Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 27

  

     చెర్రీ పండ్లలాంటి పెదవులూ, సంపెంగలాంటి నాసికా, చిన్నవీ పెద్దవీ, కాకుండా అందంగా వుండి తీక్షణంగా చూసే కళ్ళు.... ఆ నునుపైన మెడా.. 'కళ్ళు చెదరగొట్టే ఈ అందాలన్నీ ఇంకొ నాలుగురోజుల్లో నా సొంతం కాదా....' అనుకున్నాడు.
       
    ధరణి తలెత్తి తనవైపు చూడగానే తియ్యగా నవ్వాడు.
   
    ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదు. తలవంచుకుంది.
   
    'అమ్మ... దొంగా! నటివే....' అనుకున్నాడు. ఫైల్సుతీస్తూ, "ప్రమోషన్, ఇంక్రిమెంటు అంటే ఎవరికి మాత్రం చేదూ! నేను కొట్టిన బాణం కరెక్ట్ గా తగిలింది' అని ఆనందించాడు.
   
    ధరణి మామూలుగానే తన పని చూసుకోసాగింది. ఇంతలో సుకుమారి ధరణి టేబుల్ దగ్గరకు వచ్చింది.
   
    ధరణి వెంటనే లేచి నిలబడింది.
   
    "ఇందాక నా కళ్ళజోడు మర్చిపోయాను."
   
    "ఇదిగోండి" అని అది అందిస్తూ, 'ఈవేళ ఎందుకో ఈవిడ హుషారు పెరిగిపోయింది' అనుకుంది ధరణి.
   
                                            2
   
    రావులో అకస్మాత్తుగా వచ్చిన మార్పు ధరణికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ రోజు ఆమె గదిలోకి వెళ్ళి "సర్.... నాకు ఓ గంట పర్మిషన్ కావాలి. కాస్త షాపింగ్ పని వుంది" అంది. అనగానే రావు మండిపడతాడనుకుంది.

    కానీ రావు నవ్వాడు. ఆ తరువాత "ఆఁ...ఆఁ....ఉండదూ మరీ! వెళ్ళిరా.....ఈ వారం అంతా నీ ఇష్టం!" అన్నాడు.
   
    ఆ వారం అంతా అంత విరివిగా పర్మిషన్లు ఎవైల్ చేసుకోవచ్చు అని ఎందుకన్నాడో ఆమెకు అర్ధంకాలేదు. ఇదేమైనా 'ఇంటర్నేషనల్ విమెన్స్ ఫ్రీడమ్ వీక్ ఏమో!' అనుకుంది.
   
    ఆమె ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల బస్ వచ్చేసింది. పూజా, అభీ ఇంట్లోనే వున్నారు.
   
    అభీ ఎప్పటిలా ఎదురొచ్చి తల్లి మెడని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు.
   
    "అక్క ఏదిరా?" అడిగింది ధరణి.
   
    "అక్క పడుకుంది. జ్వరం వచ్చింది" అన్నాడు అభీ.
   
    ధరణి కంగారుగా వెళ్ళి పూజ నుదురు తాకి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. గబగబా దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ధరణిని చూడగానే "రామ్మారా! ఏవిటీ మా కోడలు ఏవైనా హడావుడి చేస్తోందా?" అన్నాడు.
   
    ఆయన కొడుకు స్టేట్స్ లో ఎమ్.బి.ఏ. చదువుతున్నాడు. సరదాగా పూజని తన కొడుక్కి చేసుకుంటానని హాస్యమాడుతుంటాడు.
   
    ధరణి నవ్వేసి "ఔను డాక్టర్! ఇందాకే స్కూలు నుండి వచ్చింది. అప్పటినుంచే జ్వరం" అంది.
   
    ఆయన పూజని నాలిక చూపించమన్నాడు. పూజ చూపించింది. ఆ తరువాత టెస్ట్ చెయ్యడానికి స్టెతస్కోప్ తీసుకుని ఆమె గుండెలమీద నెమ్మదిగా ప్రెస్ చేశాడు.
   
    పూజ పెద్దగా అరుస్తూ ఆయన్ని తోసేసి, అక్కడినుండి లేచి బైటికి పరిగెత్తింది.
   
