట చూస్తూ అంది.
    "నాకు వీలు పడదు."
    "నేనూ వెళ్ళను" అంటూ కర్టెను తొలగించుకుని క్రిందికి వెళ్ళింది.
    గదిలోని ప్రతి వస్తువునూ కౌతుకంగా చూడసాగాడు శేఖరం.
    మరో రెండు నిమిషాలకు సుధీర ప్లేట్లో బిస్కెట్లూ, ఆపిలు ముక్కలూ పట్టుకు వచ్చింది. వెనకాలే నౌకరు ట్రేలో టీ సరంజామా తెచ్చి టేబిలు మీద పెట్టి వెళ్ళాడు.
    "కాఫీ తీసుకునే వచ్చాను" అన్నాడు ఎదురుగా గోడకున్న పెయింటింగ్ వేపు చూస్తూ.
    "కాఫీ యిప్పుడు మీ ఒంటికి పడుతుందా?" కిలకిల నవ్వి అంది.
    "నువ్వొట్టి అల్లరి పిల్లవు!" అన్నాడు శేఖరం హాయిగా నవ్వుతూ.
    శేఖరానికి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ - "పోన్లెండి! బిస్కెట్లూ, ఆపిలు ముక్కలూ జీర్నమవుతాయోమో కాస్త చెప్పండి!" అంది బాగా నవ్వడం చేత సుధీర ముఖమంతా ఎర్రబడింది.
    ఎరుపు రంగును పులుముకున్న ఆమె ముఖం లోని క్రొంగొత్త అందాలను వీక్షిస్తూ -- "నాచేత్తో తింటే జీర్ణం కావానుకుంటాను!" అన్నాడు.
    టీ కలుపుతున్న సుధీర తలెత్తి శేఖరం ముఖం లోకి చూడాలని చూడలేక పోయింది.
    ముఖం మరీ ఎర్రనై ప్రాచీ కన్నెలా వెలిగిపోతుంది.
    "అబ్బ! ఎంత మృదువుగా మాట్లాడగలడు!' తియ్యని రహస్యాన్ని చెప్పింది ఆమె హృదయం. మెల్లగా కంపిస్తున్న చేత్తో టీ కప్పును శేఖరం ముందు పెట్టింది.
    "ముందు టేనా? లేక...."
    "మీ యిష్టం."
    "నాకు సొసైటీ లో ఎలా మెలగాలో బొత్తుగా తెలీదు."
    సుధీర చురచురా చూసింది.
    "పుస్తకాల్లో యివన్నీ వుండవాయె! నేర్పిస్తావా, సుధీరా" అన్నాడు ఓరగా చూసి నవ్వుతూ.
    "చల్లారి పోతుంది టీ తీసుకోండి."
    శేఖరం టీ త్రాగి యాపిల్ ముక్కలు రెండు తీసి నోట్లో వేసుకున్నాడు.
    "ఇంతకూ ఎందుకు పిలిపించినట్లు?" అన్నాడు కాసేపయ్యాక.
    "మిమ్మల్ని సత్కరించాలని!"
    "ఎందుకో?"
    "అంత చక్కని నాటకం వ్రాసినందుకు!"
    శేఖరం మెల్లగా నవ్వుతూ -- "ఆ సత్కారం నువ్వే చేస్తున్నావా?" అన్నాడు.
    "నేనెందుకు చేస్తాను?"
    "మరి?"
    "మా మండలి."
    "ఏవిటో?"
    "నూట పదహార్లు!"
అంటే! ఎందుకూ?"
    సుధీర ఆశ్చర్యపోయింది. తన శ్రమంతా నిష్ప్రయోజనం లాగుందే అన్న బాధ కూడా కలక్క పోలేదు. శేఖరం డబ్బు లేక యిబ్బంది పడుతున్నాడేమో అని నూట పదహార్లు యివ్వాలని ప్రతిపాదించి నేగ్గేందుకు నానా అవస్థాపడి యింత చేస్తే తనకు డబ్బెండుకంటాడేమిటి ఈ పెద్దమనిషి! తనుగా డబ్బిస్తే తీసుకోడని సుధీరకు బాగా తెలుసు.
    "మీరు వ్రాసిన నాటకం నిజంగా అద్భుతంగా వుంది. ఏ ఉద్దేశం కొరకయితే అది రాయబడిందో ఆ ఉద్దేశం సంపూర్ణంగా ఫలించింది. నాటకం చూచిన ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి వెల్లువలై ప్రవహించింది. ఐదు వేల రూపాయలు అయాచితంగా విరాళ రూపంలో వచ్చిందంటే మీ నాటకం ఎంత ప్రభావాన్ని కలిగి వుందో చూడండి!"
    "నాకదే సన్మానం! అంతకన్నా కావలసిందేముంది?" ఆనందంతో చెమర్చిన కళ్ళతో అన్నాడు.
    "నిజమే! కాదని ఎవరనగలరు? కానీ మా ప్రీతి కొలది యిస్తున్న ఈ పారితోషకాన్ని మీరు తప్పక స్వీకరించాలి."
