Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 27


    "ఆడపిల్లకి ఎడమకన్ను అదిరితేనే మంచిది! అయినా ... నీకు వేడిచేసి ఉంటుందిలే!" అంది తాయారమ్మ.
    
    గదిలోకి వచ్చిందన్న మాటేగానీ రాధకి ఎందుకో మంస్మతా దిగులుగా ఉంది. ఇంట్లోవాళ్ళంతా తండ్రి ఊరెళ్ళాడనుకున్న బెంగ అనుకున్నారు. ఆమెకి మాత్రం అదురుతున్న కుడికన్ను అశుభంగా అనిపిస్తోంది. పిన్నితో చెప్పినా పట్టించుకోకుండా "వెళ్లి తరవాణీ అన్నంలో నూనె వేసుకు తిను..... వేడి తగ్గుతుంది" అంది.
    
    వాకిలి చిమ్ముతున్న నరసమ్మ ఫక్కున నవ్వి, "ఈ వేడి తరవాణితో కాదమ్మా, కాలి పారాణితో తీరేది!" అంది.
    
    దాని మాటలు అర్ధంకాకపోయినా మాధవ్ గుర్తొచ్చాడు. విదేశాల్లో పెద్ద చదువులు చదివొచ్చాడు. దొరసాని పిల్లలతో కలిసి తిరిగొచ్చాడు. ఎన్నో విషయాలు తెలుసు! అందగాడే కాదు, అతి తెలివైనవాడు! అతను తనను ఏంచూసి ఇష్టపడ్డాడూ? అద్దంముందు కూర్చుని చూసుకుంది.
    
    ఆమె లేస్తుంటే కుడి తొడమీద పరుచుకున్న జడ బరువుగా మూలుగుతూ ఆమె జఘనాన్ని ముద్దాడింది. గుండెల్లోని తలపులన్నీ పైట కొంగుతో వడపోసి ఎక్కడికీ జారిపోకుండా మొలలో దోపింది. మంచం మీద పడుకోగానే మగత కమ్మింది.
    
    ఆ మగతలో తన చెంపమీద చెంపని ఆన్చి "ఎంత అందంగా ఉన్నావో తెలుసా?" అన్నాడు మాధవ్.
    
    "అమెరికాలో అమ్మాయిల కంటేనా?" మనసులో మాటపైకి అనేసింది.
    
    "ఛ! వాళ్ళకి కృష్ణవేణిలాంటి ఈ జడేదీ..... నాగావళి లాంటి నడుము ఒంపేదీ....కావేరిలాంటి కళ్ళ మిలమిలలేవీ? గోదారి తీరంలాంటి ఈ...." అంటూ పొత్తికడుపుమీద పరికిణీ కుచ్చిళ్ళు తప్పించబోయాడు.
    
    "వదులు...." అతని చేతిని తొలగిస్తూ అంది.
    
    అతని పెదవులు ముఖమంతా వెచ్చని ముద్రలేశాయి. గుండెలు కొండలయినట్లూ, రక్తం పోటెత్తిన సంద్రంగా పరుగులు పెడుతున్నట్లూ నరాలన్నీ అడవి తీగెల్లా ఒకదానితో ఒకటి మెలిపడుతున్నట్లూ అనిపించాయి.
    
    "ఐ లవ్ యూ!" అన్నాడు.
    
    రాధ దిగ్గున లేచికూర్చుంది. ఆమెకి వళ్ళంతా చెమటలు పట్టాయి. మాధవ్ ఇంకా తనని చుట్టుకున్నట్లే ఉంది. ఒంటివంక చూసుకుంది. నలిగినట్లు అనిపించింది.
    
    ఏమన్నాడూ? ఆమెకి మనసంతా దిగులుగా మారింది. ఇంగ్లీషులో అన్నాడు తనకి ఇంగ్లీషు రాదు ఎలా?
    
    'గోపాల కృష్ణుడు నల్లనా...
    గోకులంలో పాలు తెల్లనా...
    కాళిందిలో నీళ్ళు చల్లనా....
    కాళిందిలో నీళ్ళు చల్లనా.....
    
    పాత పాడేటి హృదయాలు ఝల్లనా...!' వాళ్ళ బృందావనంలో శాంత పాడుతూ ఉంటే ప్రకాశం హార్మోనియం వాయిస్తున్నాడు.
    
    రేపల్లెలో రాధ మాత్రం దిగులుగా మారింది!
    
                                                             * * *
    
    "ఏమిటి తల్లీ? ఎందుకలా దిగులుగా ఉన్నావు? అన్నం తినలేదట, పిన్ని చెప్పింది ఏమైందో నాతో చెప్పవూ?" లాలనగా అడిగాడు రాదని ప్రకాశం.
    