    ధరణి భయంగా "పూజా....అమ్మా....పూజా..." అంటూ పూజ వెనకాల పరిగెత్తి పట్టుకుంది.
   
    "వద్దు..నన్ను ముట్టుకోవద్దని చెప్పు....నన్నేం చూపించమని అడగద్దు అని చెప్పు" అంటూ పూజ ఏడుపు మొదలెట్టింది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపలేదు. ఇంకా ఇంకా గొంతు పెంచి ఏడవసాగింది.
   
    "ఓ.కే....ఓ.కే.....నేను నిన్ను అసలు ముట్టుకోకుండా మందులు ఇస్తాను.....సరేనా?"
   
    ధరణి కూతురి వీపుమీద నిమురుతూ "ఏవిటిది డాక్టర్? అలా కొట్టగా చేస్తోందేవిటీ?" అంది.
   
    "జ్వరం వచ్చినప్పుడు మైండ్ వీక్ గా ఉంటుంది. ఎప్పుడో చూసిన హారర్ మూవీస్ అవీ ఇప్పుడు గుర్తుకు వచ్చి భయపడే ఛాన్స్ కూడా వుంది!"
   
    ధరణికి ఎందుకో చాలా దిగులేసింది.
   
    "ఓ వారం లీవ్ పెట్టండి. పాప దగ్గర ఉండండి. పాపని కూడా రెస్ట్ గా ఇంట్లోనే ఉంచండి."
   
    "అలాగే డాక్టర్" అని అతను రాసి ఇచ్చిన మందుల కాయితంతో ధరణి బైటికి వచ్చింది. అంతలో నీలూ హడావుడిగా లోపలికి వస్తూ కనిపించింది.
   
    "నీలూ...ఏవైందీ?" అడిగింది ధరణి.
   
    "ప్రియకి బాగా జ్వరంగా వుంది" బాధగా చెప్పింది నీలూ.
   
    "అరే..పూజకి కూడా ఫీవరే. ఇదేమీ ఇన్ ఫెక్షన్ కాదు కదా!" అంది ధరణి.
   
    "ఏమో....స్కూల్ నుండి వచ్చిన దగ్గర్నుండీ మూసినా కన్ను తెరవకుండా ఒకటే జ్వరం!" అంది కూతురి నుదురు తాకుతూ నీలూ.
   
    ధరణి ఆమెకి ధైర్యం చెపుతున్నట్టు ".....నర్స్ వైపుండి అలా కంగారుపడతావేం? డాక్టరుకి చూపించు. రాత్రికి మరీ కంగారు చేస్తే మాకు ఫోన్ చెయ్యి" అంది.
   
    నీలు బేలగా తలూపింది. ఆమె అంతగా ఎందుకు అధైర్యపడుతోందో ధరణికి అర్ధంకాలేదు. ఇద్దరు పిల్లలకీ ఒకేసారి జ్వరం రావటంతో ఏదైనా ఇన్ ఫెక్షనో, లేక బెదిరిపోయారో అనుకుంది.
   
    అంతకన్నా ఎక్కువ కారణం వుందని నీలూ గ్రహించింది.
   
    నర్సు కాబట్టి.
   
                                         3
   
    చందూ ధర్మామీటర్ శుభ్రం చేస్తూండగా శ్రీధర్ భార్యతో అన్నాడు. "పూజకి ఇలా వున్నదని చెప్పగానే మీ బాస్ శలవు మంజూరు చేయటం చిత్రంగా వుంది. ఇంతకుముందు చాలా యాగీ చేసేవాడు కదూ..."
   
    "రెండ్రోజుల్నుంచీ ఆయన వైఖరి చాలా చిత్రంగా వుంది. ఎప్పుడు శలవు కావాలని ప్రాధేయపడినా 'నో' అనేవాడు. ఈసారి పూజకి కాస్త బావోలేదని తెలియగానే ఇంటికి వెళ్ళిపొమ్మని ఆయనే తొందరపెట్టాడు. పైగా ఏదో అన్నాడు.. 'నాల్రోజుల్లో మీ పాపకి సరికాకపోతే నీకు మూడ్ వుండదూ' అని. నాకేమీ అర్ధం కాలేదనుకోండి."
   
    "ప్రియకి ఎలా వుందట?"
   