    'అలా అనకు, సుధీ! భారతీదేవి కడుపున పుట్టినందుకు మరే విధంగానూ నా ఋణాన్ని తీర్చుకోలేను. ఇదొక్కటే నాకున్న మార్గం. దాన్ని కూడా నువ్వు మూసి వేస్తానంటే నేనేం చెయ్యను చెప్పు?' అన్నాడు చలిస్తున్న కంఠం'తో.
    సుధీర విప్పారిత నేత్రాలతో దుర్భలుడూ, ధీరుడు, త్యాగధనుడు అయిన ఆ యువకుని వంక నిశ్చలంగా చూసింది. సుధీర లేచి వెళ్ళి డ్రాయర్లో నుండి రెండు పాకెట్లు తెచ్చి శేఖరం ముందు పెట్టింది.
    "తీసుకోక తప్పదా?"
    "డబ్బు తీసుకోమంటే అంత కష్టపడతారేం?"
    "పోనీ రక్షణ నిధికి యిస్తున్నాను. తీసుకో!" అన్నాడు.
    రెండో పొట్లాం విప్పుతూ కళ్ళు టపటపలాడించి "ఇది నాకాన్క" అంది.
    ఆ కళ్ళల్లోని వెలుగూ, ఆ వెలుగులోని మెరుపూ శేఖరం హృదయాన్ని చక్కని వెలుగులతో నింపాయి.
    "ఎందుకేమిటి?"
    "అడిగిన వెంటనే నాటకం వ్రాసి యిచ్చినందుకు!"
    "బాగుంది!"
    "బాగుండకేం?"
    "కాన్కల కోసం నేను వ్రాయలేదు."
    "ఆ విషయం నాకు తెలుసు!"
    "తెలుసా! అయితే తెలిసీ యివ్వడంలో ఉద్దేశం?" అన్నాడు కనుబొమలు చిట్లించి.
    సుధీర అట్ట పెట్టెను తెరిచి రిస్టు వాచీ తీసింది.
    "ఏవిటది!" ఆశ్చర్యపోయాడు.
    "ఓ ప్రక్క చూస్తూ అడిగితె నేనేం చెప్పను?"
    "నాకేనా?' ఇంకా బోలెడంత ఆశ్చర్యపోయాడు.
    "మరే! నాకే! రెండు చేతులకూ రెండు కట్టుకుందామని!"
    "మంచిదే! ఇప్పుడు ఏ రెండు గడియారాలూ ఒకే టైము చూపడం లేదట!' అన్నాడు కొంచెం ఎర్రబడిన ముఖంతో.
    "మీ చెయ్యి యిలా యివ్వండి!"
    "నన్నవమానిస్తున్నావు , సుధీ!" అన్నాడు దూక్షణ స్వరంతో, కుర్చీలో అస్వస్తంగా కదులుతూ.
    సుధీర ఆ మాటకు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది. కాసేపటికి-- "మిమ్మల్ని అవమానించడమంటే నన్ను నేను అవమానించుకోవడమే ! ఆ సంగతి తెలుసా?" అంది తల వంచుకుని నెమ్మదిగా.
    శేఖరం సుధీర ముఖంలోకి చూస్తూ బాధగా నవ్వి - "మరి నిన్ను నువ్వు ఎండు కవమానించుకుంటావు?" అన్నాడు.
    "ఇందులో అవమానానికి, అవహేళనకు తావు లేదు. ప్రేమపూర్వకంగా యిచ్చే చిన్న కాన్క" అంది చెమ్మగిల్లిన కనురెప్ప లెత్తి చూస్తూ.
    "రిస్టువాచీ యివ్వడంలో నీ ఉద్దేశమేమిటి? నాకు లేదనేగా? అంటే మరో విధంగా నా బీదరికాన్ని ఎత్తి చూపడమేగా?" విలవిల్లాడి పోయాడు.
    సుధీర కళ్ళల్లో చివున నీళ్ళు తిరిగాయి. గొంతు పట్టుకు పోయినట్లయింది. ఆవేదనతో హృదయం అలమటించింది. శేఖరం ఇంత అన్యాయంగా మాట్లాడతాడని సుధీర ఏరోజూ అనుకోలేదు. శేఖరం అభిమానం దెబ్బతింది. కానీ తనేం చేసిందని? ప్రేమించడం తప్పా?
    "మీరు బీదవాళ్ళయితే నేనూ బీదదాన్నేగా? ఆ విషయం మరిచిపోతున్నట్లుంది. గొప్ప వాళ్ళింట్లో పుట్టడమే నా తప్పా? ఎందుకింత కఠినంగా మాట్లాడతారు?" బాధా తప్త కంఠం తో అంది.