    "మరి నే అడిగింది ఇస్తావా?" అంది రాధ.
    
    "ఏం కావాలన్నా ఇస్తాను. జాతరకి తీసుకెళ్ళి జీళ్ళుకొనిపెట్టాలా? పండక్కి పాపిటి బిళ్ళా? చేతులకి ముత్యాల గాజులా? లేక నడుముకి రవ్వల వడ్డాణమా?" నవ్వుతూ అడిగాడు.
    
    రాధ తల అడ్డంగా ఊపి, "అవేమీ కాదు." అంది.
    
    "మరి ఏమిటో చెప్పు తల్లీ?"
    
    "చెప్పాక కాదనకూడదు!"
    
    "సరే - ఏవిటీ వెనకాల దాచి పెట్టుకున్నావూ? చూపించూ!"
    
    రాధ వీపు వెనకాల దాచిపెట్టుకున్న చేతుల్ని ముందుకి జాపింది ఆకుపచ్చని గాజులు తొడిగిన చేతులకి ఎర్రని గోరింటాకు పెట్టి, మరువం, కనకాంబరాల పూలమాలల్లా ఉన్న చేతుల్లో.... పుస్తకం ముప్పై రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకునే పుస్తకం!
    
    "పుస్తకమా!" అన్నాడు ప్రకాశంగానే ప్రకాశం.
    
    "ఔను చిన్నానా!" పుస్తకాన్ని అపురూపంగా గుండెలకి హత్తుకుంటూ, "నాకు ఇంగ్లీషు నేర్పించే టీచర్ని చూడవూ?" అంది.
    
    తాయారమ్మ ఈ మాట విని మంచంమీద లేచి కూర్చుంటూ, "మన గణపతి ఉన్నాడు కదరా?"
    
    "ఛీ! వాడి ఇంగ్లీషూ, నీ ఆరోగ్యం ఒకలాంటివే కానీ పడుకో!" తల్లిని విసుక్కున్నాడు. తొందరపది మాటిచ్చేశానే అని అతనిలో మధన ప్రారంభమైంది. అన్నగారికి తెలిస్తే ఏమంటాడో?
    
    "నాన్న అడిగితే నేను మంకుపట్టు పట్టానని చెప్పు!" అంది.
    
    "అలాగే చూద్దాం...." అని "ఎందుకమ్మా హఠాత్తుగా ఈ కోరిక?" అన్నాడు.
    
    "ఎప్పుడైనా ఆయన ఇంగ్లీషులో ఉత్తరం రాస్తే...." అని ఆగిపోయింది రాధ.
    
    "ఎవరమ్మా?" అన్నాడు ప్రకాశం.
    
    "బిల్ క్లింటన్.... అనీ అమెరికా ప్రెసిడెంట్!" ఉక్రోషంగా అంది.
    
    "నీకెందుకు రాస్తాడూ?"
    
    "తరవాణి తినాలనిపించినప్పుడు!" కోపంగా అంది.
    
    "ఎందుకు అనిపిస్తుందీ?"
    
    "వేడి చేసినప్పుడు!" దుఃఖం వచ్చేసింది.
    
    "వేడెందుకు...."
    
    'ఛీ, ఫో.... నాతో మాట్లాడకు!" రాధకి ఉక్రోషంతో ఏడుపొచ్చి రెండు చేతుల్లో మొహం దాచుకుంది.
    
    ప్రకాశం పకపకా నవ్వి "పిచ్చి తల్లీ... నీకు ఇంగ్లీషు ఎందుకో..... తరవాణీ ఎందుకో నాకు తెలీదా?" అన్నాడు.
    
    రాధ చేతులు తప్పించి తల వాల్చుకుంది.
    
    నీవు నడిచే బాట యెల్లెడల వ్యాపించు గంధపు దావులెట్టుల కప్పిపుచ్చెదవు?
    
    ఓ ముద్దరాలి నీ విహారము బయలుపరచెదవు!"
    
    అని కవి అన్నట్లు ప్రేమ చిలికిన వెన్నలా పైకే తేలుతుంటుంది, అణిగి మణిగి హృదయం అడుగున దాగుండదు!
    
    "అన్నయ్యని ఎలాగైనా ఒప్పించి వెంటనే నీకోసం ఓ ఇంగ్లీషు చెప్పే టీచర్ని చూస్తాను. సరేనా? నవ్వాలి మరి..... ఇల్లంతా చీకటిగా ఉంది. వెన్నెల పరచినట్లు నవ్వాలి..... అదీ .... అలా నవ్వాలి!" అని ప్రకాశం రాధ తల నిమురుతూ ఆమె నవ్వుని అపురూపంగా చూసుకున్నాడు.

 Previous Page Next Page