    "ఏమో మరి. వాళ్ళ అమ్మ ప్రొద్దున్న డాక్టర్ గారి క్లినిక్ లో కనపడింది. ఇప్పటివరకూ ఫోన్ లేదంటే బహుశ నెమ్మదించి వుండాలి. ఏదైనా కంగారు చేస్తే ఫోన్ చేసేదిగా. పైగా వాళ్ళాయన లేడు కూడానూ" అంది ధరణి.
   
    సరిగ్గా ఆ సమయానికి ధర్మామీటర్ పూజ నోట్లో పెట్ట బోయాడు చందూ.
   
    ఒక్కసారిగా పెద్ద స్వరంతో అరుస్తూ, "వద్దు... నాకు భయం" అని అరవసాగింది పూజ. శ్రీధర్ ని కూడా దూరంగా తోసేసింది.
   
    ధరణి వళ్ళోకి తీసుకుని చాలాసేపు అనునయించాక అప్పుడు నిద్రపోయింది.
   
    దంపతులిద్దరూ తేలిగ్గా నిట్టూర్చారు.
   
    అప్పుడు మ్రోగింది ఫోను. నీలూ కంఠం.
   
    "ప్రియని ఆస్పత్రిలో చేర్పించాం. మీకు వీలైతే మీరు రాగలరా?"
   
                                    *    *    *
   
    ధరణిని కూతురికి సాయంగా వదిలి, శ్రీధర్, చందూలు హడావుడిగా ఆస్పత్రికి బయల్దేరారు.
   
    ఆ ఆస్పత్రి చీఫ్ పరిమళ. ఆమె కూడా ప్రియ పరిస్థితి చూసి కంగారుపడింది. ఆ పాప అపస్మారక స్థితిలో మాటిమాటికి కళ్ళు అప్పగించి చూస్తోంది. భయంతో వణికిపోతోంది.
   
    అదృష్టవశాత్తు అదే సమయానికి కబురు అంది, తండ్రి వచ్చాడు. అతడి పేరు టోనీ. భర్తని చూడగానే నీలూ ఏడ్చేసింది. కూతురివైపు వంగి, "ప్రియా.....డాడీ వచ్చారమ్మా.... కళ్ళు తెరూ.." అని కుదపసాగింది.
   
    పరిమళ ఆమెని వారించింది. ఈ లోపులో ప్రియ శరీరం వంకర్లు తిరగసాగింది. పరిమళ కంగారుగా "మైగాడ్ ఫిట్స్ వస్తున్నాయి" అంది. నీలూ భర్తని పట్టుకుని ఏడ్చేసింది. దీనంతటికీ శ్రీధర్, చందూలు ప్రేక్షకులే అయ్యారు.
   
    ఎందుకో తెలీదుకానీ శ్రీధర్ కి ఇంట్లో ఉన్న ధరణీ పిల్లలు గుర్తొచ్చారు. చందూతో "నువ్విక్కడ ఉండు.. నేను ఇంటికెళ్ళి పూజ ఎలా ఉందో చూసి వస్తాను" అంటూ పరుగులాంటి నడక మొదలెట్టాడు.
   
    ఇంటికి వస్తున్నంతసేపూ అతనికి ప్రియ స్థానంలో కొంకర్లు తిరిగిపోతున్న పూజ రూపమే కళ్ళలో మెదలసాగింది. ధరణి బాగానే ఉందని ఫోన్లో చెప్పినా కళ్ళతో చూసేదాకా అతని మనస్సు ఊరుకోలేదు.
   
    వేగంగా వెళ్ళి డోర్ బెల్ ని ఆపకుండా మోగించాడు.
   
    ధరణి వస్తూనే "ఉష్ ... ఇపుడే కాస్త నిద్రపోతుంది" అంది.
   
    శ్రీధర్ ఆతృతగా లోపలికి పరిగెత్తి కూతుర్ని చూసుకున్నాడు.
   
    నిండుగా దుప్పటి కప్పుకుని పూజ ప్రశాంతంగా నిద్రపోతోంది.
   
    అంటీ అంటనట్లుగా కూతురి నుదుటిమీద చుంబించి "థాంక్ గాడ్!" అన్నాడు.
   
    "ప్రియకి ఎలా ఉంది?" అడిగింది ధరణి.

 Previous Page Next Page