    శేఖరం తల తిప్పుకున్నాడు. సుధీర కళ్ళల్లో నుండి నీళ్ళు రాలి పడేటట్లున్నాయి. శేఖరం కళ్ళల్లో తన కన్నీళ్ళు పడడం యిష్టం లేక నెమ్మదిగా అక్కడి నుండి లేచి వరండా లోకి వెళ్ళిపోయింది. విపరీతమైన ఆలోచనల్లో తెలిపోతున్నాడు శేఖరం. గొప్పవాళ్ళ లక్షణమే అంత బీదవాళ్ళ బీదరికాన్ని ఎత్తి చూపి వాళ్ళు నీళ్ళలో నుండి బయటికి పడ్డ చేపలా విలవిల్లాడుతుంటే చూసి ఆనందించడమే వాళ్ళ వినోదం. ఆ లక్షణం సుధీరలో మటుకు లేకుండా ఎలా పోతుంది? భాగ్యవంతుల బిడ్డ కాదూ? ఛా! ఏవిటి తనిలా ఆలోచిస్తున్నాడు? సుధీర ఎవరు? తన్ను మనసారా ప్రేమించి దిగివచ్చిన చందమామ కాదా? అంతస్తులనూ, అర్హతలనూ , కులాన్నీ లెక్కచేయక తన పాదాల ముందు హృదయ సుమాన్ని అర్పించిన సుధీరను గురించేనా తనిలా ఆలోచించడం? ఎంత అన్యాయం! తన్నసలు భగవంతుడు క్షమిస్తాడా? అసలు తనూ, సుధీర వేరేలా అవుతారు? తను కవి అయితే - ఆమె కవిత. తను వీణ అయితే - ఆమె గానం. తను చంద్రుడయితే - ఆమె వెన్నెల. తను పుష్పమైతే -- ఆమె తావి.
    అవును.... కానీ.... రిస్టు వాచీ ఎలా తీసుకోవడం?
    ఏం, తీసుకుంటే? అమూల్యమూ, అనన్యమూ, ప్రేమభరితమూ అయిన ఆమె హృదయ సుమాన్ని నీరాజనం చేసి యిచ్చిన రోజు స్వీకరించాడా? అందులో ఈ చిన్న కాన్క ఎంత? సుమ కోమలమైన ఆమె హృదయాన్ని తనెందుకు చిన్న బుచ్చాలి? ఆలోచనల నుండి తేరుకుని మెల్లగా గదంతా కలయజూశాడు సుధీర కోసం. కుర్చీలో నుండి లేచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వరండాలోకి వచ్చాడు.
    మాలతీ లత దగ్గర నిల్చోనుంది సుధీర.
    "సుధీ! నా మీద కోపమొచ్చింది కదూ?"
    సుధీర వెనక్కు తిరిగి చూడలేదు. మెత్తని సిల్కు చీరతో కన్నీళ్ళు తుడుచుకుంది. శేఖరం హృదయంలో వెయ్యి బాణాలు ఒక్కసారిగా గ్రుచ్చుకున్నాయి.
    "సుధీ! ఇలా చూడు."
    వెనక్కు తిరిగి ఎర్రబడిన కళ్ళతో శేఖరం వేపు చూసింది.        
    "నువ్వింత బాధపడతావని అనుకోలేదు. ఏమనుకోకు" అన్నాడు నేల చూపులు చూస్తూ.
    "ఆ మాట సులభం లెండి! ఉండండి!" అంటూ గదిలోకి వెళ్ళి రిస్టు వాచీతో వచ్చింది.
    "తీసుకోక తప్పదన్నమాట!" అన్నాడు నవ్వుతూ.
    "ఊ...."
    "అయితే సరే! ఇలా ఇవ్వు" అన్నాడు చెయ్యి చాపుతూ.
    "నేకడతానుగా?" అంటూ రిస్టు వాచీ కట్టసాగింది.
    "కుడిచేతికి కడుతున్నావు!" ఆశ్చర్యపోయాడు.
    "నాకు తెలుసు."
    "తెలిసే కడుతున్నావా?' అదేమిటి?"
    "యిప్పుడు ఫాషన్ అదే!" అంది తలెత్తి చూసి నవ్వుతూ.
    "ఫాషనా? అయితే సరే!" అంటూ తన నవ్వునూ జోడించాడు.
    "బాగుంది! కానీ రిస్టువాచీ మరీ సన్నగా ఉంది" అంది చేతి వేపు చూస్తూ.
    "మనిషే సన్నమైతే రిస్టు లావుగా ఎలా ఉంటుంది?"
    "లావుకండి!' అంది విలాసంగా తలతిప్పి నవ్వుతూ.
    "చిత్తం! తమరోచ్చాక!"
    సుధీర ముఖం అరుణీమను దాల్చింది. చివాల్న తలతిప్పి మాలతీ పుష్పావాచయంలో మునిగిపోయింది.
    "టెలిగ్రాం ఏదో వచ్చిందట. అమ్మగారు రమ్మంటున్నారు' అన్నాడు నౌకరు వచ్చి.
    సుధీర ఆత్రంగా మెట్ల వేపు నడిచింది. శేఖరం వెనకే నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra